Sunday, March 8, 2020

A Poem in Telugu



ఆలోచన

ఇక నోరెత్తకు
నా గురించీ నీ గురించీ, గతం గురించీ రానున్నకాలం గురించీ
నేల గురించీ, నింగి గురించీ
అవతలి ఖాళీ గురించీ
ఉందనుకున్న దీవి గురించీ
లేదనుకున్న దారి గురించీ
అంతా ఉత్తిదే
అంతరిక్షంలో అంతా ఎదురు చూస్తున్నారంటారు
అక్కడ మనకు బాగా గడుస్తుందంటారు
అంతా అబద్ధం
సూర్యుళ్లు, ప్రపంచాలు, మనుషులు, మృగాలు, పంటలూ, పువ్వులూ
ఇప్పటివి కానే కావు
వచ్చినప్పుడవి ఇట్లా లేనేలేవు
రేపు ఉండవు
ఎంతెంత గందరగోళం జరగిందో ఎవరూ ఎరుగరు
ఎప్పుడేది మాయమవుతుందో ఎవరికీ తెలియదు
ఉన్నంతకాలమే మన రాజ్యం
ఈ ప్రపంచం మనకు ఇట్లాగే దొరికిందా
వీళ్లు చెప్పేదంతా ఊహాగానాలు,
కంటున్న కలలు
ఇదంతా ఆలోచనలో పుట్టింది, అందులోనే పోతుంది
మెదడు దాని ఊయల, అదే వల్లకాడు కూడా
గతం, వర్తమానం రేపటి నీడలు
అప్పటి వరకు ఏమయినా రాసుకో, ఎంతయినా చెప్పుకో
రెక్కలు కట్టుకుని విశ్వమంతా తిరిగి రా
ఎక్కడా ఏమీ లేదు, ఉన్నా అందదు
అందినా అర్థం కాదు
వంగిందంటారు
వస్తుందంటారు
ఉట్టిదేనేమో
కనుకనే ఇక నోరెత్తకు
వింటూ ఉండు
ఏదయినా జరిగినప్పుడు చూద్దాం.....

1 comment:

ramana said...

yes, we shall lead a better life at present.......ramana