Monday, February 21, 2011

Be in Limits!

హద్దులు అవసరమే!.
An article that appeared in Yuva suppliment of Andhra Bhoomi on February 2nd, 2011


‘హాయ్ గైస్! వాట్సప్!’ అంటూ వర్క్ ఏరియాలోకి వచ్చి వీపు చరిచేది ఏ టీం లీడరో అయితే బాగానే ఉంటుంది. ఏకంగా బాసే వచ్చి వీపు చరిచి మాట్లాడతాడనుకోండి. కొంత బాగుంటుంది, కొంత చికాకుగానూ ఉంటుంది. కొన్ని ఆఫీసుల్లో అందరూ బిగదీసుకుని ఎందుకొచ్చిన గొడవ అన్నట్టు పని చేసుకుని పోతుంటారు. అదీ చికాకే. కొత్తతరం ఆఫీసుల్లో అలా ఉండకూడదని అందరూ అనుకుంటున్నారు.

అందరూ అందరితో స్నేహంగా ఉండాలనీ, పని సరదాగా గడవాలనీ అనుకోవటంలో తప్పు లేదు. అందరూ ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి. మంచి చర్చలు, ఫార్మాలిటీస్ అవసరం లేని మీటింగులు, ఎవరితోనైనా ఎవరైనా సంప్రదింపులు చేయగల వాతావరణం మొదలైన పద్ధతులను ఈ మధ్య చాలా ఆఫీసుల్లో ప్రవేశ పెడుతున్నారు. అయితే, ఈ ప్రయత్నాల ఫలితాలు అందరి మీదా ఆధారపడి ఉంటాయి. ఎంత చేసినా పరిశ్రమ, ఆఫీసులాంటి ఆర్గనైజేషన్స్‌లో వ్యక్తుల మధ్య సంబంధాలకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. మరీ స్నేహపూర్వకమైన వాతావరణంలో -కొందరు మంచి పద్ధతులను తప్పుగా అర్థం చేసుకుని హద్దులు మీరే అవకాశం ఉంటుంది.

‘వాట్సప్!’ అన్న బాసుకు, ‘ఏముంది బాస్! పని లేదు.. హాయిగా కాలక్షేపం చేస్తున్నాము’ అన్న ఇంప్రెషన్ కలిగించే ప్రమాదం ఉంటుంది. అది చూద్దామనే బాసులు ఎంతో ఫ్రెండ్లీగా అందరినీ పలకరించే ప్రయత్నం చేస్తారు. అందరూ, అవసరమయిన దానికంటే ఎక్కువ దోస్తీ కనబర్చడం ఒక చిక్కు. అలాగ ఉండేవారు బాసులయినా, మన దగ్గర పని చేసేవారయినా చిక్కే. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, అవసరం ఉండనీ లేకపోనీ మధ్యన తలదూర్చే వారితో తలనొప్పి తప్ప మరో ప్రయోజనం ఉండదు. స్వంత విషయాలు గురించి ఆరాలు తీయడం, అనుమతి అడగకుండానే, మరొకరి పని సమయంలో దూసుకుని రావడం, అనవసరంగా సలహాలు పడేయటం, పనిలో అనవసరంగా కలగజేసుకోవడం ఎవరు చేసినా పని పాడవుతుంది తప్ప లాభాలు ఏరకంగానూ ఉండవు.

ఎదుటివారిలో మంచితనాన్ని అర్థం చేసుకోలేని వారు కొందరుంటారు. అన్ని సంగతులూ తమకే తెలుసునన్నట్టు పోజు పెడుతుంటారు. ఆఫీసులో అందరూ కలిసి మెలసి ఉండాలి, అంటే, అవసరం లేని చోట్ల కూడా జోక్యం కలిగించుకోవాలని మాత్రం అర్థం కాదుగదా! కలిసి మెలిసి పని చేయాలన్న ఆలోచన గొప్పది. కానీ, గౌరవం, మర్యాదలను పక్కన పెట్టమని మాత్రం అర్థం ఎంతమాత్రమూ కాదు. పని చేసే వారందరూ హాయిగా, ఆనందంగా రిలాక్స్‌డ్‌గా ఉండి పని చేయాలి. ఎవరికి వారు తమ పని చేతయినంత బాగా చేయాలి. అందుకు, ముందుగా సంస్థలోని నియమ నిబంధనల పట్ల, సిబ్బంది పట్ల, గౌరవంగా ఉండగలగటం మొదటి మెట్టు. ముడుచుకుని ఉండవద్దు. అలాగని దూసుకునీ వెళ్లిపోవద్దు. తోటివారి ప్రైవసీని గౌరవించటం నేర్చుకోవాలి. అందరితోనూ గౌరవంతో కూడిన స్నేహ సంబంధాలు ఏర్పర్చుకోవాలి. ఆఫీసులో ఎవరిస్థాయి వారికి ఉంటుంది. అందుకు తగిన బరువు బాధ్యతలు ఉంటాయి. ప్రివిలైజెస్ కూడా ఉంటాయి. వీటికి ఎక్కడా భంగం రాకుండా చూడటం అందరి బాధ్యత. అధికారం ఉన్నవారు, అందరి వెనుకనుంచీ పనిలోకి తొంగి చూస్తుంటారు. అది తమ హక్కు అనుకుంటారు. లేదా కనీసం బాధ్యత అనుకుంటారు. సూపర్‌విజన్ లేదా పర్యవేక్షణ అనేది ఒక కళ. ఎవరినీ చికాకుకు గురి చేయకుండా, మరీ చనువు ఉండకుండా కావలసిన సమాచారాన్ని రాబట్టడం పర్యవేక్షకులకు ఒక
పరీక్ష! టీ టైంలో, వాటర్ కూలర్ దగ్గరా సూపర్‌విజన్ చేస్తుంటే, సరైన ఫీడ్‌బ్యాక్ రాదు. సరికదా, అందరూ చికాకు పడతారు.

లంచ్ సమయంలో ఆఫీసు వ్యవహారాలు చర్చించటం ఎంత ఇబ్బందిగా ఉండవచ్చునో ఊహించండి. వ్యక్తి సంబంధాలలో ఎక్కడ చూపవలసిన స్థాయి అక్కడ ఉండాలి. ఎదుటివారి మానసిక పరిస్థితిని మనం చెడగొట్టే హక్కు ఏనాటికీ ఉండదు. ఎదుటివారి గౌరవ మర్యాదలకు భంగం రాకుండా ప్రవర్తించగలగడం అందరికీ చేతగాదు. ‘టాక్సిన్ వేస్ట్ డంప్’ అనే పద్ధతి గురించి చాలా చర్చ జరిగింది. మనుషులను ముట్టుకుంటే చాలు రెండు అర్థాలు వచ్చే మాటలు, నాకు నీకన్నా బాగా తెలుసన్న భావం వచ్చే ప్రవర్తన, నాదీ అధికారం అన్న భావనతో టీములు ‘టాక్సిక్’గా మారుతుంటాయి. టీములో స్నేహవాతావరణం దెబ్బతింటుంది. తోటి వారందరితో మనకు ఒకే రకమైన స్నేహం ఉండదు. మరీ స్నేహం ఉన్నా, ఇష్టం లేకపోయినా, ఆ సంగతులు అందరిముందూ బయటపెట్టనవసరం లేదు.

ఇంట్లోనయినా, పనిచోట్లలోనయినా, స్నేహపూర్వక వాతావరణం ఉండాలంటే హద్దులను గౌరవించటం అవసరం!

No comments: