నిన్ననెందుకో సుధామతో మాట్లాడుతూ ఒక మాటన్నాను.
దానం చేస్తానంటే, నీ దగ్గర పాత్రతే కాదు, పాత్ర కూడా ఉండాలి అని.
నేను దానం చేయ దలచింది పాలయితే, నీవు దాన్ని అందుకోవడానికి కొంగు జాచితే, ఫలితం నీకూ మిగలదు, నాకూ మిగలదు. అన్నమయితే గుడ్డలోనయినా ఫరవా లేదు. అది మరి పులుసన్నము గనుక అయితే, మళ్లీ, గుడ్డ పనికి రాదు.
చిన్ననాట గమనించిన సంగతి.
బీదలు గుడ్డలో, అన్నం మూటకట్టి తెచ్చుకుంటారు.
అది మధ్యాహ్నంకల్లా ఆరిపోతుంది. తినే ముందు మూట మీద కొంచెం నీళ్లు చల్లి అంటుకున్న మెతుకులను గుడ్డనుంచి వదిలించి, తింటారు.
బీదలకు కూరలు, పులుసులు తెలియవు.
మిరపపొడి, ఉప్పు వేసుకు తిన్నవాళ్లను చూచాను.
అది కాస్త రోటవేసి, ఒక చింతపండు రెక్కవేసి, నూరితే గొప్ప పచ్చడి.
అదీ అంటీ అంటనట్టు కలిపి తింటారు.
ఈ కాలం పిల్లలకు, అందునా కాస్త కలిగిన పిల్లలకు, తిండి పట్టదు.
సత్తు కంచం ముందు పెట్టుకుని, బాసింపట్టు కూచుని, ఏది పెడితే అది ఆబగా తిన్న రోజులు గుర్తొస్తే, కళ్లు చెమరుస్తాయి.
తిండిలో నాటి రుచి లేదు.
బతుకులో నాటి పస లేదు.
దానం తీసుకునేందుకు పాత్రత, పాత్ర ఉండాలన్నాను గదా!
కలిగిన కలిమిని కలగలిపి, దున్న నీరు తాగిన తీరు చేస్తే, అందులో స్వారస్యం వచ్చేదెట్లా?
No comments:
Post a Comment