Monday, May 11, 2026

లోకాభిరామం : అసలు - నకలు : On Imitation

 


లోకాభిరామం : అసలు - నకలు


అసలు - నకలు

Published Saturday, 23 February 2019
 
పాట విని చాలా బాగుంది అంటుంటారు. బాగా పాడారు అంటే ఏమిటి అర్థం? పాట అంతకుముందే మరెవరో పాడి ఉంటారు. దాన్ని మరొకరికి నేర్పించి ఉంటారు. లేదా పాడినవారు పాటవిని మాత్రమే పాడి ఉంటారు. అటువంటి పాట బాగుంది అంటే అందులో అర్థం, అంతరార్థం ఏమిటి? నన్ను అందరూ కోడిగుడ్డు మీద అదేదో చేస్తున్నాడు అని తప్పు పట్టకండి గాని, కొంచెం నామీద సానుభూతి చూపి ప్రశ్న గురించి ఆలోచించండి. పాడిన వ్యక్తి అంతకుముందు పాటను పాడిన వ్యక్తిని చాలా బాగా అనుకరించారు అనే కదా! ఇమిటేషన్ అన్నది గొప్ప విద్య. అది మక్కికిమక్కీగా విరామాలతో సహా అసలు పాటలాగే పాడాలి. ఇక కొత్త గాయకుని సొంతతెలివి అంతవరకే పరిమితం అయ్యింది అని నేను అంటే మీరు నన్ను తప్పు పడతారు.
శాస్ర్తియ సంగీతంలో మనోధర్మం అని ఒకటి ఉంది అని చెబుతుంటారు. ఇక హిందుస్తానీ సంగీతం ఇంచుమించు మనోధర్మం మీదనే ఆధారపడి అదొక పద్ధతిలో సాగుతుంది. అయితే చాలామటుకు పాటలలో, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో అనుకరణ, నకిలీ చేయడం ఒక్కటే గొప్పతనం కింద లెక్క. స్వరప్రస్తారం కూడా, లేక నెరవల్ వంటివి కూడా అంతకుముందు మరెవరో చేసిన పద్ధతిలోనే చేసి తీరాలి. ఆలాపన విషయంలో అయినా ఇంచుమించు అంతే. ఎందుకంటే ఇక్కడ మనోధర్మానికి, ఒక నిర్మాణం, ఒక చట్రం, ఒక పరిధి ఉన్నాయి మరి! మాటలు చదివిన చాలామందికి కోపం రావచ్చు! కనీసం అసంతృప్తి కలగవచ్చు! అది జరగాలని, రకంగా కొంతమంది ఆలోచించాలని నా ఉద్దేశం అంటే నమ్మండి!
ప్రపంచంలో కొత్తదనానికి అర్రులు చాచేవారు కొంతమంది మాత్రమే. పడమటివాడు థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటాడు. మరొకడు కొత్తదారులు తొక్కమంటాడు. కలలు కనండి అంటాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా అందులో ఎక్కడో ఒకచోట నకలు అన్న పద్ధతి ఉండనే ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. ప్రపంచం తీరే అంత. గతానుగతికో లోకః అన్న మాట ఉండనే ఉంది. కొత్తదారి తొక్కిన వారికి ముళ్ల సమస్య ఉంటుంది కనుక ముందు కనిపించిన దారిలోనే అందరూ పోతారు. కనుకనే అది ఒక దారిగా ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ ఒక కొత్త దిశగా నడిస్తే, అప్పుడు దారులు కనిపించవు. అడుగుజాడలు అంతకన్నా కనిపించవు. ఎక్కువమంది ఒకే మార్గంలో నడుస్తారు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే కొత్తదారులు చూపిస్తారు.
మనిషికి మాటలు ఎట్ల వస్తయి? మిగతా వాళ్ల మాటలు వింటున్నందుకే కదా? అందరూ బాబును లేదా పాపను ఒక పేరు పెట్టి పిలుస్తరు. అప్పుడు కొంతకాలానికి అది తనపేరు అని అర్థమవుతుంది. ఇందులో అనుకరణ కాకుండా అనుసరణ ఉందేమో? తరువాత అమ్మ, అత్త, లాల, బువ్వ అంటూ ఒక్కొక్కటిగా మాటలు ఎదుటి వారిని చూసి నేర్చుకోవడం తప్ప మరొక మార్గం లేదు. అదే సంగతి పాట విషయంలో జరిగితే ఇక్కడ మరొక రకంగ ఎందుకు ఆలోచనలు సాగుతయి? అది నాకు మెదడులో కలకాలంగా ఉన్న ప్రశ్న! ఇక మీద కూడ ఉండి తీరుతుంది. నడక అయినా, తిండి అయినా మరొకటి అయినా పనులు మరొకరిని చూసి నకలు చేసి నేర్చుకోవలసిందే! ఇక కొంతకాలం తరువాత చదువు అని ఒక యజ్ఞం మొదలవుతుంది. అక్కడ కూడా ఉన్నది నకలు చేయడం మాత్రమే! తెలిసిన తరువాత కూడా అవగాహనను పెంచే రకం చదువులు అంతంత మాత్రంగానే ఉంటాయి. బడిలో పంతులు తెలివిగలవారిని, అంతంత మాత్రం వారిని, తెలివిలేని వారిని కూడా ఒకేచోట కూర్చోబెట్టి, ఒక సగటు పద్ధతిలో పాఠం చెబుతరు. అందులోనుంచి ఎవరికి చేతనైనంత, వారు అందుకోవాలి. తెలివిగల పిల్లలు సంగతి అందరికీ అర్థమయ్యేటట్లు ఒక ప్రశ్న అడిగితే, కొంచెం ఆగమని, వారిని పక్కకు తీసుకువెళ్లి నీవు ప్రశ్నలు అడగకుండా ఉంటే బాగుంటుంది అని నచ్చచెబుతారు. సంగతి నాకు చిన్నప్పుడు బడిలోనుంచి మొదలు మొన్నమొన్నటి దాకా అనుభవంలో ఉన్న విషయం. ఇక నాకు, ఆలోచించకూడదు, అనవసరంగా ప్రశ్నలు అడగకూడదు, అన్న భావం బలంగా నాటుకుని పోక మరేమవుతుంది?
పెద్దచదువుల పేరున కొన్ని విషయాలు నేర్పిస్తారు. నేను జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ చదువుకున్నాను. జీవుల గురించిన ప్రాథమిక విషయాలైన శరీరనిర్మాణం, వాటి పనిపద్ధతి ఇలాంటి మూల విషయాలు చెప్పారు తప్ప, నాకు అక్కడ చుట్టుపక్కల ఉండే జంతువుల గురించికానీ, ప్రపంచంలో జంతువుల వ్యాప్తి గురించి గానీ, మనిషికి జంతువులు చేసిన సాయం గురించి గానీ, ఇప్పుడు చేయగల పనులను గురించి గానీ ముక్క కూడా చెప్పలేదు. కొంత పర్యావరణం గురించి చెప్పినట్లు జ్ఞాపకం. గుర్రం, ఏనుగు, ఒంటె లాంటివి పరిణామం చెంది ఇప్పటి పరిస్థితికి వచ్చిన వివరాలు కూడా కొంత చెప్పినట్టు గుర్తు. ఇవన్నీ చదువుకుని జంతువుల మధ్యకు వెళ్లి నేను ఏం అర్థం చేసుకోగలను? మాకు చదువు చెప్పిన ఒక పెద్దమనిషి, ఒక పక్షిని గురించి చెబుతూ నూనెకాకి అన్నాడు. కానీ దాన్ని మామూలు ప్రపంచంలో చమురు కాకి అంటారని నాకు తెలుసు. సంగతి నేను చెబితే ప్రొఫెసర్గారు వింటారా? నాది అతితెలివి అని కోపగించుకుంటారు బహుశా!
అది భౌతికశాస్త్రంగానీ, రసాయనశాస్త్రం గానీ, ఇటు జనజీవితానికి సంబంధించిన సాంఘికశాస్త్రాలు గానీ, మౌలిక అంశాలు చెప్పి వదులుతున్నారు కానీ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, తన చదువును దానితో జతచేసి అవగాహన కలిగించుకోవడం వీలయ్యే చదువులు లేవు. కనుక ఎందుకు పనికిరాని చదువంతా నకలు పద్ధతిగా మిగిలిపోయింది. అందులో ఒకే ఒక విషయం గొప్పగా ఉంది. తెలివి గురించి ప్రశ్న లేదు. విషయాలను గుర్తుంచుకునే శక్తి, వాటిని యథాతథంగా పరీక్షలో వెళ్లగక్కే వెసులుబాటు ఎవరికి ఎంత ఎక్కువ ఉంటే వారు అంత గొప్పవారు. అంటే అవగాహన సంగతి పక్కనబెట్టి, కేవలం నకలు చేయడం నేర్చుకోండి అని చెబుతున్నారు. అదే మరి పరీక్షల్లో కూడా చూచి రాస్తాం అంటే మాత్రం ససేమిరా ఒప్పుకోరు! ఇది ఎంత విచిత్రం? గుర్తున్నది రాయడం సులభం! నకలు చేయడం చాలా కష్టం! మేము బిఎస్సీ పరీక్షలు రాసినప్పుడు మూకుమ్మడిగా అందరూ నకలు చేస్తున్నారు. నేను మాత్రం సొంతంగా రాస్తున్నాను. భాగ్యలక్ష్మి మేడంగారు వచ్చి, నాయనా నువ్వు కూడా చూచి రాయవచ్చు కదా? అని అడిగారు. చేతనైనంత రాస్తాను. మార్కులు వేసేవారికి సంగతి అర్థం కాకపోదు, అని జవాబు ఇచ్చినట్టు గుర్తు. అన్నీ పక్కనపెట్టి, మహా ఘనత వహించిన విశ్వవిద్యాలయం వారి నిర్ణయం ప్రకారం, మా కాలేజీలో ఎవరికీ ఫస్ట్క్లాస్ మార్కులు రానేలేదు. బతుకంతా బాగా చదువుకున్న నేను, బిఎస్సిలో మాత్రం సెకండ్ క్లాస్ మార్కులతో మాత్రమే పాస్ అయ్యాను. ఎందుకని? నేను నకలు చేయలేదు కనుకనా? లేక అందరూ చేశారు కనుకనా? జవాబు నాకు తెలుసు! కానీ చెప్పను!
ఫ్యాషన్లు వస్తాయి పోతాయి. ఒక ఫ్యాషన్ వచ్చిందంటే అందరూ మూకుమ్మడిగా, వేలంవెర్రిగా వెంటపడి అనుకరిస్తారు. అనుసరిస్తారు. అంటే కూడా మరెవరి పద్ధతినయినా సరే అనుసరించి బతకడమే బాగుంటుంది, అని ప్రపంచం అవగాహన అన్నమాట. ఆయనెవరో ఫ్యాంట్ వేసుకుని, పైన లాల్చీ వేసుకుని వచ్చాడు. పని నేను చేస్తే అందరూ నవ్వి ఉండేవారు. చేసింది ఒక మహానటుడు, అది కూడా ఒక సినిమాలో చేశాడు. దానికి డైరెక్టర్ ఒప్పుకున్నాడు. కనుక తరువాత మేమంతా రకంగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాము. గురు షర్ట్ అనే పద్ధతి ప్రస్తుతం చాలా మామూలు అయింది. రకం లాల్చీలను మోకాళ్లు దాటిన దాకా వేసుకునే పద్ధతి మధ్యలో వచ్చింది. నేను అటువంటి కుర్తా వేసుకుని వెళ్లాను. సరిగ్గా అదేనాడు మా దగ్గర ఒక క్లాస్ ఫోర్ కూడా అట్లాంటిదే చొక్కా వేసుకుని వచ్చాడు. ఇదండీ నకిలీ పద్ధతి! అది జరగకూడని సంగతి కానే కాదు. నకలు చేయడంలో కూడా తెలివి ఉండాలి! ఎవరు దేన్ని నకలు చేయవచ్చు, దేన్ని చేయకూడదు అన్న ఒక వివేకం కూడా ఉండాలేమో! మెచ్చుకోవడానికి పతాకస్థాయి అనుకరణ, అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఒకటి ఉన్నది. కనిపించిన ఒక విషయం మరీ ఎక్కువగా నచ్చితే, మనం కూడా అటువంటి విషయాన్ని సొంతం చేసుకోవాలి అన్నమాట. నేను ఇటువంటి మాటలు చెప్పడం ఎవరిని చూచి నేర్చుకున్నాను?
ఇవాళ మోకాళ్ల వరకు మాత్రమే ఉండే ఒక లాగు వేసుకొని బజార్లో తిరిగి వచ్చాను. కొంతమంది నా వైపు చూసినట్లు అనుమానం కూడా వచ్చింది. కానీ ప్రపంచమంతటా చాలామంది ఇలాగ షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారని చూశాను. కనుక నేను కూడా అదే పని చేశాను! తప్పేముంది?
అనుకరణ కారణంగా ప్రపంచమంతా ఒక కలగలుపు ఫ్రూట్జామ్ పద్ధతికి మారిపోయింది. ప్రపంచంలో మూలను చూసినా తేడా తెలియకుండా ఉంది. సంస్కృతి అంటే మాట, పాట, కట్టు, బొట్టు, వంట వంటివి అని అనుకునే వాళ్లం. కానీ వాళ్ల ప్రపంచమంతటా ప్యాంట్లు వేసుకుంటున్నారు. భారతదేశమంతటా పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నారు. ఒకప్పుడు మా ఊరిలో పంజాబీ డ్రెస్ను కేవలం పాకీవాళ్లు మాత్రమే వేసుకునేవారు అని నేను చెబితే ఇవాళ చాలామందికి నచ్చకుండా ఉంటుంది. ఎంతో అనుకూలంగా ఉండే దుస్తులు ఇవాళ భారతీయతకు గుర్తింపుగా మారిపోయాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ వారి విమానంలో విమాన కన్యక అసలు సిసలైన పంజాబీ దుస్తులలో కనిపించింది అంటే అదే మరి! అనుకరణ తప్పు కానే కాదు. అది నేర్చుకునే పద్ధతి అని నేను కూడా తెలుసుకున్నాను. అయితే పేరుతో అన్ని పాత పద్ధతులను అనుసరిస్తుంటే, ఇక మరి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించవలసిన ప్రశ్న. అడగవలసిన ప్రశ్న!
లోకాభిరామం వ్యాసాలు రాయడంలో నేను ఒకరిద్దరిని ఆదర్శంగా పెట్టుకున్నాను. అంతేకానీ అనుకరణ మాత్రం చేయడం లేదు. అది నిజానికి నావల్ల కాదు. అంటే చేతకాదని అర్థం కాదు. నేను అనుకరించదలచిన ఒకరిద్దరు తమకంటూ చక్కటి గుర్తింపు గలవారు. కనుక నేను వారి పద్ధతిలో రాసిన మాటలు వెంటనే బయటపడి పోతాయి. కనుక నా దారిలో నేను రాయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నాను కూడా!

 




Friday, May 8, 2026

చిట్టచివరకు.... రవీంద్రనాథ్ టాగోర్ కథకు కేబీ గోపాలం చేసిన తెలుగు అనువాదం

 


చిట్టచివరకు.... రవీంద్రనాథ్ టాగోర్ కథ


చిట్టచివరకు....

రవీంద్రనాథ్ టాగోర్ కథకు

కేబీ గోపాలం చేసిన తెలుగు అనువాదం

 

రికొత్తగా అందిన బిఏ డిగ్రీతోపాటు అపూర్వకృష్ణ కలకత్తా నుంచి ఇంటికి బయలుదేరాడు. నది సన్నగా ఉంటుంది, వర్షాలు ముగిసిన తరువాత అది ఎండిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా ఆగస్టు మాసం మధ్యలోనే ఉన్నాం. కనుకనే అది నిండుగా పారుతున్నది. నీళ్లు ఊరి కంచె అంచులను, వెదురు పొదల కింది మట్టిని తాకుతున్నది. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంది, కొన్ని రోజులపాటు సాగిన వర్షం తరువాత సూర్యుడు తీవ్రంగా వెలుగుతున్నాడు.

మనం గనుక బోటు మీద ప్రయాణం చేస్తున్న అపూర్వకృష్ణ హృదయమనే నదిలోకి తొంగి చూడగలిగితే, మనకు అక్కడ అచ్చంగా అటువంటి దృశ్యమే కనబడుతుంది. అతని మనస్సు కూడా పొంగి పొరలుతున్నది మరి.

బోటు జెట్టీలో ఆగింది. అపూర్వ వాళ్ళ ఇంటి కాంక్రీట్ పైకప్పు చెట్లమధ్యలో నుంచి కనబడుతున్నది. అతను తను వస్తున్నట్లు ఎవరికీ కబురు పెట్టలేదు. అందుకే అతని కోసం నది పక్కకు ఎవరూ రాలేదు.. బోటుమనిషి సాయం చేయడానికి అన్నట్టు ముందుకు వచ్చాడు కానీ అపూర్వ అవసరం లేదు అన్నట్టు చెయ్యి ఊపి సంచిని తానే అందుకుని చురుకుగా దిగాడు. అతని అడుగుల్లో ఒక ఊపు కనపడుతున్నది.

అపూర్వ కిందకు కాలు పెట్టాడో లేదో జారుడుగా ఉన్న బురదలో పట్టుతప్పి జారి పడిపోయాడు. సంచి కూడా కింద పడింది. పడిపోతే పర్వాలేదు కానీ ఒక చక్కని గొంతు కీచుగా గలగలా నవ్వడం వినిపించింది. దాంతో దగ్గరలోని మర్రిచెట్టు మీద పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి.

అపూర్వ పరిస్థితి కనబడుతూనే ఉన్నది. అతను బిత్తర పోయాడు. కానీ తమాయించుకుని తనను తాను చూచాడు. అప్పులు ఇచ్చే అతని బోటునుంచి దింపిన ఇటుకలను పేర్చిన కుప్పమీద ఒక అమ్మాయి కూర్చుని ఉండడం కనిపించింది. ఆ అమ్మాయే పకపకా నవ్వుతున్నది.

ఆమె మృణ్మయి అని అపూర్వకు తెలుసు. ఆమె, కొత్తగా వచ్చిన పక్కింటివాళ్ళ అమ్మాయి. వాళ్ళు అంతకుముందు దూరంగా నది దాటి ఉండే చోట ఒక ఇంట్లో ఉండేవాళ్లు. రెండు మూడు సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చారు. అప్పటికి మరి, నది గట్లు తెగి వాళ్ళ ఇల్లు పాడయింది. అందుకే వచ్చారు.

నిజానికి ఆ అమ్మాయికి కొంత చెడ్డ పేరు ఉంది. మగవాళ్ళందరూ అమ్మాయిని అందగత్తె అంటారు. కానీ ఆమె తీరు గురించి ఊర్లో ఆడవాళ్లు, భార్యలందరూ బెంగ కలిగి ఉంటారు. ఆ అమ్మాయి మరి ఎప్పుడూ కుర్రవాళ్ళతో ఆడుతుంది. అమ్మాయిలను చూచి ఆవిడ విసుక్కుంటుంది. ఊళ్లోని కుర్రవాళ్ళు అందరిలోనూ, ఆమె ఒక మరాఠా గుర్రం వీరుడిలాగా చెలరేగిపోతూ ఉంటుంది.

ఆమె స్వభావం తండ్రి కారణంగా వచ్చింది, అంటారు. తల్లి మాత్రం వీలున్నప్పుడల్లా ఊళ్లో ఆడంగులతో, అవకాశం జారవిడవకుండా తన కూతురి గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. పరదేశంలో ఉన్న భర్త మనసు తెలిసిన మనిషిగా, ఆమె బిడ్డను మాత్రం ఎప్పుడు ఒక్క మాట అనదు. అమ్మాయి కంట నీరు పెడితే ఆ తండ్రి భరించడు మరి.

మృణ్మయి చామనచాయగా ఉంటుంది. పొట్టిగా ఉండే ఆమె జుట్టు వీపుల మీద వేలాడుతూ ఉంటుంది. ముఖంలో మగలక్షణాలు కనబడతాయి. అందమైన ఆ రెండు పెద్ద పెద్ద కళ్ళలో వినయం గానీ, భయంగానీ, సంకోచంగానీ కనబడవు. అమ్మాయి మంచి పొడగరి. శరీరం సౌష్టవంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్కరికి కూడా ఆమె వయస్సు గురించి అనుమానం రాదు. ఒకవేళ వస్తే, ఆమెకు ఇంకా పెళ్లి ఎందుకు చేయలేదని, తల్లిదండ్రుల మీద వారికి కోపం కలిగే వీలుంది. ఇప్పుడు ఇప్పుడు దూర దేశం నుంచి ఒక మహాప్రభువు ఎవరో వచ్చి బోటు దిగితే ఊరి వాళ్ళందరూ కలవర పడిపోతారు. అనుకోకుండా అక్కడే నది వద్ద ఉన్న ఆడంగులు ముఖాల మీదకి పరదాల లాగా కొంగును లాగుకొని క్షణాల్లో మాయం అవుతారు.మృణ్మయి మాత్రం గుడ్డలు లేని ఒక బాబును చంకన వేసుకుని, జుట్టు భుజాల మీద ఎగురుతూ ఉండగా, తప్పకుండా అక్కడకు వచ్చి ప్రత్యక్షమవుతుంది. కొత్తగా వచ్చిన మనిషిని కుతూహలంగా చూస్తూ, భయం తెలియని ఒక జింకపిల్ల లాగా, అంటే అక్కడ ఎవరూ వేటగాళ్లు లేకుంటే భయం లేని జింకలాగా, వచ్చి అంతే వేగంగా వెళ్ళిపోతుంది. కుర్రవాళ్ళ జట్టులోకి చేరి, కొత్తగా వచ్చిన మనిషి గురించి వివరంగా కబురు చెబుతుంది.

మన అపూర్వ, ఆ అమ్మాయిని అంతకు ముందు చాలాసార్లు చూచాడు. తీరిక దొరికినప్పుడల్లా ఆమెను గురించి ఆలోచించాడు. తీరిక లేనప్పుడూ ఆలోచించాడు. ప్రతినిత్యం ఎన్నో కొత్త ముఖాలు కనిపిస్తూ ఉంటాయి,. అందులో కొన్ని మాత్రం మనసులో గట్టిగా మిగిలి ఉంటాయి. అదేదో కేవలం అందం గురించి మాత్రమే కాదు. వాళ్లలో ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది మరి. దాన్ని ఏమనాలో తెలియదు. చాలా ముఖాల్లో అటువంటి ఆకర్షణ వివరంగా కనిపించదు. గుహలో దాగున్న వంటి మనసును బయటికి లాగిందంటే, ఆ ముఖం ఎంతో ఆకర్షణ గలదని లెక్క. గమనించిన వారి మనసులో అది లోతుగా నాటుకుంటుంది. సరిగ్గా పాదుకొనని ఆడతనం, మృదుత్వం, కొంత కలవర పెట్టి గుండెను దడదడలాడిస్తుంది. స్వేచ్ఛగా అడవిలో తిరుగుతున్న జింక పిల్ల లాగా ఉండే ఆ మనిషి ముఖం, అందులోని చురుకుతనం, మరవడం కష్టం అవుతుంది.

చదువరీ, మృణ్మయి గలగల నవ్వు ఎంత శ్రావ్యంగా వినిపించినా, మన అపూర్వ మాత్రం కుదేలు పడిపోయాడు. వెంటనే చేతిలోని సంచిని బోటు మనిషికి ఇచ్చాడు. ఎర్రబడ్డ ముఖంతో ఇంటి వైపు బయలుదేరాడు.

దృశ్యం ఇంచుమించు పర్ఫెక్ట్ గా ఉంది. నదీ తీరం. చెట్ల నీడలు. పక్షుల పాటలు. ఉదయం సూర్యుడు. 20 ఏళ్ల వయసు. ఆ ఇటుకల పోగును అంతగా పొగడడానికి ఏమీ లేదు గాని, వాటి మీద ఎక్కి హాయిగా కూర్చుని ఉన్న, పొగడదగిన ఆ శాల్తీ తీరు పొడిబారిన అతని మనసు మీద వర్షంలా కురిసింది. పాపం అతని అదృష్టం అలా ఉంటే, ఎవరేం చేయగలుగుతారు? అది వంకర తిరిగింది. మొదటి అడుగులోనే ఒక వింత అనుభవాన్ని ముందు ఉంచింది.

 

రెండవ భాగం

 

చెట్ల నీడల కింద నడిచిన దారి వెంట అపూర్వ ఇంటికి చేరుకున్నాడు. ఇటుకల గుట్ట మీద నుంచి వినిపించిన ఆ గలగల నవ్వు అతని చెవుల్లో రింగుమంటూనే ఉన్నది. అతని శాలువా, సంచి మొత్తం బురద కొట్టుకొని ఉన్నాయి.

అపూర్వ రావడం అతని తల్లికి గొప్ప సంతోషాన్ని కలిగించింది. వెంటనే పనివాళ్ళను దూరాలకు, దగ్గరకు పంపించి చిక్కని తీయని పాలు, పెరుగు, రోహు చేపలు, తెప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. పక్కనున్న ఇళ్లన్నిటిలోనూ వార్త పొక్కింది.

భోజనాలు అయిన తర్వాత అపూర్వ వాళ్ళ అమ్మ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. అందుకు మన అపూర్వ సిద్ధంగానే ఉన్నాడు. అటువంటి ప్రస్తావనలు ఇంతకు ముందు కూడా వచ్చినవే. ఈ కుమార శేఖరుడు మాత్రం రకరకాల మార్గాలు వెతికి, తన బిఏ డిగ్రీ చేతికందేదాకా పెళ్లి ప్రసక్తి లేదు, అన్నాడు. తల్లి మరి ఇంతకాలం ఓపిక పట్టింది. ఇప్పుడిక అతను ఆ మాట అనడానికి లేదు.

నేను ముందు అమ్మాయిని చూచిన తరువాతే నిర్ణయం జరుగుతుంది, అన్నాడు అపూర్వ. అమ్మ మాత్రం అమ్మాయిని మేము చూచాం గదా, నీవు శ్రమ పడవలసిన అవసరం లేదు, అన్నది. అయితే అపూర్వకు, శ్రమ పడాలనే ఉన్నది.. ముందు చూడకుండా నేను ఏ అమ్మాయినీ పెళ్లి చేసుకోను, అన్నాడతను. ఏమిటి ఈ కని విని ఎరుగని విచిత్ర ధోరణి, అనుకున్నది కానీ, ఆ తల్లి కొడుకును కాదనలేకపోయింది.

ఆ రాత్రి అపూర్వ దీపం మలిపి పడుకున్నాడు కానీ, ఇంకా పడకలో నిద్ర లేకుండానే పడి ఉన్నాడు. అతని చెవుల్లో మాత్రం గలగలా ఒక సందేహం లేని నవ్వు, చుట్టుకుని ఉన్న ఆ వర్షం రాత్రి శబ్దం నిశ్శబ్దాల మధ్యలో నుంచి వినపడుతూనే ఉన్నది.. అతను పాపం పొద్దున్నే లేచి బురదలో జారిపడకుండా ఉంటే ఎలా ఉండేది, అన్నట్టు మనసులోనే కలవరపడిపోతున్నాడు. అపూర్వకృష్ణ అనే ఈ నేను, ఎంతో తెలివిగలవాడిని, చదువుకున్నవాడిని, కలకత్తా నగరంలో ఎంతో కాలంగా ఉంటాను, ఏదో అనుకోకుండా బురదలో జారిపడ్డాను, అంతేగాని నేనేమీ పల్లె మనిషిని కాదు, అన్న సంగతి ఆ అమ్మాయికి పట్టనే లేదు. అయినా ఆమె నన్ను చూచి నవ్వింది, అన్నది అతని మనసులోని కలవరానికి కారణం.

తర్వాతి రోజున అపూర్వ ఒక పెళ్లి చూపులకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళవలసిన చోటు దూరమేమీ లేదు, దగ్గర్లోనే ఉంది. అలవాటు కొద్ది వేసుకునే అడ్డపంచె, శాలువా బదులు, అతను చక్కగా దుస్తులు వేసుకున్నాడు. పట్టు లాల్చి, గుండ్రంగా తలపాగా, బాగా వార్నిష్ చేసిన జోళ్ళు, సిల్క్ గొడుగు అతని దుస్తులిప్పుడు.

మామగారు కావలసిన పెద్దమనిషి, వాళ్ల ఇంట్లోకి అడుగు పెట్టాడో లేదో, అక్కడి వాళ్ళందరూ ఘనంగా స్వాగతం పలుకుతూ, అతని చుట్టూ చేరారు. కొంతకాలం గడిచిన తర్వాత, భయంతో కుంచించుకుపోతున్న అమ్మాయిని, కాబోయే పెళ్ళికొడుకు ముందుకు తెచ్చారు. ఆమెను కష్టపడి సిద్ధం చేశారు. రంగురంగుల చీర కట్టారు. అది చాలా నాణ్యంగా ఉంది. జుట్టు ముడి వేసి, దాని చుట్టూ ఒక మెరుపుల గుడ్డ కట్టారు. ఆమె నిశ్శబ్దంగా ఒక మూలన, తలను మోకాళ్ళ మీదకు వంచుకుని, కూర్చుని ఉంది. ఒక ముసలి పనిమనిషి ఆమె వెనక ఉంది. బహుశా మద్దతుగా వచ్చిందామె. కాబోయే పెళ్లికూతురుకి బహుశా తమ్ముడయి ఉంటాడు ఒక చిన్న కుర్రవాడు వచ్చి, తమ కుటుంబాల్లోకి తీసుకువచ్చిన కొత్త మనిషి తాలూకు తలపాగా, గడియారం, కొత్తగా పెరుగుతున్న గడ్డం, మొదలైనవన్నీ పరిశీలనగా చూచాడు. ఆ కుర్రవాడు బహుశా అక్కకు తోడుగా వచ్చినట్టున్నాడు. అపూర్వ కాసేపు మీసం దువ్వుతూ కూర్చున్నాడు. చివరకు మెత్తని గొంతుతో ఏం చదువుతున్నావు?” అని అడిగాడు. గుడ్డలు కట్టుకుని, నగలు పెట్టుకున్న ఆ మర్యాదల కుప్ప, జవాబు చెప్పలేదు. ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగిన తర్వాత, వెనుకనున్న పనిమనిషి తట్టి ధైర్యం ఇచ్చిన తరువాత, ఆమె మెత్తని గొంతుతో, ఊపిరి కూడా తీసుకోవడానికి ఆగకుండా, గబగబా జవాబు చెప్పింది. ఎలిగెంట్ రీడర్ రెండో భాగం, ఎసెన్స్ ఆఫ్ బెంగాలీ గ్రామర్ మొదటి భాగం, అండ్ అకౌంట్ ఆఫ్ జాగ్రఫీ, లెక్కలు, భారతదేశ చరిత్ర అన్నది ఆమె. ఇంతలో బయట ఏదో గోల జరిగింది. ఒక్క క్షణంలో పరుగుతూ రొప్పుతూ మృణ్మయి గదిలోకి ప్రవేశించింది. ఆమె జుట్టు అటు ఇటు కదులుతున్నది. పెళ్లికూతురు తమ్ముడు రాఖాల్ని ఆమె చేయి పుచ్చుకుని,  అపూర్వకృష్ణ వేపుగాని, చూడనే చూడకుండా లాగ సాగింది. రాఖాల్ మాత్రం తన పరిశీలనలో మునిగి ఉన్నాడు. లేవడానికి నిరాకరించాడు. పనిమనిషి మృణ్మయిని వారిస్తూ అరవకుండానే నివారించను మొదలుపెట్టింది. అపూర్వకృష్ణ కొంచెం తమాయించుకుని వీలైనంత గంభీరంగా నిటారుగా, కూర్చుని తలపాగాతో బాటు తలను అలాగే ఎత్తి ఉంచి, గడియారాన్ని పొట్ట మీద చొక్కాకు రాసుకుంటున్నాడు. అమ్మాయి కుర్రవాని వీపు మీద చరిచింది. పెళ్లికూతురు ముఖం మీద ముసుగును లాగేసింది. పరుగు లంకించుకుంది. పనిమనిషి విసుగుతూ గురగురలాడింది. అక్కయ్య ముసుగు తొలగిపోవడం చూచి చిన్న కుర్రవాడు నవ్వడం మొదలుపెట్టాడు. వాడికి వీపుమీద పడిన దెబ్బ గురించి పట్టింపే లేదు. వాడికి ఇలాంటివన్నీ మామూలే. నిజం చెప్పాలంటే ఒకప్పుడు మృణ్మయి జుట్టు పొడుగ్గానే ఉండేది. అది వీపులో సగం దాకా వేళ్లాడుతూ ఉండేది. ఈ కుర్రవాడే ఆమె వెంట్రుకల మీద ఒక కత్తెరను ప్రయోగించాడు. అది జరిగిన తరువాత ఆ అమ్మాయి కత్తెర పుచ్చుకొని నిర్దయగా తన వెంట్రుకలను కోపంతో కత్తిరించి వేసింది. ద్రాక్షపళ్ళ గుత్తిలాగా తెగిన ఆ జుట్టు నేల మీద పడిపోయింది. ఆ పిల్లల ఆటలు అలా ఉండేవి.

ఆ నిశ్శబ్దంగా సాగిన పరీక్ష మరెంతో కాలం కొనసాగలేదు. రూపు పోసిన మర్యాదగా కూర్చుని ఉన్న అమ్మాయి, కష్టపడుతూ పైకి లేచింది, లోపలి గదిలోకి వెళ్లిపోయింది. పనిమనిషి ఆమెకు సహాయంగా వెళ్ళింది. తన తీరుకుతానే సంతృప్తి పడుతూ, అపూర్వ తన నూనూగు మీసాలను సవరించుకున్నాడు. పైకి లేచాడు. ద్వారం దగ్గరికి చేరేసరికి, తన కాళ్లు జోళ్ళు అక్కడ లేవని కనిపించింది. అవి ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు.

దాంతో ఇంటివాళ్ళు బెంబేలు పడిపోయారు. ఆ పని చేసిన మనిషి గురించి గోలగోలగా విమర్శలు సాగించారు. కాసేపు వెతికారు, గాని జోళ్లు దొరకలేదు. వాటికి బదులుగా ఒక్క పాత అరిగిపోయిన జోళ్లజత అతనికి యిచ్చారు. అవి ఇల్లుగల పెద్దమనిషివి. వాటితోనే ఎలాగో ఒకలాగా, అనుమాన పడుతూ అపూర్వ, వీధి దారి వెంట నడవసాగాడు. అతని దుస్తులు అంటే పంట్లాము, చొక్కా, తలపాగాలు మాత్రం బాగున్నాయి.

అతను కొలను పక్కకు చేరేసరికి మళ్ళీ ఒకసారి పెద్ద స్థాయిలో నవ్వు వినిపించింది. అడవిలో హాయిగా తిరిగే ఆకతాయి అమ్మాయి, అపూర్వకృష్ణ వేసుకున్న జోళ్లను చూచి నవ్వు ఆపుకోలేకపోయింది.

అపూర్వ ఒక్కసారిగా ఆగిపోయాడు. అన్ని వైపులకు తలతిప్పి చూచాడు. అసలు సిగ్గు పడకుండా, దట్టంగా ఉన్న చెట్లనుంచి అమ్మాయి బయటకు వచ్చింది. కాళ్ళ ముందు అతని జోళ్లు పెట్టి, పరుగెత్తి వెళ్ళిపోసాగింది. కానీ అపూర్వకృష్ణ ఆమె చేయి పట్టుకుని ఆపగలిగాడు.

అమ్మాయి తప్పించుకోవడానికి పెనుగులాడింది. అటు ఇటు కదిలింది. కానీ ప్రయత్నం ఫలించలేదు.

ఆనందంగా ఉన్నా, ఆమె గుండ్రటి ముఖం మీద, చెట్ల మధ్యలో నుంచి ఎండ ప్రతిఫలించింది. దాని చుట్టూ ఉంగరాల జుట్టు ఉంది. ప్రవహించే నీళ్ల మీద ఎండ పడినప్పుడు ప్రయాణికుడు కుతూహలంగా చూసినట్టే, అమ్మాయి పైకెత్తిన ముఖంలోని కళ్ళలోకి లోతుగా చూచాడు మన అపూర్వ.. మెరుపులాగా చంచలమైన కళ్ళు చూస్తూ అతను తను పట్టుకున్న అమ్మాయి చేయి వదిలేశాడు. బందీని వదిలినట్టు, తప్పు భావం కూడా అతని మదిలో తోచింది. అతడు గాని ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటే ఆమె ఎంత మాత్రం ఆశ్చర్యపోయేది కాదు. ఏకాంతంగా ఉన్న, చుట్టూ ఎవరూ లేని ఆ దారిలో అతని మెత్తని ప్రవర్తన వెనుక గల అర్థాన్ని మాత్రం, ఆమె అర్థం చేసుకోలేకపోయింది.

ప్రకృతి నాట్యం చేస్తుంటే ఖాళీ గజ్జెలు గలగలనాటినట్టు అదేపనిగా సాగుతున్న నవ్వు మాత్రం ఆకాశమంతటా నిండింది.

 

మూడవ భాగం

 

ఆ రోజంతా అపూర్వ అమ్మను తప్పించుకుని తిరిగాడు. అందుకు ఏవేవో సాకులు చెప్పాడు. లోని గదులలోకి వెళ్ళనే లేదు. అతడిని ఎవరో భోజనానికి పిలిచారు, కనుక అక్కడకు వెళ్లి తిన్నాడు. అపూర్వ బాగా చదువుకున్న మనిషి. గుంభనంగా ఉంటాడు. మంచి ఆలోచనలు గలవాడు. పోయిన తన గాంభీర్యాన్ని గురించి అతను ఇంతగా కుమలడానికి గల కారణం చెప్పడం అంత సులభం కాదు. అవతలి వ్యక్తి ఏమి తెలియని ఒక అమ్మాయి. ఆమె ముందు తన గొప్పదనాన్ని అంతగా పోగొట్టుకున్న భావం అతనికి నిజానికి అనవసరం. ఓ పల్లెటూరి పిచ్చి పిల్ల తన గురించి ఏమనుకుంటే మాత్రం అతనికి అంతగా ఎందుకు. ఆమె అతగాడిని చూసి నవ్వింది. అతడిని చూసి నవ్వవచ్చు అనుకుంది.  అంతట్లోనే అదే అమ్మాయి రాఖాల్ లాంటి చదువు లేని ఒక కుర్రవాడితో ఆడుకోవడానికి పరుగులెత్తుతుంది. ఆ సమయంలో తన గురించి పట్టించుకోనే పట్టించుకోదు. అటువంటి అమ్మాయి ముందు తాను ఒక సాహిత్య విమర్శకుడిని అని, ఏ లాంప్ టు ద వరల్డ్ అనే పత్రికతో తనకు సంబంధం ఉందని రుజువు పరుచుకోవాల్సిన అవసరం ఉందా? తన వద్ద మంచి అత్తరు బుడ్డీలు, మేలైన కాలి జోళ్ళు, రూబిన్ కర్పూరం, రంగు రంగుల కాగితాలు, హార్మోనియం నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం, అలాగే రాత్రి కడుపుని చీల్చుకుని బయటపడడానికి ఉదయ సూర్యుడు వేచి ఉన్నట్టే, అచ్చు కోసం వేచి ఉన్న తన రచనలతో నిండిన నోట్ బుక్, కూడా ఉందని రుజువు చేయవలసిన అవసరం లేదు. అయితే మనసుతో చర్చ చేయడం నిజంగా కొంచెం కష్టమే. కనుకనే అపూర్వకృష్ణ రాయ్, బి ఏ, ఒక తుంటరి పల్లెటూరి పిల్ల ముందు ఓడిపోవడానికి నిరాకరిస్తున్నాడు.

అపూర్వ తన ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మ ఎదురయింది. సరేగాని అపూ, అమ్మాయి గురించి ఏమంటావు? నచ్చిందంటావా?” అని అడిగింది.

అపూర్వ ధైర్యంగానే జవాబు ఇచ్చాడు. అవునమ్మా, అమ్మాయిలను చూచాను. వాళ్లలో ఒకరు నాకు నచ్చారు, అన్నాడతను.

ఎంతమంది అమ్మాయిలను చూచావేమిటి, ఆమె ఆశ్చర్యంగా అడిగింది.

కొంత బెట్టుసరి సాగిన తర్వాత ఒక విషయం అర్థమయింది. పక్కింటి శరత్ కూతురు, మృణ్మయిని తన కొడుకు పెళ్లి చేసుకోవాల నుకుంటున్నాడు అన్నది, ఆ సంగతి. ఇంత చదువుకున్న తరువాత ఇదన్నమాట నిర్ణయం.

అపూర్వ ముందుగా కొంచెం సిగ్గుపడ్డాడు. తల్లి మాత్రం ససేమిరా వీల్లేదు, అన్నది. అతను తన గట్టి పట్టును సాగించాడు. తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు, అంటే ఇక తనకు పెళ్లి అవసరం లేదు, అన్నాడు. బుట్టబొమ్మ లాగా కనిపించిన, ప్రవర్తించిన మరో అమ్మాయి గురించి ఆలోచించిన కొద్దీ, ఆమెతో పెళ్లి అసలు కుదరదు, అన్న భావం అతని ముందు బలంగా నిలిచింది. రెండుమూడు నాళ్లు వాదప్రతివాదాలు జరిగాయి. ఉపవాసాలు, నిద్రలేమి సాగాయి. తల్లి ముందు, అపూర్వ గట్టి పట్టు పట్టాడు. తల్లి కూడా కొంత పట్టు సడలించింది. మృణ్మయి నిజానికి చిన్నపిల్ల. ఆమె తల్లికి, తన పిల్లకు చదువు చెప్పించే స్తోమత లేదు. ఇక తానే తన కోడలికి నచ్చజెప్పి, ఆమె తీరు మార్చాలి, అనుకున్నది ఆమె. మృణ్మయి ముఖం అందంగా ఉందని కూడా తనకు తాను నచ్చజెప్పుకున్నది. ఆమె అదంతా సాధించిన తరువాత, మరోసారి ఆమె మనసు కృంగి పోయింది. ఆలోచనల్లో మృణ్మయి పొట్టిజుట్టు ఎదురయింది. కానీ అది కూడా సమస్య కాదు. తలకు బాగా నూనె పట్టించి, ముడికట్టి ఉంచితే పోతుంది, అనుకున్నది ఆమె.

ఇరుగుపొరుగు వాళ్లు అతని ఎంపికను చాలా మెచ్చుకున్నారు. అతని పేరులోనే ఆ తీరు ఉందన్నారు. అమ్మాయి ఎలాగున్నా వాళ్లందరికీ ఎంతో ఇష్టమయినదే. అయితే ఆమెను కోడలుగా చేసుకోవాలంటే మాత్రం ఎవరూ ముందుకు రారు.

మృణ్మయి తండ్రి ఈషాన్ మజూందార్ కు సంగతి సకాలంలో తెలియజేశారు. ఆయన ఒక స్టీమర్ కంపెనీలో గుమాస్తాగా పని చేస్తుంటాడు. ఆ చోటు నదీతీరం మీద ఎక్కడో ఉంటుంది. పనిలో భాగంగా అతను టికెట్లు అమ్ముతుంటాడు. సరుకులు ఎక్కించడం, దించడం, చేయిస్తుంటాడు. రేకు పైకప్పు గల ఒక గుడిసెలోనుంచి ఆ పనులన్నీ సాగిస్తుంటాడు.

తన మృణ్మయి పెళ్లి ప్రస్తావన వార్త అందగానే, అతని కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. వాటిలో తన కూతురు తననుంచి దూరం అవుతుందని వచ్చినవి ఎన్ని, ఆనందంతో వచ్చినవి ఎన్ని, చెప్పడం మాత్రం కుదరదు. విదేశంలో ఉన్న యజమానిని శెలవు కోసం అడిగాడు. అతనికి మాత్రం అదేదో గొప్ప విషయంలాగ కనిపించలేదు. శెలవు లేదు పొమ్మన్నాడు. వారం రోజులు శెలవు దొరుకుతుంది, గనుక పెళ్లి దుర్గాపూజ సమయంలో పెట్టండి, అని అతను అడిగాడు. అపూర్వ తల్లికి అంతవరకు వేచి ఉండడం ఇష్టం లేదు. పెళ్లి ఎలాగయినా ఆ నెలలోనే జరగాలి, అని నిర్ణయించింది ఆమె. మంచి ముహూర్తం ఉందని పట్టుదల. అటూయిటూ తన ప్రార్థనలు పనిచేయలేదని ఈశాన్ ఏ ఆనందమూ లేకుండా తన సరుకులు తూచే పనిలో, టికెట్లు అమ్మడంలో, మునిగి పోయాడు.

ఆ తరువాత మృణ్మయి తల్లీ, ఊళ్లోని మిగతా ఆడంగులు, అమ్మాయికి రాబోయే కాలంలో, ఉండవలసిన తీరు గురించి సలహా లివ్వను, మొదలు పెట్టారు. ఆటలాడడం, అటూయిటూ పరుగులు పెట్టడం, అబ్బాయిలతో కలిసి ఆడడం, ఆకలికొద్దీ తినడం లాంటివన్నీ, ఇక పనికి రావని చెపుతూ, వ్యవహారాన్ని మొత్తంగా ఒక పెద్ద రాక్షస లక్షణం, కింద వర్ణించ సాగారు. మృణ్మయికి అంతా చికాకుగా ఉంది. తనకేమయినా ఆజీవ కారాగారం, ఆ తరువాత మరణదండన విదించారేమోనని, ఆమె ఆశ్చర్య పడసాగింది.

అడవి గుఱ్ఱం పిల్లలాగ వెనక్కు కదిలి నేను పెళ్లి చేసుకోను అంటూ తెగేసి గట్టిగా చెప్పేసింది.

 




Tuesday, May 5, 2026

నా తెలంగాణ - ముస్సీ తటము - కవి దాశరథి

 


కవి దాశరథి తమ కవితలో 

నా తెలంగాణ కోటి రత్నాల వీణ
అన్న తరువాత ఏమన్నరు?
ఎంత మందికి ఈ కవిత గురించి తెలుసు?

వినండి.
చదవండి.

ముస్సీ తటము

దాశరథి కృష్ణమాచార్య కవిత

అగ్ని ధార కావ్యం నుండి

 

అచట ప్రాక్పశ్చిమాకాశమావలించి
నెత్తురులు కక్కుకొన్నది; కుత్తుకలకు
కత్తులను కట్టి ఊరేగు కాలరాణి
మానభంగాల జెండాలతో నదించె.
 
అచట, పాపము, దౌర్జన్య మావరించి
తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి వేసె
మతపిశాచము పేదల కుతుక నమిలి
ఉమ్మివేసెను పిప్పి, లోకమ్ము మీద.
 
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
తీవియలు తెగి, విరిగి  నదించకుండె
నా తెలుగుజాణ ప్రాణ మానాలు దోచి
ఈ నిజాము పిశాచి కన్నెర్ర చేసె.
 
మా నరాల నెత్తురు ప్రవాహాన కలిసి
"ముస్సి"లో పారినది బుద్ధమూర్తివోలె
మా స్థిరీ భూత భావసమాధి వృక్ష
మట్లె నిలిచిన దీనాటికైన గాని.
 
గెలిచినది గడ్డిపోచ" ముక్క లయిపోయి
మన్ను కరిచెను గొడ్డలి; కన్నులోని
వేడి అశ్రువు గెలిచెను; వాడికత్తి
ఓడిపోయెను; 'ముస్సి' పారాడిపోయె

 

 

 

 

 

 

 

 

 


Friday, May 1, 2026

చక్కని దోస్తీ : ఒక చక్కని కథ - A short little story about truth.


చక్కని దోస్తీ

ఒకానొకప్పుడు ఒక అందమైన ఆవిడ ఉండేది. ఆమె నగరంలో అంతటా తిరుగుతూ ఉండేది. వెళ్లిన చోట ప్రతి వాళ్లు ఆమెను గమనిస్తూ ఉండేవారు. అందరూ ఆమెతో మాట్లాడాలి అనుకునే వారే. ఆమె మాటలు వినదలుచుకున్న వారే. ఆమెను ఏదో అడగదలుచుకున్న వారే. ఏదో ఒక రకంగా ఆమెతో కలిసి కాలం గడపాలని అందరూ అనుకుంటారు. అదే నగరంలో ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె బీదమనిషి. తగిన దుస్తులు లేనిది. అయితే ఆమె కూడా చాలా అందంగా ఉండేది.అయినప్పటికీ ఎవరూ ఆమెను పట్టించుకునే వాళ్ళు కాదు. కనుక బహుశా ఆ అమ్మాయి ఒంటరిగా, దుఃఖంగా ఉండేదేమో. ఆమె కూడా అందమైన ఆవిడను చూస్తుంది. ఆమెను అందరూ పట్టించుకునే తీరు గమనిస్తుంది. తనను కూడా అందరూ పట్టించుకుంటే బాగుంటుంది కదా, అనుకుంటుంది. తన మనసులోని మాటలను అందరికీ చెప్పాలని ఆమెకు చాలా కోరిక. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోరు.

ఒకనాడు చింకి దుస్తులలో ఉన్న బీద అమ్మాయి, ఏదోరకంగా ధైర్యం తెచ్చుకుంది. వెలగల దుస్తులు వేసుకున్న అందమైన అమ్మాయి తో మాట్లాడడానికి ధైర్యం చేసింది. ఏమండీ, నన్ను మీరు క్షమించాలి. మిమ్మల్ని ఒక సహాయం అడగవచ్చునా?’ అన్నది ఆ అమ్మాయి. ధనికురాలయిన మహిళ నిజానికి చాలా మంచి మనిషి. చాలా దయగల మనిషి. కనుక వెంటనే బీద అమ్మాయి మాటలు విన్నది.

అదేమన్న మాట! ఏం అడగదలుచుకున్నావు చెప్పు మరి!, అన్నది ఆమె బీద అమ్మాయితో.

ఏం లేదండీ, ధైర్యం చేసి బీద అమ్మాయి మాట్లాడ సాగింది. మీరు చాలా అందంగా ఉన్నారు. అందుకు తగినట్టే మంచి దుస్తులు కూడా వేసుకుంటారు. అందుకని అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు. నేనేమో బీద దాన్ని. నా దగ్గర మంచి దుస్తులు లేవు. కనుక ఎవరూ నన్ను పట్టించుకోరు. కనీసం ఒక్కరోజు, మీ దుస్తులు వేసుకుని, మీ వెంట తిరగాలని ఉంది. మిమ్మల్ని చూసిన వాళ్లంతా, నన్ను కూడా చూస్తారు. వాళ్ళందరికీ చెప్పడానికి నా దగ్గర ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతి ఇప్పుడు వాళ్లకు తెలియదు మరి! అని, ఆ అమ్మాయి వినయంగా నిలబడింది.

అందమయిన ఆవిడ చాలా సులభంగా అమ్మాయి కోరికకు అంగీకరించింది. మరుసటి రోజు ఉదయాన ఆమె తన దుస్తులు బీద అమ్మాయికి వేసింది. తనతో పాటు వెంటబెట్టుకుని నగరంలో తిరగసాగింది. మామూలుగానే, అందరూ వాళ్ళకి ఎదురుగా వచ్చారు. పక్కన ఉన్న అమ్మాయిని కూడా వాళ్లంతా చూడగలిగారు. ఇద్దరూ కలిసి నడుస్తూ చాలా సంగతులు మాట్లాడుకున్నారు. బీద అమ్మాయిని ప్రశ్నలు అడిగి అందమైన అమ్మాయి ఎన్నో సంగతులు విన్నది. ఆమె గురించి తెలుసుకున్నది. అమ్మాయి చెప్పిన సంగతులు ఎంతో బాగున్నాయని అర్థం చేసుకున్నది. బీద అమ్మాయి తెలివిగలది, అని ఆమెకు సులభంగానే అర్థమైంది. వాళ్ళిద్దరూ నేస్తాలయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరుగుతు న్నారు. అందరితోనూ మాట్లాడుతున్నారు.

వాళ్ళ పేర్లు ఏమిటి? అని ఎవరికి ఇప్పటివరకు అనుమానం రాలేదా?

అందమైన ఆవిడ పేరు, కథ. ఆమెతో నేస్తం కట్టిన బీద అమ్మాయి పేరు, నిజం.