Tuesday, February 17, 2026

లోకాభిరామం - కష్ట షకారం మరెన్నో సంగతులు...


లోకాభిరామం - కష్ట షకారం

 మరెన్నో సంగతులు...


కష్ట షకారం

హొటేల్‌లో (హోటల్‌ అంటే తప్పు తెలుసా?) దోసె తినడానికి పోయిన ఒకతను ‘బాగ పల్చగ వేయాలె. అంచులు కూడ బాగ కాలాలె. పచ్చిమిర్చి తక్కువగ ఉండాలె’ అని తన మనసును బయటపెట్టుకున్నాడు. సర్వర్మహాశయుడు మాత్రం లోపలికి పోయి ‘ఒక సాదా!’ అని ఆర్డరు ఇచ్చాడు. అదీ మన ఒకతనికి వినిపించే పద్ధతిలో!

ఇంగ్లీషులో దోసె పేరు దోస అని రాస్తరు. డొస్సా అని పలికిన వారిని నేను చూచి పుణ్యం కట్టుకున్నాను. దోస అన్నది కూరగాయలలో ఒకటి. వాటిలో ముల్లుదోస, ఏటిగడ్డ దోస, కీరా దోస అని రకాలుంటాయి. ఏటిగడ్డ దోస అన్నది కర్బూజలంత తీపిగా పండడం, కర్బూజకన్నా మెత్తగా వెన్నలాగ లోని గువ్వము (గుజ్జు) ఉండడము గుర్తుంది. మాకు చిన్నప్పుడు బుడుమ కాయలు తినడం అలవాటు. అవి దోసకాయలకన్నా చిన్నవి. గుండ్రంగా ఉండేవి. వీటిలో కొంత పులుపు ఎక్కువ. గింజలలో పులుపు మరీ ఎక్కువ. గింజలలో అనేకన్నా, వాటి చుట్టు ఉండే పదార్థంలో ఈ పులుపు ఉంటుంది కనుక, గింజల చుట్టు పులుపు అనాలి. పప్పులోనయితే గింజలతోబాటు ముక్కలు వేస్తే, ఇక పులుపే పులుపు.

ఈ బుడుమ కాయలలో కొన్ని చేదుండేవి. అమ్మ వాటిని చిన్న ముక్కలుగా తరిగి, కొంత చింతకాయ తొక్కు వేరే తీసి, అందులో కలిపి పెట్టేది. నాలుగయిదు దినాలయితే ఆ ముక్కలు చేదు పోయి, ఉప్పు, పులుపు కలిసిన గొప్ప రుచిలోకి మారేవి!

ఇనుప బొచ్చెల కాలం: మా ఊళ్లో చాలా మంది అన్నం, పప్పు, కూరలు అన్నీ మట్టిపాత్రలలోనే వండుకునేవారు. మా ఇంట్లో మాత్రం నాగరికత పేరున, అన్నం కంచు, ఇత్తడి గుండీల్లో వండేవారు. చారు, పప్పు మాత్రం మట్టికుండలోనే. కొంతకాలానికి జనం సత్తు అనే అల్యూమినం వాడడం నేర్చుకున్నారు. దాన్ని జర్మన్‌ సిల్వర్‌ అనేవారు. మా ఇంట్లో ‘చాయ’కు మాత్రం సత్తుగిన్నె వాడడం గుర్తుంది. మట్టికుండలో వండిన పప్పు, చారు రుచి మరో రకంగా ఉండేవి.

పాడి కూడా మొత్తమంతా మట్టి కుండలలోనే! నేలలో ఒక గుంత ఉంటుంది. దాని పేరు దాలిగుంత. అందులో పిడకలు వేసి, మీద ఒకటి రెండు నిప్పు కణికలు వేసి, రాజుకున్న తరువాత పాల కుండ పెడతారు. మీద ఒక పీట పెడతరు. పాలు దినమంత అందులో సన్నని సెగ మీద కాగి, కాగి చిక్కబడతయి. వాటి రంగు తెలుపు నుంచి మారిపోతుంది. పిడకల పొగ కారణంగా వాటికొక చిత్రమయిన వాసన వస్తుంది. కిటుకు తెలిసినవారు అమర్చిన పిడకల వల్ల రాత్రి వరకు వేడి పోతుంది. ఆ గుంటలోనే కుండలో తోడు పెడితే, తెల్లవారేసరికి చిక్కని కమ్మని పెరుగు సిద్ధం. నిజానికి ఆ పాత్రను కుండ అనకూడదు. దుత్త, అటికె లాంటి పేర్లుంటాయి వాటికి. వెడల్పు మూతి, ఎత్తు తక్కువ కలిగిన గిన్నెలాంటివవి! పెరుగును రాచ్చిప్ప (రాతి చిప్ప) లోకి మార్చిన తర్వాత, అడుగున పాత్రను కౌచిప్ప (ఆల్చిప్ప)తో గోకాలి. మాడీ మాడని గోకు వస్తుంది. అమ్మ ఎప్పుడు ‘గోకు’ పెడుతుందోనని ఎదురుచూడడం గుర్తుంది.

