Here is the material from Vikasam page of Andhra Bhoomi.
ఛెక్కు బ్యాంకులో వేసి ఉండాలి! వెయ్యలేదు! అంటే బద్ధకమా? తీరిక దొరకలేదా? -ఏమిటి కారణం? ఫరవాలేదు, రేపు వేసినా కొంప మునగదు అన్న భావం దానికి కారణం. చేయవలసిన పనులను ముందుకు నెట్టడంలో రెండు రకాలున్నాయి. కొంతమంది చదువుకునే పిల్లలు, అన్ని పనులు చేస్తుంటారు... చదువుకోవడం తప్ప! పరీక్షలు వస్తున్నాయంటే మాత్రం పగలు, రాత్రి చదువుతారు. మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు. ప్రయాణ సమయానికి అరగంట ముందు మాత్రమే సామాను సర్దుకోవడం చాలామందికి అలవాటు. కరెంటు, టెలిఫోను మొదలు ఏ బిల్లయినా చివరి రోజున మాత్రమే కట్టడం చాలామందికి అలవాటు. ఇలాంటి వారందరు కూడా హాయిగానే బతుకుతుంటారు. పైగా మిగతా వారిని ఛాదస్తంగాళ్లని అనుకుంటారు కూడా!
ఈ రకం పద్ధతిని బద్ధకం అనలేము. అదొక పథకం. పదిహేను వందల మీటర్ల పరుగు పోటీలో ఎవరూ మొదటినుంచీ వేగంగా పరిగెత్తరు. అందరూ తాపీగా వెడుతూ, చివరి రౌండులోకి వచ్చిన తరువాత ఒక్కసారి వేగం పెంచి బులెట్‌లా దూసుకుపోతారు. అక్కడ బాగా పరిగెత్తాలంటే ఓపిక మిగిలి ఉండాలి. శక్తి ఉండాలి. అవి ఉంటే గెలుపు అందుతుంది. మరి ఈ పద్ధతి అన్నిచోట్లా మంచిదేనా? ఏమో?
మరి కొంతమంది పనిని పక్కనపెట్టి కూర్చుంటారు. చేయకుండా ఉంటే, కొంత కాలానికి చేయాల్సిన అవసరం ఉండదేమో చూద్దామన్నట్టు ఉంటుంది వారి ధోరణి. చెక్కు ఇవాళ బ్యాంకులో వేయకపోతే మురిగిపోతుంది. అయినా ఆ పని చేయకుంటే, బద్ధకం, నిర్లక్ష్యం, మరెన్నో కారణాలు. చాలామంది పనులు చేయకుండా ఉండడానికి, రకరకాల కారణాలు ఉంటాయని మనస్తత్వ వేత్తలు అంటున్నారు.
ఆ పని ఎలా చేయాలో తెలియదు. ఎవరినైనా అడగాలంటే నామోషీ!
తప్పుచేసి తిట్లు తినడంకన్నా, చేయకుండా తిట్లు తినడం బాగుందన్న భావం
చేయాల్సిన పని నచ్చక పోవడం. ఇష్టంలేని పని ఇచ్చారన్న కసి!
చివరిదాకా వేచి ఉండి, అప్పుడు బాగా చేసి మెప్పు పొందాలన్న కోరిక
నిజంగా బిజీగా ఉండి, సరైన సమయం ఏర్పాటుచేసుకోలేకపోవడం
స్వంత సమస్యలు
పని సరిగా జరుగుతుందో, జరిగిందో లేదోనన్న ఛానస్తం. ఇలా ఎన్నో కారణాలు! ఫలితంగా ఆదుర్దా, దోషభావం, నిద్రపట్టక పోవడం! ప్రతి పనినీ వాయిదా వేయకుండా ఉండడానికి కూడా పద్ధతులున్నాయి
పని పెద్దదిగా కనిపిస్తున్నదా? దాన్ని విడగొట్టి ముక్కలు చేసి చూడండి. ఆ ముక్కలను ఒక్కొక్కటిగా ముగిస్తూ వస్తే బోలెడంత బలం కలుగుతుంది.
ఏ పని ముందు చేయాలి? ఏది తర్వాత చేయవచ్చునన్న నిర్ణయాలు జరగాలి. చెక్కు బ్యాంకులో రేపు కూడా వేయవచ్చు. అంతేగాని చివరి రోజు దాకా ఆగకూడదు. మిగతా పని ఒత్తిడి ముఖ్యమైతే మరో రెండు రోజులు వాయిదా వేయవచ్చు. కానీ అదీ జరగవలసిన పనే!
పని ఉండగా అర్ధంలేని వేరే పనుల మీదకి ధ్యాసపోకుంటే మేలు. బొమ్మల పుస్తకం ఎన్నడయినా చూడవచ్చు. కిటికీలోంచి చూస్తూ ఎన్నడైనా కాలం గడపవచ్చు. సీట్లో హాయిగా కునుకు పడుతున్నదా? అనుకూలంగా లేని కుర్చీ తెచ్చుకోవాలి. పని జరగాలి!
ఇల్లంతా వస్తువులే. టేబుల్ నిండా వస్తువులే! వాటిలో వేటిని ఎప్పుడు వాడాలి. అవసరం లేని వాటిని ఏం చేయాలి. నిర్ణయించడం మంచిది. కొన్ని నిముషాల్లో ఆ పని ముగిస్తే తర్వాత చేయవలసిన పనులు సులభంగా తోచి వస్తాయి.
పనిమీద గురి కుదరక పోవడం, ఆ పని అప్పజెప్పిన వ్యక్తి ఇష్టం లేకపోవడం వల్లనా? ఎవరు అప్పజెప్పినా, మనం చేయాల్సిన పని మనమే గదా చేయాలి? చేసి పక్కన పడేస్తే మన మంచి పేరు నిలబడుతుంది. చేసింది ఎవరికోసమో కాదు మనకోసమే!
మనకన్నీ చేతవుతాయని మరీ పనిని తలకెత్తుకోవడం తప్పు. ప్రతి పనినీ అతిగా చూచి మరీ బాగా చేయాలనుకోవడం కూడా తప్పే! ఏపనికి ఎంత ప్రాముఖ్యం అవసరమో గుర్తించడం అవసరం. మన శక్తిని గుర్తించడం అంతకన్నా అవసరం.
చేయవలసిన పని, చేయవలసిన సమయంలో చేయకుంటే ఏమవుతుంది? ఆలోచన అవసరం. చివరకు మనమే ఆ పనిని ముగించాలేమో? మనకూ, మన వారికి నష్టం, కష్టం, అపకీర్తి వస్తాయేమో? ఆ పనేదో ముగిస్తే ఆలోచనలే ఉండవుగదా?
చాలా సందర్భాల్లో కష్టపడి పనిచేసినా ఎవరూ కనె్నత్తి చూడరుకూడా! చేయకుంటే మాత్రం కాకుల్లా పొడుస్తారు. అయినా మనం, మన పని ఎవరి మెప్పు కొరకో చేయనవసరం లేదు.
ఆలోచిస్తూ కూచుంటే ఏదీ జరగదు. పని మొదలుపెడితే అదే ముందుకు సాగుతుంది. కనీసం చేయడం కుదిరేట్లు లేదని అర్ధమయినా అవుతుంది.
గెట్ గోయింగ్! అది అసలు సూత్రం!
ఎందుకు నచ్చవ్.. బాసూ!?
బాసులు నచ్చకపోతే ఎవరూ సక్రమంగా పనిచేయరు. అసలు ఈ బాసులు ఉద్యోగులకు నచ్చకపోవడానికి కారణమేమిటని పరిశోధన జరిగింది. అందులో తెలిసిన సంగతులు మీరు గమనించండి.
నోటికి వచ్చినట్టు మాట్లాడడం.
తగిన వారున్నా, ప్రమోషన్లు ఇవ్వకుండా కొత్తవారిని పనిలోకి చేర్చుకోవడం.
వాగ్దానాలు చేయడమే కానీ, వాటిని నిజం చేయాలన్న శ్రద్ధ లేకపోవడం.
నిష్కారణంగా కొంతమంది మీద అభిమానం, కొంతమంది పట్ల అయిష్టత చూపడం.
‘తనవారు’ అనే ఒక వర్గాన్ని తయారుచేసుకుని మిగతావారిని నిర్లక్ష్యం చేయడం.
ఉద్యోగుల వ్యక్తిగత ఆరోగ్యం, భద్రతల గురించి శ్రద్ధ చూపించకపోవడం.
అందరూ ఉండగా బాహాటంగా నిలదీసి తప్పులు లెక్కించి దుయ్యబట్టడం.
జీతాలు నిర్ణయించే విషయంలో పక్షపాత పద్ధతి.
రోజుకొకటిగా రూల్సు, నియమాలు, పద్ధతులు మారుస్తూ ఉండడం.
మంచి పని చేసిన వారిని గుర్తించడంలో జాప్యం, నిర్లక్ష్యం.
పని ముఖ్యం, నీ స్వంత సంగతులు ఏమైతే నాకెందుకూ అనే పద్ధతి.
క్రమశిక్షణ పేరున, అనవసరంగానే కొందరిని తప్పు పట్టడం.
ఎవరేం చెప్పినా చెవిని పెట్టకుండా ఉండడం.
తన పర్యవేక్షణలో జరగవలసిన పనిని గురించి తనకే పట్టులేకపోవడం.
అర్ధంలేని రూల్సుపెట్టి బాధించడం.
ఆఫీసు వాతావరణం, పరిశుభ్రత మొదలైన వాటిని పట్టించుకోకపోవడం.
అన్ని పనుల్లోను అనవసరంగా సాగదీసే ధోరణి.
ఇచ్చే సలహాలు, ఆదేశాలు అర్ధం కానివిగా ఉండడం.
ఇలా వేస్తూపోతే అధికారులు తమ సిబ్బందికి నచ్చకపోవడానికి ఎన్నో కారణాలుంటయి. మీ ఆఫీసురుగారు, ఒకరయినా వీటిలో ఎవో కొన్ని లక్షణాలు కలవారే ఉంటారు. అది తప్పదు. ఈ ప్రపంచంలో మనుషులంతా ఒక రకంగా ఉండరు గదా! ఇప్పటికే మీ చేతిలో అధికారం ఉంటే, రేపు వచ్చే వీలుంటే మరి మీరు ఈ విషయాలను గురించి ఏం చేస్తారు? ఆలోచించండి!
నీ పేరేమిటి?
ఒకప్పుడు ఒక మల్లయోధుడు ఉండేవాడు. అతని పేరు ఓనామీ. ఆ పేరుకు జపాను భాషలో పెద్ద అల లేదా ‘మహా తరంగం’ అని అర్ధం!
యోధుడు చాలా బలంగలవాడు. కుస్తీ గురించి బాగా తెలిసినవాడు. నేర్చుకునే చోట అతను స్వంత గురువునుకూడా చిత్తుగా ఓడించేవాడు. కానీ పదిమది ముందు మాత్రం సిగ్గుతో ముడుచుకుపోయేవాడు. కొత్త వారి చేతుల్లో కూడా ఓడిపోయేవాడు.
ఇందుకు మార్గంగా ఎవరైనా గురువుగారి సాయం పొందాలని అతను అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో హకుజు అనే గురువుగారు, దగ్గరలోని గుడిలో బస చేసి ఉన్నారని తెలిసింది. ఓనామీ వెళ్లి గురువుగారి ముందు గోడు చెప్పుకున్నాడు.
‘నీ పేరేమిటన్నావూ? మహాతరంగమని గదూ? ఇవాళ రాత్రి ఇక్కడే గుడిలోనే ఉండిపో! నిన్ను నీవు పెద్ద అలగా భావించు. సిగ్గుపడే మల్లయోధుడు ఇక లేడు. అల మాత్రమే మిగిలింది! అది అన్నింటినీ ముంచెత్తుతుంది. గతాన్ని మొత్తంగా మింగేస్తుంది. అట్లా చేస్తివంటే ఇక నీకు తిరుగుండదు అన్నారు గురువుగారు.
గురువు వెళ్లి పడుకున్నాడు. ఓనామీ మాత్రం ధ్యానానికి కూచున్నాడు. తనను తాను అలగా భావించసాగాడు. ఎనె్నన్నో ఆలోచనలు వచ్చాయి. చివరకు అలల బలం గట్టిపడసాగింది. రాత్రి గడిచిన కొద్దీ అలలు పెద్దవిగా వస్తున్నాయి. తోట మునిగిపోయింది. గుడి కూడా మునిగిపోయింది. కొంతకాలం తర్వాత అతని మెదడంతా సముద్రమయింది.
తెల్లవారింది. గురువుగారు నిద్రలేచారు. ఓనామీ మాత్రం ధ్యానంలో ఉన్నాడు. ‘మహా తరంగమా? ఇక వెళ్లి నీ బలం చూపించు!’ అన్నారు గురువుగారు.
ఆనాడే మహాతరంగం ఒక పోటీలో గెలిచాడు. తరువాత అతనికి తిరుగులేదు.
ఆలోచనలను ఆపేస్తాయి!
అసలు మాట!
పిడికిలి బిగబట్టి ఉన్నప్పడు ఎవరూ సరిగా ఆలోచించలేరు!
-జార్జ్ జా నతాన్
బిగువు, భయం, కోపం-ఇవన్నీ మెదడు తలుపులను మూసేస్తాయి.
Let us enjoy some good ideas!!
!!!!!!!!!!