Friday, July 10, 2026

సూక్ష్మప్రపంచం - మన శరీరం లోపల పైన సూక్ష్మజీవుల గురించి


సూక్ష్మప్రపంచం

            ఈ విశ్వం చాలా విశాలమయినది. దాని పొడవు, వెడల్పుల కొలతలు మన ఊహలకు కూడా అందవు. అందులో ఉన్న గెలాక్సీల సంఖ్య ఆలోచనలకు అందదు. లెక్కలేని ఆ గెలాక్సీలలో ఒక్కొక్క దాంట్లో లెక్కలేన్నని చుక్కలు అంటే నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో సూర్యుడు కూడా ఒకటి. ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో భూమి ఒకటి. ఆ భూమి మీద బిలియన్‌ల సంఖ్యలో జనం ఉన్నారు. అందులో మనం ఉన్నాము. ఈ లెక్కన చూస్తే విశ్వంలో మనం సూక్ష్మజీవులం. ఇక మన శరీరం మీద ట్రిలియన్‌ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయని విషయం తెలిసినవారు చెబుతున్నారు. అంటే అవి ఎంత చిన్నవో మనం ఊహించలేము అని అర్థం. వాటిని పట్టించుకునేవాళ్లు చాలా కాలంగానే కొందరు ఉన్నారు. లూయి పాశ్చర్ అనే పెద్దమనిషి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. సూక్ష్మజీవులను పరిశీలించడం అన్న విషయాన్ని ఒక ప్రత్యేకరంగంగా నిలబెట్టిన ఘనత అతనిది అనవచ్చు. ఒక భూతద్దం చేత పట్టుకుని కనిపించిన ప్రతి వస్తువును పరిశీలించేవాడట. తిండి పెడితే తినడంకన్నా పరిశీలన ముఖ్యం అనుకునే వాడు. పక్కింటి వాళ్లు భోజనానికి పిలిస్తే భూతద్దం పట్టుకుని వెళ్లే వాడు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు పిలవడం మానేశారు.

            సూక్ష్మజీవులు కనిపించవు, కనుక అవి లేవు, అనుకుంటే మనకన్నా అమాయకులు మరెవరూ ఉండరు. అవి మన మీద, చుట్టుపక్కల, ఎటుచూస్తే అటు, ఆలోచనకు అందని సంఖ్యలో అంతటా నిండి ఉన్నాయి. మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. సబ్బుపెట్టి వళ్లంతా తెగ తోముకొని వుండవచ్చు. మన వంటిమీద గుంపులు గుంపులుగా సెంటిమీటర్ చర్మానికి లక్షల సంఖ్యలో బాక్టీరియా ఉండనే ఉంటుంది. మన వంటినుంచి అంటే చర్మం నుంచి ప్రతి నిత్యం బిలియన్‌ల సంఖ్యలో పొలుసులు ఊడి పడుతుంటాయి. పాశ్చర్ లాగా బూతద్ధం పెట్టి చూచినా అవి కనిపించవు. కనిపిస్తే మన పడక మనకు నరకం లాగ కనిపిస్తుంది. ఈ పొలుసులను తింటూ సూక్ష్మజీవులు మన మీద కాపురం ఉంటాయి. అక్కడ వాటికి మనం వదిలిన పొట్టు మాత్రమే కాక రుచికరమయిన నూనెలు, లవణాలు, ఖనిజాలు కూడా దొరుకుతాయి. వాటికి కనుక రుచి తెలిసే పద్దతి ఉంటే మన వంటిమీద మంచి విందు దొరుకుతున్నది అని అర్థం. వంటినిండా రంధ్రాలు ఉన్నాయి. కావలసిన్నని పగుళ్లు ఉన్నాయి. వాటిలోనుంచి సూక్ష్మజీవులకు తిండి సరఫరా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మనకు తిండి అప్ప్పుడప్ప్పుడు దొరుకుతుంది. వాటికి మాత్రం ఎప్ప్పుడూ దొరుకుతుంది.

            విందు తింటూ బ్రతికే సూక్ష్మజీవులు చర్మంమీద మాత్రమే కాదు, శరీరం మొత్తంలో, లోపల, బయట కూడా అదే పద్దతిలో అంటే లెక్కించలేని సంఖ్యలో ఉన్నాయి. పేగుల్లోకి వెళితే పెద్ద సంఖ్యలో ఉండే బాక్టీరియా లేకుండా మనకు తిండి అరగదు, అన్నది మనం అత్యవసరంగా తెలుసుకోవలనిన సత్యం. ముక్కులోపల కావలసిన్నని సూక్ష్మజీవులు ఉన్నాయి. కనుగుడ్డు మీద ఉండే తేమలో అవి ఈదుతూ ఉంటాయి. దంతాలమీది పింగాణీ పొరలో రంధ్రాలు వేస్తూ ఉంటాయి.

            మనిషి జీర్ణాశయంలో వంద ట్రిలియన్‌లకు పైబడి బాక్టీరియా ఉన్నాయని లెక్క తేలింది. అందులో కనీసం నాలుగు వందల రకాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని చక్కెరలను అరిగిస్తాయి. కొన్ని పిండి పదార్థాలను పట్టించుకుంటాయి. మరికొన్ని మిగతా సూక్ష్మజీవుల మీద దాడి చేస్తాయి. కడుపులో అంటే పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ యించుమించు మనకు సాయం చేసేవే. అయితే ఏమి పని చేస్తాయని తెలుసుకోవడానికి వీలు కుదరని రకాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. అవి పేగుల్లో అలా మనకు తెలియకుండానే కలకాలం కాపురం ఉంటాయి. వాటికి అలా ఉండడం అనుకూలంగా ఉంటుంది.

            మానవుని శరీరంలో సుమారు పది క్వాడ్రిలియన్ కణాలు ఉంటాయని లెక్క తేల్చారు. ఇక తరువాతి వాక్యం వినాలంటే గుండె గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉండాలి. సగటు మానవుని శరీరంలో బాక్టీరియాల సంఖ్య  వంద క్వాడ్రిలియన్‌ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైక్రోబయాలజీ రంగంవారు మనిషిని, మనిషి అనే కన్నా మరేదో అంటే బాగుంటుంది అంటారు. మనిషిలో మనిషి కణాలకన్నా మైక్రోబ్స్ కణాలు పదిరెట్లు ఎక్కువ ఉన్నాయి మరి. మనిషిమీద సూక్ష్మజీవులు బతుకుతున్నాయా లేక వాటిమీద మనిషి బతుకుతున్నాడా? ఇటువంటి ప్రశ్నలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, విషయంగా తెలుసుకోవడానికి మనకు, కొంచెం ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అసలు విషయం ఒప్ప్పుకోవాలంటే, మన శరీరంలో శరీరంకన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి మధ్యన మనం కూడా ఉన్నాము.

            బాక్టీరియా అనగానే రోగాలు కలిగిస్తాయని అందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. చాలా తెలివిగా వాటిని మట్టు పెట్టడానికి మనం సబ్బులు, ఆంటీయోటిక్స్ వంటివి క£నుగొని, మనలను మనం కాపాడుకుంటున్నామని భ్రమ పడుతున్నాము. వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులను తొలగించుకుంటున్నాము అన్నది, నిజం. కానీ అంతకన్నా పెద్ద సంఖ్యలో బాక్టీరియాలను పెంచి పోషించుకుంటున్నాము అన్నది, అంతకన్నా పచ్చి నిజం. ఈ మాట కూడా కొంతవరకు నిజం కాదేమో అని అనుమానం. బాక్టీరియాలకు సమాజాలు లేవు. ఊళ్లు, నగరాలు £ట్టుకోవాలన్న ఆశ అంతకన్నా లేదు. అయినా అవి మన సౌరమండలం కొనసాగినంత కాలం ఉండి తీరతాయి. భూగ్రహం నిజానికి వాటి స్వంతం. అవి మన పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అంటే మనిషి జాతికన్నా ముందు ఉన్నాయి. ఈ మనిషిజాతి కనిపించకుండా పోయిన తర్వాత కూడా అవి ఉండి తీరతాయి. అవి దయతలచి మనలను ఉండనిస్తున్నాయి, కనుక కొంతకాలం ఇక్కడ మనం కూడా ఉంటాము. బిలియన్‌ల సంవత్సరాలుగా భూమిమీద రకరకాల సూక్ష్మజీవులు కొనసాగాయి. మన తరువాత కూడా మనిషి లేకున్నా, అవి ఉండి తీరతాయి. ఇక్కడ మనం ఒక్క విషయం లెక్కలోకి తీసుకోవాలి. మనం లేనప్పుడు సూక్ష్మజీవులు ఉన్నాయి, కానీ సూక్ష్మజీవులు లేనిదే, మనం అనే మనుషులం, ఒక్క రోజు కూడా బతకజాలము. మనం వదిలిన మురికిని వదిలించడానికి సూక్ష్మజీవుల మీద ఆధారపడుతున్నాము అన్న సంగతి చాలా మందికి తోచకపోవచ్చు. పడేసిన వస్తువులు, అది పాచి అన్నం కావచ్చు, పశువులు, జంతువుల శరీరాలు కావచ్చు. కుళ్లడం బాక్టీరియాల వల్లనే జరుగుతున్నది. కుళ్లకుంటే వ్యర్థ పదార్థాలన్నీ అలాగే ఉండి పోతాయి. కుళ్లితేనే అవి మట్టిìలో క£లుస్తాయి. ఆ రకంగా మట్టిసారం పెరుగుతుంది. మనకు తెలిసిన, తెలియని జీవులను, మొక్కలను కుళ్లించడం ద్వారా సూక్ష్మజీవులు పైమట్టిని హ్యూమస్‌గా మారుస్తున్నాయి. అట్లా మారినందుకే మట్టిలోకి పోషకపదార్థాలు మళ్లీ చేరుతున్నాయి. కనుకనే అదే పొలంలో అయినా మళ్లీ పంటలు పండుతున్నాయి.

            మంచినీళ్లు శుభ్రంగా ఉండాలని మనం రకరకాలుగా ఏర్పాట్లు చేస్తుంటాము. బాక్టీరియా కారణంగా నీటి నాణ్యత తగ్గుతుంది. కానీ బాక్టీరియా కారణంగానే మరొక పరిస్థితిలో పెద్ద ఎత్తున నీళ్లు పరిశుభ్రం అవుతున్నాయి కూడా. నీటిలో చేరిన వ్యర్థపదార్థాలను కుళ్లించినందుకే ఆ మకిలి అడుగుకు చేరుతుంది. పైన తేటనీళ్లను మనం త్రాగగలుగుతాము.

            పేగుల్లో ఉండే బాక్టీరియా మనకు అవసరమయిన వైటమిన్‌లను తయారు చేస్తాయి. మందుబిళ్లలు తెచ్చి మింగనవసరం లేకుండానే మనకు అవసరమయిన పోషకపదార్థాలు సూక్ష్మజీవుల వలన అందుతాయి అన్నమాట. మనం తిన్న తిండిని చక్కెరలుగా మాÂర్చేది సూక్ష్మజీవులే. బయటినుంచి వచ్చిన బాక్టీరియామీద లోపల ఉన్న రకాలు తెల్ల రక్తకణాలకన్నా ముందే పోరాటాన్ని మొదలు పెడతాయి. తిండి అరగడం, ఆరోగ్యం నిలబడడం సూక్ష్మజీవుల వల్ల జరుగుతున్నది. అంటే అవి మనకు ఎంత అవసరం అన్నది అర్థం అవుతుంది.

            వాతావరణంలో సూక్ష్మజీవుల పాత్ర గురించి చెప్పుకోవాలంటే, ఆశ్చర్యరకమయిన వివరాలను అంగీకరించడా నికి సిధ్ధంగా ఉండాలి. మనకు తెలిసి, మనచుట్టూ ఉన్న గాలిలో ఎక్కువగా ఉండే భాగం నత్రజని అనే వాయువు. సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని వాడుకొని, మాంసకృత్తులకు ఆధారమయిన అమైనో ఆమ్లాలను తయారు చేస్తాయి. డిఎన్ఏలో ఉండే భాగాలను కూడా సూక్ష్మజీవులే తయారుచేస్తాయి. ఇది మనకు నిజానికి అర్థంకాని అద్భుతం. అపార్థానికి గురయిన అమాయక జీవులు తెలియకుండానే మనకు చేస్తున్న పకారం ఇది. పరిశ్రమలో నత్రజని ఎరువులను తయారుచేయడానికి అయిదువందల డిగ్రీల సెల్సియస్ వేడిమి అవసరం అవుతుంది. ఒత్తిడికూడా చాలా ఎక్కువగా వాడవలసి ఉండుంది. సూక్ష్మజీవులు మాత్రం ఈ చిక్కులేవీ లేకుండానే, మనకు కావలసిన పదార్థాలను తయారు చేసిపెడతాయి. కంటికి కనపడకుండా జరుగుతున్న ఈ ఉత్పత్తి కార్యక్రమం వల్లనే చిన్ననుండి పెద్ద జీవులన్నీ బతుకు కొనసాగించ గలుగుతున్నాయి.

            విశ్వంలో మానవులనే మనం ఉండి, మనకు మనం కూడా ఉపకారం చేసుకోలేక పోతున్నాము. మెదడు అంటూ ఒకటి ఉంది కనుక, మనం ఎందుకు ఉన్నాము, అని ప్రశ్నలు అడుగుతున్నాము. జవాబు దొరకక అసంతృప్తితో బ్రతుకు కొనసాగిస్తున్నాము. మనం రాకముందే భూమిమీద మనుగడ కొనసాగిస్తున్న సూక్ష్మజీవులు మాత్రం, కొత్తగా వచ్చిన మనలను ఈసడించకుండా ఉపకారం చేయడం నేర్చుకున్నాయి. ఎందుకు అని ప్రశ్న వేసుకోలేదు. చేతనయింది కనుక తమకు తెలిసిన పనిని చేస్తున్నాయి. మనకు మాత్రం మంచితనం మనసులోకి కూడా రాదు. ఒకవేలు ఎత్తి ఒకరిని అనేముందు, మిగతా మూడువేళ్ల గురించి పట్టించుకోవలసిన పరిస్థితి సూక్ష్మజీవుల విషయంలో ముమ్మాటికి నిజం.


 

1 comment:

బుచికి said...

మంచి వ్యాసం వ్రాశారు