Saturday, September 26, 2026

లోకాభిరామం - కబుర్లు కాదు: On languages in India


కబుర్లు కాదు

ప్రపంచంలోని చాలామందితో పోలిస్తే, భారతీయులం అనే మనము భాషల విషయంలో చాలా వెసులుబాటు ఉన్నవాళ్ల కింద లెక్క. మన దేశంలోని వైవిధ్యం చాల గొప్పది. దేశంలో కావలసినన్ని భాషలు, అంతకు మించిన యాసలు ఉన్నయి. ప్రెంచ్‌ వారిలాగ, జెర్మన్‌లలాగ కేవలం ఒకే భాషతో బతుకుసాగించి ముగించేవారు మన దగ్గర ఉండరు. భారతీయులకు భాషా పటిమ మెండు. అంటే ఎక్కువని అర్థము లెండు.ఇక్కడ లెండు అన్నమాటకు లేవండి అని అర్ధం చెప్పుకుని ఫాయిదా లేదు. పోనిండు అంటే పోనివ్వండి అనే అర్థానికి బదులుగా లెండు అనే మాట వాడుతము. ఇంగ్లీషులో “లెండ్‌” అంటే అరువు ఇవ్వడమని అర్థం. మనం ఎన్నెన్నో మాటలను అరువు తెచ్చుకుని ప్రపంచాన్ని అర్ధం చేసుకుంటము.

ప్రపంచంలోని భాషలన్నీ మిగతా భాషలనుంచి మాటలను అరువు తెచ్చుకుని పెరుగుతుంటయి. పెరుగును చిలికి మజ్జిగ చేయడం ప్రపంచమంతట తెలుసు. వెన్నను కాచి నెయ్యి చేయడం మాత్రం అందరికీ తెలియదు. వెన్నను కాచి ద్రవంగ మార్చినంత మాత్రాన నెయ్యి రాదు. దాన్ని ఒక పద్ధతి వరకూ మరగబెట్టాలె. మాడకముందు దింపి చల్లబరచాలె. ఈ తతంగమంతా ఇంగ్లీషువాడికి తెలియదు. నెయ్యి రుచి అంతకన్నా తెలియదు. కనుకనే మొదట్లో నేతిని 'క్లారిపైడ్‌ బటర్‌” అన్నడు. ఇది సరిగా లేదని తోచి ఘీ అన్న మాటను ఏకంగ డిక్షనరీలోకి కూడా ఎక్కించినడు. జమీన్‌దార్‌, బాండికూట్‌ లాంటి మాటలెన్నో వెబ్‌స్టర్‌, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలలో కనబడతయి. అసలు నిజానికి డిక్షనరీ కొత్త ఎడిషన్‌ వచ్చినప్పుడల్ల, అందులో చేరిన కొత్త మాటలను గురించి చర్చించడం ప్రపంచమంతట పండితులకు అలవాటు. “జగ్గర్‌నాట్‌' అని ఒక మాట ఉన్నది. ఇది నిజానికి తెలుగువారికిగాని, ఒరియావారికిగాని పరిచయం లేకపోవచ్చు. జగర్‌ అంటే దారిలో వచ్చిన అడ్డులన్నింటినీ తొక్కేస్తూ ముందుకు కదిలే మహత్తరమయిన శక్తి అని అర్థం. వస్తున్నాయ్‌, వస్తున్నాయ్‌... అంటూ శ్రీశ్రీగారు పతితులకు, భ్రష్టులకు, బాధాసర్పదష్టులకు నమ్మకమిచ్చిన రథం మీద ఎక్కిన జగన్నాథుడు ఈ “జగర్‌నాట్‌”. జగన్నాథరథం ముందు కదలదు, కదలడం మొదలయితే, ఇక ఆగదు. అడ్డువచ్చినవారిని అణగగొడుతుంది. ఇది ఒకప్పటి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగ పుట్టిన మాట మీకు అన్ని ఇంగ్లీషు డిక్షనరీలలోనూ దొరుకుతుంది. ఇది భాష, భావం అర్థాల బలం.

జమీన్‌దారుగారు ముద్దాయిని హాజరు పరచమని హుకుం జారీ చేశినరు, అన్న వాక్యాన్ని ఆధారంగ ఒకప్పుడు వ్యాసం రాసినట్టు గుర్తుంది. ఈ వాక్యంలో అన్నీ తెలుగుకాని మాటలే. అవి తెలుగుకాదని అంతుపట్టనివారే ఎక్కువ. జమీన్‌రైతు అని ఒక పత్రిక కలకాలంగ ఉన్నది. జమీన్‌ అంటే నేల. నేలను కాక రైతు ఆకాశాన్ని దున్నుతడా? జామీన్‌ అని ఇంకొకమాట ఉంది. ఒక విషయంలో ప్రత్యక్షంగా నిలిచిన మనిషికి మరొకరు పక్కన ఉండి నమ్మకం కలిగించేట్టు మాట ఇస్తే, దాన్ని జామీన్‌ అంటారు. ఇట్ల, తెలియకుండనే రకరకాల భాషల నుంచి మాటలు వచ్చి తెలుగులో చేరినయి. తెలుగు మాటలు మిగతా భాషల్లో చేరినయి.

సరిహద్దుప్రాంతాల ప్రభావం కారణంగా తెలుగులో రకరకాల మాటలు వచ్చి చేరుతయి. కన్నడ ప్రాంతానికి కలిసిన ప్రాంతాలలో కన్నడం మాటలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అక్కడివారు సులభంగా అటు తెలుగులోను,ఇటు కన్నడంలోనూ మాట్లాడేస్తుంటరు. రెంటిని కలిపిన ఒక మణిప్రవాళ భాష కూడా పుడుతుంది. కేశవరెడ్డిగారు చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత. పనివాళ్లచేత ఇది ఆడిమాసం అనిపిస్తడు. తెలంగాణలో ఆడ, మగ అనే మాటలను ఆడి, మొగ అనే అలవాటు ఉన్నది. తమిళం గురించి తమిళ నెలలను గురించి తెలియనివారు, రెడ్డిగారి నవలలు చదువుతుంటే ఆడ నెలలు, మగ నెలలు ఉంటయా అన్న అనుమానంలో పడిపోకతప్పదు! వెంటనే ఆయన వయ్యాసి అన్న నెల పేరు కూడా చెపుతరు. అప్పుడు అనుమానం వస్తుంది. “రాముడుండాడు, రాజ్జిముండాది” లో యువకుడు అరవదేశం వెళ్లినడంటరు. నవలలు మొత్తంలోనూ తమిళ ప్రభావం అందంగా కనబడుతుంది. అర్థం చేసుకుంటే తప్ప, గజిబిజి పుడుతుంది. అర్ధమయిన తరువాత, అందం తోస్తుంది. తెలియని భాషలను, భాషారూపాలను, యాసలను కొంచెం ఓపికగ పట్టించుకుంటే, కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. హిందీ, ఉరుదూ (ఉర్దూ అనాలి) రెండు కలగలిసిన హిందూస్తానీ వద్దనుకున్నా, దేశంలో అందరికీ కొంతవరకయినా తెలిసే ఉంటయి.

నూరుపాళ్లు తమిళుడు అనుకున్న ఒక తంబుడు అనగా తమ్ముడు అనగా తంబి ఒక సందర్భంలో నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అక్కడికి తమిళులకు హిందీ అసలు పట్టదు అని నేను అనుకోవడం గుర్తుకువచ్చేట్టు చేసినడతను. అతను ఇచ్చిన ఒక సామగ్రి గురించి నా అసంతృప్తి వ్యక్తం చేశాను.

“ఖాన్‌ మే కోయిలా భీ మిల్తా హై” అన్నడతను. ఎంతటి ప్రతీకాత్మకమయిన బాష అది! వజ్రాలకని గని తవ్వితే బొగ్గుకూడా దొరుకుతుందని చెప్పి నన్ను అతను మురిపించినడు. ఆ తరువాత ఆయనకు ఎంత హిందీ వచ్చును అన్న పరీక్షకు నేను దిగదలచుకోలేదు. అసలు హిందీ రాదు అనుకున్న ఒక తమిళ మహిళ “ఓ క్యా బిగాడేగా? అన్నప్పుడు నోరు వెళ్లబెట్టడం నా వంతయింది. భాషలు తెలియడమేకాదు, వాటిలోని అందాలను అందుకుని సందర్భం ప్రకారం వాడడం మనకు బాగా వచ్చు.

భారత దేశంలోవాళ్లందరికీ కనీసం రెండు లేదా మూడు భాషలతో పరిచయం ఉండి తీరుతుంది. మాతృభాష, హిందీ ఇక ప్రపంచాన్ని నడిపించే ఇంగ్లీషు, ఇవి అందరికీ కొంతయినా వచ్చి ఉంటయి. వైద్యం రానివారు, పాట తెలియనివారు లేరని ఒక మాట ఉన్నది. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులను చిట్కా వైద్యంగ వాడడం నిజంగనే చాలామందికి తెలుసు. ఠండే ఠండే పానీమే స్నానమాడేటప్పుడు కనీసం పాడని వారు ఉండరు. అట్లాగే తమది కాని భాషలో మాట్లాడనివారు కూడా ఉండరని మనవాళ్లందర కలిసి ఏకతాటిపై నిలిచి, మూక ఉమ్మడిగ నొక్కి వక్కాణిస్తుంటరు. తెలిసినా తెలియకున్నా, అన్యభాష పదాలను పుష్కలంగా పంచి పెడుతుంటరు. ఏ కొంచెం ప్రయత్నించి నేర్చుకున్నా ఆయా భాషలలో మంచి పాండిత్యాన్ని సంపాదించుకుంటరు. నెహ్రూ, గాంధీగారుల ఆంగ్ల రచనలకు ప్రపంచమంతటా ఉన్న గౌరవం తెలిసిందే. వచ్చీరాని ఇంగ్లీషులో మళయాళీ నవల చెప్పిన ఒక అక్కగారికి ప్రపంచస్థాయి బహుమతి వచ్చేసింది. మనవాళ్లు చాలామంది ఇంగ్లీషులో కవులుగ, రచయితలుగ గొప్ప పేరు తెచ్చుకుంటున్నరు. అనువాదకులుగా కూడా పేరు తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నయి. దక్షిణభారతీయులు దేశంలో మరెక్కడో స్థిరపడి అక్కడి భాషలను నేర్చుకుని అందులో పేరు సంపాదించుకోవడం కూడా చాలా మామూలు విషయంగ కనబడుతుంది. ఇది “ఇట్‌ హాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా అనదగ్గ పరిస్థితి. రాంగేయ రాఘవ్‌ అనే ప్రసిద్ధిచెందిన హిందీ రచయిత నూటికి నూరుపాళ్లు తెలుంగు మనిషి. ఆయన రచన “కబ్‌ తక్‌ పుకారూ' (మన కంప్యూటర్లలో అర సున్నకు చోటు లేదు మరి!) అన్న నవల టీవీ సీరియల్‌గా ఒకప్పుడు దేశాన్ని ఒక కుదుపుకు గురిచేసింది. ఒక తెలుగు సోదరుడు హిందీ రచయితగ ఇంత పని చేశాడంటే అది మన భాషాపటిమకు చక్కని ఉదాహరణ. మొదలుపెట్టాలేగాని, ఇట్ల లెక్కించేందుకు ఎంతో మంది, ఎన్నో భాషలలో ప్రావీణ్యం సంపాదించినవారు ఉన్నరు.

పడమటి దేశాలవారు కేవలం ఒకే భాషతో బతుకు ముగిస్తరు. వారికి మరొక భాష నేర్చుకోవాలన్న ఆలోచన కూడా కలగదు. కనుక భాషల మీద అసహ్యం కూడ మొదలవుతుంది. రాజకీయ కారణాల వల్ల కెనడాలో ప్రెంచ్‌ మాట్లాడుతరు. మరికొన్ని చోట్ల స్పానిష్‌ మాట్లాడుతరు. వాళ్లకు ఆయా భాషలమీద ప్రేమ ఉండి మాత్రం కాదు. ఒకే భాషతో మొత్తం జీవితం గడిపే వారి మధ్యకు ఆసియాదేశాలవారు వెళ్లి అక్కడి భాషను కూడ నేర్చుకుని అదరగొడుతుంటరు.

అదనపు భాష ఈ ప్రపంచమనే దృశ్యాన్ని చూడడానికి మరొక కిటికీ అన్నరొకరు. కొత్త భాషతో కొత్త భావజాలం అర్థమయ్యే వీలు కలుగుతుంది. మన దేశంలో ఇది అవసరంగ మారింది. కనుక మనకు ఎక్కువ భాషలు రావడం వింతకాదు. చేతయినది కనుక మరికొంతమంది మరిన్ని భాషలు నేర్చుకుంటరు. పాతకాలంలోనే కొల్లాపురంలో రాజావారికి అష్టభాషా బహిరీ గోపాలరావుగారని పేరు ఉండేది! ఆయన ఎనిమిది భాషలు నేర్చుకున్నరు. పి.వి గారు మరిన్ని భాషలు నేర్చుకున్నరు. సాంబమూర్తిగారు ఎవరికీ తెలియరు. కానీ, ఆయన ఇరవయి అయిదు భాషలు నేర్చినరట. ఆశ్చర్యం లేదు.


 

No comments:

Post a Comment