Here is the third instalment of Medha, the sciene page in Andhra Bhoomi.
This appeared in print on 2nd November 2010
Now the page appears on Mondays and in colour!
Here is the link to the weekly page!
Visit every week and read a lot of interesting material!
http://www.andhrabhoomi.net/features/intelligent
Now, let us enjoy some reading here itself!
Do I have to tall that I am contributing this page?
‘మంచి’నీరు మిగులుతుందా?.
November 1st, 2010
ఈ సంవత్సరం ‘వద్దనే’వరకు వానలొచ్చాయి. కనుక, కొన్నాళ్లవరకు మంచినీళ్లకు కొదువ ఉండదేమోనని అనిపించింది. పేపర్లో, ఎక్కడో ‘వాటర్ మెయిన్’ అంటే, నీటిని నగరందాకా తెచ్చే పెద్ద గొట్టం, పగిలి, నీరంతా పోతున్న ఫొటో కనిపించింది. నీళ్లు, ఎప్పటికైనా సమస్యే.
ఈ సంవత్సరం జూన్ 28న జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ ఆసెంబ్లీలో ‘పరిశుభ్రమైన తాగునీరు’, ‘ప్రాథమిక పారిశుధ్యం’ అన్న రెంటినీ మానవ హక్కులుగా గుర్తించారు. కానీ ప్రపంచంలో ఒక బిలియన్‌కు పైగా జనానికి ‘మంచినీరు’ అనే వసతి లేనేలేదు. ఉందనుకుంటున్న చాలాచోట్ల, ఆ నీరు ‘మంచి’ గురించీ, మోతాదు గురించీ సమస్యలు ఉండనే ఉన్నాయి. మరో రెండున్నర బిలియనుల పైగా జనానికి పారిశుధ్య వ్యవస్థ అంటే ఏమిటో తెలియదు.
దొరుకుతున్న నీటిలో అయిదింట నాలుగు వందలు, వ్యవసాయం, పరిశ్రమలకు ఖర్చవుతున్నది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నీటికి ముఖ్యమైన చోటుందని అర్థం. మునుముందు దేశాల మధ్యన సంబంధాలకు (బహుశః పోరాటాలకు) చమురు వగైరాలకన్నా వీరే ముఖ్య ప్రాతిపదికగా ఉంటుందని యుఎన్ వారే అంటున్నారు.
మొత్తానికి ప్రపంచమంతటా, అందరి దృష్టి ప్రస్తుతం నీటి మీద ఉంది. నీటిని వాడడంలో, పొదుపులో, తిరిగి వాడడంలో కొత్త పద్ధతుల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. నిలదొక్కుకోగల నీటి నిర్వహణ పద్ధతుల గురించి సదస్సులు జరుగుతున్నాయి.
అది ఎడారిగానీ, మహానగరం మధ్యనగానీ, గాలిలోనుంచి నీటిని తీయవచ్చునని ఫ్రవున్‌హాఫర్ పరిశోధనా సంస్థవారు అంటున్నారు. ఒక ఎత్తయిన గోపురం వంటి నిర్మాణంలో ఉప్పు ద్రావణం తిరుగుతూ ఉంటుంది. అది వాతావరణంలోని తేమను పీల్చుకుంటుంది. అక్కడినుండి ఆ ద్రావణం ఒక ఎత్తులో ఏర్పరచిన ట్యాంకులోకి చేరుతుంది. అక్కడ అది సౌరశక్తి ఆధారంగా మరుగుతుంది. ఆవిరయిన నీటిలో ఏ ఉప్పూ ఉండదు. దాన్ని చల్లబరిస్తే ‘మంచినీరు’ దొరుకుతుంది. నీటిని వదిలిన ఉప్పు ద్రావణం తిరిగి గోపురంలోకి వస్తుంది. కార్యక్రమం చక్రంగా జరుగుతూనే ఉంటుంది. ఇందులో విద్యుత్తును వాడుకునే ప్రసక్తి లేదు. కాలుష్యం కలిగించనిదీ, ఎంతకాలమయినా తరగకుండా అందుతూనే ఉండేదీ అయిన ఎండ లేక సౌరశక్తి ఇక్కడ ఇంధనం. విద్యుత్తు అసలు లేని చోట కూడా ఈ పద్ధతిని వాడుకోవచ్చు. వర్షాలు తక్కువగా ఉండే చోట్ల మంచినీటి సమస్యకు ఇది మంచి సమాధానం.
మంచినీటి సరఫరా వ్యవస్థను మరింత బాగా నడపడానికి, గొట్టాలు పగిలి, మరో రకంగానూ వచ్చే లీక్‌లను మరింత సులభంగా గుర్తించడానికి కూడా మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీటిని వాడుకుంటున్న, సరఫరా చేస్తున్న పద్ధతులను కంప్యూటర్లద్వారా పరిశీలించగలిగితే, సులభంగా సమస్యలు తెలుస్తాయి. సమస్యలకు, అంతే సులభంగా సమాధానాలు తెలుస్తాయి. లీకులుంటే క్షణాల్లో వాటి చోటు, తీరు తెలిసిపోతుంది. వెంటనె తగిన ఏర్పాట్లు చేయవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రకం కంప్యూటర్ ప్రోగ్రాములను మంగోలియా, లిబియా, సౌదీ అరేబియాలంటి దేశాలలో వాడుతున్నారు. వారికి నీళ్లు కరువు. నీటి విలువ బాగా తెలుసు. కనుక వారు త్వరగా మేలుకున్నారు. మంచి పద్ధతులను వాడుతున్నారు. మన దేశంలో, ఈ ఆలోచన త్వరలోనే వస్తే, పరిస్థితి చేయిదాటకముందే అదుపులోకి వస్తుంది.
మన దేశంలోగానీ, మరెక్కడయినా గానీ, గొట్టాలలో చాలాభాగం నీరు లీకుల కారణంగా మట్టిపాలవుతుంది. గొట్టం పైకి కనిపించేదయితే వీలుగా దానికి రంధ్రంపెట్టి, నీటిని మరోవేపు మరలించిన దాఖలాలూ మన దగ్గర ఉన్నాయి. మొత్తానికి ప్రభుత్వ ధనంలాగే, నీరు కూడా చివరన అందవలసిన వాటికి అందదని అర్థం. అల్ట్రాసౌండ్, ఇంటలిజెంట్ సెన్సర్స్ సాయంతో వీటి పరిస్థితిని గుర్తించే పద్ధతులున్నాయి. ఈ రకంగా మంచినీటి వ్యవస్థలో, పారిశుద్ధ్య వ్యవస్థలోనూ గొట్టాలలో లోపాలనూ, లీకులనూ సులభంగా కనుగొని, తగిన ఏర్పాట్లు చేయవచ్చు.
నీటిని శుభ్రపరచడంలో వజ్రాన్ని వాడుకునే పద్ధతి ఒకటి వచ్చింది. డైమండ్ కోటెడ్ ఎలక్ట్రోడ్‌లను నీటిలోకి ప్రవేశపెడితే, సూక్ష్మజీవులు, విషరసాయనాలు మొదలు, కార్బన్ ఉండే ఏ కాలుష్య పదార్థాన్నయినా అవి ఆకర్షిస్తాయి. నీటిలో కొన్ని రకాల లవణాలు, కార్బన్ డయాక్సయిడ్ మాత్రం మిగులుతాయి. వాటివల్ల ఆరోగ్యానికి ఏ రకంగానూ నష్టం జరగదు. ఈ పద్ధతితో సులభంగా కాలుష్యం, సూక్ష్మజీవులు లేని నీటిని తయారుచేసుకోవచ్చు.
పరిశ్రమల నుంచి బయటపడే నీటిలో హెవీ మెటల్స్, విషరసాయనాలు, రకరకాల సంక్లిష్ట రసాయనాలు కలిగి ఉంటాయి సమస్యలు రావడం తెలిసిందే. ఈ రకం నీటిని వదిలించుకోవడం నిజంగానే కష్టం. పరిశోధకులు ఇందుకు కూడా తగిన మార్గాలు తయారుచేశారు.
నీరు ప్రాణాధారం! నీరు లేనిదే మన మనుగడ లేదు. సరైన సమయంలో మనం నీటిని గురించి పట్టించుకోకుంటే భవిష్యత్తు నరకమవుతుంది.
‘కింగ్’ పెంగ్విన్స్.
November 1st, 2010
పెంగ్విన్‌లో చక్రవర్తులున్నాయి. సహజంగానే ఎంపరర్ పెంగ్విన్స్ ఆకారంలో అన్నిటికన్నా పెద్దవి. ఆ తర్వాత వచ్చేవి ‘కింగ్’ పెంగ్విన్స్, ఇవి ఒక్కొక్కటి మూడు అడుగుల ఎత్తు, 30 పౌండ్ల బరువు ఉంటాయి. ఇలాంటి పెంగ్విన్‌లను ఒకే చోట సుమారు 20 లక్షల వరకు చూడాలంటే, అంటార్కిటాకు ఉత్తరంగా 1400 మైళ్ల దూరంలోని క్రోజెట్ ద్వీప సమూహంలోని పొజెషన్ దీవికి వెళ్లాలి.
అక్కడికి చేరకముందే బడివదిలిన తర్వాత పిల్లల గోలలాగ పెద్ద రొద వినపడుతుంది. బడిలోలాగే అరుపులు, కీచులాటలు, సమరస సంభాషణలు అన్నీ ఉంటాయి. దీవికి మరింత దగ్గరవుతుంటే, ముక్కులు అదిరిపోయే తీరుగా వాసన మొదలవుతుంది. కుళ్లిన చేపల కంపుతో కలిసి, పెంగ్విన్‌ల రెట్ట (గ్వానో)నుంచి అమోనియా ఘాటు! చెవులు, ముక్కులకు ముందుగా రాజుల సంగతి తెలుస్తుంది.
మరింత దగ్గరగా పోయి, దీవిలో, సముద్రానికి దగ్గరగా వుండే ఒక లోయలోకి చూడగలిగితే మన కళ్లను మనం నమ్మలేని దృశ్యం కనపడుతుంది. రాజకీయ సభనో, సంగీత కార్యక్రమాన్నో చూడడానికి వచ్చి, క్రమశిక్షణగా నిలబడిన జనంలాగ లోయలో వేలకు వేలు పెంగ్విన్‌లు కిటకిటగా నిలబడి ఉంటాయి. దక్షిణార్ధగోళంలో వేసంగి కాలం వచ్చిందంటే కింగ్ పెంగ్విన్స్ జంటకట్టి పిల్లలను కనడానికి, ఈ దీవికి వచ్చి మూడు నెలలు గడుపుతాయి. పెంగ్విన్ల కాళ్లు చాలా చిన్నవి. శరీరం పెద్దది. అవి నీటిలోనైతే చాలా చలాకీగా కదలగలవు. కానీ, వాటికి నేలమీద నడవడం, ఈ తరుణంలో తప్పదు. కింగ్ పెంగ్విన్‌ల తల, ముక్కు, మెడ, ఎదల మీద అందమైన నారింజరంగు ఉంటుంది.
