Tuesday, May 10, 2011

Sriman Puttaparti Narayanacharya - A review

ఆయనది పరిధిలేని పాండిత్యం

-గోపాలం కె.బి

April 23rd, 2011

పుట్టపర్తి నారాయణాచార్యులు
రచన: డా.పుట్టపర్తి నాగపద్మిని
సి.పి.బ్రౌన్ అకాడమీ,
53,
నాగార్జున హిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్
పేజీలు: 216, వెల: రూ. 95/-
ఫోన్: 23423188, 23430448
పెళ్లాన్నేం చేస్తావురా బాళప్పా?’ ‘గొంతు పిసికి బాయిలో వేస్తాను!ఈ డైలాగును, బీచి అన్న పేరును శాన్నాళ్లుగా వింటున్నాము. కానీ ఇన్నాళ్లకు వాటి అసలు రూపం అర్ధమయింది. భీంసేనాచార్ (బీచి) కన్నడ నవలకు సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల అనువాదంలోని మాటలవి. కథ చెప్పే వాళ్లకు ఊకొట్టే వాళ్లు కావాలి అన్న గొప్ప మాట కూడా ఆ నవలలోనిదే! ఎక్కడుంది ఆ నవల దొరుకుతుందా?
నారాయణాచార్యుల వాక్కు వణుకు లేనిదిఅన్నారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు. ఆ వ్యక్తిని గురించి, వాక్కును గురించి, బ్రౌన్ అకాడమీవారు సమగ్రమయిన పుస్తకం వ్రాయించారు. ఆ పుస్తకాన్ని ఆచార్యులవారి కుమార్తె నాగపద్మినిగారు రాయడం నిజంగా గొప్ప విషయం. నారాయణాచార్యులను గురించిన ఈ పుస్తకాన్ని నాగపద్మినిగారు ఒక కూతురుగా రాయలేదు. తండ్రిని ముందు గురువుగానే ఎంచి, అసలయిన అకడమిక్ సిద్ధాంత వ్యాసం పద్ధతిలో, శ్రమకోర్చి, వివరాలను సేకరించి, సోదాహరణంగా ఆమె చక్కని పుస్తకాన్ని అందించారు. మేరునగమంతటి మేటి పండితునికి, కూతురు పట్టిన ఈ నివాళి, సాహిత్యాభిమానులందరి నివాళిగా నిలిచింది.
నారాయణాచార్యులవారు సముద్రము వంటి వ్యక్తి. అందులోని లోతు అందరికీ అర్ధం కాదు. కానీ అందరికీ అందుతుంది. ఎన్నో భాషలలో పరిచయం, ప్రపంచం గురించిన అవగాహన కలిగి వారి కలానికి కలిగిన వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారంగా ఒక కవి, రచయిత పేరు చెప్పగానే ఒకటి రెండు రచనలు అందరికీ తెలిసి ఉంటాయి. పుట్టపర్తి వారి విషయంలో ఇది అంత సులభంగా జరగదు. పెనుగొండ లక్ష్మి నిజానికి అందరికీ తెలుసు. కానీ అది వారి రచనలలో ఒకటి మాత్రమే. అదొక్కటే ఆయనగారి రచనలలో గుర్తుండిపోయేది మాత్రం కాదు. శివతాండవమయినా అంతే!
ఆచార్యులవారు కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు, వ్యాఖ్యాత ఇంకా ఎనె్నన్నో. ఎన్ని భాషలు నేర్చారు? ఎన్ని పనులు చేశారు? ఆ వైవిధ్యం గురించి వారికి తెలుసు! అందుకే నా కవిత్వం బాగాలేదంటే కోపంరాదు. నేను పండితుణ్ణి కాదు అంటే మాత్రం కోపంవస్తుంది!అంటారాయన. రచనలను గురించి రాసినంత వివరంగా, వారి జీవితం గురించి కూడా మంచి పుస్తకం వస్తే బాగుంటుంది.
