పాట ఎందుకు
బజారులో పాట, బడిలో పాట, గుడిలో పాట! కష్టానికి పాట, సుఖానికి పాట! పాట లేనిదే ప్రపంచం లేదు. కానీ ఎందుకీ పాట? నాగరికతకన్నా ముందు నుంచి మనిషికి పాట తెలుసు. అంటే పాటకు ప్రయోజనం కూడా ఉండాలి కదా! మానవజీవన పరిణామాన్ని పరిశోధించిన ఛార్ల్‌స్ డాల్విన్ కూడా ఈ ప్రశ్న గురించి ఆలోచించాడు. పాటలో గొప్ప గణితం ఉందని చాలాకాలం కిందనే తత్వపరిశోధకులు గుర్తించారు. కానీ జీవ ప్రపంచానికీ, జీవనానికి ఈ పాటకు సంబంధం ఉందా? నెమలికి సంతోషమయితే పురివిప్పి ఆడుతుంది. మనిషికి సంతోషమయితే హుషారుగా ఈల వేస్తాడు. అంటే మనిషితోపాటు పాట కూడా పరిణామం పొందింది. అందుకుగల అవసరాన్ని మాత్రం డార్విన్ గుర్తించలేక పోయాడు. మామూలు బతుకులో పాటకు చోటు లేదు అన్నాడాయన.
ఈ మధ్యన పాట ప్రభావంగా మెదడులో జరిగే మార్పులను గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. నాడీ కణాలలో పాటవల్ల జరిగే చర్యలను గమనిస్తున్నారు. రసాయనికంగా శరీరంలో జరిగే మార్పులను గమనిస్తున్నారు. మెదడు ఎంతో గజిబిజి యంత్రం. ఎవరికీ అంతుచిక్కదు. ప్రమాదవశాత్తు అందులోంచి సంగీతమనే ఈ అందమయిన అంశం బయటపడింది అన్నారు కొందరు. మొత్తానికి సంగీతం, పాట మన శరీరంలో, జీవనంలో గట్టిగా పాతుకుపోయినయి. పాటలేని మానవ సమాజం ఇప్పటికి ఒక్కటికూడా కనిపించలేదు అంటారు ఆంత్రపాలజిస్టులు. చెప్పకుండానే పిల్లలు పాడతారు. నాగరికతన్నా ముందు నుంచే మనిషి బతుకులో పాట భాగంగా ఉంది. పురాతత్వ పరిశోధకులు జర్మనీలో 35వేల సంవత్సరాల నాటి వేణువునొకదాన్ని కనుగొన్నారు. సంగీతం అంతటా ఉంది. అలనాటి నుంచి ఉంది. అలవోకగా మనిషికి అబ్బింది.
మిగతా జంతు జాతుల్లో మగవి, శరీర విన్యాసంతోబాటు రకరకాల ధ్వనులు చేసి జంటకట్టవలసిన ఆడను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. మనుషులు కూడా ప్రాచీన కాలంలో ప్రేమధ్వనులు, లయలను వాడుకుంటున్నారంటారు పరిశోధకులు. పాట ప్రేమ కొరకే పుట్టిందంటాడు డార్విన్.
మనిషికి పాట సహజంగా వచ్చింది నిజమే కానీ డార్విన్ అభిప్రాయం మాత్రం సరికాదు అంటారు న్యూమెక్సికో పరిశోధకులు డీన్ షాక్ వాషింగ్టన్ సైంటిస్టు ఎలెన్ దిస్సనాయకే లాంటివారు. పాట కేవలం ఆడ, మగ మధ్య ఆకర్షణ కొరకే పుట్టింది కాదు. ఆ తర్వాత కూడా ఎన్నో అంశాలలో దాని పాత్ర ఉందని వీరి అభిప్రాయం. తల్లులు పిల్లలను ఆడించి అలరించేందుకు పాటలాంటి ధ్వనులను చేస్తారు. దానికి ‘మదరీస్’ అని పేరు పెట్టారు వీరు. ఈ లక్షణం మనుషుల్లో తప్ప మరే జంతువులోనూ లేదు. ఈ తల్లిభాష ప్రపంచమంతటా ఒకే రకంగా ఉంటుంది. ఎక్కువ స్థాయిలో తక్కువ వేగంతో సాగే ఈ పాట పిల్లలకు ప్రత్యేకం. ఈ పాటతో తల్లీ బిడ్డల మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది. అందుకే పెద్దయిన తర్వాత కూడా మనిషి పాట విని ఆనందించగలుగుతాడంటారు ఈ పరిశోధకులు!
పరిణామంలో పాటను గురించి మూడవ అభిప్రాయం కూడా ఉంది. ఇది కేవలం ఇరువురు వ్యక్తుల మధ్యకాక, రెండు వర్గాల మధ్య బంధం కొరకు పుట్టింది అంటారు ఈ వర్గం వారు. మనుషులు గుంపులుగా బతకడం నేర్చుకున్న మొదట్లో ఆ గుంపులోని వ్యక్తుల మధ్య సంబంధాలను గట్టి పర్చడానికి పాట సాయపడింది అంటారు ఆక్స్‌ఫర్డ్ మనస్తత్వశాస్తవ్రేత్త రాబిన్ డన్‌బార్. ఈయన మనుషులను గాక కోతి జాతులను గురించి కూడా ఎంతో పరిశోధన చేశారు. కోతులలో ఒకదానికి మరొక దానికి మధ్య బంధం ఏర్పడడానికి, వెంట్రుకలు సవరించడం, పేలు తీయడం లాంటి పనులు మాధ్యమంగా ఉంటాయి. ఈ భౌతిక సంబంధంతో వాటి మెదళ్ళలో ఎండాల్ఫిన్స్ అనే రసాయనలు పుడతాయి. అవి బాధను తగ్గిస్తాయి. ఆనందం, అన్నభావాన్ని కలిగిస్తాయి. మనుషులు కూడా తొలిరోజుల్లో ఇలాంటి పనులు చేసి ఉంటారు. రాను రాను మనుషుల గుంపులు పెద్దవిగా మారసాగాయి. అంతమందిలో ఈ శరీరపరమయిన సంబంధం కుదరలేదు. శారీరకంగా సాయపడడానికి బదులు పాట పుట్టిందంటారు డన్‌బార్. అందరూ కలిసి హాయిగా ఆడడం, తోడుగా పాడడం నేర్చుకున్నారు. పాట వినడంతో కూడా ఎండాల్ఫిన్స్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్స్ పుడతాయని కొన్ని పరిశీలనల్లో గమనించారు. వినడం కన్నా పాడడంతో ఈ రసాయనాలు మరింత బాగా పనిచేస్తాయని గమనించారు.
ఈ పరిశోధకులు రకరకాల చోట్ల బృందాలుగా ఆటపాటతో గడుపుతున్న వారిమీద పరిశీలనలు చేశారు. ఆట, పాట ముగిసిన తర్వాత ఆ వ్యక్తుల శరీరాలలో ఎండాల్ఫిన్ స్థాయిని పరీక్షించారు. అలాగే, అవసరం లేకున్నా ఏదోరకమయిన సంగీతం వింటూ ఉండే, అంగర్ణాలో వ్యక్తుల మీద కూడా పరిశోధనలు చేశారు. పాటకు అనుగుణంగా శరీరం కదిలించే డాన్సర్లు, మొదలయిన వారిలో రసాయనం ఎక్కువయింది. వారికి బాధను భరించే శక్తి కూడా ఎక్కువగా ఉంది. ఊరికే వింటున్న వారిలో ఈ రకమయిన మార్పులు కనిపించలేదు.
సంఘీభావం కోసం సంగీతం పుట్టిందన్న సిద్ధాంతాన్ని అనిరుధ్ పటేల్ లాంటి పరిశోధకులు సరికాదంటున్నారు. సంగీతం, మానవ సంబంధాలకు దారితీసేదయితే, ఒంటరితనాన్ని ఇష్టపడే వారికి పాట చికాకు కలిగించాలి మరి! కానీ అలా జరగడం లేదు! ‘పాట ఒక ప్రయోజనం కొరకు పుట్టలేదు. అది దొడ్డిదారిన మనిషి మెదడులోకి చేరింది అంటారు ఈ వర్గం పరిశోధకులు. మనుషుల మధ్యన జరిగే సమాచార వినిమయం కొంత ముందుకు జరిగి పాటగా తేలింది అన్నారు వీరు.
మెదడులో శృతి, లయ మొదలయిన అంశాలను గ్రహించే భాగాలమీద పరిశీలనలు జరిగాయి. ఈ పనుల కొరకు అక్కడ ప్రత్యేకమయిన భాగాలు లేవని తెలిసింది. మిగతా పనులను చూచే భాగాలేవో ఈ పనులను కూడా చూస్తున్నాయి.
పాటను గుర్తించగల జంతువుల మీద పరిశోధనలు జరిగాయి. కానీ చాలా జంతువులకు పాట, మాట తెలియవు. కొన్ని పక్షులు, క్షీరదాలకు ‘పాట’ తెలుస్తుంది. కోతులలో, చివరకు చింపాజీలకు కూడా పాట తెలియదు. లయ అంతకన్నా రాదు. వెయ్యిసార్లు ప్రయత్నించినా కోతులకు లయ పట్టబడలేదని ఈ మధ్యన గమనించారు. స్ట్రోక్ వచ్చిన కొంతమందికి మాట పడిపోతుంది. వారికి తిరిగి మాట నేర్పించడానికి పాటలాగ సాగదీసి మాట్లాడే పద్ధతిని వాడుతుంటారు. రాను రాను ‘సాగడం’ తగ్గితే మామూలుగా మాట వస్తుంది
Did you ever think about the matter?
No comments:
Post a Comment