ఈ అందమైన ప్రాణులు పొజెషన్ దీవుల్లో పిల్లలను కనడానికని ఆరు స్థలాలను ఎంపిక చేసుకున్నాయి. అందులో అన్నిటికన్నా పెద్ద ప్రాంతం 90 ఎకరాలు వుంటుంది. అంత స్థలంలో వేలాది పెంగ్విన్‌న్లు వుండగలుగుతాయంటే, అందులో ఒక రహస్యం ఉంది. ఒక్కొక్క పెంగ్విన్ తనదంటూ, తాను నిలబడేందుకు వీలుగా ఉండే స్థలం దొరికితే సంతృప్తిపడుతుంది. మూడు నెలలూ అక్కడే నిలబడి ఉంటుంది. పెంగ్విన్‌లు వస్తుతః పక్షులే అయినా వీటికి గూడుకట్టే అలవాటు లేదు. సముద్రంనుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట వాటి పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది. ఆ తర్వాత అవి జోడును వెతుక్కుంటాయి. అన్నింటికీ నేస్తం దొరకాలని లేదు!
జంట కట్టినవి ఒకే ఒక గుడ్డు పెడతాయి. ఆడా మగా వంతుల వారీగా ఆ గుడ్డును పొదుగుతాయి. నిలబడే వుండి గుడ్డును రెండు కాళ్ల మధ్యన నిలుపుతాయి. దానిమీద పొట్టనుంచి చర్మం మడత ఒకటి వచ్చి కుప్పుకుంటుంది. గుడ్డులోనుంచి పిల్ల వచ్చి దానికి ఈకలు పెరిగే దాకా, ఈ నిలువుజీతం కొనసాగవలసిందే!
మూడు నెలల కాలం ప్రశాంతంగా గడిస్తే, ఏ సమస్యా ఉండదు. గుడ్లు, పిల్లలను ఎత్తుకుపోవడానికి పెట్రిల్స్, స్కువిజ్ పక్షులు అనుక్షణం ప్రయత్నం చేస్తుంటాయి .వాటిని ముక్కుతో పొడిచి తరుముతుంటాయి పెంగ్విన్లు. వరసగా నిలబడిన నాలుగు గంటల సమయంలోఒక పెంగ్విన్ శత్రువులను రెండువేలసార్లు పొడిచినట్టు పరిశీలకులు గమనించారు. ఇంతయినా లోయలో గందరగోళం మాత్రం లేదని వాళ్లే అంటున్నారు. ‘మిలటరీ కవాతులో నిలబడ్డ జవానుల్లాగ పెంగ్విన్‌లు తమ తమ నెలవుల్లో అలా కొనసాగడం ఆశ్చర్యకరంగా ఉంటుంది’ అన్నారు పరిశీలకులు.
హిందూ మహా సముద్రం, అట్లాంటిక్‌లలో కలిసి మొత్తం ఏడు దీవుల్లో పెంగ్విన్లు, తమకోసం స్థావరాలను ఎంపిక చేసుకున్నాయి. అంటార్కిటికా చల్లని నీరు, ఇవతలి వచ్చే నీరు కలిసే సరిహద్దు ప్రాంతంలో ఈ దీవులున్నాయి. అక్కడ పెంగ్విన్లకు ఆహారం కావలసినంత దొరుకుతుంది. తిండికోసమని బయలుదేరి ఇవి 250 కిలోమీటర్లు ఈదుతాయట. స్క్విడ్, లాంటర్న్‌ఫిష్ అనే సముద్ర జీవులు లోతుల్లోగానీ దొరకవు. అవే పెంగ్విన్ల అభిమాన ఆహారం.
ఈ దీవులు అన్నింటా కలిసి పెంగ్విన్ల ‘జంటల’ సంఖ్య 22 లక్షలు!
వీటికి రానురాను తిండి దొరకడం కష్టమయ్యే సూచనలున్నాయట. ప్రస్తుతం మాత్రం ఈ ‘మహరాజు’లే నయం! మనకన్నా క్రమశిక్షణతో మహరాజుగా బతుకుతున్నాయి!
కాలం కబుర్లు!!
.November 1st, 2010
* శరీరానికి టైం ఎలా తెలుస్తుందో ఎప్పుడైనా ఊహించారా?
* మెదడులోని ‘హైపొతలామస్’ అనే భాగంలో ‘మాస్టర్ క్లాక్’ ఉంటుంది. అక్కడే సమయానికి చెందిన లయ నడుస్తుంది.
* జన్యువులు, ప్రొటీన్ల ద్వారా చర్య మొదలయ్యి, పీనియల్ గ్రంథిలోని మెలటోనిన్ మీద ప్రభావం పుడుతుంది. మనం ఎప్పుడు పడుకోవాలి అనే నిర్ణయం, మెలటోనిన్ ద్వారా జరుగుతుంది.
* ఈ కార్యక్రమం, ఏ మాత్రం పొల్లు పోకుండా కొనసాగుతుంది.
* కానీ మనం ఈ గడియారాన్ని, బయటి ప్రపంచంలోని వెలుతురు, ఇతర విషయాలతో ముడిపెడతాము.
* ఈ రెండు గడియారాలు ఒకే టైంకు చేరడానికి టైం పడుతుంది.
* అందుకే, మరో దేశానికి ప్రయాణించి వెళ్లినవారు ‘జెట్‌లాగ్’కు గురవుతారు. వారి నిద్రకూ, బయటి వెలుతురుకు సంబంధం ఉండదు.
* వెలుగు తెలియకుండా, బంధించి ఎంతకాలం ఉంచినా, ఆ వ్యక్తికి నిద్ర సమయం సక్రమంగా తెలుస్తూనే ఉంటుంది.
ఆశ్చర్యంగా...
* ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు కాలం నెమ్మదిగా నడిచినట్లు అనిపిస్తుంది.
* సరదాగా గడుస్తుంటే, అప్పుడే ఇంతకాలం గడిచిందా అనిపిస్తుంది.
చెట్లు - తుపానులు.
November 1st, 2010
మన ఇళ్లముందు మొదలు, కొండలమీద దాకా రకరకాల, మొక్కలు చెట్లు ఉంటాయి. అటు సముద్రం అడుగున మొదలు, అక్కడి నీటిమీద తేలుతు రకరకాల మొక్కలు ఉంటాయి. సముద్రం నీరు, రంగు రంగులుగా కనిపించడానికి ఈ తేలుతూ ఉండే మరీ చిన్న, ఫైటోప్లాంక్టనే్ల కారణం. అవి తుఫానులకు కూడా కారణం అంటున్నారు పరిశోధకులు.
తుమ్మెద రెక్కలు అల్లాడిస్తే, ప్రపంచంలో మరో మూల తుఫాను పుట్టడం గురించి సిద్ధాం ఉంది. కానీ, అది కేవలం సిద్ధాంతం. ఈ తుఫాను నిజం!
సముద్రం రంగులను గమనించి, రాబోయే తుఫానుల గురించి ముందే వివరాలను సూచించే పద్ధతి వస్తుందని పరిశోధకుల అభిప్రాయం. సముద్రం నీరు, కల్మషం లేకుండా ఉంటే ముదురు నీలం రంగులో కనబడుతుంది. తేలియాడుతుండే ఈ మొక్కలు ఉంటే మాత్రం ఆ నీలం రంగు మురికిగా మారుతుంది. సముద్రంలో బతికే ప్రాణుల ఆహార వలయానికి ఈ మొక్కలే ఆధారమని ముందుగా మనం గుర్తించాలి. ఈ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా, తిండిని సిద్ధం చేస్తేనే, ఆహార వలయం కొనసాగుతుంది.
ఫైటోప్లాంక్టన్ కారణంగా వాతావరణంలో మార్పులుంటాయని తెలుసు కానీ మరీ తుఫానులకు ఇవి కారణమవుతాయన్న ఆలోచన ఈ మధ్యనే పుట్టింది. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఆనంద్ జ్ఞానదేశికన్ అనే పరిశోధకుడు కంప్యూటర్ మాడలింగ్ ద్వారా పరిశోధనలు ప్రారంభించాడు. ఉత్తర పసిఫిక్‌లోని ఒక ప్రాంతం గురించి అతని పరిశోధన సాగింది. ఆ ప్రాంతంలో నీరంతా శుభ్రంగా నీలంగా ఉంటే తుఫానుల తాకిడికి 70 శాతం తగ్గి ఉన్నట్లు తెలిసింది. కానీ, ‘ఇది ఎట్లా జరుగుతుంది?’ అన్నది ప్రశ్న.
నీరు శుభ్రంగా ఉంటే, సూర్యుని వేడిమి, అందులో వంద మీటర్ల లోతు దాకా చొచ్చుకుపోగలుగుతుంది. కానీ, మొక్కలు ఉండే ప్రాంతంలో వేడి అయిదునుంచి పది మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు చేరదు. అంటే, మొక్కలు విస్తరించి ఉన్న ప్రాంతాలలో, పైభాగంలోని నీరు బాగా వేడెక్కుతుందని అర్థం. శుభ్రమైన నీరయితే, ఆ వేడి లోతుదాకా వ్యాపిస్తుంది. వేడి లోతుకు చేరితే అక్కడి ప్రవాహంతో బాటు, అది సముద్రంలో బాగా దూరాలవరకు చేరుతుంది. సముద్రాలలోని నీరు నిరంతరం కదులుతూ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. వేడి అట్లా వ్యాపించిందంటే, పైన సముద్రం చల్లగా ఉంటుందని వేరుగా చెప్పనవసరంలేదు. ఆ చల్లదనం, అక్కడి గాలి కదలికల మీద ప్రభావం చూపిస్తుంది. సముద్రం ఎంత చల్లబడి ఉంటే తుఫానులు అంత తక్కువగా వస్తాయి. గతంలో గుర్తించిన ఉష్ణోగ్రతల రికార్డును, ఆయా సమయాలలో వచ్చిన తుఫానులను పరిశీలించిన తర్వాత, ఈ విషయం నిజమేనని రుజువయింది. అట్లాంటిక్ ప్రాంతంలో వచ్చే తుఫానులకు కూడా, పసిఫిక్ నీటి చల్లదనంతో సంబంధం ఉందని తెలిసింది. చల్లదనానికి, అక్కడ పెరిగే చిన్న మొక్కలకు సంబంధం ఉందని మరింత బాగా తెలిసింది!
గ్లోబల్ వార్మింగ్ కారణంగా, ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నారు. సముద్రాలమీద వేడి పెరిగితే, ఫైటోప్లాంక్టన్ పెరుగుదల అంత బాగా సాగదు. ఈ మొక్కలు, వేడి ఎక్కువయితే పెరగవు. వేడి ఎక్కువయేకొద్దీ తుఫానులు తగ్గుతాయని పరిశోధకుల అభిప్రాయం.
సముద్రం మీద మొక్కల పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలలో వేడిమి ఒకటి. మిగతా అంశాల గురించి ఇంకా పరిశోధనలు జరగాలి.
మొక్కల కారణంగా అనారోగ్యం వస్తుందా?.
November 1st, 2010
మనుషులకు బ్యాక్టీరియా, వైరసులు, బూజు జాతి ఫంగసులు సోకి రకరకాల అనారోగ్యాలు వస్తాయి. చిన్నా పెద్దా జంతువుల కారణంగా వచ్చే అనారోగ్యాలు మామూలే! అయితే, మొక్కల కారణంగా అనారోగ్యం వస్తుందా?
మొక్కల కారణంగా అనారోగ్యం కొత్త ఏమీ కాదు. చాలామందికి పచ్చివేరు శెనగకాయలు తింటే, ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి అవుతుంది. ఇక రకరకాల మొక్కల పుప్పొడి కారణంగా ఉబ్బసం లాంటి జబ్బులకు గురయేవారి సంఖ్య రోజురోజూకూ పెరుగుతున్నది. పిచ్చిమాసుపత్రి లేదా కాంగ్రేసు గడ్డి అనే పార్థీనియం మొక్క ఎంత ఎత్తుంటే అంత ఎత్తూ విషమే. అదేమో పల్లెలు, పట్నాలు తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ పెరుగుతుంది. అమెరికావారు దయతలచి దానం చేసిన గోధుమలతో కలిసి వచ్చిన ఈ మొక్క విత్తనాలు ఇవాళ దేశంలో నలుమూలలా విస్తరించి, తోటల్లాగే పెరుగుతున్నాయి.
మొక్కలను, పాతొజెన్స్, అంటే రోగకారకాలు అనడానికి ఒక ఇబ్బంది ఉంది. అవి శరీరంలోకి ప్రవేశించి, మిగతా రోగకారకాలలాగా పెరగడం కుదరదు. మొక్కలు పెరగాలంటే, లోపల ఎండ ఉండదు కిరణ్యజన్య సంయోగక్రియ వీలుగాదు.
మొక్కలకు సంబంధించిన పదార్థాలు మాత్రమే రోగకారకాలు! 1894లో హెచ్.జి.వెల్స్ అనే రచయిత ‘ద ఫ్లవరింగ్ ఆఫ్ ది స్ట్రేంజ్ ఆర్కిడ్’ అని ఒక కథ రాశాడు. కానీ, అది నిజంగా కల్పన మాత్రమే. ఫెర్న్ జాతి మొక్కలమీది నూగును తింటే కాన్సర్ వస్తుందని పరిశోధకులు గమనించారు. ఆ మొక్కల పుప్పొడితో జలుబు వస్తుంది.
మొక్క మీద పెరిగిన బూజులు, ఇతర ప్రాణులు మనుషులకు సోకి జబ్బులు వస్తాయి. ఇది సాధారణంగా చాలా కాలంగా జరిగేదే!
సూదిగా ఉండే విత్తనాలు కొన్ని జంతుల వెంట్రుకల ద్వారా వాటి శరీరాల్లోకి చేరుకుంటాయి. అలా మనుషుల విషయంలోనూ జరగవచ్చు. దక్షిణ ఆఫ్రికాలో ఒక అమ్మాయి కిడ్నీలోకి అలాంటి విత్తనం ఒకటి చేరి అక్కడ పెరగడం మొదలుపెట్టింది. కానీ మొక్కల విత్తనాలు పెద్దవిగనుక అంత సులభంగా జంతువులు, మనుషుల శరీరాలలోకి చేరజాలవు.
ఒక పెద్దమనిషి ఊపిరితిత్తులలో ఫర్‌చెట్టు పెరుగుతున్నదన్న వార్త ఈ మధ్యన బాగా ప్రచారంలోకి వచ్చింది. అతను పైన్ చెట్లను నరుకుతున్న సమయంలో ఒక విత్తనం ఊపిరితిత్తుల్లో చేరింది. అది పెరుగుతుంటే దాని చుట్టూ సిస్ట్ పెరగసాగింది. కాన్సర్ అన్న అనుమానంతో ఆపరేషన్ చేసి తీస్తే అందులో చిన్న మొక్క కనిపించింది. ఇది ఇంగ్లాండ్‌లో జరిగింది.
ఇంగ్లండ్‌లోనే మరొక వ్యక్తి, ముఖమంతా నొప్పితో కొంతకాలం బాధపడ్డాడు. బాగా పరిశీలిస్తే ఒక టమాటా విత్తు అతని ఆంగిట్లో ఇరికి అక్కడే మొలకెత్తిందని తెలిసింది. మొక్కలు నేరుగా అనారోగ్యానికి కారణాలవుతాయని మాత్రం చెప్పడానికి లేదు!