యువ ప్రాయంలో కాల్పనికత, తరువాత క్షేత్ర ప్రశస్తి, ఆ తరువాత ఆధ్యాత్మికం-రచనలు, వ్యాసంగం మామూలుగానే జరిగినట్టు కనపడుతుంది. పుస్తకంలో రకరకాల రచనలను వ్యాసాలుగా వివరించడం బాగుంది. ఆచార్యులవారి అభివ్యక్తి పద్ధతిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ అంశం గురించి ప్రత్యేకంగా మరింత రాస్తే బాగుండును. దేవాంగనా వరిత దృక్పరిపూతమూర్తే’, ‘శిలలైన మనసులకు నే పాడలేనూ!’, ‘ఈ విరహ వీణలో ఎంతయానందమ్ముఅన్నీ ఒకే కలంనుంచి వచ్చిన మాటలేనా? అదే కలం వేల సంఖ్యలో భక్తిరచనలు చేసింది. అదేకలం మరొక చోట అవిగో మహాత్ముని నెత్తుటి చుక్కలు! ఏరుకోండి, ఏరుకోండి!అన్నది. పాండిత్యమంటే అది!
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించి పరిశోధన జరగలేదనడానికి లేదు. కానీ, జరగవలసింది మరెంతో ఉందన్న భావం ఈ పుస్తకం చదివిన తరువాత కలిగింది. తెలుగు జాతి రత్నాలు అన్న శీర్షికలో ఈ పుస్తకం రావడం ఎంత సమంజసంగా ఉంది. నాగపద్మినిగారు తదితరులు ఈ ప్రయత్నాన్ని ప్రారంభంగా భావించి, ఆచార్యుల వారి గురించి సాహితీ లోకానికి, సామాన్యులకు మరింత తెలియజేసే ప్రయత్నం చేస్తారని ఆశించడం ఆశకాదు! వారి గురించి వారి రచనల గురించి వచ్చిన ఈ పుస్తకం అందరిలోను ఈ ఆశను రేకెత్తిస్తుంది అంటే అనుమానమూ లేదు
చివరగా ఒక మాట! నారాయణాచార్యుల వారికి, ఏవో అవార్డులు రాలేదని ఒక అసంతృప్తి, కొందరిలో మిగిలి ఉంది. అందుకు కారణం ఆచార్యులవారే. వారేదో ఒక ప్రక్రియనుమాత్రమే పట్టుకుని అందులోనే సుడులు తిరిగి ఉంటే అందరూ గమనించేవారు. కానీ ఆయనది పరిధిలేని పాండిత్యం! ఆ గొప్పదనం, కొలబద్దకు అందలేదేమో? చాలా కొద్దిమంది మాత్రమే కొలతలకు లొంగకుండా ఎదిగిపోతారు. అరుదయిన ఆ తీరుగల వ్యక్తిత్వాన్ని స్థాలీపులాక న్యాయంగా, అద్దంలో కొండను చూపిన తీరుగా, ఈ పుస్తకం మనకు చూపిస్తుంది.

Let us enjoy some good books!
!!!!!

1 comment:

మాగంటి వంశీ మోహన్ said...

"నారాయణాచార్యుల వారికి, ఏవో అవార్డులు రాలేదని ఒక అసంతృప్తి, కొందరిలో మిగిలి ఉంది" -

ఈ అసంతృప్తి ఒకప్పుడు నాలో బాగా ఉండేది గురువు గారు. వయసొస్తున్న కొద్దీ నెమ్మదిగా , చడిచప్పుడు లేకుండా ఆ అసంతృప్తి ఎక్కడికో పోయింది.....ఎందుకా? ఆయన రచనల్లోని గొప్పతనం నాకు అర్థమయ్యి.....అవార్డులు కొలబద్ద కాదనీ ఎల్లలు లేని ప్రతిభ కల సాహిత్యమే గొప్పదనీ ఓ దశాబ్దం క్రితం నేను గుర్తించటం మొదలుపెట్టినప్పటినుంచీ ఆ అశాంతి నాలో తొలిగిపోయింది...

మీ పోష్టులో బోల్డు అక్షర సత్యాలు...

ధన్యవాదాలు