Thursday, October 2, 2008

04 02 2000 A page from the Diary

నగ్నముని కవిత రాశాడు. అదీ రేడియో కోసం.
‘సాంకేతిక విజ్ఞానం హద్దులు లేకుండా చేస్తోంది, కానీ మనిషికీ మనిషికీ మధ్యన బంధాలు మాత్రం, భయపడుతున్నాయి’ అంటాడు. నేనూ అదే కదా అంటున్నది!

‘ఇంటర్నెట్ వచ్చి దేశాల మధ్యన సరిహద్దులను తుడపగలిగిందేమో కానీ, మన దేశం ఇలాగున్నంతకాలం, కలవారు, లేనివారు, తెలివిగలవారు లాంటి సరిహద్దులు ఉండనే ఉంటాయి’ అన్నది నా వాదం.
తెలివి ఉండగానే సరిపోదు. దానికి సరిపడా సపోర్టింగ్ మెటీరియల్ ఉండాలి. చదువుకోడానికి పుస్తకాలు, ప్రపంచం, వ్యక్తులీ అన్నీ ఉండాలి.

వ్యక్తం చేసిన భావాలను విని, అవుననీ, కాదనీ అనడానికి కొందరు ఓరిమి గలవారు ఉండాలి. అప్పుడుగానీ ఆ తెలివికి రాణింపు, గుర్తింపు ఏర్పడేది!

పల్లెలో మగ్గుతున్న సోదరులకు, ప్రశ్న అడగడం ఇంకా నేర్పలేదు మనం. కలవారు తెలివిగలవారుగా చలామణీ అవుతున్నారు. ఎందుకంటే డబ్బు వారికి ప్రశ్నలడిగే ధైర్యాన్నిస్తుంది. జవాబు గలవాడూ వాడిముందే మోకరిల్లుతాడు.

పల్లెలో ప్రశ్న బెరుకుగా, అమాయకుల గొంతులో, నీలకంఠంగా ఉండిపోతున్నది.

ఈ నూతన ప్రపంచం, ఈ హద్దులులేని సమాచార ప్రపంచం, ఈ పరిస్థితికి సమాధానం వెదక్కపోతే, ఈ దేశం మారదు.
సాంకేతిక విప్లవం, పారిశ్రామిక విప్లవం, మనలను పట్టించుకోలేదు.
ఈ కొత్త విప్లవాన్ని మనం పట్టించుకోవాలి!

No comments:

Post a Comment