Thursday, August 22, 2019

అహమదాబాదులో ...



పార్లమెంట్ ఎన్నికలకన్నా చాలా ముందు అంటే మార్చి నెల చివర్లో నేను ఒక వారం పాటు ఉత్తర భారతదేశంలో తిరిగాను. అది నిజానికి విహార యాత్రగా పథకం ప్రకారం చేసిన ప్రయాణం కాదు. మరొక అవసరం మీద ఒక పెద్ద మనిషి బయలుదేరితే అతనితోపాటు నేను కూడా వెళ్లి తిరిగాను. మొదట అహమదాబాదు వెళ్లాము. అక్కడి నుంచి రిషికేశ్, కురుక్షేత్ర, షిమ్లా, ఆ తర్వాత దిల్లీ. అంటే ప్రయాణం కనీసం ఐదు ఆరు రాష్ట్రాలలో సాగింది అని అర్థం. వెళ్లిన ప్రతిచోట అనుభవాలు గొప్పగానే ఉన్నాయి. వాటన్నిటిని గురించి చెప్పుకోవాలంటే సరైన సందర్భం, సమయం ఉండాలి. ఎంత దూరం తిరిగినా నాకు ఎక్కడా ఎన్నికల సూచనలు కనిపించలేదు. అహమదాబాదులో అంతకన్నా ఆశ్చర్యాలు ఎదురయ్యాయి. నేను నిజానికి ఆ నగరాన్ని చూసి చాలా కాలమైంది. అప్పట్లో నాకు అది ఒక పాత నగరంగా కనిపించింది. ఇప్పటి నగరాన్ని నేను గుర్తించలేక పోయాను. స్థానిక మిత్రుడు ఒకాయన మమ్మల్ని పాత కొత్త నగరాలతోపాటు పక్కనే కట్టిన గాంధీనగర్‌కు కూడా తీసుకువెళ్లాడు. మొట్టమొదట ఆ నగరంలోని రోడ్ల గురించి చెప్పుకోవాలి. నగరం మధ్యలో నడుస్తున్న దారులు ఆరు లేన్లు కలిగి ఉన్నాయి అంటే ఆశ్చర్యం. వాటిలో ఒక లేన్ కేవలం ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకించబడింది. ఆ బస్సులకు ఇంచుమించు రైల్ స్టేషన్ లాగా అందమైన స్టాప్‌లు ఉన్నాయి. బస్సులో ఎక్కే అవకాశం నాకు దొరకలేదు. మన దగ్గర రోడ్లలో ఆర్టీసీ బస్సులు చేసే విన్యాసాలు గుర్తుకు వచ్చిన తరువాత మన వాళ్లకు ఈ తరహా ఆలోచనలు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న మెదడులో గట్టిగా కదిలింది. ఇక అక్కడ కడుతున్న భవనాలను చూస్తే అయిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. చిన్నది అనుకున్న భవనంలో పన్నెండు అంతస్తులు కనిపించాయి. ఇరవై ఐదు అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. అవి లెక్కలేనన్ని ఉన్నాయి. అన్నిటిలోనూ నిర్మాణం చురుకుగా సాగుతున్నది. కొన్నిటిలో జనం కాపురాలు ఉంటున్నారు. దారి వెంట వెళుతున్న నాకు కొన్ని హోటేళ్ల పేర్లు ఆకర్షణగా కనిపించాయి. అవన్నీ అసలు సిసలైన దక్షిణ భారతం పద్ధతిలో ఉన్నాయి. పట్టలేక ఏమిటి పరిస్థితి? అని అడిగాను. ఆ ఊళ్లో ఉద్యోగాల పేరు మీద వచ్చిన దాక్షిణాత్యులు లెక్కలేనంత మంది ఉన్నారట.
ఆరోగ్యం కారణంగానో, మరే రకంగానో పని మానుకున్న వారికి తప్ప అక్కడ పనికి కొదవలేదు. తిండికి అంతకన్నా కొదువ లేదు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకనే మిగతా ప్రాంతాల వాళ్లు అంతా అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారట. ఈ సంగతి చెప్పిన యువకుడు నాకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు. అతని పేరు రరుూస్. అంటే ధనవంతుడు అని అర్థం. ధనవంతుడు అవునో కాదో తెలియదు గానీ అతను గుణవంతుడు. టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంచి మాటకారి. అతని కారులో ముందు పక్కన కమలం గుర్తు గల పవిత్ర వస్త్రం కనిపించింది. మొహమాటం లేకుండా అదేమిటి? అని అడిగాను. ఇక కమలం పార్టీ గురించి గొప్పగా పొగడుతూ చెప్పిన సంగతులు నాకు ఇంకా గుర్తున్నాయి. సరిగ్గా మాటకు మాట జ్ఞాపకం లేదు కానీ, మంచి జరుగుతుంటే దాన్ని చేస్తున్నది ఎవరు? అన్న ప్రశ్న రాకూడదు. 2002 సం. తరువాత మా దగ్గర హిందూ, ముస్లిం భేదభావాలు అందరూ మరిచిపోయారు. ఎన్నికలు వస్తే కళ్లు మూసుకుని అందరూ కమలం గుర్తుకే ఓటు వేస్తారు అని అతను తెగేసి చెప్పాడు.
అహమదాబాదులో అసలు సిసలైన గుజరాతి భోజనం అంటూ ఒకచోటికి తీసుకువెళ్లారు. డోక్లా, సమోసాలతో మొదలైన ఆ భోజనం అడిగినప్పుడల్లా అందిస్తున్న మామిడి పళ్ల రసంతో ముగిసింది. నిజానికి ఆ మామిడి పళ్లు కూడా మనకు తెలిసిన రకం కానే కాదు. అటువంటి భోజనం రాజస్థాన్‌లో కూడా ఉంటుంది. వాళ్ల హోటేళ్లు హైదరాబాదులో ఉన్నాయి కనుక ఇక్కడ కూడా ఆ రకం భోజనం దొరుకుతుంది. ఇక నాకు ఎప్పటి నుండో ఉన్న కోరిక ప్రకారం ఫాలూదా కావాలి అన్నాను. స్థానిక మిత్రుడు జోషి, మమ్మల్ని ఊరంతా తిప్పి ఒకచోటికి తీసుకువెళ్లాడు. అక్కడ అనుకున్న ప్రకారం ఆశ్చర్యకరమైన ఫాలూదా దొరికింది. మరునాటి సాయంత్రం మరొక ఆశ్చర్యం ఎదురయింది. తీన్ దర్వాజా అన్న ప్రాంతం గురించి నాకు ముందు కూడా తెలుసు. అక్కడికి దగ్గరలోనే మనీష్ చౌక్ అనే ప్రాంతం ఒకటి ఉంది. అక్కడ అన్నీ నగల దుకాణాలు ఉంటాయి. కానీ రాత్రి పడిందంటే ఆ అంగళ్లనీ మూసేస్తారు. దారులన్నీ ఒక ఈట్ స్ట్రీట్‌గా మారుతాయి. జిలేబీ నుంచి మొదలు దోసెల దాకా అక్కడ దొరికే తిండి రకాలను గురించి చెప్పడానికి వీలు ఉండదు. దారి నిండా బల్లలు పరిచి కుర్చీలు వేసి ఉంచారు. మధ్యలో, పక్కలకు బళ్ల మీద వంటలు జరుగుతూంటాయి. తిండి సంత ఆ రకంగా రాత్రి రెండు, మూడు గంటల దాకా సాగుతుందట. జోషి ధైర్యంగా ఆ ప్రాంతంలోకి కారు పోనిచ్చాడు. పార్కింగ్ చేయడానికి స్థలం సంపాదించాడు. ఇక తిండి మీద పడ్డాము. నాకు రాత్రి పూట తిండి తినడం అంతగా అలవాటు లేదు. జున్ను తురుము వేసిన సాండ్విచ్ తిన్నాను. ఆ తరువాత అక్కడి స్పెషల్ అంటూ నన్ను మళ్లీ ఒక ఫాలూదా అంగడికి తీసుకువెళ్లారు. స్వంతదారు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు. తన అంగడికి ప్రపంచమంతటా పేరు ఉంది అన్నాడు. యూ ట్యూబ్‌లో తమ అంగడి వీడియో చూడమన్నాడు. నిజంగానే సరుకు కూడా చాలా బాగుంది. అక్కడ తినడం అది నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం.

మరుసటి నాడు మేము సర్దార్ సరోవర్ దగ్గర ఒక చిన్న ప్రపంచ రికార్డ్ గల వల్లభభాయి పటేల్ విగ్రహాన్ని చూడడానికి బయలుదేరాము. అది అహమదాబాద్ నుండి చాలా దూరంలోనే ఉంది. హైవే మాత్రం అద్దంలాగా ఉంది. గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి పేరు ఏదో చెప్పారు. మధ్యలో అందరికీ అమూల్ పేరు మీద తెలిసిన ఆనంద్ అనే నగరం వస్తుంది. అది నిజానికి రోడ్డు పక్కన ఉండదు. ఎడమకు తిరిగి బాగా లోపలికి వెళ్లాలి. వెళ్లిన అంత సులభంగా అక్కడి కర్మాగారాలను చూడనివ్వరు. అందుకు ముందే అనుమతి తీసుకోవాలి. కనుక మేము అమూల్ పాల ఉత్పత్తుల కేంద్రాలను చూడలేక పోయాము. దేశమంతా పేరున్న అమూల్ తిండి పదార్థాల తీరు అక్కడ అంటే అహమదాబాదులో మరో రకంగా ఉంది. మేమున్న హోటేల్‌కు దగ్గరలోనే ఉన్న ఒకానొక అమూల్ కాంటీన్‌కు వెళ్లాము. అక్కడ ఐస్ క్రీమ్, పాల ఉత్పత్తులు మాత్రమే గాక రకరకాల తిండి పదార్థాలు అమ్ముతున్నారు. అన్నింటిలోనూ అమూల్ ఉత్పత్తుల ప్రమేయం ఉంది. గుజరాత్ వాళ్లు సైన్యంలో తప్ప మిగతా ఏ రంగంలోనయినా బాగా పని చేస్తారు అనిపించింది. గిరీష్ కర్నాడ్ తీసిన సినిమా మంథన్ గుర్తుకు వచ్చింది. అది అమూల్ వెనుకనున్న వేలాది మంది రైతుల కథ. వర్గీస్ కురియని అనే మలయాళీ వాళ్లకు నాయకుడుగా నిలిచి చరిత్ర సృష్టించాడు.
చివరకు సర్దార్ సరోవర్ చేరుకున్నాము. అందులో నీళ్లు లేవు. డామ్ మీది నుంచి చుక్క కూడా కిందకు రావటం లేదు. ఇటుపక్కకు మళ్లితే మాత్రం, నిజంగానే లోహ పురుషుడిగా నిలబడిన సర్దార్ పటేల్ విగ్రహం అద్భుతంగా కనిపించింది. అందరూ గొప్పగా చెప్పుకునే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 93 మీటర్ల ఎత్తు మాత్రమే. అంతకన్నా ఎతె్తైన విగ్రహాలు చైనాలో ఒకటి, జపాన్‌లో ఒకటి ఉన్నాయి. అవి రెండు బుద్ధ విగ్రహాలు. చైనా విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అయితే సర్దార్ సరోవర్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం ఏకంగా 182 మీటర్ల ఎత్తు. ప్రత్యేకంగా టికెట్ తీసుకుంటే విగ్రహం కాళ్ల దగ్గరికి లిఫ్ట్‌లో వెళ్లవచ్చు. అక్కడి నుండి దృశ్యాన్ని అన్ని వేపులా చూడవచ్చు. అంతకన్నా ఎత్తుకు వెళ్లడానికి అవకాశం లేదు. ఆయన కాళ్లకు మామూలు చెప్పులు ఉన్నా. మామూలు చెప్పులలాగే వాటిని కుట్టిన దారాలు కూడా ఉన్నాయి. చెప్పుల అడుగులు నిలబడ్డ నాకు తలకన్నా ఎత్తులో ఉన్నాయి. ఆధారాలు మోకుతాళ్లకన్నా లావుగా ఉన్నాయి. అక్కడ నిలబడి తల పైకి ఎత్తినా విగ్రహం పై భాగం కనిపించదు. కిందకు దిగి రావాలి. కొంత దూరం పోవాలి. అక్కడి నుండి చూడాలి. అప్పుడు గానీ విగ్రహం పూర్తిగా కనిపిస్తుంది. విగ్రహం ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనుకుంటే మనం కనిపిస్తే విగ్రహం కనిపిచదు. కాళ్లు మాత్రమే కనిపిస్తాయి. మొత్తం విగ్రహం కనిపించేటట్టు ఫ్రేమ్ చేస్తే మనం కనిపించము. మరీ చిన్న రూపాలము అవుతాము. స్వాతంత్య్రం తరువాత దేశంలోని సంస్థానాలను విలీనం చేయించి ఐక్యత సాధించిన మహానుభావుడు సర్దార్ పటేల్. అందుకే ఆ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీఅని పేరు పెట్టారు. హైదరాబాద్ వారికి ఆయన చేయించిన పోలీస్ యాక్షన్ ఒకటే జ్ఞాపకం ఉంటుంది. నిజానికి దేశంలో ఇటువంటి విగ్రహం ఒకటి ఉందని మన వాళ్లకు చాలామందికి తెలియకపోవచ్చు. దాన్ని గురించి మన ప్రాంతాలలో పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. మొత్తానికి అది చూడవలసిన చోటు.
-కె.బి.గోపాలం


No comments: