Saturday, September 19, 2026

పుస్తకాలు అమ్మేవాడు : మళయాళ కథకు అనువాదం


పుస్తకాలు అమ్మేవాడు

 

ఈ కథ నిజానికి చాలా పాతది. ఇది మలయాళం కథ. అనువాదం కూడా చాలా పాతది. అనువాదకుడు కథ పేరును పుస్తకాలు అమ్మేవాడు అని కాక పుస్తకాలు అమ్మే మనిషి, అని కూడా పెట్టి ఉండవచ్చునేమో, అని నాకు అనిపించింది. మొదటి వాక్యంలోనే, కథలో నాకు ఇంకొక అభ్యంతరం కనిపించింది. అనువాదకుడు కథను తన సొంత కథగా మార్చడానికి ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించింది. వదిలేయండి. కథ వినండి.

 

ఆ పుస్తకాలమ్మేవాడు రామవరప్పాడు స్టేషన్లో మా బండి ఎక్కాడు. బండి కదలగానే, ఒక మూల నిలబడి ఒక పుస్తకం తీసి, ఎంఏలు బిఏలు పాస్ అయినారు, అని పాడటం మొదలు పెట్టాడు. ఆ పాడే ధోరణిలో ఒక వింత ఆకర్షణ వుంది. మా పెట్టె క్షణంలో నిశ్శబ్ద పూరితమైంది. ఆ నిశ్శబ్దంలో కంగున వినిపించే వానికంట ధ్వని ఎవ్వర్ని ఆకర్షించదు?  నేను విననట్టు నటిస్తూ సావధానంగా వింటున్నాను.

చెట్ల క్రింద ప్లీడర్లు

గట్ల మీద ప్లీడర్లు

కల్లబొల్లి మాటలాయే

ఇల్లు వల్లు గుల్లలాయె!”

అని సాగించాడు. ఆ పాటసారాంశంయిది. ప్లీడరు పరీక్ష చదివి ఇల్లు గుల్ల చేసి, ఎవ్వరింటికైనా చెక్క కొడతారు. ఇంటి దగ్గర భార్యాలలామ పోరు పడలేక కోర్టుకి వెళ్తారు. అక్కడ బారు రూము లో పడి నిద్రపోతారు. సాయంకాలం అయిదింటికి ఆపసోపాలు పడుతూ కొంపకి చేరతారు. మా ఆయన కష్టపడి వచ్చాడమ్మా!” అని భార్య ఆదరిస్తుంది... ఇంటి ఖామందు అద్దె అడిగితే, ఆరు నెలల నోటీసు ఇవ్వలేదు. నేను ఖాళీ చేయను, ఏమి చేసుకుంటావో చేసుకోఅంటారు.--- చేతిలో పడ్డవాళ్లను పీల్చి పిప్పి చేస్తారు. తిరుక్షారం చేసి పంపుతారు.---- ఫ్యాషన్లకు మాత్రం తక్కువ ఉండదు. నోట్లో సిగరెట్లు, ప్రక్క క్రాఫింగులు, మద్యపాపట్లు----.

రైలు పెట్టె లోని జన మంతా నన్ను చూచి గొల్లున నవ్వారు. నా నోట్లో సిగరెట్టూ, నా మధ్యపాపటి,(బహుశా నా మొహం ప్లీడరు మొహంగా ఉందేమో)- నా మొహం దేవురించింది. ఆ క్లయింటు వెధవ చేశాడు. డబ్బు లేదని మూడో క్లాసు టిక్కెట్టు కొన్నాడు. లేకపోతే నా తాతలనాడు ఎక్కారా, నా తండ్రులనాడు ఎక్కారా, ఈ మూడో తరగతి!” అని గొణుగుకొన్నాను. గబగబా కాగితాలు తీసుకొని ఏదో చదువుతున్నట్టు నటించాను

పుస్తకాలమ్మేవాడు పాడుతూనే ఉన్నాడు. వాని మాటలు చెవుల్లో గింగురు మంటున్నవి. నా అదృష్టవశాత్తు వాడు ప్లీడర్ల అధ్యాయం ముగించి స్త్రీల అధ్యాయంలోకి వచ్చాడు. నేను కాగితాలు అడ్డుపెట్టుకునే వింటున్నాను.

చంక చేతుల జాకెట్లు

చంటి మెడల జాకెట్లు

ముక్కు పుడకలు మోటాయె

వాలు చూపులు మెండాయె!”

నేను ఆకర్షించ బడ్డాను. అప్రయత్నంగా కాగితాలు మడిచి, శ్రద్ధగా విన్నాను. ఈ అధ్యాయం సారాంశం కూడా చెబుతాను. కుచద్వయం కనుపించే చేతులు గల జాకెట్లు --- ఒక కుచం కనిపించేటట్లుగా రెండో కుచం మీద నుంచి పోయే పమిట....

పెట్టలోని జనమంతా సంతోషంతో విరగబడి నవ్వారు. కొందరు చిరునవ్వులతో గుసగుస లాడుకున్నారు. కొందరు చూడు అన్నట్టు కనుసైగలు చేసుకున్నారు. బలే బాగుంది. అందులో ఒక్క అబద్ధం లేదు,” అన్నారు కొందరు. ఒక ముసలివాడు తన్మయత్వంతో తలూపుతూ పుస్తకాలమ్మే వాడి పాటకు తాళం వేశాడు. నాకొక పుస్తకం నాకొక పుస్తకం అని ఆ పుస్తకాలన్నీ క్షణంలో కొని వేశారు. నా పక్కన కూర్చొన్న హరిజన బాలిక భర్తతో ఒక పుస్తకం కొను పిచ్చాయి కూడా చదువుకుంటాడు,” అన్నది. అని వాడు రెండుపుస్తకాలు కొన్నాడు. నాక్కూడా ఒక పుస్తకం కొనాలని పించింది, కానీ నేను (ప్లీడర్ని, ఆర్టిస్టుని) ఈ అర్ధణా పుస్తకం, ఇటువంటి పుస్తకం కొంటుంటే ఎవ్వరైనా చూస్తే ... (వచ్చే టప్పుడు వీడు ఒంటరిగా కనబడితే తప్పకుండా కొనాలని నిశ్చయించుకున్నాను.)

ఇంతలో నేను దిగిపోవలసిన స్టేషన్ వచ్చింది . ఆ పుస్తకం సంగతే ఆలోచిస్తూ దిగాను. నా వెంటనే, నేను దిగిన పెట్టెలో నుంచే 20 సంవత్సరాల యువతి దిగింది. ఈమె ఇందాకటి నుంచి ఈ పెట్టలోనే ఉందా!” అని నేను ప్రశ్నించు కున్నాను. ఆమె గబగబా నా దగ్గరకు వచ్చింది.

ఆ పుస్తకం కొనుక్కోరూ?”

ఏ పుస్తకం?”

రైలు పెట్టెలో అమ్మిన పుస్తకం.

నాకెందుకు?”

చాటుగా చదువుకొని ఆనందించటాడానికి. ఇందాక వాడు చదివేటప్పుడు, అందరూ పరిహాసంగా నన్ను చూచి నవ్వేటప్పుడు, మీరు నోరు తెరుచుకొని ఆనందించారుగా!” అంది. వాడు వర్ణించిన స్త్రీ వేషం ఈమెకు సరిగ్గా అతికిపోయిందని అప్పుడు నేను గ్రహించాను. రైల్లో జనం అంతగా ఎందుకు సంతోషించారు అప్పుడు నాకు అర్థమయింది. పాపం, ఈ అమ్మాయి...

అభిమానం లేకపోతే సరి, ఒక స్త్రీని పట్టుకొని అందులో భారత స్త్రీని, ఈ విధంగా ఇంత మంది పురుషులు పరిహసిస్తుంటే, నోరు తెరుచుకొని సంతోషించారు.

నేనేం చేయను? నన్ను మాత్రం వాడు పరిహసించలేదా? మొదటి అధ్యాయం అంతా నా జాతిని గురించే గదా! నేను ప్లీడర్ని.

ఓహో, మీరు ప్లీడర్లా!! ... అందుకనే మిమ్మల్ని పరిహసించినా, మీ దేశంలోని ఒక అబలను పరిహసించినా, గుటకలు మింగుతూ సంతోషించారు. ఏ తృణమో పణమో, వంకాయో సొరకాయో, ముట్ట జెపితే నా తరఫున వాగే వారు కాబోలు. ... ప్లీడర్లు!” అనుకుంటూ పోయింది.

నాకు ఆశ్చర్యం వేసింది. పరిహసించటం తప్పయితే ఎవ్వర్ని పరిహసించినా తప్పే. పురుషుణ్ని ఏమి చేసినా పర్వాలేదు గాని స్త్రీని జాగ్రత్తగా వాడాలి, అనే వాదం నేను ఒప్పుకోను.

అందులో నీ దేశం, అబలను. ఈ జాతీయవాదం నన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు. నన్ను ఒక్కటే ప్రశ్న బాధిస్తోంది. ప్లీడర్లంటే ఇంత ఏవగింపు ఎందుకు? ఈమె నన్ను డబాయించే బదులు (ప్లీడర్నని లోకువా?) వాణ్ని ఎందుకు డబాయించదు?”

 


 

No comments:

Post a Comment