Saturday, August 30, 2025

Sufi Story - కలలు - రొట్టె ముక్క

Sufi Story - కలలు - రొట్టె ముక్క


కలలు - రొట్టె ముక్క

ముగ్గురు ప్రయాణికులు చాలాకాలంగా, చాలాదూరం కలిసి వెళుతున్నారు. కనుక స్నేహితులయ్యారు. కష్టసుఖాలను పంచుకున్నారు.

కొన్నాళ్లు అట్లా గడిచిన తర్వాత వాళ్లకు తమదగ్గర ఒక రొట్టెముక్క, గుక్కెడు నీళ్లు మాత్రమే మిగిలాయని అర్థమయింది. అవి ఎవరికి చెందాలనే విషయంలో కీచులాటలు కూడా మొదలయినయి. ఉన్నదాన్ని పంచుకు తినాలనుకున్నారు. ఉండేది తక్కువ కనుక పంపకం కుదరలేదు.

చీకటి పడసాగింది. పడుకోవడం మంచిది, అన్నాడొకతను. నిద్రలో ఎవరికి గొప్ప కలవస్తే వారు జరగవలసిందేమిటో నిర్ణయించాలని కూడా సలహాయిచ్చాడతను.

మరుసటి ఉదయం పొద్దు పొడుస్తుంటే ముగ్గురూ నిద్ర లేచారు.

నాకల చెప్పనా?’ అంటూ మొదటి మనిషి మొదలు పెట్టాడు  ‘నేను వర్ణించనలవిగాని ప్రదేశాలకు కొనిపోబడ్డాను. అక్కడంతా అందమే. ప్రశాంతతే. అక్కడొక జ్ఞాని కనిపించాడు. ‘నీ గతము, భవిష్యత్తు గొప్పవి. అందరూ మెచ్చుకోదగ్గవి. తిండి నీకే చెందాలి’ అని చెప్పాడా జ్ఞాని.

అతని మాటలు ముగియక ముందే రెండవ మనిషి అందుకున్నాడు ‘కదూ! అసలు నాకు నా గతం, భవిష్యత్తు అన్నీ కలలో కనిపించాయి. నేను భవిష్యత్తులో ఒక సర్వజ్ఞుడిని దర్శించాను. అతనన్నాడు గదా! నీ మిత్రులకన్నాముందు ఆతిండి నీకే అందాలి. నీవు తెలివి, ఓపిక గలిగినవాడివి. నీవు నాయకుడవు కావాలి గనుక, నీకు మంచి పోషణ అందాలి’ అని చెప్పుకు వచ్చాడతను.

మూడవ ప్రయాణికుడు నెమ్మదిగా చెప్పసాగాడు. ‘నాకు కలలో ఏమీ కనబడలేదు. ఏమీ వినబడలేదు. ఏమీ అనలేదు కూడా. నాకు నిద్ర తేలిపోయి మెలుకువ వచ్చింది. రొట్టె, నీళ్లు వెదికాను. అక్కడిక్కడే తిన్నాను కూడా. అదీ అసలు సంగతి’ అన్నాడతను.

 

ఈ కథను షా మహమ్మద్‌ షత్తారీ చెప్పాడంటారు. ఆయన 1563లో గతించాడు. హుమాయాన్‌ చేత గౌరవం పొందిన వాడతను. షత్తారీ, మతానికి వ్యతిరేకమయిన మాటలు చెపుతున్నాడని, మరణశిక్ష వేయాలన్నారు. కానీ ప్రత్యేక పరిస్థితులలో చెప్పిన మాటలను మామూలు పండితపద్ధతిలో విమర్శించడానికి లేదని, ఆయనను వదిలేశారు. ఆయన సమాధి గ్వాలియర్‌లో ఉంది.


No comments: