Tuesday, November 3, 2026

స్టడీ ఇన్ బోర్ డమ్ : కర్తార్ సింగ్ దుగ్గల్


స్టడీ ఇన్ బోర్‌డమ్

కర్తార్‌సింగ్ దుగ్గల్

పడక గది, భోజనాల గది, నడవ, గ్యాలరీ... గ్యాలరీ, నడవ, భోజనాల గది, పడక గది. ఐనీ అటు ఇటూ తిరుగుతున్నది.

డైమండ్ రెండు, ఆఠీన్ అయిదు, కళావర్ రాణి...ముందు గుండ్రం గదిలో పేకాట జోరుగా సాగుతున్నది.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు” కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

పడక గదిలో మంచాల మీద దుప్పట్లు దులిపి ఉన్నాయి. చక్కగా సర్ది ఉన్నాయి. ఇప్ప్పుడిప్ప్పుడే ఉతికి తెచ్చినట్టు అవి కమ్మటి వాసన వస్తున్నాయి. అవి శుభ్రంగా ఉన్నాయి.

ఐనీకి వెళ్లి వాటిమీద కూచోవాలని అనిపించలేదు. పనిమనిషి ఇల్లు అంతా శుభ్రం చేసి వెళ్లింది. మళ్లీ మళ్లీ రమ్మంటే రాదు. వచ్చినా వేరే పనులు చాలా బోలెడు ఉన్నాయి. వాళ్లాయన చెప్పే పనులే ఊపిరి సలపనివ్వవు. ఆయన, ఆయన నేస్తాలు, ఆ పేకాట.

ఆఠీన్ జాకి, ఇస్పేట్ రాణి, డైమండ్ రాజా... ముందుగదిలోనుంచి పేకాట ముక్కల గురించి మాటలు వినబడుతూనే ఉన్నాయి.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు... కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

భోజనాల గదిలో బల్ల శుభ్రంగా ఉంది. దానిమీద జగ్‌లో నిండా నీళ్లున్నాయి. నీళ్లు కావాలని మళ్లీ మళ్లీ కేకవేసి అడగడం ఆమెకు అసలు ఇష్టం లేదు. కుర్చీలన్నీ బల్లకిందకు సర్ది ఉన్నాయి. కేవలం వాటి వెన్నులు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. కోడిపిల్లలు తల్లి రెక్కల కిందికి దూరి ముడుచుకున్నట్టు అవి కనిపిస్తున్నాయి. పక్కన బల్లమీద పెట్టిన గడియారం టిక్ టిక్‌మంటూ గట్టిగా చప్ప్పుడు చేస్తున్నది.

ఐనీ ఆ గదిలోకి వచ్చి నిలబడింది. గడియారం టిక్ టిక్ రానురాను మరింత గట్టిగా వినిపిస్తున్నది.

ఇస్పేట్ రెండు, ఇస్పేట్ అయిదు, ఇస్పేట్ తొమ్మిది... పేకాట గదిలోనుంచి ఎవరో సంతోషంగా అరుస్తూ ముక్కలు విసిరినట్టున్నారు.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు...” కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

నడవలో వాలు కుర్చీ పక్కగా వేసి ఉంది. మిగతా కుర్చీల మధ్యన ఒక టీ పాయ్ కూడా అమర్చి ఉంది. దానిమీద దినపత్రిక మడతపెట్టి ఉంది.

‘ప్రపంచ యుద్ధం తప్పదు’ చైనా వ్యాఖ్యానం. ‘యుద్ధం వచ్చిందంటే ప్రపంచం మొత్తం నాశనమవుతుంది. కానీ చైనా వాళ్లు మాత్రం మిగిలిపోతారు. మరి వాళ్ల జనాభా మిగతా దేశాలకంటే చాలా ఎక్కువగా ఉంది కదా’ ఐనీకి కాసేపు బయటకు వెళ్లాలి అనిపించింది. ఒక్కసారిగా పిల్లలు గుర్తుకు వచ్చారు. ఆమె కళ్లముందు ఒక రకమయిన చీకటి కదల సాగింది! కళ్లు తిరుగుతున్నాయి.

డైమండ్ అయిదు, ఇస్పేట్ ఆరు, బాదాం ఏడు... ముందుగదిలోనుంచి ఎవరో గట్టిగా అరుస్తున్నారు.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు...” కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

నూనె పూసిన పొడుగాటి జుట్టు, ఎర్రఎర్రని కళ్లు, టపటపలాడుతున్న కనురెప్పలు, కోసుగా మొనదేలిన మీసాలు, ఉక్కులాగ వెడల్పయిన ఎడద, అన్నిటికంటే గట్టిగా గొంతు. ఐనీ గ్యాలరీలోకి వచ్చి నిలబడి కింద వీధిలోకి చూస్తున్నది.

కళావర్ ఎక్కా, బాదాం రెండు, ఇస్టేట్ ఎక్కా ...ముందుగదిలోనుంచి పేకాట మాటలు కొనసాగుతున్నాయి.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు...” కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

నడవలో పైన ఎక్కడా బూజులు కూడా లేవు. ఈ పట్నం పద్ధతి అంతే. ఇక్కడ అందరికీ పరిశుభ్రత కావాలి. దోమలు, ఈగలు కూడా ఉండకూడదు. సాలెగూళ్లు అసలే ఉండకూడదు. కనిపిస్తే చాలు వెంటనే వాటిని తుడిచేస్తారు. ఏ పనీ లేనప్ప్పుడు బూజుకర్ర తీసుకుని ఇళ్లంతా తుడవడం మొదలు పెడుతుంది ఆమె. ఇక సాలెపురుగులు టపటపా పరుగులు పెడుతూ తిరిగి ఆమెవేపు చూస్తాయి. మళ్లీ పారిపోతూ ఉంటాయి. పాలలాగ తెల్లని గోడలు, పాలలాగ తెల్లని పైకప్పు, పాలలాగ తెల్లని మూలలు. ఎక్కడా కొంచెం కూడా బూజు లేదు. మట్టి అంతకన్నా లేదు.

ఇస్పేట్ తొమ్మిది, ఆఠీన్ పది, డైమండ్ జాకీ... ముందు గదిలో ఎవరికో మళ్లీ పట్టు దొరికినట్టుంది.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు...” కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

భోజనాల గదిలో అన్ని వస్తువులు వాటివాటి చోట్లలో సర్ది ఉన్నాయి. పనిమనిషికి ఒక్కమాట చెపితే చాలు మళ్లీ ఎప్ప్పుడూ పొరపాటు చేయనే చేయదు. జగ్‌లో నిండా నీళ్లున్నాయి. కుర్చీలన్నీ బల్లకిందకు సర్దిఉన్నాయి. బయటికి ఉంటే అవి అనవసరంగా స్థలం ఆక్రమించుకుంటాయి. ఇంత పెద్ద నగరం. ఇంత పెద్ద ఇల్లు. అయినాసరే అందులో దేనికీ చోటు లేదు.

కళావర్ ఎక్కా, కళావర్ రెండు, కళావర్ మూడు... ముందు గదిలో గలగలా నవ్విన చప్ప్పుడు గట్టిగా వినిపించిది.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు...” కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందర ఒక పిచ్చుక వచ్చి కూచున్నది. తనను తాను అద్దంలో చూచుకుంటూ ఆ లోపలి పిచుకతో పోరాడుతున్నది. ముక్కుతో అద్దాన్ని పొడుస్తున్నది. విసిగిపోయి ఎగిరి బల్లమీద కూచున్నది. మళ్లీ అద్దం ముందుకువచ్చి ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది. పాపం పిచ్చి పిచుక.

ఇస్పేట్ రెండు, ఆఠీన్ రెండు, డైమండ్ రెండు... ముందు గదిలో ఒక చిన్న కేక వినిపించింది.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు... కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

భోజనాల గదిలో బల్లమీద పెట్టిన గడియారం ఆగిపోయింది. మూడు గంటల ఇరవయి అయిదు నిమిషాల దగ్గర. సెకండ్ల ముల్లు ఏడుమీద ఉంది. ఈ గడియారం ఎందుకు ఆగిపోయింది. కీ ఇవ్వలేదేమో! బహుశా మర్చిపోయి నట్టున్నాము. 

బయట నడవలో టీపాయ్ మీద పత్రిక.

ప్రపంచ యుద్ధం రాకమానదు. పత్రికలో పడగ విప్పిన పాము కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఐనీకి ఎందుకో తోచింది. ఆవాల నూనె పూసిన జుట్టు. కింద నుంచి ఎందుకో అలాంటి వాసన వచ్చింది. లేక ఎవరయినా పకోడీలు వండుతున్నారేమో!

ఇస్పేట్ ఎక్కా, కళావర్ ఎక్కా, డైమండ్ ఎక్కా... ముందు గదిలో మళ్లీ ఎవరో సంతోషంగా అంటున్నారు.

టప్ టప్, టప్ టప్, టప్ టప్... వంటింట్లో  కుళాయి కారుతున్నది.

“చిక్కుడు కాయలు, తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చటి చిక్కుడు కాయలు...” కింద వీధిలో కూరలబండి వాడు గట్టిగా అరుస్తున్నాడు.

ఇక ఐనీ సైగ చేసి కూరలబండి ఆతడిని పైకి పిలిచింది. నూనె పూసిన జుట్టు, ఎర్రబారిన కళ్లు, టపటప లాడుతున్న కనుపాపలు, కోసుగా మొనదేలిన మీసాలు, వెడల్పాటి ఎద, గట్టి గొంతుక.

‘చిక్కుడు కాయలమ్మా, రూపాయికి కిలో!’

‘తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు...’ అంటూ బండి మనిషి తనవేపే చూస్తున్నాడు. ఐనీ ఆకుపచ్చని చీరలో మెరిసిపోతున్నది.

‘రెండు కిలోలు ఇవ్వు!’ ఐనీ కూరల మనిషి అరచేతిలో అయిదు రూపాయల నోటు పెట్టింది. అతను బుట్టలోనుండి రెండు కిలోలు తూకం వేసి సంచిలో పోసేశాడు. తరువాత ఒకసారి ఆమెవేపు చూచాడు. తాజా చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు పచ్చని చిక్కుడు కాయలు...!

‘అమ్మగారూ’ కూరల మనిషి చేతులు జోడించుకుని నిలబడ్డాడు. ‘చిల్లర మూడు రూపాయలు లేవండి అమ్మగారు. రేపు మీకు తెచ్చి ఇచ్చేస్తాను. ఇవాళ డబ్బులు అవసరం కూడా ఉంది.’

ఐనీ మరేమి పాలుపోక తల ఆడించింది. కూరల సంచి వంట ఇంట్లోకి తీసుకు పోయింది. మళ్లీ బయటనుంచి చప్ప్పుళ్లు మరోసారి మొదలయ్యాయి. తలుపు తట్టిన చప్ప్పుడు కూడా అయ్యింది.

ఐనీ వెళ్లి తలుపు తెరిచింది. ‘అమ్మగారూ!’ ఎదురుగ్గా చిక్కుడుకాయల మనిషి. ‘అమ్మగారూ గొప్ప చిక్కుల్లో పడిపోయాను. నాకు మరొక పది రూపాయలు ఇప్పించండి. మా తమ్ముడిని పోలీసులు పట్టుకున్నారు. వాళ్లకు నమలడానికి ఎముక ఏదో పడెయ్యాలి కదా! తమ్ముడిని విడిపించుకుని వస్తాను’ అన్నాడతను.

ఐనీ లోపలికి వెళ్లి పర్సు తెచ్చింది. అందులోనుంచి పది రూపాయల నోటు తీసి కూరల మనిషిని అందించింది. మిగతా నోట్ల కట్టను పర్సులో తిరిగి పెట్టింది. తల ఎత్తి కూరల మనిషివేపు చూచింది. పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చని చిక్కుడు కాయలు. కూరల మనిషి మెట్లు దిగుతున్నాడు. ఐనీ వెనక్కు మళ్లి తన గదిలోకి వచ్చింది. లోపలికి చేరిందో లేదో మళ్లీ తలుపు తట్టిన చప్ప్పుడు వినిపించింది.

మళ్లీ అతనే. ‘అమ్మగారూ! వాళ్లు యాభయి రూపాయలు అడుగుతున్నారు. మా తమ్ముడిని బొక్కలో తోసేశారు. మీకు ఒక్కొక్క రూపాయి తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను’

పర్సు ఇంకా ఐనీ చేతిలోనే ఉంది. ఆమె దాన్ని తెరిచింది. పది రూపాయల కాగితాలు అయిదు ఎంచి తీసింది. కూరల మనిషికి అందించింది. మిగిలిన రెండు నోట్లను పర్సులో పెట్టింది.

‘అమ్మగారూ, మరొక్క పది కాగితం కూడా ఇప్పించండి. పోలీసు వాళ్ల సంగతి తెలిసిందే కదా! ఎంత అడిగినా అడుగుతారు....!’

ఐనీ మరొక నోటు కూడా తీసి కూరల మనిషికి అందించింది.

‘అమ్మగారూ, ఆ మిగిలిన ఒక్కనోటు కూడా ఇవ్వండి. నాకు చాలా అవసరం ఉంది.’

ఇక ఐనీ చివరి నోట్‌ను కూడా కూరల మనిషికి అప్పగించేసింది.

టప్‌టప్! టప్‌టప్! కూరల మనిషి టకటక మెట్లు దిగిపోతున్నాడు. ఐనీ అతడిని వెనుకనుంచి చూస్తున్నది. తాజా ‘చిక్కుడు కాయలు, పొడుగాటి చిక్కుడు కాయలు, పచ్చని చిక్కుడు కాయలు...’

పర్సు ఖాళీ అయింది. ఐనీ దాన్ని పట్టుకుని ద్వారంలో నిలబడి ఉంది. ఎదురుగా ఉన్న లిఫ్ట్‌లోనుంచి పిల్లలు బయటకు వచ్చారు. ముద్దుముద్దుగా బొద్దుబొద్దుగా ఇద్దరు పిల్లలు చకచకా వచ్చేశారు!

ఐనీని ఒక్కసారి ఎవరో కుదిపి నిద్రలేపినట్టు తోచింది. తను ఏం చేసింది? అన్ని డబ్బులు ఎవరో పరాయి మగవాడికి అందించింది. వాడు అవి తీసుకుని మెట్లు దిగి వెళ్లిపోయాడు. మళ్లీ వాడి చప్ప్పుడు లేదు, కనీసం పక్కవీధిలో కూడా వాడి జాడలేదు.

ఐనీకి ఊపిరి బరువుగా తోచింది. ఆమె దుఃఖంగా తిరిగి తన ఫ్లాట్‌లోకి వచ్చేసింది. నేరుగా ముందు గదిలోకి దూసుకుపోయింది. అక్కడ ఆట సాగుతూనే ఉన్నది. ‘ఇస్పేట్ ఎక్కా.....!’

‘మీరు ఇక్కడ కూచుని హాయిగా పేక ఆడండి. ఎవడో వచ్చి నన్ను దోచుకుని వెళ్లిపోయాడు!’ ఐనీ భర్తతో గట్టిగా అన్నది. ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టింది.


 

No comments: