మళ్లీ
మొదటికి
ఇంతకూ భాష అంటే ఏమిటి? మళ్ల మొదటికి
వచ్చినము. భాష లేని కాలంలో మనిషి సైగలతో చెప్పదలచుకున్నదేదో చెప్పి ఉంటడు. దీన్ని
శరీర భాష అంటము. భాషలు బాగ పరిణతి చెందిన తరువాత కూడా శరీర భాష అవసరం మాత్రం తగ్గలేదు.
నోటితో పొగడుతూ, నొసటితో వెక్కిరిస్తున్నడు అని ఒక మాట
ఉంది. నోటితో అంటున్నది ఒకటయితే, శరీరం మరొకటి అంటుందన్నమాట! ఇది అందరికీ
అనుభవంలో ఉన్న విషయమే. మొత్తానికి మనిషి భాష నేర్చుకున్నడు. ఉన్నచోట ఉండక రకరకాల
చోట్లకు వలస వెళ్లినడు. ఎక్కడికక్కడ భాషలు పుట్టినయి. వాటి మధ్యన పోలికలు ఉన్నయి.
తేడాలు అంతకన్న ఎక్కువగ ఉన్నయి.
నోరు తెరిచి సులభంగా చేయగలిగిన శబ్దం అకారం. కొంచెం ముక్కును కూడా వాడితే, మ
అన్న ధ్వని వీలవుతుంది. ప్రపంచంలోని అన్ని భాషలలోనూ అమ్మ అన్న మాటకు మ అనే అక్షరమే
ఆధారంగ ఉంది. ఇదేరకంగ భాష పుడుతూ అభివృద్ధి చెంది బోలెడన్ని మార్పులకు గురయింది.
అయినా భాష ప్రయోజనం ఒక్కటే. ఏమిటా ప్రయోజనం? అసలు భాష అంటే
ఏమిటి? భావ వినిమయ మాధ్యమం అని కదా జవాబు? విషయం అర్థమయిందే? నేను
ప్రశ్నకు జవాబు తెలుగులోనే చెప్పిననని గట్టిగా అనుకుంటున్న. చెప్పిన మూడు మాటలు
సంస్కృతంలోనివి. వచ్చి తెలుగులో చేరిన మాటలు. ఈ రకమయిన మాటలను తొలగిస్తూ పోతే, తెలుగు
చాల కొంచెమే మిగులుతుంది. మనసులో ఆలోచనను ఎదుటివారికి అందించడానికి వీలు కలిగించే
దారిని భాష అనాలి. ఇది దారి కాదు. ఒక యానకం. ఈ యానకం మళ్లీ సంస్కృతం! యానకం అంటే
మోసుకుపోయేది అని అర్ధము.
భావ వినిమయ మాధ్యమం అన్నా, మనసులో ఆలోచనను ఎదుటివారి వరకూ
మోసుకుపోయేది అన్నా ఒకటే! ఈ రెండవ నిర్వచనం అసలయిన తెలుగు. కానీ అది మనకు
తెలుగులాగ వినిపించదేమో! మన దగ్గర రక్షకభట నిలయాలు ఉంటయి. పోలీసులు ఉంటరు.
తమిళనాడులో పోలీసువారి వాహనాల మీద “కావల్' అని రాసి
ఉంటుంది. నిజానికి వాళ్లు చేస్తున్న పని “కాపలా కాయడమే'. అంటే
వాళ్లు కావలివాళ్లే! ఈ మాట తెలుగు తెలిసిన ఒక పోలీసాయనకు చెప్పి చూడండి. నేను అట్ల
కనిపిస్తున్ననా అంటడేమో! అది భాషలోని చిక్కు. మనకు మాట్లాడడం తరతరాలుగా
సంక్రమించిన శక్తి. కనుక ఇవాళ, ఇలాగే ఎందుకు మాట్లాడుతున్నము అని
ప్రశ్నించకుండ అనుకరించి నేర్చుకున్న భాషను నిర్లక్ష్యంగ వాడేస్తము. అందులోని మంచి
చెడులను తర్కించే అవసరము, అవకాశమూ లేదు అనుకుంటము.
మన దేశంలో బోలెడు భాషలు ఉన్నయి. ఒక్కొక్క భాషలో బోలెడు యాసలు ఉన్నయి. యాసలు
కాని రూపాలు కూడ ఎన్నో ఉన్నయి. కనుక ముఖ్యంగ మనదేశంలోవారికి భాషలతో పరిచయం, వాటి
తీరుతెన్నుల గురించిన ఆలోచన చాలా ఎక్కువగ అవసరం. ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత
సంజీవ్‌దేవ్‌గారు చెప్పిన ఒక విషయం నాకు గుర్తుకు వస్తున్నది. రాహుల్ సాంకృత్యాయన్‌గారు
సంజీవదేవ్‌గారితో కబుర్లు చెపుతూ కాలం గడపడానికి తుమ్మపూడికి వచ్చినరట. ఈ రాహుల్
ఎవరు? అని అడిగేవారికి జవాబు చెప్పవలసిన బాధ్యత నామీద ఉందని నాకు తెలుసు. జయ యౌధేయ, సింహసేనాపతి
లాంటి రచనలు చదివినవారికి సాంకృత్యాయన్‌గారి పాండిత్యము గురించి తెలిసి ఉంటుంది.
ఆయన గొప్ప పండితుడు, రచయిత. ఆయన రచనలు తెలుగులో చదివే భాగ్యం నాలాంటివారికి కలిగింది. మొత్తానికి
సాంకృత్యాయన్‌గారికి తెలుగు రాదు. సంజీవదేవ్‌గారితో ఆయన ఒక కామన్ భాషను ఎంచుకుని
చర్చ సాగించి ఉంటరు. సంజీవదేవ్‌గారు కూడా గొప్ప పండితులు. ఆయనకు కూడా బోలెడు భాషలు
వచ్చి ఉంటయి. కానీ ఇక్కడ విషయం అది కాదు. సాంకృత్యాయన్ తుమ్మపూడిలో ఉండగా, ఒక
రోజు పొలాలకు వెళ్లి చూడాలన్న ఆలోచన కలిగిందట. నడిచి వెళ్లడం శ్రమ అనుకున్నరేమో, ఎద్దుల
బండి కట్టించుకున్నరట. బండి నడుపుతున్నది ఒక లంబాడీ మనిషి. వీళ్లనే సుగాలీలు అని
కూడా కొన్ని ప్రాంతాలలో అంటరు. మన దగ్గర వీళ్లు అనుసూచిత జాతులలో లెక్కింపబడుతున్నరు.
మొత్తానికి పెద్దలిద్దరూ బండిలో ప్రయాణం చేస్తున్నరు. బండి నడుపుతున్న మనిషి తోడు
వచ్చిన మరొక మనిషితో తన భాషలో సంభాషణ సాగిస్తున్నడు. రాహుల్ గొప్ప పండితుడు, ఒక
వైపు సంజీవదేవ్ గారితో మాట్లాడుతూనే, మరొక వైపు బండి
మనిషి మాటలను విన్నట్టున్నరు. చేరవలసిన చోటికి చేరిన తరువాత బండి దిగినరు. వెంటనే
ఈయన బండి మనిషితో సంభాషణ మొదలుపెట్టినరు. ఆ మనిషి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు
చెబుతున్నడు. సంభాషణ హాయిగ సాగింది. సంజీవదేవ్‌గారు సాంకృత్యాయన్ గారిని “నీకు
లంబాడీభాష వచ్చునా?' అని అడిగినరు. రాహుల్ సాంకృత్యాయన్ చెప్పిన జవాబును మనమందరమూ గమనించాలె. బండి
మనిషి మాట్లాడుతున్నది గుజరాతీ భాష. అయితే అది కొంత మారింది. దారి వెంట మాటలను
విన్న ఈ పండితుడు ఆ మార్పును అర్థం చేసుకున్నడు. ఆయనకు గుజరాతీ వచ్చు. తనకు
తెలిసిన మాటలను గమనించిన మార్పులతో సహా బండి మనిషి మీద ప్రయోగించినరు. సంభాషణ
సాగింది. ఇక ఎక్కువ చెప్పనవసరం లేదు.
భాషలకు దేనికవిగా, చక్కని రంగు,రుచీ వాసనలు ఉంటయని నాకు గట్టి నమ్మకం. రైల్లో కూచున్నాను. ఎదురుగ ఒక జంట,
వారి ఇద్దరు పిల్లలు వచ్చి చేరినరు. గొడవగొడవగ మాట్లాడుతున్నరు. నాకు తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ, హిందీ, ఉర్దూ బెంగాలీలాంటి భాషలతో పరిచయం ఉంది. కనీసం విన్నమాట ఏ భాషలోది అన్నది
సులభంగా తెలుసు కోగలను. ఈ కుటుంబం మాట్లాడుతున్నది దక్షిణాది భాష కాదు. ఉత్తరాది
భాష అంతకన్నా కాదు. అందులో నాకెన్నో బాషలు వినపడుతున్నయి. మామూలుగానే కొంతకాలానికి
అక్కడున్న మిగతా వాళ్లందరితోనూ మాటలు కలిసినయి. అప్పుడు నేను సందర్భం చూచి వీళ్లు
మాట్లాడుతున్నది దక్షిణాది భాషలు, కొంచెం మరాఠీ కలిసిన ఒక భాష అన్నది
సూచించిన. అది కొంకణి లేదా తుళు అయి ఉండాలి అని నా అనుమానం. ఏదో ఒక పేరు చెప్పి
తప్పులో చిక్కడానికి నాకు భేషజం అడ్డువచ్చింది. వాళ్లు మాట్లాడుతున్నది కొంకణి అని
చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉండడం కారణంగ అది కూడా ఎంతో మారిందని ఆ పెద్ద మనిషి హాయిగ
నవ్వుతూ చెప్పినడు. భాషల రంగు, రుచి, వాసన
రుజువయింది!
భాష గురించి పద్ధతిగా పరిశీలించేవాళ్లు సెమాంటిక్స్ అనే ఒక పద్ధతిని గురించి
చెబుతారు. ఇది భాష నిర్మాణానికి సంబంధించిన విషయం.
ఇక సింటాక్స్ అనే వాక్యనిర్మాణ పద్ధతి మరొకటి ఉంటుంది. బాషల మధ్యన మాటలను
ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఈ రూల్స్‌ను జవదాటుతుంది. పెన్ అన్న ఇంగ్లీషు మాట హలంతము.
దాన్ని మనం పెన్ను అని అజంతంగ మార్చుకున్నము. పెన్నులు అని దానికి బహువచనం కూడా
ఏర్పరచుకున్నము. పెన్‌లు అనడం ఇబ్బందిగ ఉంటుంది. తమిళంలో “పెణ్' అంటే
అమ్మాయి అని అర్ధం! కనుక వాళ్లు పెన్నును పేనా అన్నరు. పెన్ మారలేదు. పేరు మాత్రమే
మారింది!
తోడల్లుని గురించి చెప్పడానికి మనవాళ్లు కోబ్రదర్ అని ఒక మాట వాడుతుంటరు.
ఇంగ్లీషువానికి తెలియని ఇంగ్లీషు మాట ఇది! జోక్ కాదు, ప్రపంచంలోని
అన్ని డిక్షనరీలలో వెతికినా ఈ మాట మీకు కనిపించదు. మనతో కలిసి పనిచేసే మనిషి
కోవర్కర్. మనతోబాటు ఒక మనిషికి అంటే మామగారికి అల్లుడయిన మరొక పెద్ద మనిషి, అయితే
గీతే, కో సన్ ఇన్ లా కావాలి. ఈ
కోబ్రదర్ ఎక్కడినుంచీ వచ్చిందో తెలియదు. గుండెలు గట్టిగ పట్టుకుని వినండి.
ఇంగ్లీషు భాషలో తోడల్లుడుగారిని బ్రదర్ ఇన్ లా అంటరు. భార్య తోబుట్టువును కూడా ఈ మాటతోనే పిలుస్తరు. కజిన్ అంటే వాళ్లకు
తేడా తెలియదు. మనకు మాత్రం బాబాయి కొడుకు వేరు, మామయ్య కొడుకు
వేరు. భాషలలోని రంగులో, రుచిలో, వాసనలో ఛాయలు కూడా ఉంటయన్నమాట! మన భాష నేర్చుకోవాలంటేనే గగనం అవుతున్నది. ఇక
మరో భాష నేర్చుకోవాలంటే, ఎంత కష్టమో ఆలోచించండి. కానీ, మనం చాలా భాషలు సులభంగానే
నేర్చుకుంటున్నము.
No comments:
Post a Comment