Wednesday, May 13, 2026

బదరీ (చిన్న కథ) : లక్ష్మీనాథ్ బెజ్ బారువా (అస్సాం గ్రామీణ జీవిత దృశ్యము)

 


బదరీ (చిన్న కథ) : లక్ష్మీనాథ్ బెజ్ బారువా


బదరీ (చిన్న కథ)

లక్ష్మీనాథ్ బెజ్ బారువా (అస్సాం గ్రామీణ జీవిత దృశ్యము)

శిశురాం అప్పుడే పొలం నుంచి తిరిగి వచ్చాడు. తొందరగా స్నానం చేసి అంగవస్త్రాన్ని మార్చుకుని, సరాసరి వంటింటిలోనికి వెళ్ళాడు. అతని భార్య బదరి మధ్యాహ్న భోజనానికి వంట చేస్తున్నది. అన్నం ఇంకా వండలేదని, కూర ఇంకా తయారు కాలేదని చూసి శిశురాంకు కోపం వచ్చింది. ఆకుకూర లింకా తరగనే లేదు, అరిటాకు మధ్య కత్తిపీట చచ్చిపడి ఉన్న నెమలిలా ఉంది. పక్కనే పడుకున్న చేప, వంటి నిండా బూడిద పూసుకుని, త్రాగడంతో మత్తెక్కిన సన్యాసిలా ఉంది. మరొక పక్క, పొగ వల్ల కళ్ళు మూతలు పడిపోయిన బదరి, పొయ్యి రాజేస్తున్నది.

భోజనం ఇంకా తయారు కాలేదని శిశురాం చిందులు తొక్కుతున్నాడు. ఉదయం నుంచి అతని మనసు చికాకుగానే ఉంది. అనేకానేక కారణాల వల్ల అతని ఆగ్రహం పెరిగిపోయింది. నిన్నటి రోజున కృష్ణ ఏకాదశి కనుక దోషమని నాగలి పట్టనే లేదు. నేడు గిత్తలు చాలా చికాకు కలిగించాయి. ఉదయాన్నే పొరుగింటి బహువాతో సరిహద్దురాళ్ల గురించి పేచీ పెట్టుకున్నాడు. తగాదా ముదిరిపోయేదే, కానీ బహువా రానున్న ప్రమాదం గమనించి, చల్లగా జారుకున్నాడు. కోపమంతా ఇల్లాలి మీద తీర్చుకోనడమనేది సామెత కాదు, పూర్తిగా సత్యం. ఇదివరకు ఒకసారి బహువా వల్లనే బుర్ర వేడెక్కిపోయి, గిత్తలకు వేళ్ళకి మేత వేయలేదని కారణం మీద, శిశురాం తన భార్యను చితక కొట్టడం ద్వారా తన కోపాన్ని తీర్చుకున్నాడు.

బదరీ భూదేవి వంటిది. భర్త ఆగ్రహావేశాలను పల్లెత్తు మాట అనకుండా సహించింది. నిజానికి - నిద్ర, ఆకలి ఎలాంటివో వివాహిత స్త్రీకి దెబ్బలు, ఛీత్కారాలు అటువంటివేనని ఆమె నమ్మకం. కానీ దేనికైనా ఒక పరిమితి ఉన్నది. సహనానికి మారుపేరైన భూదేవి కూడా ఒక్కొక్కప్పుడు ఆగ్రహిస్తుంది. భూకంపం సంభవిస్తుంది. పరిస్థితులు భరింపరానివిగా తయారైనప్పుడు బదరీ కూడా ఎదురు తిరిగితే అసహజమవుతుందా?

బదరీ పొగతో వేగిపోయింది. ఆమె వంక కసిగా చూసి, ఆవేశంతో అరిచాడు. 'ఇంత పొద్దెక్కినా వంట ఎందుకు చేయలేదే? ఫలాని వారి కూతురా అతని కళ్ళు, ముఖం కోపంతో జేవురించాయి.

పొగలోంచి తల వెనుకకు తిప్పి బదరీ ఇలా అన్నది, ‘నా కాళ్లు చేతులు పొయ్యిలో పెట్టి వంట చేయనా?  ఇంట్లో ఒక్క ఎండు పుల్ల అయినా లేదు. తడిపుల్లలు ఊది ఊది ప్రాణం కడగంటుతోంది. ఏమీ చూడకుండా అలా విరుచుకుపడడం బాగున్నదా?’ ఆమె కనురెప్పలు చెమటతో బరువెక్కాయి.

ఏమిటి అన్నావు, ముండా?’ అని శిశురాం కంఠం చించుకున్నాడు. ఆవేశంతో బదరీ వంకకు ఒక అడుగు వేసి, కిందనున్న కత్తిపీట తీసి దానితో ఆమె వీపున ఒక్క వేటు వేశాడు. మరొక దెబ్బ తీసే లోపల బదరీ ఆర్తనాదం విని శిశురాం తమ్ముడు కినారాం ఒక్క అంగన వచ్చి, అన్నను పట్టుకొని బయటకు లాగి వేశాడు. పాపం బదరి నెత్తురు మడుగులో స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

మూడవ నాడు బదరికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి, ఎవరి కోసమో అన్నట్టు గది అంతా కలయ చూచింది. చేరువగా వచ్చిన నర్స్ ను చూచి, బదరీ నీరసంగా ఏరీ ఆయన?’ అని అడిగింది.

ఎవరు కావాలెనమ్మా?’

మా బాబు తండ్రి.

ఆ దుష్టుడా? జైల్లో ఉన్నాడు.

వారిని ఇక్కడికి రప్పించరూ? బదరీ జాలిగా అడిగింది.

ఎలా రాగలడూ, అయినా ఇప్పుడు అతన్ని గురించి ఆలోచించకూడదు నువ్వు. నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది.

నర్స్ మాటలు వింటూ ఉండగానే బదరీ కళ్ళు మూతపడ్డాయి. కొద్ది క్షణాలలో ఆమెకు తెలివి తప్పింది. విషయం తెలుసుకున్న డాక్టరు, శిశురాంను తీసుకురాకపోతే రోగి పరిస్థితి విషమించవచ్చునని గ్రహించాడు. తిరిగి తెలివి వచ్చేసరికి బదరి తన భర్తను చూడడానికి వీలుగా శిశురాంను రప్పించే ఏర్పాటు చేశాడు.

మరునాటి ఉదయం బదరికి స్పృహ వచ్చేసరికి, శిశురాం ఆమె తల నిమురుతూ పక్కన కూర్చున్నాడు. భర్తను చూసేసరికి ఆమెకి ఏదో బరువు తీసినట్టు అయింది- మెల్లగా నవ్వి, ‘ఎలా ఉన్నారు? భోజనం సరిగా చేస్తున్నారా?’ అంది. వంట చేసుకోవడం మీకు కష్టమే. ఇంకెంత, మరో రెండు రోజులలో నాకు నయం అవుతుంది. నన్ను ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేయండి. మీకు ఇబ్బంది ఉండదు అంది. శిశురాం కళ్ళనుండి అశ్రువులు రెండు ధారలు కట్టాయి.

డాక్టర్ను చూసి బదరీ ఇలా అంది, ‘బాబూ, ఆయన ఏ పాపం ఎరుగరు. వట్టి అమాయకులు. ఆయన్ను ఏమీ చేయకండి. నేనే కత్తిపీట మీద పడి గాయం చేసుకున్నాను, అని వెక్కివెక్కి ఏడ్చింది. అంతా నిస్తబ్ధులయ్యారు. శిశురామ్ తన దుఃఖాన్ని అణుచుకోలేక పోయాడు. పసివానిలా ఏడ్చాడు.

అది నిజం కాదు బాబూ, నేనే కత్తిపీటతో ఆమెను కొట్టాను. నాకు శిక్ష విధించండి. నేను పాపిష్టి వాడిని బాబూ, కట్టుకున్న భార్యని కత్తితో పొడిచిన దుష్టుడిని, అని తొందర తొందరగా, జాలిగా అన్నాడు శిశురాం.

కొద్ది వారాలలో బదరీ గాయం నయమయింది. ఆమెను ఆసుపత్రి నుంచి పంపించి వేశారు. శిశురాం ఏ పాపం ఎరగడని బదరీ శతవిధాలు చెప్పడానికి ప్రయత్నించినా, నేరం రుజువై, అతనికి మూడు నెలల కఠిన శిక్ష విధించారు. శిశురాం తన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించేందుకు నవ్వుతూ వెళ్ళాడు జైలుకి.

భర్త జీవితంలో వచ్చిన ఈ మచ్చకు తనే కారకురాలని నిందించుకున్నది బదరీ. తన్ను తాను నిందించుకున్నట్టుగా మరెవ్వరూ ఆమెను నిందించలేకపోయారు.

 

బదరి అన్న ఈ కథ నిజంగా పాతకాలంనాటిది. రచయిత లక్ష్మీ నాథ్ బెజ్ బారువా ఈ శతాబ్ది మొదటి మూడు దశకాల్లో గొప్ప పేరు సంపాదించుకున్న అస్సామీ రచయిత. కథలో ఆ కాలపు పల్లె స్త్రీల మానసిక పరిస్థితి కనబడుతుంది. మొగుడు ఎంత ఘాతుకం చేసిన ఆడవాళ్లు భరించాల్సిందే, అన్న పద్ధతి ఈ కథలో కనపడుతుంది. నిజానికి ఇప్పటికి కూడా దేశంలోని పల్లెల్లో పరిస్థితి ఇంచుమించు అట్లాగే ఉందేమో.


No comments: