సరస్సు
ఈ సరస్సు గురించి ఎవ్వరూ రాయరు. దాన్ని గురించి అందరూ గుసగుసగా మాట్లాడుకుంటారు.
అదేదో మంత్రాల కోట మార్గాలవలె అక్కడికి వెళ్లే ప్రతిదారి మీదా ‘రావద్దు’ అంటూ రాసి ఉంటుంది.
సూటిగా ఒక్కమాటలో నిషేధం చెపుతారు.
మనిషిగాని, మృగంగానీ, ఆ మాటను దాటడానికి లేదు. వెనక్కు తిరగవసిందే.
ఆ మాటను అక్కడ రాసిపెట్టింది నేల మీద పుట్టిన శక్తులే.
దాన్ని దాటి ఎవ్వరూ పోకూడదు, నడవకూడదు, పాక కూడదు కనీసం ఎగరకూడదు.
విచ్చుకత్తులతో, పిస్తోళ్లతో పహారాదారులు దారిపక్కన చెట్ల తోపులో నక్కి చూస్తుంటారు.
సరస్సుకు దారి వెతుకుతూ, నీవా నిశ్శబ్దపు అడవి చుట్టూ ప్రదక్షిణాలుగా తిరగవచ్చు.
కానీ, నీకెవరూ కనిపించరు. అడగడానికి ఎవరూ ఉండరు. అవునుమరి, ఆ అడవిలోకి ఎవరూ పోనే పోరు.
వాళ్లందరినీ భయపెట్టి తరిమేశారు. ఒకానొక మధ్యాహ్నం వర్షం కురుస్తూంటే,
పశువుల దారిలో ధైర్యంగా ముందుకు సాగడానికి నీకు అవకాశం దొరుకుతుంది.
దూరంగా ఎక్కడో ఆవు మెడలోని గంట చప్పుడు మందంగా వినిపిస్తుంది.
కంటపడిన మొదటి క్షణం నుంచి చెట్ల తోపుల మధ్యన విస్తృతంగా మెరుస్తున్న ఆ దృశ్యం నిన్ను ఆకట్టుకుంటుంది.
ఆ గట్ల వద్దకు చేరకముందే బతుకంతా అది నీకు గుర్తుండిపోతుందన్న నమ్మకం కలుగుతుంది.
సరస్సు ఎవరో వృత్తలేఖినితో గీసి తయారుచేసినంత గుండ్రంగా ఉంటుంది.
నీవు ఒకవేపున ఉండి అరిస్తే, కానీ అక్కడ నీవు అరవకూడదు, అందరికీ వినిపిస్తుంది,
అటుపక్కకు కేవలం కొంచెం చప్పుడు మాత్రమే చేరుకుంటుంది. అంత దూరం ఉంటుంది అవతలి గట్టు.
సరస్సు పక్కనంతా అడవి పరుచుకుని ఉంటుంది.
అంతులేని వరుసల్లో ఒకదాని వెంట ఒకటిగా చెట్లు దట్టంగా చుట్టుకుని ఉంటాయి.
అందులోనుంచి ముందుకు సాగి నీటి అంచులకు చేరుకుంటావు.
ఆంక్షలు పెట్టిన ఆ తీరాలన్నింటినీ చూడగలుగుతావు.
ఇక్కడొక పసుపు ఇసుక పర్ర, అక్కడొక రీడ్ పొదల గుంపు, మరోచోట గాలిలో కదలాడుతున్న గడ్డి.
నీళ్లు చదునుగా ఉంటాయి, ప్రశాంతంగా కదలకుండా ఉంటాయిగట్టు మీద తుప్పలు కాక, అడుగు కనిపించని నీళ్లలో నుంచి మెరుపేదో వస్తూ ఉంటుంది.
రహస్యమయిన అడవిలో రహస్యమయిన సరస్సు. నీళ్లు పైకి చూస్తుంటాయి. ఆకాశం కిందకు చూస్తుంటుంది.
ఆ అడవికాక, మరొక ప్రపంచం ఉంటేగింటే అది అక్కడ తెలియదు, కంటికి కనిపించదు. అది ఉన్నాసరే, దానికి అక్కడ చోటు లేదు.
కలకాలంగా ఉండిపోవడానికి అది సరయినచోటు. ప్రకృతిలో ఒకరుగా బతకడానికి తగిన చోటు.
ఉత్తేజంగా ఉండ డానికి కావలసిన చోటు.
కానీ, అది కుదరదు. ఒక దుర్మార్గుడు, మెల్లకంటి మహాక్రూరుడు సరస్సును తనది అంటాడు.
అదే వాని ఇల్లు, అదే వాని స్నాన గృహం. వాని సంతతి దుర్మార్గులంతా అక్కడ చేపలు పడతారు.
వాని బోటునుంచి బాతులను వేటాడుతారు. ముందు నీటి మీద ఒక నీలం పొగమేఘం కనిపిస్తుంది.
మరుక్షణం దూరంగా ధ్వని వినిస్తుంది.
అడవికి ఆవల దూరంగా జనం చమటోడ్చి కష్టపడతారు. ఇక్కడికి వచ్చే దారులన్నీ మూసి ఉంటాయి.
లేకుంటే వారు దూరి వస్తారు. ఇక్కడ ఉండే చేపలు, జంతువులన్నీ దుర్మార్గుని ఆనందం కొరకే!
ఇక్కడెవరో మంటలు పెట్టిన ఆనవాళ్లున్నాయి. కానీ, మంటలను ఆర్పేసారు. మనుషులను తరిమేశారు.
ప్రియమయిన ఏకాకి సరస్సు! అదే నా స్వంత దేశం!