Tuesday, February 24, 2026

లోకాభిరామం : మాటా - మంతీ On languages and speaking.


లోకాభిరామం : మాటా - మంతీ 

On languages and speaking.


మాటా - మంతి

మాట అంటే ఏమిటో తెలుసు. మంతి అంటే ఏమిటో తెలియదు. ప్రాసగా ఉంటుందని బహుశా మాటతోబాటు మంతి అని చేర్చి ఉంటారు. బాపుగారు వేసిన ఒక కార్టూన్‌ గుర్తుకు వస్తుంది. ఒక పెద్దాయన చేతికి కట్టుగట్టుకుని దీనంగా ఉంటాడు. అతని మిత్రుడు ఏమిటి? అన్నట్టు చూస్తుంటాడు. “కూర ఏమిటి అన్నాను. మా ఆవిడ కంద అంది. ప్రాస కుదిరింది కదా అని నీ బొంద అన్నాను” అన్న అక్షరాలు బుడగలో ఉంటాయి. మీకు ఈ మాటలు అర్థమయ్యాయి, నవ్వు కూడా వచ్చిందని నమ్మకంగా ఉంది.
ఇంతకూ, మీకు ఏమి అర్థమయింది? ఎందుకు అర్థమయింది? తరువాత నవ్వు వచ్చి, గిచ్చి ఉంటే ఎందుకు వచ్చి చచ్చింది? పుచ్చు ప్రశ్న అనకండి. చదువుతూ పొండి. అంటే వింటూ పొండి. మెచ్చుకోవడం గురించి తరువాత ఆలోచిద్దాం.
మీరేదో చప్పుడు చేస్తారు. ఎదురుగా ఉన్నవాళ్లు అర్థమయినట్టు ఏదో చేస్తారు. మీరు చేసిన అన్ని ధ్వనులూ అందరికి
అర్థమవుతున్నయా? కొన్ని ధ్వనులను, అర్థం ఉండే ధ్వనులను అంటే, మాటలను మాత్రమే మీ పక్కనున్న వారు అర్ధం చేసుకుంటున్నారా? ఆలోచించండి. బుర్రను చించండి.
మనిషి శరీరంలో, ప్రత్యేకంగా గొంతులో ధ్వనులను పుట్టించే వీలున్నది. మాట అన్నది ఉన్నదన్న సంగతి తెలియనినాడు మనిషి అన్నవాడు తన భావాలను సైగలతోనే చెప్పుకుని ఉంటాడు. ఆ తరువాత మూలుగులు, కేకలు, మొదలయి ఉంటాయి. జంట అక్షరాలు, మరిన్ని పెద్ద పదాలు పుట్టి ఉంటాయి. క్షమించండి, నాకు భాష పుట్టుక గురించి ముక్క తెలియదు. ఆలోచించడం, ఊహించడం కొంత చేతనవుతుంది. కనుక, ఏదేదో చెప్పేస్తున్నాను. పాత మానవుడుగాని, ఇక మీరు అనే కొత్త మానవుడుగాని మాట్లాడి ఎదుటివారు అర్ధంచేసుకోవాలని అనుకుంటే, ఒక మాటకు మీరనుకున్న అర్థమే ఎదుటి మనిషి మెదడులోని నిఘంటువులో కూడా ఉండి తీరాలి. సూటిగా ఒక్కమాటలో చెప్పాలంటే, ఇద్దరికీ ఒక భాష, ఒకే భాష తెలిసి ఉండాలి. ఒకే భాషలో ఒకే మాటకు రకరకాల అర్థాలు ఉండే పరిస్థితి దాకా ఇప్పుడు మనం పోనవసరం లేదు. భాష అంటే మాటలకు అర్థాలు ఒకేరకంగా తోచే ధ్వనుల పద్ధతి అనవచ్చా? నేనయితే అంటున్నాను.
అర్థం అని సులభంగానే ఉంటున్నాము గాని, అభివృద్ధిచెందిన భాషలలో కూడా ఒకే అర్ధం ఉన్న మాటకు బోలెడు అర్థాలు ఇవాళిటికీ తోస్తున్నాయి. అంటే, భాష అన్నది చేతికి అందే ఒక పదార్థం కాదు. ఏ చెట్టు మీదా కాయడం లేదు. అంతరిక్షంలో అంతకన్నా లేదు. ఎవరో 'చెప్పు' అన్నారనుకుందాము. ఆ రెండు అక్షరాలు ఒక పదార్థం. అవి రెండూ కలిసి గాలిలో అలలను పుట్టించాయి. అలలు వచ్చి వినేవాళ్ల చెవులకు తగిలాయి. అక్కడ అణువులు కదిలాయి. నాడులు పనిచేశాయి. మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. విన్నది ఎవరన్నదాన్ని బట్టి, మాట అర్థం వేరు వేరుగా తోస్తుంది. సైంటిస్ట్‌కు మొట్టమొదలు ఆ రెండు అక్షరాలు ఒక ధ్వనిగా తోస్తాయి. అది పుట్టిన చోటు తెలుస్తుంది. కదిలిన తీరు తెలుస్తుంది. అలల నిడివి పట్టి ఆడ, మగ గొంతు తేడా తెలుస్తుంది. వయసు తేడా తెలుస్తుంది. వీటన్నిటిలో టార్చ్‌ వేసి వెతికినా, మాట అర్ధం మాత్రం తెలియదు.
చెప్పు” అన్న ఈ శబ్దానికి అర్ధం కూడా ఉండి తీరాలి. ఉంది మరి. అర్ధం ధ్వనిలో లేదని అర్థమయింది. ఆ పరమార్థం
మరెక్కడో ఉంది. అది మెదడులో ఉంది. అర్థమయ్యే తీరునుబట్టి ‘ఏం చెప్పమంటావు?' అన్న జవాబు రావచ్చు. “ఒకటా రెండా? చెప్పు ఏమిటి? జత ఉండాలికాని!' అన్న జవాబు కూడా రావచ్చు. జవాబు రాకుండానే జయలలిత గారి చెప్పుల దృశ్యం మనసులో మెదిలి ఉండవచ్చుకూడ. బాటకాని బాటావాని అంగడి గుర్తుకు వచ్చి ఉండవచ్చు కూడా. దారి పక్కన కూర్చుని తన పని తాను చేసుకుంటున్న ముసలి మోచీ తాత గుర్తుకు రావచ్చు కూడా! అన్నది ఒక్క మాట. కానీ ఎన్నెన్నో దృశ్యాలు, ఎన్నెన్నో ఆలోచనలు!
పుట్టిన దృశ్యాలు, ఆలోచనలు అన్ని కలిసి తెలుగులోనే తిరుగుతున్నాయి. ఇక మరొక భాష గురించి కూడా ఆలోచిస్తేఏమవుతుందో చెప్పలేము. చెప్పు అన్న మాటకు ప్రపంచభాషలలో మరెక్కడయినా వేరు అర్థాలు ఉన్నాయేమో వెతకాలి. వెతకడం చేతగావాలేగాని తప్పకుండా ఉండే ఉంటాయి. గొప్ప వైవిధ్యం వీలవుతుందనుకున్న మనిషి గొంతు కూడా పుట్టించగలిగేది కొన్ని మాటలను మాత్రమే. కనుక దేశ కాలాలనుబట్టి ప్రపంచంలో మూలలలో ఎక్కడో ఈ మాటకు మరొక అర్థం ఉండనే ఉంటుంది. కనీసం ఇలాగే వినిపించే మాటలు కొన్ని ఉండే ఉంటాయి. వాటన్నింటికి అర్ధం మనకు తెలియక పోవచ్చు.
స్వాప్‌” అని ఒక మాట ఉంది. ఇంకో మాట ఏదో ఉంది. వీటికి అర్ధం తెలియదంటే మన చెవులు సరిగా పని చేయడం లేదని మాత్రం అర్ధం కానేకాదు. చెవులకు తెలిసేది ధ్వని మాత్రమే. అది భౌతికమయిన విషయం. ఆ మాటలను వేరు వేరు రకాలుగా అన్నా సరే, వినబడి తీరుతుంది. మరి వాటికి ఉండే అర్ధం లేదా అర్థాలు మాత్రం చేతికి అందే సంగతులు కావుకదా?
తెలియని భాషలో ఎవరయినా ఒక ప్రశ్న అడిగితే, వినిపించినా సరే వినిపించనట్టు బేల ముఖం వేయడం తప్ప మనం చేయగలిగింది మరొకటి ఉండదు. దాస్‌ తో కలకత్తా వీధులలో తిరుగుతున్నాను. దూరంగా ఎత్తయిన భవనం మీద ఒక హోర్డింగ్‌ కనిపించింది. అందులో తాటికాయలను, తలకాయలను తలదన్నే రీతిలో కారు సైజు కాదంటే గుడిసె సైజులో పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. “సాధనా షధాలయ్‌' అని గట్టిగానే చదివాను. దాస్‌ ఎగిరిపడినంత పనిచేశాడు. “నీకు బెంగాలీ వచ్చా?” అని అడిగాడు. అడిగింది మాత్రం బెంగాలీలో కాదని మనవి. నాకు బెంగాలీ రాదు. ఖంగాళీ అంతకన్నా రాదు. అంతోకొంతో హిందీ వచ్చు. కనుక నాగరి అక్షరాలు తెలుసు. బెంగాలీ అక్షరాలు నాగరిలోలాగే ఉన్నాయి. ఇంతకూ దాస్‌ నన్ను ఏ భాషలో ప్రశ్న అడిగి ఉంటాడు? ఆలోచించండి చూద్దాం! అది కలకత్తా అని చెప్పి పూర్వ రంగం వేశాను. మనిషికి దాస్‌ అని పేరు పెట్టి మరింత బెంగాలీ రంగు పూశాను. ఆ బెంగాలీ మనిషికి నా మాతృభాష అయిన తెలుగు వచ్చి ఉండే అవకాశం చాలా తక్కువ. వస్తే గిస్తే మా ఇద్దరికీ కలిసి ఇంగిలీషు లేదంటే హిందీ వచ్చి ఉంటాయి. దాస్‌ తప్పకుండా ఈ రెంటిలోనూ ఏదో ఒక భాషలో అడిగి ఉంటాడు అని సులభంగానే ఊహించవచ్చు.
నేను పిల్లిని సంచీలోనుంచి బయటకు వదిలేశాను. అంటే, రహస్యమేదో చెప్పేశాను. పిల్లిని సంచీలోనుంచి వదలడం అంటే రహస్యం చెప్పడం అని అర్థం వచ్చే తీరు తెలుగు భాషలో లేదు. అది ఇంగ్లీషులో మాత్రమే ఉంది. ఇంగ్లీషు ప్రభావంతో ఇటువంటి మాటలు మనం కూడా నేర్చుకుని వాడేసుకుంటున్నాము. మంచి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికమీద చేస్తున్నాము. వార్‌ ఫూటింగ్‌ అన్న మాట అసలు సిసలు ఇంగ్లీషు పద్ధతి. ఎక్సర్‌సైజ్‌ కూడా ఇంగ్లీషు మాటే. దానికి ఒక పని లేదా ప్రయత్నం అని అర్ధం. మాటకు ఉన్న నానార్థాలలో వ్యాయామం, కసరత్తు అనేవి కూడా ఉన్నాయి. బహుమతికి ఒక వ్యక్తిని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలయింది అని వాక్యం రాస్తున్నారు. ఇక్కడ రాసిన వాళ్లు ఎక్సర్‌సైజ్‌ అనే మాటకు కసరత్తు అన్న అర్థాన్ని అసందర్భంగా వాడుకుంటున్నారని వేరే చెప్పాలా? ఇంతకు మనం అనగా నేను, తరువాత మీరు కొమ్మలు దూకినట్టున్నాము. అనగా శాఖాచంక్రమణము చేసితిమని అర్థము. అనగా అసలు విషయము వదిలి ఎక్కడో పక్కకు కదిలితిమని అర్ధము. కావున, అనగా, అనగా తిరిగి పాతకొమ్మకు చేరుదము గాక!




 

Monday, February 23, 2026

ఆలోచన - అవసరం వ్యాసం


ఆలోచన - అవసరం వ్యాసం


ఆలోచన

తెలివి తెలిసి తెలియక ముందే బడిలో పడేస్తరు. పంతులు చెప్పిందే చదువు అన్న పద్ధతి అక్కడనే మొదలవుతుంది. భాషలు నేర్పుతరు. రాత, చదువు రావాలంటే అదే కదా మరి ఆధారము! లెక్కలు కొంతవరకు నేర్పుతరు. ఇంకా సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలైన పాత సంగతులు చెబుతరు. అన్నింటికి మించి చెప్పింది గుర్తుంచుకోవాలె అన్నది మొదటి పాఠం. వాటిని పరీక్షలో అప్పచెపితే మార్కులు వస్తయి. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత గొప్ప లెక్క. ఈ గొప్ప వాండ్ల బతుకులు తరువాత ఎంత బాగ సాగుతున్నయి అన్న సంగతి ఎవరికి పట్టదు. మొత్తం మీద ప్రశ్న అడుగగూడదు. లేనివి ఊహించగూడదు. ఆలోచన అసలే కూడదు. ఈ స్వంత ఆలోచన అన్న పద్ధతి ఏ బడిలోనన్న, ఏ కోర్సులోనన్న నేర్పుతున్నరా? అనుమానమే.

యద్భావం తద్భవతి అని ఒక మాట ఉన్నది. ఏది భావించితే అదే జరుగుతుంది. నీకోసం ఆలోచనే లేకపోతే ఆ సంగతి మరి వాస్తవము అయ్యే మార్గమేమి?

సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము అన్ని తమంతతాము వచ్చి మన ఎదురుగ నిలిచినయా? అన్ని మనిషి అనుభవములో నుంచి వచ్చినవే గదా? వాటికి ఆధారమైన ఆ పద్ధతులు ఎంతమంది వాడుకుంటున్నరు? మొట్టమొదట పరిశీలన. ఎవరంతకు వారు గాక, కొంతమంది మనుషులు ఒకచోట కలిసి ఉంటే, తంటాలు పుడతయి. అందరూ ఒకే రకంగ అర్థం చేసుకోరు. అందరూ ఒకే రకంగ ఆలోచించరు. కనుక ప్రతి సంగతి గురించి వేరువేరు అభిప్రాయాలు పుడతయి. వాటిలో అనుకూలమైనవి, అనుసరించదగినవి ఏవి అనే నిర్ణయము ఆలోచనతో మాత్రమే వీలవుతుంది. ఎక్కువమంది అవునన్నది శాస్త్రము అవుతుంది. ఆ పద్ధతిని మార్చవలసిన పరిస్థితి వస్తే, మళ్ల ఆలోచన మొదటికి చేరుతుంది. సైన్స్ అయినా, మతం అయినా అంతే!

మనిషి మొదటి నుంచి, పరిశీలన, ప్రయోగము, చర్చ, నిష్కర్ష, అనే పద్ధతులతో ఎంతో తెలివిని జమ చేసుకున్నడు. రాను రాను బతుకు మారింది. అనుభవం పెరిగింది. పొద్దు పొడిస్తే వెలుతురవుతుంది. రాత్రి అయితే చీకటవుతుంది. ఈ సంగతిని మొదట్లో గమనించిన మనుషుల భావములను గురించి ఆలోచించండి. నిన్న మొన్నటి వరకు సూర్యోదయము, అస్తమానము గురించి అందరికీ ఒకే ఆలోచన. ఈమధ్య పిల్లలకు సూర్యోదయము అబద్ధము. మనమే భూమితో పాటు తిరుగుతము. వెలుగులోకి మరొకసారి వస్తము అన్న సంగతి అర్థమయింది. భూగోళము బొంగరమువలె తన చుట్టూ తాను తిరుగుతున్నది. అంటే, ఇవాళటికి అందరికీ నమ్మకము కలుగదు. మరి మనమెందుకు తిరుగుతు లేము? అని అడిగినవారు కొంత తెలివిని వాడినట్టు లెక్క. ప్రశ్నలు మరింత ముందుకు సాగితే మరెన్నో సంగతులు తెలుస్తయి. అవునా? అవునుగదా? అనిపిస్తుంది. ఆనందం అది సాటిలేనిది. అనుమానాలు, ప్రయోగాలు, ప్రశ్నలు, పరిశీలనలు, నిర్ణయాలు జరుగుతయి. కొత్త సంగతులు ఎన్నో అర్థమవుతయి.

కొంతమంది, మరింత తెలివిగ ఆలోచించి, మరింత ముందుకు నడిచి, ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తరు. వారికి కలిగే భావనలు, మొత్తం ప్రపంచాన్ని ముందుకు నడపగలుగుతయి. ప్రపంచం మారుతుంది. కొత్త అనుభవాలు తోడవుతయి. మళ్ళా ప్రశ్న, ప్రయోగం, ప్రయత్నం కొత్త భావనల వరుస! ఈ రకంగనే కదా! ఇవాళ ప్రపంచం ఈ పరిస్థితికి చేరింది?

ఒక్కసారి వెనుక తిరిగి చూడగలిగితే కథ మరింత ఆసక్తికరమవుతుంది. నూరేండ్లనాటి, అంతకు ముందునాటి, పోనీ 1900ల సంవత్సరము నాటివరకు పోదాము చాలు! అప్పటి దినపత్రిక ఒకటి దొరికింది, దొరికించు కుందము. అందులో రేడియో అనే మాట కనబడదు. ఇప్పటి పేపర్లో రేడియో గురించి ఉండదు. మధ్యలో రేడియో వచ్చింది. అందరికీ సమాచారం, విద్య, అందం పంచింది. దాని రూపు ఇప్పుడు మారిపోయింది. ప్రతి ఫోన్ లో పాటలే, మాటలే, వార్తలే, విశేషాలే.

అలనాటి పత్రికలో సినిమా, మూవీ అనే మాట కనిపించదు. రేడియో, సినిమా, టీవీ అన్ని 1920 తరువాత ఎప్పుడోగాని రాలేదు. వాటిని, వాటి పనితీరును గురించి ఆలోచన గలవారు ఎంతెంతో భావించినందుకు, వాటి తీరు నమ్మరానంత మారింది. సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఉంటే, ప్రపంచమంత జేబులో ఇమిడిపోతుంది, ఇవాళ. కొందరు భావించిన సంగతులు అందరికీ అనుభవంలోకి వచ్చినయి. అనుభవించే వారికంత ఒకనాడయినా, ఏ రకంగా వీలైంది అని అనుమానం, ప్రశ్న వచ్చిందా? రాలేదు. మన చదువు తీరు వలన కలిగిన స్తబ్ధత. ఆనాటి పత్రికలో అప్పుడప్పుడే ఆటోమొబైల్ గురించి ప్రసక్తి వస్తున్నది. ఇవాళ మనిషి వేరు గ్రహాలకు, సౌర మండలం అవతలకు నౌకలను పంపగలుగుతున్నడు. అంటే అంతా, ప్రశ్న, ఆలోచన, భావనల వలననే గదా?

అందరికీ, ఆలోచించే మనసు ఉండాలె. ప్రశ్నలు వాడి సంగతులు అర్థం చేసుకోవాలె. అప్పుడుగాని, ఉన్న అద్భుతాల గురించి అర్థం అవుతుంది. ఓహో! కదా! అనిపిస్తుంది.

1863 లో జూల్స్ వెర్న్ అనే రచయిత ఆలోచించి ఒక నవల రాసినడు. ప్యారిస్ ఇన్ ద ట్వెంటియత్ సెంచురీ, అన్ననవలలో రానున్న కాలంలో పారిస్ నగరంలో ఉండగల అద్భుత జీవితాలను గురించి రాసినడు. కానీ ఆ నవల 130 సంవత్సరాలు మరుగున పడి ఉండిపోయింది. అది 1994లో అచ్చయింది.

రచయిత ఆ నవల రాసిన కాలంలో రాజులు, రాజ్యాలు ఏలుతుండేవారు. రైతులు శ్రమపడి తిండి పండించే వారు. అటు యూఎస్ లోలోపల యుద్ధాలు జరుగుతున్నయి. రచయిత మాత్రం 1960లో పారిస్ నగరంలో ఆకాశాన్ని తాకే, అందాల, అద్దాల భవనాలు ఉన్నట్టు ఊహించుకున్నడు. ఎయిర్ కండిషనింగ్, టెలివిజన్, లిఫ్ట్ లు, రయిళ్లు, పెట్రోల్ వాహనాలు, ఇంచుమించు ఇంటర్నెట్ లాంటి వ్యవస్థ అన్నింటినీ ఊహించినడు. అతని భావనలన్నీ, పూర్తిగా నిజమయినయి. అంతా అతను అనుకున్నట్టే, పుస్తకం ప్రచురించిన నాటికి ప్రపంచం సాగుతున్నది. అదేదో అనుకోకుండా జరిగిన సంగతి కాదు. వెర్న్ తన నవల ఆలోచన కొరకు ఎంతో మందితో మాట్లాడి, ఎంతో సమాచారం సేకరించి, ఆ తర్వాత మాత్రమే రాసినడు.

అతను, మానవుడు చంద్రగోళం మీదకు దిగినట్టు మరొక నవల రాసినడు. ఆ సంగతి నూరేళ్ల తరువాత నిజమయింది. అయితే వెర్న్ తుపాకి మందును ఇంధనంగ వాడుకునే రాకెట్ గురించి రాసినడు. ద్రవ ఇంధనం రాకెట్ అతనికి తోచలేదు. అది మరో డెబ్భయి యేళ్లకు నిజమయింది.

మొత్తానికి కావలసింది ఆలోచన! భావన! కలగంటే అది నిజమవుతుంది!

 

 

 

 

 




 

Friday, February 20, 2026

అగ్గి మనిషి - A story in Telugu about human nature


అగ్గి మనిషి

A story in Telugu about human nature


అగ్గి మనిషి

 

అనగనగనగా ఒకప్పుడు ఒకానొక మనిషి ఉండేవాడు. ఆయనకు నిప్పు తయారు చేయడం తెలిసి ఉండేది. అతనికి గల ఆ అద్భుతమైన శక్తిని చూచి ఆయన ఊరులోని వాళ్ళందరూ ఎంతో అబ్బుర పడేవాళ్లు. అతను మొట్టమొదటిసారిగా నిప్పు తయారు చేశాడు. వాళ్లందరికీ దాని గురించి ఏమనాలో తెలియలేదు. దాంతో ఏం చేసుకోవాలో అంతకన్నా తెలియలేదు. నిజానికి ఉన్న మాట చెప్పాలంటే, వాళ్లందరూ కొంచెం భయపడిపోయారు కూడా.
కానీ, ఈ నిప్పు తయారు చేసే మనిషిని ఏమందాం
అగ్గిమనిషి అందామా, అగ్గిమనిషి తాను తయారు చేసిన నిప్పుతో చలి పుడుతున్నప్పుడు వెచ్చగా ఉండవచ్చునని, చీకటి చుట్టూ అలుముకున్నప్పుడు వెలుగు కోసం దాన్ని వాడవచ్చునని, అట్లాగా మరెన్నో చెప్పాడు. తిండి వండుకోవడానికి మంట పనికి వస్తుంది అని కూడా వాళ్లకు చేసి చూపించాడు. మట్టితో కుండలు తయారు చేసుకోవాలని కూడా చేసి చూపించాడు. ఆ కుండలలో వాళ్ళు తిండి వండుకొని తినవచ్చునని కూడా చూపించాడు. ఆ అడవిలో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, దారి తప్పిపోయాం అనుకున్నప్పుడు, ఈ కొత్త బహుమానాన్ని పెద్ద మంటగా మారిస్తే, దూరంగా ఉండే వాళ్లకు కూడా అది కనబడుతుంది, వీళ్ళు ఎక్కడున్నది అందరికీ తెలుస్తుంది అని, అప్పుడు కాపాడడానికి ఎవరైనా రావడానికి వీలు ఉంటుందని కూడా చెప్పాడు.
అయితే నిప్పుతో కొంచెం తంటాలు కూడా ఉన్నాయి. అజాగ్రత్తగా ఉంటే అది నాశనానికి దారి తీసింది కూడా. కనుక అగ్గిమనిషి అగ్గి అనే అగ్నిని గౌరవంగా, జాగ్రత్తగా వాడుకునే పద్ధతులను కూడా నేర్పించాడు. నిజంగా తెలివిగలిగి వాడుకుంటే, నిప్పు బ్రతుకులను గొప్పగా మారుస్తుంది. ఎవరికి ఎటువంటి హాని ఉండదు. దానివల్ల ప్రపంచంలో దేనికి కూడాను హాని ఉండనవసరం లేదు, అన్నాడు అగ్గిమనిషి.
మొత్తానికి ఈ అగ్గి, నిప్పు, మంటలు గురించి తొందరలోనే చుట్టుపక్కల ఊళ్లవాళ్ళకు అందరికి కూడా వార్త పొక్కిపోయింది. ఆ ప్రాంతంలో అందరికీ సంగతి తెలిసిపోయింది. ఇక అగ్గిమనిషికి కావలసినంత గిరాకీ మొదలయింది. అందరూ అతని దగ్గరికి రాసాగారు. అగ్గిమనిషి అన్ని ఊళ్లకు తిరిగాడు. అవసరమని ముందుకు వచ్చిన వాళ్ళందరికీ తన విద్యను పంచాడు, పెంచాడు. అందరూ నిజంగా ఆశగా నేర్చుకున్నారు. అగ్గిమనిషిని ఎంతో గౌరవంగా చూడసాగారు అందరూ. ఈ మనిషి నిజంగా మామూలు వాడు కాదు. దేవతలు కూడా ఇతన్ని చూచి ఇష్టపడతారు అనుకున్నారు కూడా.
త్వరలోనే సంగతి గురించి ప్రాంతం పెద్దలకు, అధికారులకు తెలిసిపోయింది. ప్రాంతం ప్రభువుకు కూడా తెలిసిపోయింది. అయితే అన్యాయంగా వాళ్ళందరూ వింటున్న విషయాన్ని విచిత్రంగా కాక, వినోదంగా అంతకన్నా కాక, వినాశనం కింద చూడ సాగారు. అగ్గి మనిషేమో అందరికీ, వారు కోరుకున్న మీదనే, తన విద్యను పంచి పెడుతున్నాడు. దాంతో ప్రజలు సుఖంగా, సంతోషంగా, సౌకర్యంగా బతుకుతున్నారు. ప్రజలంతా ప్రభువులను, పెద్దలను కూడా కాదని, అగ్గిమనిషినే అనుసరించ సాగారు. ఇక అనుకున్నట్టే ఆ ప్రాంతంలో అందరికన్నా అతనే గొప్పవాడు అయ్యాడు. అధికారుల పట్టు సడలిపోయింది.
ఇంకేముందీ, వాళ్లంతా ఒక్కచోట చేరి, ఆ మనిషి ఆగడాలను ఆపకుంటే, అంతా మునుగుతుంది, అన్నారు. అయితే అతడిని ఆపడానికి ఎవరికీ తరం కాలేదు. కనుక అంతకన్నా అన్యాయమైన మార్గం ఏదో వాడితే తప్ప పని జరగదని వాళ్లకు అనిపించింది. అగ్గిమనిషి అంతం కావాల్సిందే, అనుకున్నారు వాళ్ళు. నిర్ణయం అయిపోయింది. ప్రభువులు తలిస్తే పని జరగకుండా ఉంటుందా...
ఒక చీకటి రాత్రి ఎక్కడో మారుమూలన వాళ్ళు అగ్గిమనిషిని చుట్టుముట్టి గుట్టుగా మట్టుపెట్టేశారు. అంటే చంపారు. ఇక తరువాత ఎవరైనా నిప్పు తయారు చేసే పని అయితే అది నేరం కింద నమోదు అవుతుందని అంతటా ప్రకటనలు వినిపించారు.
ప్రజలంతా గగ్గోలు పడిపోయారు. ఎవరు ధైర్యం చేసి అధికారులను ఎదిరించడానికి వీలు లేకపోయింది. అగ్గిమనిషి లేకపోవడం గురించి అందరూ ఆలోచించారు. చర్చించారు. మనసులోనే కుమిలిపోతున్నారు. అయితే ఈ లోపల అతను నేర్పిన విద్య గురించి మాత్రం అందరికీ మరుపు వచ్చేసింది. ఏ పనైనా చేస్తుంటే గాని, అలవాటవుతుంది. అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, నిజంగానే మరపు వచ్చేస్తుంది. అందరూ అగ్గి తయారు చేయడం మర్చిపోయారు, కానీ అగ్గిమనిషిని మాత్రం మరువలేదు.
ప్రభువులు, పెద్దమనుషులు అందరూ ఒకచోట చేరి, ప్రజల గురించి ఏం చేయాలని మంతనాలు చేశారు. అపాయానికి కారణమయ్యే ఒక మనిషిని గురించి, అంతగా దిగులు పడిపోతున్న ప్రజలను, మరో మార్గంలోకి నడిపించేందుకు, పథకాలు వేశారు. తగిన గౌరవం జరగాలంటే అగ్గిమనిషికి అంతటా గుడులు కట్టించాలి, అని ప్రజలకు సలహాలు ఇచ్చారు. కనుక ఊరూరా అగ్గిమనిషి గుడి వచ్చేసింది. ప్రజలంతా ఆ గుడులను అన్ని రకాల అలంకరించి పువ్వులు, పూజలతో, రంగురంగుల చిత్రాలతో, విగ్రహాలతో నింపేశారు. వీలున్నప్పుడంతా, అక్కడ చేరి అగ్గిమనిషిని గురించి భజనలలాగ పాడసాగారు. నిప్పు గురించి అతను ఒకప్పుడు చెప్పిన సంగతులన్నింటినీ పుస్తకాలలో రాసుకున్నారు. సమూహంగా చేరినప్పుడంతా ఆ పుస్తకాలను పారాయణం చేయసాగారు. మొత్తానికి అధికారులు మాత్రం చింత లేకుండా ఉంటున్నారు. అగ్నిని వాళ్ళు అదుపు చేసినట్టు భావించసాగారు.
పాపం ప్రజలు మాత్రం రాత్రులలో చలి బాధకు గురవుతున్నారు. చల్లని తిండి తింటున్నారు. హాయిగా మంట చుట్టూ నాట్యం చేస్తూ ఆడే వీలు లేకుండా, అదోరకంగా బతుకుతున్నారు.
అగ్గిమనిషి పట్ల వారిలోని విధేయత మాత్రం అణువంత కూడా తగ్గలేదు. ఆ రకంగా ఎంతోకాలం గడిచింది. ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. కానీ, ఎక్కడా అగ్గి, నిప్పు, మంట మాత్రం అడుక్కున్నా కనిపించడం లేదు.




 

Thursday, February 19, 2026

గౌతముడు - గణితం : Buddha and Mathematics


గౌతముడు - గణితం

Buddha and Mathematics


గౌతముడు - గణితం

యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ నంబర్స్ అని ఒక పుస్తకం. రచయిత పేరు జార్జెస్ ఇఫ్రా. అందులో గౌతముడు (తరువాత గౌతమ బుద్ధుడు) చూపిన గణిత నైపుణ్యం గురించి ఒక కథ. కథలలిత విస్తార సూత్రఅనే పుస్తకంలోనుంచి తీసినదట.

గౌతముడు గోప అనే అమ్మాయి కోసం మిగతా యువకులతో పోటీ పడ్డాడని కథలో చెప్పారు. కానీ అది మనకు ఇక్కడ అంత ముఖ్యం కాదు. సిద్ధార్థుడు, అంటే గౌతముడు అర్జునుడు అనే లెక్కల నిపుణునితో పోటీ పడ్డాడు. పోటీలో ఏమి చెయవలె? ‘ఒక పెద్ద అంకెను, ఒక మరీమరీ చిన్న అంకెను గణించి చెప్పవలె!’ ‘ పని అంత కష్టమాఅని ప్రశ్న. ఒక యోజనాన్ని విభజిస్తూ పోయి చివరకు అణువు పరిమాణం వరకు చెప్పడం కష్టమే!

యోజనం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు కూడా మరో ఇంగ్లీషు పుస్తకంలో జవాబు దొరికింది. పుస్తకంపేరుహియర్ ఈజ్ లుకింగ్ అట్ యూక్లిడ్. రచయిత అలెక్స్ బెలోస్. యోజనమన్నది పాతకాలంలోని నిడివి కొలత అని, అది సుమారు పది కిలోమీటర్లకు సమం అవుతుందని బెలోస్ చెప్పాడు. ఇప్ప్పుడు అసలు ప్రశ్నపది కిలోమీటర్లలో ఎన్ని అణువులను పరచవచ్చు?’ అని వస్తుంది.

ప్రశ్నకు గౌతముడు ఇచ్చిన జవాబు. (ఇది బహుశః సంస్కృత శ్లోకాలలో ఉండి ఉంటుంది.కానీ ఆంగ్లరూపం మాత్రమే దొరికింది.)

యోజనములో నాలుగు క్రోశములు

క్రోశములో వెయ్యి చాపములు,

చాపములో నాలుగు మూరలు

మూరలో రెండు జానలు

జానలో పన్నెండు కణుపులు

కణుపులో ఏడు గింజలు

గింజలో ఏడు ఆవగింజలు

ఆవగింజలో ఏడు గోధూళి కణాలు

గోధూళి కణంలో ఏడు గొర్రెదుమ్ము కణాలు

గొర్రెదుమ్ము కణంలో ఏడు కుందేటి దుమ్ము కణాలు

కుందేటి దుమ్ము కణంలో ఏడు గాలిలో తేలే దుమ్ము కణాలు

దుమ్ము కణంలో ఏడు మరింత చిన్న దుమ్ము కణాలు.

అందులో ఏడు మరింత సూక్ష్మమయిన ధూళి కణాలు, అందులో ఏడు అణువులు!

లెక్కన చూస్తే గౌతముడు అణువు పరిమాణాన్ని చాలా దగ్గరగా అంటే, ప్రస్తుతం మనకు తెలిసిన అణువు పరిమాణానికి దగ్గరగా సూచించాడని రచయితలు అభిప్రాయపడ్డారు. వాళ్లకు లెక్కలోని మొదటి కొలతల కన్నా వేలి కణుపుల తర్వాతి భాగం సులభంగా అర్థమయ్యింది. ‘ఒక వేలు నాలుగు సెంటి మీటర్లు పొడుగు ఉంది అనుకుందాం. నాలుగు సెంటి మీటర్లను 7తో పదిసార్లు విభజించాలి. అంటే 0.04 మీ I 7 టు పవర్ ఆఫ్ మైనస్ 10. లెక్క తీస్తే ఒక విలువ 0.000 000 000 01416 మీటర్లు. ఇది ఇంచుమించు కార్బన్ అణువు పరిమాణానికి సమానం! లెక్కను గణిత నిపుణులే తేల్చారు.

గౌతమునికి ఆధ్యాత్మిక దృష్టితో బాటు అంతకన్నా నిశితంగా ప్రపంచ దృష్టి, శాస్త్ర దృష్టి ఉండేదన్నమాట. కథ, లెక్క, ఎక్కడయినా మన పుస్తకాల్లో వచ్చిందా, అన్న అనుమానం మాత్రం ఇంకా మిగిలే ఉంది. పాశ్చాత్యుల దృష్టిలో, ఆనాటి భారతదేశానికి రకమయిన లెక్కల గురించి ధ్యాసే లేదని కద! భారతీయులంతా అంతర్ముఖులయి, తత్వం గురించి మాత్రమే పట్టించుకున్నారని ప్రపంచానికి ఒక ధారణ ఉంది. కానీ వారు పదార్థ ప్రపంచ తత్వం గురించి కూడా ఇంతగా ఆలోచించారన్నది, పాశ్చాత్యులకే కాదు మనకూ ఆశ్చర్యం లగజేస్తుంది.

ఇంత గణితం చెప్పిన సంస్కృతి నుంచి బౌద్ధం వంటి సిద్ధాంతం కూడా రావడం అసలు గుర్తించవలసిన విషయం. కథలో, లెక్కలో పాశ్చాత్యులను గొప్పగా ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. సూక్ష్మాన్ని కేవలంసూక్ష్మంఅని చెప్పి వదలక, దాన్ని రకరకాల కొలతలలో చెప్పడం నిజంగా మనకూ ఆశ్చర్యం కలిగించే అంశమే. గోధూళి, మేష ధూళి, శశక ధూళి అనే కొలతలు ఎంతమందికి తెలుసు? ఇందులో గణితంతోబాటు ఒక రకమయిన కవితా ధోరణి కనబడుతుంది. విభజన గణితంలో గొప్ప మిస్టరీ ఉంది. గొప్ప అందం ఉంది.

నాటి రసాయన శాస్త్రంలో కూడా మరీ చిన్న పరిమాణంగా క్వార్కు గురించి చెపుతుంటారు. పేరుజేమ్స్ జాయ్స్అనే రచయిత నుంచి వచ్చిందని ఎంత మందికి తెలుసు?