Monday, November 23, 2026

లోకాభిరామం : స్వర తరంగం

 


అక్క కేళవ్య - హాంటింగ్ మెలొడీ: అంటే తలలో ఆగకుండ మోగుతుండే పాట:

నాకు రేడియో వినడం ఇంచుమించు వ్యసనంగా ఉండేది. (ఇప్పుడు లేదని నా చేత ఎందుకు చెప్పిస్తరూ?) నాకు సంగీతంలో, వివిధ భాషల మీద ఆసక్తి కలిగింది, పెరిగిందీ అంటే రేడియో కారణంగనేనని మొహమాటం లేకుండ చెప్పగలను. నాన్న, ఒక ఏ కంపెనీ కాని, అనగా అసెంబ్‌ల్‌డ్ ట్రాన్సిస్టర్ తెచ్చి ఇచ్చినడు. పల్లెలో రేడియేషన్ కాలుష్యం లేని రోజులు. ఆ రేడియోలో ఎక్కడెక్కడి స్టేషన్లు వినబడేవి. వాటిని మారుస్తూ రాత్రి పొద్దుపోయేవరకు ఏమేమో వినే అలవాటయింది. ఒకనాటి రాత్రి ఒకానొక కర్నాటక స్టేషన్ నుంచి ఈ కన్నడ పాట విన్నాను. ‘అక్క కేళవ్వ! నానొందు కణసు కండేనే!’ అంటే ‘అక్కా విన్నావా? నేనొక కలగన్నానూ’ అని. కన్నడంలో ‘వచనగళు’ అనే రచనలుంటాయని తెలియదు. మల్లికార్జున్ మణ్‌సూర్ ఎవరో తెలియదు. ఆ పాట మాత్రం సంవత్సరాలపాటు నా మెదడులో మనసులో తిరుగుతూ ఉండిపోయింది.

తరువాత చదువుతూ వుంటే, శైవ సాంప్రదాయంలో, పెద్ద పండితులు గాని భక్తులు ‘వచన’ అనే రచనల్లో తమ భక్తిని పంచినరని తెలిసింది. బసవేశ్వరుని సంప్రదాయం అది. అక్కమహాదేవి అన్న ఒక మహిళ ఈ అక్క కేళవ్వ అనే పాట రాసిందని కూడ తెలిసింది. ఈ వచనాలను, శాస్త్రీయ విద్వాంసులు కూడా రాగయుక్తంగ పాడినట్టు తెలిసింది. తెలుగులోనూ ‘వచనములు’ ఉన్నయి. వాటినెవరన్న పాడినట్లు మాత్రం కనిపించలేదు. (అది నా లోపము గావచ్చు. నాకు అవి వినిపించలేదు)

నేను మాత్రం ‘అక్క’ పాట గురించి చేతనయిన చోటంత వెతుకుతూనే ఉన్న. కడకు, ఇంటర్‌నెట్ అనే సముద్రంలో ఆ మణిపూస దొరికింది. దాన్ని నేను ఇంచుమించు దొంగిలించి, సాంకేతికంగ తీరు మార్చి, అందరికి అందేట్లు అందించి, దోష భావాన్ని కొంత తగ్గించుకున్న. ఈ పాట పాడిన మల్లికార్జున మణ్ సూర్, హిందుస్థానీ సంగీతంలో మేరు పర్వతమంత గాయకుడు. ఆయనను కళ్లచూచే అదృష్టం కలగలేదు. బొమ్మలో ఆయనను చూస్తే, ఈయనేనా పాడింది?’ అని అనుమానం పుడుతుంది. ప్రపంచమంతట పేరున్న ఆ మహా గాయకుడు, ధార్వాడ్‌లో, ఎవరితోనో సైకిలు వెనుక కూచుని, రేడియోకు వచ్చి కచేరీ చేసేవాడని, మిత్రులు వెంకటేశ్ గోడ్‌ఖిండీ చెపితే ఆశ్చర్యపోయిన. ఆయన సంగీతం విన్న. వీరాభిమానిగ మిగిలిన.

నాకు కొంచెం కన్నడం వచ్చును. కానీ, కవిత అర్థం తెలుసుకునేంత వచ్చునా? విచిత్రంగ, వచన సాహిత్యం, అనువాదం పుస్తకమొకటి, సమీక్ష కొరకు నాకు పంపి పుణ్యం కట్టుకున్నరు ఒక పత్రిక వారు. అదేదో వర్క్‌షాప్ పెట్టి, కవులను ఒకచోట చేర్చి అనువాదాలు చేయించినరు. మిత్రులు కె.శివారెడ్డి గారు తెలుగు అనువాదాలు చేశినరు. కానీ, నిజం చెప్పొద్దూ, అక్క కేళవ్వ అనువాదం సరిగా లేదు. అందుకు నేనెవరినీ తప్పు పట్టేందుకు లేదు.

‘అక్కా విన్నావా/ నేనొక కలగన్నా/ బియ్యము, వక్క, తమలపాకూ, (తాటాకు, కొబ్బరికాయ) చూచిన/ చిన్నచిన్న జడల, (సుందర దంతాల)/ గొరవడు (ఇంటికి) భిక్షకు రావటం చూచిన/ మితిమీరిన మోహంతో (అతడిని అనుసరించి పాణిగ్రహణం చేశిన)/ చెన్న మల్లికార్జునుని చూచి కళ్లు తెరిచిన.. పాట కన్నడ పాఠం చూడాలి. బ్రాకెట్లలోని మాటలు పాటలో లేవు. నేను నెట్‌లో పంచిన పాటా లేదు! వినదలచుకున్న వారు యూ ట్యూబ్‌లో వెతకండి. ఉంది పాట!

 


No comments: