Sunday, July 19, 2026

దారి దోపిడీ : మారూన్ అబ్బూద్

 


దారి దోపిడి

 

మారున్ అబ్బూద్ (లెబనాన్)

 

బూ ఖట్టర్ దుమ్ము కొట్టుకుని, జుట్టు, గుడ్డలు రేపుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. రైఫిల్ ను దాని స్థానంలో వెళ్ళాడదీశాడు. పిస్టల్ పక్కనే ఉన్న గూట్లో పెట్టాడు. చొక్కాలో, జేబుల్లో, పటకాలో దాచుకున్న వస్తువులను షెల్ఫ్ లోని బండమీద బోర్లించాడు. కాళ్లు ముడుచుకుని కూచున్నాడు. పొయ్యి పక్కనే అతను మామూలుగా కూచునే స్థలం అది.

భార్య బర్ సిత్తా ఒక జగ్, ఒక పళ్లెం తీసుకుని వచ్చింది. అతను అక్కడే తల వెంట్రుకలు, ముఖం కడుక్కోసాగాడు. అయితే అంత సేపు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఆపి ఆమెను ఒక ప్రశ్న అడుగుతాడు. ముఖం మీద నరుగును పట్టించుకోడు. పైకి చూస్తే, అది అతని కళ్ళలోకి పోయి మండుతుంది. కళ్ళు మూసుకుని మళ్లీ తెరుస్తాడు. మాటలు ఆగకుండానే, కళ్ళు మాత్రం మామూలు కావాలి మరి. అట్లా చాలా సేపు అతను మాట్లాడాడు. బర్ సిత్తా నీళ్ళు పోయడంలో కొంత పొరపాటు జరిగితే, అతను ఒళ్లంతా కదుపుతూ కేకలు వేస్తాడు. అంతలోనే తప్పు చేశానని తెలుసుకొని, క్షమా ప్రార్ధనలు మొదలు పెడతాడు. ముఖం తుడుచుకుంటూ కూడా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. సమాధానం గురించి పట్టించుకోడు. అందుకోసం ఎదురు చూడడు కూడా. ఇక మీసాలు మెలిపెట్టే సమయం వచ్చింది.. జానపద కథలో ఒకతనిలాగా అతను వాటిని సర్దుకుంటాడు. అప్పుడు నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరం ఉంటుంది.

కొంతసేపు తరువాత కుటుంబం అంతా ఎత్తు ఉండని భోజనాల బల్లచుట్టూ చేరుకున్నారు. ఒక్కొక్కరికి ఒక పెద్ద రొట్టె, మడతపెట్టిన చేతిగుడ్డలాగ ఉండేది, అందింది. దాన్ని వాళ్లంతా తొడ మీద పెట్టుకుంటారు. తిండి తినే సమయంలో మాట్లాడడానికి తండ్రి అనుమతించడు. ఎవరయినా ఒక ప్రశ్న అడిగితే, సూటిగా జవాబు అందుతుంది. మిగతావాళ్లంతా తమ భోజనంమీద మాత్రమే దృష్టిపెట్టాలి. ఒక గిన్నెలో అత్తిపళ్ళు, లేదా మొలాసెస్ ఉంటాయి. అక్కడ మాత్రం చేతులు కలిసే అవకాశం ఉంటుంది.

తిండి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత బూ ఖట్టర్ సలహాలు, నియమాలు చెబుతాడు. ఆరోజు జరిగిన తప్పుల గురించి చెబుతాడు.(బూ అంటే అబూ, అంటే తండ్రి.) ముందు భార్యకు, తర్వాత పిల్లలకు. చివరకు అతను తన ఇద్దరు సేనానాయకుల వేపు తిరుగుతాడు. వాళ్లే అతని కొడుకులు. వాళ్ల పేర్లు ఖట్టర్, షల్హూబ్. పనిచేయవలసిన పద్ధతి చెబుతాడు. ఆనాడు వాళ్లు ఏదైనా పొరపాట్లు చేసిఉంటే వాటిగురించి విమర్శ వినిపిస్తాడు.

నువ్వు వెనకనుంచి అతని వద్దకు వెళ్లావు. ముందు నుంచి వెళ్లి ఉండవలసింది. సొమ్మంతా యిమ్మని అడిగి వేచి ఉన్నావు. అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తితే మరింత బాగుండేది. అతడిని కొట్టి ఉండాలి. కనీసం గట్టిగా అరచి ఉండాలి. చచ్చేట్టు భయపెట్టి ఉండాల్సింది. ఇక షల్హూబ్, నీ సంగతి అతను కొనసాగించాడు. నేను చెప్పినట్టు నాలుగు దారులు కలిసే చోట నిలబడితే, ఆ పందిగాడు తప్పించుకుపోయేవాడు కాదు. వాడి దగ్గరే డబ్బంతా ఉందని పందెం వేయవచ్చు. పోనీ లే, ఇప్పుడు అనుకుని లాభంలేదు. మళ్లీ అవకాశం వస్తుంది. అప్పుడన్నా జాగ్రత్తగా ఉండు.

ఇవాళ ఏమీ కలిసి రాలేదు, అన్నాడు అతను భార్యవేపు తిరిగి. మా మీద నీకు కోపం వచ్చి ఉండాలి. ఉమ్ ఖట్టర్ మెల్లగా నవ్వింది. (ఉమ్ అంటే అమ్మ అని అర్థం). బూ ఖట్టర్ మరేవో విషయాల గురించి మాట్లాడాడు. నిట్టూర్చాడు. ప్రార్థనకు సిద్ధం కండి, అన్నాడు. అంతా మోకరిల్లారు.

అతను నిటారుగా స్తంభంలా లేచి నిల్చున్నాడు. కొడుకుల్లో ఒకడు మోకరిల్లిన తీరు పద్ధతిగా లేదు. వాడిని వెళ్లి పొమ్మ న్నాడు. తండ్రి, పెద్ద కొడుకుల నాయకత్వంలో ప్రార్థన జరిగింది. కన్నెమాత ప్రార్థన అయింది. బూ ఆమెకు జయం అంటూ,  హెయిల్ మేరీ చెప్పాడు. మరుసటి రోజు అదృష్టం కలిగించమని ఆమెను ప్రార్థించాడు.

అతనిక  నేరుగా పడక చేరుకున్నాడు. వెల్లకిలా పడుకున్నాడు. దుప్పటి కప్పుకుంటూ బర్ సిత్తా! అని పిలిచాడు. మాకోసం రేపు మధ్యాహ్నానికి తిండి కట్టి ఉంచాలి. శుక్రవారం మధ్యాహ్నభోజనం! మరువ వద్దు. ఆలూ ఉడికించి పెడితే చాలు. కొంచెం సేపు తర్వాత దండు మీదనుంచి తల పైకి ఎత్తాడు. నా ప్యాంట్ కూడా చిరిగింది. విన్నావా? ఏమంటావు? నా కోటు పిగిలిపోతున్నది. వాడు కనిపించాలి గాని! ఈసారి వదలను గొణుగుతున్నాడు.

దుప్పటిలో కొంతసేపు మాత్రమే గడిచింది. ముడతలు పడ్డ బట్టతల మళ్లీ బయటకు వచ్చింది. కత్తులు సానపెట్టండి. తుపాకులు శుభ్రం చేయండి. తుపాకీ మందు ఆరబెట్టండి. మళ్లీ ఇవాళ వలె జరగకూడదుఅన్నాడు కొడుకులతో.

ఆశ్చర్యంగా ఉమ్ ఖట్టర్ ఏమిటి సంగతి?’ అన్నట్టు సైగ చేసింది. తండ్రి నిద్రపోయేదాకా ఆగమని కొడుకు సైగ చేశాడు. కొంతసేపు తర్వాత అబ్బాయి వివరించాడు. ఇవాళ ఇద్దరు మనుషులు దొరికారు. ఒకడిని దోచాము. రెండవ అతను తప్పించుకుపోయాడు. అతను మంచి ధైర్యం, ఉత్సాహం గల యువకుడు.

అబ్బాయి ఒక వెండి ఉంగరం చూపించాడు. దానిమీద అక్షరాలు చెక్కి ఉన్నాయి. దాన్ని చూడగానే తల్లి ముఖంలో కోపం కనిపించింది. అది పాపం ప్రియురాలికి కానుకగా చేయించింది. ఎలా దొంగిలించారు? అన్నది. ఖట్టర్ తండ్రి వైపు చూపించాడు. నాకు కాదు. ఆయనకు చెప్పు, అన్నాడు. నేను కాదంటే, జాలి గురించి చెబితే, కోపగించుకుంటాడు, తిడతాడు. ఏదో అడ్డు చెపుతావు. వాళ్ల పెద్దలు పాడుగాను! మన పని మనం చేయాలి అంటాడు. అది అబ్బాయి వివరణ.

త్వరలోనే ఇల్లు ప్రశాంతమయింది. బూ ఖట్టర్ గురకలు మాత్రం లయగా పడి లేస్తున్నాయి. అతను నిద్రలో మాట్లాడుతున్నాడు. ఎవరినో భయపెడుతున్నాడు. లొంగిపొమ్మంటున్నాడు. సోదా చెయ్యి! అని కొడుకుకు చెబుతున్నాడు.

అతను మామూలుగానే ఉదయాన్నే లేచాడు. చాలాసార్లు క్రాస్ చేసుకున్నాడు. పడకలోనే కన్నెమాత ప్రార్థనలు చేశాడు. అది చాలాకాలం సాగుతుంది. తప్పులు క్షమించమని ఆమెను ప్రార్థిస్తాడు. క్షమాపణలు చెబుతాడు. దొరికిన సొమ్ములో పావుభాగం యిస్తానని మొక్కుకుంటాడు. చర్చ్ లో షాండెలియర్, ఒక కొవ్వొత్తి స్టాండ్, ధూపం లేదా కొవ్వొత్తులు ఇస్తానని మొక్కుకుంటాడు. నిజంగా మంచి లాభం దొరికితే ఏకంగా పోత గంట చేస్తానంటాడు.

గంటసేపు ప్రార్థనలు సాగిన తర్వాత వాళ్లు దారిలో తమ మామూలు చోటుకి చేరుకుంటారు. తిండి మూట పట్టుకుని కడగొట్టు కొడుకు చివరన వస్తున్నాడు.

బూ ఖట్టర్ తన జపమాల తేవడం ఎన్నడూ మరిచిపోడు. అతని జపం జరుగుతూనే ఉంటుంది. ఒక పూస తప్పినట్టు అనుమానం వస్తే చాలు, మళ్ళీ లెక్కింపు మొదటికి చేరుతుంది. ప్రార్థన లెక్క చక్కగా ఉండాలన్నది అతని కోరిక. అందులో పొరపాట్లు ఉండకూడదు. మరి అనుగ్రహం అందే దారి మరొకటి గాని ఉందా?

అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. విధి తన ముందుకు ఇవాళ ఎవరిని పంపుతుంది, అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు. అంతలో ప్రార్థన గంట మోగింది. అతను క్రాస్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళనందుకు క్షమాపణలు చెప్పుకున్నాడు. మనసులో మాత్రం తాను అక్కడే ఉన్నట్టు భావించాలి, అని వేడుకున్నాడు.

సూర్యోదయం సమయానికి తన మాటు దగ్గరకు చేరుకున్నాడు. పూజ గంట అదేపనిగా మోగుతున్నది. ఫెజ్ టోపీని నుదురు మీదనుంచి కొంచెం వెనుకకు కదిలించాడు. భూమి మీద మోకరిల్లాడు. కొడుకులతోబాటు, ప్రార్థన సాగించాడు. మళ్లీ అంతా పొంచి ఉన్నారు. నిత్యం సంపాదన కొరకు ఎదురు చూస్తున్నారు. వర్జిన్ కనికరిస్తుందని బూ ఖట్టర్ కు నమ్మకంగా ఉంది.

ఎవరో పాడుతూ రావడం వినిపించింది.

బూ ఖట్టర్ ఇద్దరు కొడుకులను సిద్ధంగా ఉండమని సైగ చేశాడు. వస్తున్న మనిషి భద్రంగా ఉన్నానని సంతోషంగా ఉన్నాడు. చేతిలో జపమాల పట్టుకుని ప్రార్థన చేస్తున్న మనిషి అతనికి కనిపించాడు. గతుక్కుమన్నాడు అతను. భయం అతనికే ఆశ్చర్యం కలిగించింది. కనిపించిన మనిషి ప్రార్థనలో ఉన్నాడు. ధైర్యం నటిస్తూ అతను నమస్కారం చేశాడు గౌరవంగా. బూ ఖట్టర్ తన ఎర్రని ఉబ్బిన కళ్ళతో కోపంగా చూచాడు.

ఆ చూపులను తప్పించుకుని అతను ముందుకు నడుస్తున్నాడు. జపమాల పైకెత్తి బూ ఖట్టర్ ఆగమని సైగ చేశాడు. అతను పట్టకుండా నడిచి పోతున్నాడు. చూడూ! తరువాత బాధపడే పని ఏది నా చేత చేయించకు. నా ప్రార్థన ముగియనీ! అతను గట్టిగా అన్నాడు.

తాను అతని చేతికి చిక్కిపోయినట్టు ఆ మనిషికి అర్థమయింది. అతనే! అనుకున్నాడు ఆ వ్యక్తి.

బూ ఖట్టర్ ప్రార్థన సాగించాడు. వ్యక్తి వేచి ఉన్నాడు. చివరకు దగ్గరకు వచ్చాడు. వేలెత్తి చూపిస్తూ, ఉన్నదంతా వలిచి ఇచ్చేయ్! అన్నాడు బూ ఖట్టర్.

నా దగ్గర ఏమీ లేదు. బూ ఖట్టర్

నీ దగ్గర ఏమీ లేదా? నేను బూ ఖట్టర్ అని ఎవరు చెప్పారు?’

నేను గుర్తుపట్టాను

దేవుడు నీ కళ్ళు పోగొట్టా! సరే, ఉన్నదంతా ఇచ్చేసెయ్!

పిల్లల కొరకు పిండి కొందామని పది మజీదులు అరువు తెచ్చుకున్నాను.

దేవుడు నీకు మళ్ళీ యిస్తాడు గాని, అవి ఇచ్చేయ్!

నన్ను వాటిని ఉంచుకోనీ, కన్నెమేరీ పేరున!

బూ ఖట్టర్ తల ఊపాడు. డబ్బు యిమ్మని సైగ చేశాడు.

బోలెడంత ఏడుపు, అరుపు, వేడుకోలు తరువాత మేరీమాత పేరున డబ్బు పంచుకోవడానికి బూ ఖట్టర్ సరేనన్నాడు. జరగవలసిన దాంట్లో సగమే జరిగిందన్న సంతృప్తితో ఆ మనిషి గొణుగుతూ వెళ్ళిపోయాడు.

బూ ఖట్టర్ డబ్బుతో క్రాస్ చేసుకున్నాడు. తర్వాత జేబులో వేసుకున్నాడు. ఏం బోనీ! అన్నాడతను పవిత్రంగా.

కన్నెమేరీని ప్రార్థిస్తూ అతను ఆకాశం వైపు చూచాడు. నీ కళ్ళ కోసమే అతనిమీద దయ చూపించాము. మరి మాకు ఏదో ఇవ్వు, అన్నాడతను.

గాడిదలను అదిరిస్తూ కొంతమంది రావడం కనిపించింది. ధరల గురించి, వాతావరణం గురించి, మరెన్నో సంగతుల గురించి వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అదిగో మన అదృష్టం, వస్తున్నది అన్నాడు బూ ఖట్టర్ కొడుకులతో. బోలెడంత మంది ఉన్నారు అని కూడా అన్నాడు.

ఖట్టర్ రైఫిల్ సిద్ధం చేశాడు. షల్హూబ్ కత్తి తీశాడు. శత్రువు ఎదుట ఉన్నట్టే దాన్ని ఎత్తి పట్టుకున్నాడు.

గాడిదలను తోలుతూ ముగ్గురు మనుషులు ఉన్నారు. బూ ఖట్టర్. గట్టి కేక వేశాడు. అది నదిలో ప్రతిధ్వనించి మరింత గట్టిగా వినిపించింది. సరే పెద్దమనుషులూ! ఉన్నదంతా ఇచ్చేయండి! లేదంటే.... ముగ్గురిలోనూ ఒకడు పొగరు మోతు కుర్రాడు. మొరటుగా ఏదో అన్నాడు. అమ్మను తిట్టాడు. వాడిని భయపెట్టడానికి బూ ఖట్టర్ తుపాకీ పేల్చాడు. అతనూ పేల్చాడు.

కానీ చివరి షాట్ మాత్రం బూ ఖట్టర్ రైఫిల్ నుంచి వచ్చింది. సంగతి తేలిపోయింది. యువకుడు పడిపోయాడు. మిగతా వాళ్ళు లొంగిపోయారు. వాళ్ల దగ్గర ఉన్నదంతా దోపిడీ అయింది. చివరకు దుస్తులు, తిండి కూడా!

సంతోష దినాన సంపాదన లెక్కించడానికి బూ ఖట్టర్ కూచున్నాడు. ముప్ఫయి అయిదు బంగారం ముక్కలు, కొన్ని రియాల్స్, నాణాలతో నిండిన పెద్ద సంచి ఒకటి. అది చాలా బరువుగా ఉంది. ఎత్తడానికి బూ ఖట్టర్ మూలగ వలసివచ్చింది.

కొల్లగొట్టిన మిగతా వస్తువులను చూచాడు. నగిషీ గల కంచు గొడ్డలి, ఒక కత్తి, ఒక మాంసం చీల్చే కత్తి, మరొక రైఫిల్.

దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా అతను నేలను ముద్దాడాడు. మీరు నేలను ముద్దాడండి! కృతజ్ఞత చెప్పాలని కూడా తెలియదు! కొడుకులతో అన్నాడు. డబ్బు, ఆయుధాలు. అదృష్టం అంటే అది! అతను నవ్వాడు.

దొంగ సొమ్మును చూస్తూ అతను కన్నెమేరీతో సరదా మాటలు మొదలు పెట్టాడు. అమ్మా, ధన్యవాదాలు! దేవుడు నీకు దీర్ఘాయువు ఇచ్చుగాక! ఇవాళ నీవు బూ ఖట్టర్ కు వాని అవకాశం ఇచ్చావు. ఎక్కడా లేని గంట చేయిస్తాను. నీకు! పిల్లలూ, వాళ్ల తిండి సంచి విప్పండి! తిండి తీయండి.

నది మధ్యలో ఒక బండ మీద ముగ్గురూ కూచున్నారు. విజయం తరువాత ఎక్కడలేని ఆనందంతో ఆకలితో బాగా తిన్నారు. చిన్నవాడు దొంగిలించిన సంచి నుంచి జున్ను ముక్క తీసుకున్నాడు. బూ ఖట్టర్ వాడి చెంప వాయించాడు.

గౌరవం చూపించాలి, గాడిదా! ఇవాళ శుక్రవారం! కొవ్వు ఎట్లా తింటావూ! వాళ్లు ఈ సంగతి పట్టించుకోలేదు కనుకనే మనకు దొరికారు, అన్నాడతను.


No comments:

Post a Comment