ఇనుప బొచ్చెల కాలం వచ్చింది. తిండిలో రుచి పోయింది. పొయ్యి తీరు మారింది. తిండి తిండి గాకుండ పోయింది!

గొట్టికాయలు: పల్లెలో ఆవులు, బర్రెలకన్న మేకలు ఎక్కువగ ఉండేవి. మేకలను పెంచడములోని ఇకనామిక్స్‌ నాకు తరువాత గాని అర్థం కాలేదు. (ఎకనామిక్స్‌, ఎలెక్ట్రాన్‌, ఎలెక్ట్రిసిటీ లాంటి మాటలు ఇ అనే అక్షరంతో మొదలు కావాలట తెలుసా!) మేక పాలు కొంత వాసన! కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మా ఎదురింటి రాములు వాండ్లకు బోలెడన్ని మేకలు. వారి దగ్గర జీతము చేసే ఒక పిల్లవాడు, పాలను సూటిగ నోటిలోకి పిండుకుని తాగుతుంటే చూడడము మాకొక సరదా! గొర్లు (గొర్రెలు) మేకలను గుంపులుగ తెచ్చి పంట పొలాలలో రాత్రి ‘మందలాపుతరు’. మందలుగా ఆపుతరని భావము. వాటి చుట్టు వల దడి. కుక్క కావలి కూడ. మేకలు, గొర్లు రాత్రి మొత్తము అక్కడే నెమరు వేసి, మలమూత్రములను వదులతయి. అది పొలానికి బలము. ఎరువు! ఎంత సులభమయిన, చక్కని పద్ధతి! ఇప్పుడంతా కృత్రిమమే!

మేకలు, గొర్లు సాధారణముగ అడవిలోకి పోయి అక్కడ కనిపించిన చెట్లన్నిటినీ కరకర నమిలి తింటాయి. ‘మేక మేయని ఆకు’ అని ఒక చెట్టు, దాని ఆకులు ఉంటాయంటే చిత్రంగదూ! మిగతా మొక్కలు, చెట్ల ఆకులు, కాయలు, కొమ్మలన్నింటినీ అవి హాయిగా తినేస్తాయి. అయితే, కొన్ని కాయలలోని గింజలను, అవి అరిగించుకోలేవు. కాయ లేదా పండులోని గువ్వము (కండ) శుభ్రంగా అరుగుతుంది. గింజ అంత శుభ్రంగానూ మిగిలిపోతుంది. ఈ గింజలు, పెంటికలతో బాటు బయటకు వస్తయి. వాటినే గొట్టికాయలు అనేవారు. చెట్టునుబట్టి అందులో రకాలు. నూనె గొట్టికాయలు, నున్న గొట్టికాయలు గుర్తున్నయి. మిగతా వాటి రుచి మాత్రం గుర్తుంది. అంటే ఆ గింజలను పగలగొట్టి లోపలి పలుకులను తిన్నామనే గద అర్థం! చాలా రోజులపాటు పల్లెలో మేకలున్న ఇంటి పిల్లలకు, వారి దోస్తులకు ఇదొక కార్యక్రమం. లేచిన వెంటనే చెరువుకు పోవాలె. అక్కడ ఒకటి, రెండు, పండ్లు తోముట ముగుస్తయి. తరువాత మేకల దొడ్డిలో గొట్టికాయల వేట! నిజం చెప్పాలి. ఆ గింజల రుచి నాకు ఇవాళటికీ గుర్తుంది!

ఇసుర్రాయి: ఇసిరే రాయి అని విగ్రహము. ఇసరడము అంటే విసరడము కాదు. రాయిని దూరానికి విసిరేస్తాము. కానీ రెండు గుండ్రని రాతి పలకల నడుమ ధాన్యమును విసురుతాము. కింది రాతిలో నడుమ ఇనుప బొడ్డు, పై రాతిలో మధ్యమధ్యన గింజలు నింపేందుకు రంధ్రాలు. ఒక చేతితో రాతిని తిప్పుతూనే మరొక చేతితో గింజలు వేయడము ఒక నైపుణ్యత. పసుపు, చక్కెర కూడ ఈ పద్ధతిన ఇసరడము గుర్తున్నది. రొట్టెలు ఎక్కువగ తినే వాండ్ల ఇండ్లలో ఇసుర్రాయిని నేలలో ఒకచోట పాతి ఉంచడము గుర్తున్నది. కింది రాయి కదులుతుందన్న బాధ లేదన్నమాట. కరెంటు లేని కాలంలో ఇంటింటా ఈ ఇసిరే చప్పుడు గంటల పాటు వినిపించేవి. దారితోబాటే కిష్టమ్మ పాడిన ‘వొస్తుంటి శెల్లెల! వోగడ్డమాయె!’ అన్న జానపదం పాట గుర్తున్నది. ఇసరడము లాగనే పాట కూడ మహ సాగదీసి నడిచేది! పాలమూర్లో యాపశెట్ల కాడ గిర్నీలు వచ్చినయి. అంటే  వేపచెట్ల ప్రాంతంలో పిండిమరలు వెలిసినయని గ్రహించవలసినది.  వేపచెట్లు అన్నవి ఒక ప్రాంతమని అర్థమయ్యే ఉంటుంది. జొన్నల వంటి గింజలు సంచులలో పోసుకుని పోయి, పిండి పట్టించుకుని తేవడము కొందరికి అలవాటయింది. ఈ పేరున పాలమూరికి పోవచ్చు. నేను గూడ పోవాలని నాకు! అమ్మ నవ్వేది. ఎందుకయ్యా నీకా నడక, మోత కష్టం? అనేది. అయినా ఒక శేరు జొన్నలు, దానికి గిర్నీ కూలి అణాపైసలు సాధించి, మిగతా పిల్లలతో యాత్ర. అప్పట్లో అది సింద్‌బాద్‌కు మించిన సాహసయాత్ర!

కష్ట షకారం: ‘నాతో మాట్లాడడమే ఎడుకేషన్‌’ అంటాడు గిరీశం (కన్యాశుల్కంలో). కొందరితో మాట్లాడితే నిజంగానే బోలెడు కొత్త సంగతులు తెలుస్తాయి. పాషాణభేది గోపాలకృష్ణ గారు అట్లాంటి మనుషుల్లో ఒకరని నిస్సందేహంగా చెప్పగలను. ‘ఎల్లమ్మకు ఎల్లయ్యకు పెండ్లంట. ఎవరింట్లో వాండ్లకు విందంట!’ అని ఒక కవిత లాంటి మాట చెప్పా రాయన. దీనికి మూలం తమిళంలో ఎక్కడో ఉన్న ట్టుంది. గోపాలకృష్ణగారు సిపి బ్రౌన్‌ గురించి పరిశోధించి పుస్తకం రాశారు. స, , షలను గుర్తుంచు కునేందుకు బ్రౌన్‌ చెప్పిన సూత్రం ఒకటి ఆయనవల్లే నాకు తెలిసింది. సులభ సకారం, శాంతి శకారం, కష్ట షకారం అని ఆ సూత్రం. మా అమ్మ పేరు శేషమ్మగారు. పల్లెలో అందరూ ఆమెను సేసమ్మ అని మాత్రమే అనేవారు.

కన్యాశుల్కం చదువుతుంటే షకారం గురించి ఇంకో సంగతి కనబడుతుంది. ఏమిటిష? అంటే ఏమిటట? ఏమిటిషలో షకారం ట అన్న అక్షరానికి బదులుగా వచ్చిందని అర్థం. బాగా మాట్లాడుతున్నా మనుకుని విజయనగరం ప్రాంతంలోని అలనాటి బ్రాహ్మలు అనవసరంగా షకారం వాడుకున్నారన్న మాట.

మన వాళ్లకు చాలా మందికి స శ ష తేడా తెలియదు. పలకదు. మధ్య భారతం వారు ఈ విషయంలో మనకన్నా అన్యాయం. వాళ్లకు ష పలకదు. లేక పలకరు. అన్నింటికీ మామూలు స వచ్చేస్తుంది. అచ్చమయిన ఇంగ్లీషు స్టేషన్‌ను స్టేసన్‌ అంటారు. ఆ సంగతి వాళ్లకు తెలియదనుకోండి.  మన నాయకులలో ఒకాయన బాగా మాట్లాడుతున్నా ననుకుని అన్నీ షకారాలే పలుకుతుంటాడు. ఆయన బహుశా విజయనగరం వాళ్లను విన్నారని మీకనిపిస్తే నేనేమీ చేయలేను. అచ్చంగా వాళ్లలాగానే ఈయన కూడా కేవలం బాగా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అంతే. పలకవలసిన చోట ష పలకదు. అనవసరమయిన చోట మాత్రం అది వచ్చేస్తుంది.  ‘కష్టం’ కదూ!


 

No comments: