Tuesday, November 11, 2014

‘నెట్‌’లో ప్రపంచం!

This is an article I wrote for Andhra Prabha Daily long back.
Let us see if it still relevant.
Certain things that were looming large at that time have become routine by now. Computers have become more than a part of common life.

Here is the article!


జీవ పరిణామం, మానవజాతి పరిణామం, లక్షల, కోట్ల సంవత్సరాల పాటు జరిగాయి. వాటి గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. కంప్యూటర్‌ నిన్నగాక మొన్న పుట్టింది కాని చెప్పరాని వేగంతో మార్పు చెందుతున్నది.

కంప్యూటర్‌లకు చరిత్ర లేదు. ఇప్పుడున్న రకం కంప్యూటర్లు ఇటీవలే వచ్చాయి. అయితే అవి త్వరలోనే మాయం అయిపోవడమూ తప్పదు. అవి లేకుండా పోతాయని మాత్రం అనుకోకూడదు.

1980కి ముందు కంప్యూటర్‌ పరిశోధనశాలలకే పరిమితం. ఆ తరువాత అవి పి.సి. (పర్సనల్‌ కంప్యూటర్‌) పేరుతో ప్రజల మధ్యకు వచ్చాయి. నిజంగా ఇళ్ళలోకే వచ్చాయి. ఈలోగా ఇంటర్నెట్‌ అనే మరో కొత్త తరంగం వచ్చింది. కంప్యూటర్‌ వాడకం తీరు ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్‌ మన దేశంలోకి ఇంకా వస్తూనే ఉన్నదని చెప్పాలి. చదువుకున్నవారిలో చాలా మంది, కంప్యూటర్‌ వాడుతున్న వారిలో కొంత మంది ఇంకా ఇంటర్నెట్‌ను చూడలేదు మరి! ఇది నిజానికి సమాచార సాగరం. ప్రపంచంలోని ఏ మూలనుంచైనా సమాచారాన్ని క్షణాల్లో, కనీసం నిమిషాల్లో మన ముందుంచగల వ్యవస్థ ఇది. మన దేశంతో సహా, ప్రపంచమంతటా కొందరయినా, ఇంటర్నెట్‌ లేకుండా ఎలా బ్రతకాలి? అని ప్రశ్నించుకునే రోజులు వచ్చాయి. అవసరానికిగానీ, సరదాకుగానీ, చదువులకుగానీ, దేనికయినాసరే ఇంటర్నెట్‌ ఒక్కటే మార్గం అనే రోజులు వచ్చేస్తున్నాయి.

అంటే కంప్యూటర్‌ గొప్పదనం రాను రాను పెరుగుతున్నది. నిపుణులు మాత్రమే కాక అందరూ దాన్ని వాడుకునే అవసరం, పరిస్థితి వస్తున్నది. కానీ వాటి వాడకం మాత్రం రోజు రోజుకూ మరింత కష్టతరమవుతున్నది. ఒక్కోరకం పనికి ఒక్కో సాఫ్ట్‌వేర్‌ వాడకం నేర్చుకోవాలి. ఇంటర్నెట్‌లో ప్రవేశించాలంటే బ్రౌజెర్‌ప్రోగ్రామ్‌ అవసరం. ఇవి కూడా గజిబిజిగానే ఉన్నాయి. కాకపోతే చాలా రకాలున్నాయి.

ఇంటర్నెట్‌ అనే సమాచార సముద్రంలో ఈదిన వారు చివరకు అలసిపోయి, ఒడ్డు చేరుకుంటున్నారు. ఇక కొత్తవారయితే వారికి అందులో ఉండేది అంతా చెత్త అనే భావం కలగక మానదు.

ముందు ముందు మాత్రం పరిస్థితి ఇలా ఉండదంటున్నారు నిపుణులు. కంప్యూటర్‌లు, వాటి భాగాలు రాను రాను చేతనయినంత చిన్నవిగా మారతాయి. దీన్ని నానో టెక్నాలజీఅంటారు. అలాగే టెలిఫోన్‌ తీగ అవసరం లేకుండానే సమాచారం పెద్ద ఎత్తున ప్రవహించే ‘‘బ్రాడ్‌ బ్యాండ్‌ టెక్నాలజీ’’ తయారవుతున్నది. వీటితోపాటు బయో మెట్రిక్‌లాంటి మరికొన్ని సాంకేతిక సదుపాయాలు కలిసి త్వరలోనే కంప్యూటర్‌లను, వాటిని వాడే తీరును, ఊహించని విధంగా మారుస్తాయంటున్నారు. ఇప్పుడు కంప్యూటర్‌ వాడకాన్ని, పర్సనల్‌ కంప్యూటింగ్‌ అనడం తప్పు. మన కంప్యూటర్‌ ప్రపంచంలోని లక్షల కంప్యూటర్లతో సంబంధం కలిగి ఉంటున్నది. కనుక ఇది సోషల్‌ కంప్యూటింగ్‌! మరో 15 సంవత్సరాలు పోతే ఈ పరిస్థితి మారి ఎకొలాజికల్‌, సింబయాటిక్‌ కంప్యూటింగ్‌ వస్తుందంటున్నారు. కంప్యూటర్లు మరీ చిన్నవయిపోతాయి. తీగలవసరం లేకుండానే వాటన్నింటి మధ్యనా సంపర్కం ఉంటుంది. కంప్యూటర్‌ అంటే ప్రత్యేకమయిన యంత్రంగా కాక ఒక పదార్థంగా మారి, ఎక్కడయినా దానిని వాడే వీలు వస్తుంది. సరిగ్గా ఈ మార్పులు వచ్చే సమయానికి ఇప్పుడు మనకు తెలిసిన కంప్యూటర్లు తెరమరుగవుతాయి.

ప్రపంచంలోని అన్ని వస్తువులు, పరికరాల్లోకి కంప్యూటింగ్‌ శక్తి ప్రవేశిస్తుంది. వాటన్నింటికీ తమ ఉనికి గురించి, పరిసరాల గురించి, పనితీరు గురించి కదలిక గురించి తెలుసుకునే శక్తి ఉంటుంది. విఠలాచార్య బ్రాండ్‌ సినిమాల్లో చూసిన ట్రిక్కులు, అంతకన్నా గొప్ప చమక్కులు వీలవుతాయి. మనిషికి, ప్రాణులకు గల శక్తులు పదార్థాలకు కూడా వచ్చేస్తాయి.

మనం ఒకరితో ఒకరం మాట్లాడుకునే పద్ధతి, సైగలు చేసుకునే పద్ధతి కలిసి ఈ ఇంటలిజెంట్‌ పదార్థాలను పని చేయిస్తాయి. తాళం చెవుల గుత్తిని మీరు ఎలా పట్టుకుంటే ఏం చేయాలన్నది తాళం చెవులకు తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. పెన్ను రాయడంలేదని మీరు కోపంగా కింద పెడితే అది అర్థం చేసుకుని తనంతతానే బాగయిపోతే ఎలాగుంటుంది?

ఇళ్ళ గోడలు, బయట రోడ్లు, మొత్తం వాతావరణమంతా కంప్యూటర్లు ఉంటాయి. మీరు ఇంటికి బయలుదేరితే ఆ విషయం ఇంట్లో వారికన్నా ముందు ఇంటికి తెలుస్తుంది. తలుపులు మీరు రాగానే తెరుచుకుంటాయి. మీ కనుకూలమయిన వాతావరణం, అవసరమయిన వస్తువులు అమరి ఉంటాయి. పాలయిపోతే రిఫ్రిజిరేటర్‌ పాలవాళ్ళకు తెలియచెబుతుంది. ఈ రకంగా వర్ణిస్తూ పోతే విషయం నిజంగా విఠలాచార్య సినిమా కన్నా గొప్పగా ఉంటుంది.



గోడకు వేసిన రంగులో కంప్యూటర్‌ శక్తి ఉంటుంది. దానికి మీ అవసరాలు, ఇష్టాయిష్టాలు, కదలికలు, వాటి అర్థాలు అవసరమవుతాయి. ఇదంతా మనదాకా వచ్చేనా? అనుకోనవసరంలేదు. కంప్యూటర్‌ రంగంలో భారతీయులు చాలా మంది అగ్రగణ్యులుగా ఉన్నారు. దేశంలోనూ ఈ రంగానికి గొప్ప గౌరవం ఉంది. కనుక వచ్చే మార్పులు ప్రపంచంతోపాటు మన దగ్గర కూడా వచ్చేస్తాయి. అయితే ఇప్పటిలాగే అప్పుడు కూడా అవి అందరికీ కాక కొందరికే అందుతాయి. ఫలితాలు, ప్రభావాలు మాత్రం అందరికీ కొంతయినా అందుతాయి.

No comments: