Tuesday, September 15, 2026

లోకాభిరామం : కలకత్తా కాళిక నాలుక On my first visit to Calacutta


కలకత్తా కాళిక నాలుక

గంగలో స్నానానికి వస్తవా, అని కలకత్తాలో ఉండగా ఎవరో అడిగినరు. బాత్‌రూంలో వచ్చేవి కూడా గంగ నీళ్లే కద. ఇక్కడే శుభ్రంగ స్నానం చేస్తనని నేనన్న.

ఒంటరి ప్రయాణం: పి.ఎచ్.డీలో చేరిన తరువాత చాలాకాలం పాటు, అంశాన్ని తేల్చక ప్రొఫెసర్‌గారు కాలయాపన చేయించినరు. మానవ జనాభాలలోని జన్యు వైవిధ్యం అని విషయం నిర్ణయమయింది. కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడానికి కలకత్తా పోయి రావాలె. అంతకు ముందు ఒంటరిగ అంతంత దూరం ప్రయాణం చేసింది లేదు. కనుక ఉత్సాహంగ ఉంది. ఈస్ట్‌కోస్ట్ అనే ఎక్స్‌ప్రెస్‌లో మామూలు క్లాసులోనే ప్రయాణం. నాకు రిజర్వేషన్ ఉంది గనుక, నా సీట్లో నేను కూచున్న. అసలు ఎవరితోనూ మాట్లాడలేదు కూడా. ఎక్కడ ఎక్కినరో గుర్తు రావడం లేదు గాని, ఓ నలుగురు సైన్యం యువకులు ఎక్కినరు. వాళ్ల దగ్గర రిజర్వేషన్ లేదు. ఆ మాట ఎవరో చెప్పబోతే, ‘నీ కోసం మొత్తం రైలంత రీ-జర్వ్ అయిందిలే’ అని వారిలో ఒకడు మొరటుగ జవాబు ఇచ్చినడు. అందరూ వాళ్లను చూచి భయపడినట్లు ఊరకుండి పోయినరు. అట్లాగని నేనేదో పోరాటం జరిపిననుకునేరు! నేనూ ఊరికే ఉండిపోయిన. మధ్యలో ఎక్కడో ఒక కుర్రవాడు మట్టి పాత్రలలో ‘చాయ’ అమ్మడానికని పెట్టెలోకి ఎక్కినడు. చిన్న పిల్లవాడు. బహుశ పక్క స్టేషన్‌లో దిగి, మరో తిరుగు రైల్లో తన ఊరు చేరుకుంటడనుకుంట. ఈ మిలిటరీ రాక్షసులు, పిల్లవాని చాయ్ తాగి, పైసలివ్వక, వాణ్ణి రకరకాల హింసకు గురి చేశినరు. వాడు ఏడుస్తున్నా దిగవలసిన చోట దిగనివ్వలేదు. ఆ సంఘటన ఆధారంగా కథ రాయాలని అప్పుడే అనిపించిందా, తర్వాత అనిపించిందా? గుర్తు లేదు. సాహిత్యావేశమే గానీ, పిల్లవాని తరఫున పోరాడే ఆవేశం మాత్రం కలగలేదు. అది తలుచుకున్నప్పుడల్ల, మనసు వికలమవుతుంది. నేనే కాదు, మరెవ్వరూ వాళ్లను మందలించలేదు. ఎందుకయి ఉంటుంది?

ఆ రాక్షసులలో ఒకడు నాతో మాట కలిపినట్లు, వాడి దగ్గర నుంచి కొంచెం ఖైనీ పొగాకు, నేను రుచి చూచినట్లు గుర్తుంది. తల తిరగడం కూడ గుర్తుంది. మిగత సంగతులు గుర్తులేవు.

నేనసలు దినమంత ఎవరితోనూ మాట్లాడలేదు. రాత్రయింది. నాకు పైన బెర్త్ అలాటయింది. పండుకోవాలని ఎక్కితే అంతా దుమ్ము. ఏం చేయాలని ఆలోచిస్తున్న. నాది సైడ్ బెర్త్. ఎదురుగా ఉండే బెర్త్‌లలో ఒక కుటుంబం వారున్నరు. తెలుగువారు. ఆయనగారు కలకత్తాలోని ఆంధ్రా బ్యాంక్ శాఖ మేనేజరని అర్థమయింది. వాళ్ల అమ్మాయి ఒక గుడ్డతో తన బెర్త్ తుడుస్తున్నది. నేనామెను గౌరవంగా ఆ గుడ్డ అడిగిన. తెలుగులో అడిగిన. ఉదయం బయలు దేరి, రాత్రి వరకు, తెలుగు నేల నుంచి చాలా దూరం వచ్చేశినము. అక్కడ తెలుగు వినిపించేసరికి ఆ అమ్మాయికి సంతోషంగ తోచింది. వెంటనే! ఆయన తెలుగు వారు అని అమ్మానాన్నలకు చెప్పింది. కుటుంబం మొత్తం నాతో మాట కలిపినరు. దూర దేశంలో ‘మనవారు’ భావం రుచి నాకు అర్థమయింది. నాకంతా కొత్త. వెళ్లవలసిన చోటికి ఎట్ల చేరాలెనో తెలియదు. తెలుగు కుటుంబం కొరకు కారు వచ్చింది. వారు నన్ను చౌరంగీ దాక వెంట పెట్టుకు వెళ్లినరు. అక్కడ వారి డ్రైవరు నన్ను ఎక్కవలసిన బస్సులో ఎక్కించి, కండక్టరుకు చెప్పి, మరీ వెళ్లినడు. ‘మనవారు’ భావం పుణ్యమా అని నేను రెండు రూపాయల ఖర్చుతో గమ్యం చేరుకున్న.

పంజాబీ మిత్రులు: ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో నాతోబాటే, పని నేర్చుకునేందుకు పటియాలా నుంచి ఇద్దరు కుర్రవాళ్లు వచ్చినరు. వాళ్లు కూడా హౌరాలోనే రైలు దిగినరు. అక్కడి నుంచి గమ్యం చేరుకోవడానికి 125 రూపాయలు ఖర్చయిందన్నరు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. నాకు సెంట్రల్ యు.జి.సి. ఫెలోషిప్ వచ్చిందని చెపితే, వారిద్దరూ నన్నొక హీరోను చూచినట్లు చూడటం మొదలు పెట్టినరు. మా దగ్గరయితే నీ ఫొటోతోబాటు, వార్త పేపర్లో వచ్చేది తెలుసా? అన్నరు. మూడు వారాలు కలిసి ఉండి ఎంతో నేర్చుకున్నము. గణాంక శాస్త్రం సంస్థలో, ఒక మానవ జన్యుశాస్త్ర విభాగం ఉంటుందనీ, అక్కడ రంగంలోని గొప్ప పరిశోధకులు ఉంటరని ఎవరికీ తోచక పోవచ్చు. వాళ్ల గురించి చాల చెప్పుకోవాలె. ఈ పంజాబీ మిత్రులలో ఒకతనికి జ్వరం వచ్చింది. మెడికల్ సెంటర్ ఉంది. వెళ్లమని హాస్టల్లో వారు చెప్పినరు. ముగ్గురమూ వెళ్లినము. జ్వరం వచ్చిన అబ్బాయి పేరు విజయ్ శర్మ. డాక్టరు అడిగితే అదే చెప్పాడు. డాక్టర్ మాత్రం చీటీ మీద బిజోయ్ శొర్మా అని రాశినడు. వీడు, అనగా విజయ్ అల్లరి రకం. అది నా పేరు కాదన్నడు. మరేమిటి నీ పేరు, డాక్టరు మళ్లీ అడిగినడు. వీడు చెప్పినడు. అదే గదా నేను రాసింది, అంటడు డాక్టరు. కొంత చర్చ, స్పెల్లింగు చర్చ, తర్వాత విషయం అర్థమయి అంత నవ్వుకున్నము.

బస్సులు - ట్రాములు: సాయంత్రం లాబ్ నుంచి వచ్చిన తరువాత చేతులు కట్టుకుని కూచోవడం నావల్ల గాదు. ఊరంత తిరగాలె. బస్సుల్లో రద్దీ అంటే అక్కడనే చూడాలె. అసలు రద్దీ, అంటేనే అక్కడనే చూడాలె. ఏదో బస్ ఎక్కడం, శాంబజార్, ధరమ్‌తల్లా, మరో చోటికి వెళ్లడం, కాసేపు తిరిగి మళ్లీ వెనక్కు రావడం. తిరుగు ప్రయాణంలో దిగవలసిన స్టాప్ పేరు బోన్‌హుగ్లీ. బస్సు డన్లాప్ దాకా వెళుతుంది. మరింత ముందకు పోతే రామకృష్ణ మఠం వస్తుంది. కొథాయ్ జాబేన్, ఎఠా నాంపేన్, కుడీ పోయిషా (ఇరవయి పైసలు) లాంటి బెంగాలీ మాటలు పట్టుకున్న. అందరూ ఏదో పేర్లు అడుగుతున్నరు. అందులో ఒక వింత శబ్దం వినపడుతున్నది. అనొన్నొ లాంటి మాటేదో అంటున్నరు. రెండు దినాల తరువాత, అది నా బోన్‌హుగ్లీ కన్నా ముందే వస్తుందని అర్థమయింది. మరుసటి నాడు జాగ్రత్తగ చూస్తే అక్కడొక సినిమా హాల్ కనపడింది. దాని పేరు అనన్య! ఎంత అందమయిన పేరు! బెంగాలీ మాటల్లో ఒక ఊపు ఉంటుంది. ఏ మాటనయినా వాళ్లు పలికే తీరు ప్రత్యేకంగ ఉంటుంది. అకారం బదులు ఓత్వం. వకు బదులు బ అందరికీ తెలిసిందే. రవీంద్రుడు రొబీంద్రొ అవుతడు.

రోడ్ల మీదే ఏర్పాటు చేసిన పట్టాల మీద, రెండే రెండు పెట్టెల రైలు బండి నడుస్తుంది. దాని పేరు ట్రామ్. ఈ ట్రామ్ దారులు, ఊరంత లేవు. కొంత భాగంలోనే తిరుగుతయవి. కొత్తదనం పేరున వాటిల్లో కాస్త ఎక్కువగనే తిరిగినట్టు గుర్తు. బస్సుల్లో లాగే ట్రాముల్లోనూ విపరీతమైన రద్దీ ఉంటుంది. అమ్మాయిలకు వేరే సీట్లు ఉండవు. లేక ఉన్నా సరే, మిగతా సీట్లలోనూ వాళ్లు వచ్చి కూచుంటరు. అంతకన్నా ఎక్కువ అక్కడి అమ్మాయిలు నేర్చుకున్న పద్ధతి ఒకటి నాకు ఆశ్చర్యం కలిగించింది. సీటు వేపు తిరిగి నిలబడ్డ ఒక అబ్బాయికి సీటుకు మధ్యన వచ్చి చేరుకుంటరు. ఈ అబ్బాయి గౌరవంగా వారికి చోటిస్తడు. ఓ చిరునవ్వు చివరికి బహుమతిగా మిగులుతుంది. పరిష్వంగ సుఖము కూడ (పాపము శమించుగాక!)

కాళిక నాలుక: ఒకనాడెందుకో సెలవిచ్చినరు. సంగతేమో తెలుసుకోకుండ నేను ఒంటరిగ ప్లానేటేరియం, విక్టోరియా మెమోరియల్ చూడడానికి వెళ్లిన. అక్కడ తెలిసింది, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినయి. జ్యోతిబాసు నాయకత్వంలో కమ్యూనిస్టులు మొదటిసారిగ గెలిచినరు. పెరేడ్ మైదాన్‌లో బహిరంగ సభ జరుగుతుంది అని! ఏమవుతుందిలే, అని నేను తిరుగు ప్రయాణానికి బయలుదేరిన. బస్సులు లేవు. ఆ మైదానం విక్టోరియా మెమోరియల్ ముందే ఉంటుంది. ఎక్కడెక్కడి వాళ్లంత అక్కడికే వస్తున్నరు. ‘నేల ఈనింది’ అన్న మాట గుర్తుకు వచ్చింది. ఎక్కడ చూసినా ఎర్రజెండాలతోటి జనం. ఎస్‌ప్లనేడ్ దాటే వరకు సాయంత్రమయింది. హాస్టల్లో నేను లేనని గమనించిన వారంత, ఆదుర్దాగా ఎదురు చూస్తున్నరు. నిజం చెపుతున్న, నాకు భయం మాత్రం కాలేదు. ఏమీ జరగనట్టే హాస్టల్ చేరిన. అందరూ కాసేపు అరిచినట్లు కూడా గుర్తు! నాకది భలే సరదాగా తోచింది. అట్లాగే గుర్తుంది. ఒకచోట మాత్రం రోడ్డు దాటడానికి వీలు కుదరక, వాళ్లలో కలిసి, నినాదాలు చేస్తూ, కొంత నడిచి, అవతలికి జారుకున్నట్లు గుర్తు! తలుచుకుంటే నవ్వొస్తుంది.

సింగాడా, పూడీ! అప్పట్లో కలకత్తాలో, మధ్యరకం హోటేల్స్ కనిపించలేదు. రోడ్డు పక్కన తడికల హోటల్లో తిండి దొరుకు తుంది. చిన్న సమోసాలుంటయి. వాటి పేరు సింగాడా. పూరీలను పుడీలంటారు. బేగునీ అనే వంకాయ బజ్జీలుంటయి. ఇక బెంగాలీ స్వీట్లను గురించి చెప్పనవసరం లేదు. మట్టి ముంతల్లో తియ్యటి పెరుగు దొరుకుతుంది. దాని పేరు మిష్టి ధోయి. పూరీలు, ఆలూ కరీ, చింతపండు పచ్చడి. ఎన్‌ప్లనేడ్‌లో ఒక గలీ హోటేల్‌లో కడుపు నిండ తిన్న. బిల్లు రెండే రూపాయలు!

కలకత్తా మొత్తం గజిబిజిగా, గలీజుగా కనిపించింది. మనుషులు మాత్రం ముత్యాల్లాగ అందంగ ఉన్నారు! ఏమిటి రహస్యం?




 

No comments:

Post a Comment