లోకాభిరామం : తరం - ఉత్తరం - ఉత్తరం
రంగువేసిన
కవితా?
‘ప్రపంచంలోని కవితలన్నీ కృష్ణశాస్త్రికి
వచ్చు, అయినా చూడలేను ఆయన రంగు వేసిన బొచ్చు!’
అవును, ఈ కవిత అచ్చంగా దేవులపల్లి
కృష్ణశాస్త్రిగారి గురించి రాసిందే. అయితే ఆ రాసిన మనిషి సాహితీవేత్త మాత్రం కాదు.
నిజానికి తెలుగు చదవనూ, రాయనూ రాని మనిషి. కృష్ణశాస్త్రిగారి తల
ముగ్గుబుట్టలాగ పండిపోయింది. ఆయన దానికి రంగు వేసేవారు. అయితే బద్ధకించి మధ్యలో
తెలుపు కనిపిస్తున్నా అలాగే వదిలేసేవారు. రామాయణంలో కాకపక్షం అని వర్ణించినట్టు
రెండు వేపులా పెరిగిన జుట్టు, నడిమి పాపిట్లో నుంచి మాత్రం కొంతదూరం
తెల్లని తెలుపు. అది చూడలేక ఆలిండియా రేడియోలోనే పనిచేస్తున్న వేణు విద్వాంసులు, తరువాత
నాకు ప్రాణమిత్రులయిన ఎన్ ఎస్ శ్రీనివాసన్ ఈ కవిత చెప్పారు. ఆగ్డెన్ నాష్ లిమరిక్కుల
ప్రభావంతో, సరదాగా చెప్పిన కవిత అది.
కృష్ణశాస్త్రికి మాత్రం తాను ప్రపంచ కవితలను కాపీగొట్టి తెలుగులో రాస్తున్నాడని
ఎత్తిపొడిచిన భావం కలిగిందట ఈ కవిత విని. కాటూరి వెంకటేశ్వరరావు గారితో ఆ మాట
అన్నారట కూడా. తెలుగే తెలియని కుర్రవాడు సరదాగా మాత్రమే చెప్పాడు, అని
సర్ది చెపితే కోపం తగ్గించుకున్నాడట ఆయన.
రూమీ-సదాశివ:
నేను ఈ కాలమ్‌లోనే పారసీక కవి, తాత్వికుడు రూమీ గురించి రాశిన. నా
మూర్ఖత్వాన్ని బయట పెడుతూ, రూమీకి తెలుగు అనువాదాలు వచ్చినయా అని
ఏదో రాసినట్టున్న. మిత్రులు, పెద్దలు స్వర్గీయ సామల సదాశివ, కుమారులు
శ్రీవర్ధన్, రాజవర్ధన్ ఇద్దరు అదే రోజు ఫోన్‌లో
ఆదిలాబాద్‌నుంచి నాతో మాట్లాడినరు. సదాశివగారు రూమీ మస్నవీని తెలుగు చేసినరని
చెప్పినరు. ఈ సంగతి నాకు సూచనగా తెలుసు. ఎందుకు మరిచిననో తెలియదు. సదాశివ సారు, రూమీ
మస్నవీని పద్యాలలోకి రాసినరు. ఆ పద్యాలు ఆణిముత్యాలు. రాజవర్ధన్ ఈమధ్యన ఆ పద్యాల
పుస్తకం ఫోటో కాపీ చేయించి నాకు పంపించినడు. దానితోబాటు సారు గురించి వేసిన జయంతి
ప్రత్యేక సంచిక, సదాశివ స్మృతి అనే పుస్తకాలు కూడ పంపినడు.
రాజవర్ధన్‌కు నేను ధన్యవాదాలు చెపితే రుణం తీరదు. వాండ్ల నాయన గారికి నామీద ఉండిన అభిమానం తనకు
తెలుసు!
చిత్రం:
రాజవర్ధన్ తన పరిశోధనలో మధురాంతకం రాజారాంగారి కథల గురించి కృషి చేసినడు.
నాయనగారి సలహా మేరకు, రాజారాం గారి వద్దకు స్వయంగ పోయి, చర్చించి, వాళ్లింట్లో
ఒకడయిపోయి, అప్పుడు సిద్ధాంత వ్యాసం రాసినడు. కానీ, ఒక
సంగతి రాజవర్ధన్‌కు తెలిసి ఉండక పోవచ్చునని నా అనుమానం. సదాశివ సారుకు
చాలామంది తోటి ఉత్తరాల ద్వారా మైత్రి సాగేది. వారిలో కొందరిని ఆయన కలవనే లేదు. అందులో
మధురాంతకం రాజారాం గారు, వాకాటి పాండురంగారావుగారు కూడ ఉన్నరు.
హైదరాబాద్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, వివేక్‌నగర్‌లో
ఒక కథకుల సమ్మేళనం జరిగింది. అప్పుడప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
అందుకున్న రాజారాం గారు అక్కడికి వచ్చినరు. ఇంకా ఎంతోమంది కూడా వచ్చినరు.
కార్యక్రమం బాగ జరిగింది. అసలింతకు ఆ ప్రసక్తి ఎందుకో చెప్పాలెగద. కార్యక్రమం ఇంకా
మొదలు గాలేదు. నేను అందరినీ పలుకరించుకుంటు తిరుగుతున్న. సదాశివ సారువచ్చి వెనుక
వరసలో కూచున్నరు. నేను ఆదిలాబాదులో ఉద్యోగం చేసినందుకు మిగతా ఏమి ఒరిగిందో తెలియదు
గాని, రెండు ఉపకారాలు జరిగినయి. మొదటిది, నాకు
నౌకరీ మీద సంపూర్ణమయిన ఏవగింపు కలిగింది. రెండవది నాకు సదాశివగారి పరిచయము, మైత్రి
ప్రాప్తించినయి. ఆ బలంతో నేను పరుగున పోయి, ‘ఇక్కడుంటే ఎట్ల? మీరు
ముందరికి రావాలె’ అన్నట్లున్న. ‘నన్నెవరు గుర్తుపట్టరు గద. ముందరికొచ్చి ఏంజేస్త?’ అని
అడిగినరాయన.
‘అట్లగాదు, రాండి’
అని చెయ్యి పట్టుకుని తీసుకుపోయి వాకాటికి, రాజారాంగారికి, ఆయన
పేరు చెప్పిన అంతే. వారికి పరిచయం చేసిన, అని గనుక నేను అంటే, అంతకంటే
పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండదు. వాండ్ల ముఖాలలో కనిపించిన ఆనందం నేను మరువలేను.
అందరము, కిందకు వచ్చి, ముందున్న
లాన్‌లో కూచుని ముచ్చట్లు పెట్టినము. ఆ కాలంలో ఈ సెల్‌ఫోన్‌లు లేవు, వాటిలోగానీ, నేరుగా
గానీ, మా దగ్గర కెమెరాలు లేవు. ఫోటోగ్రాఫరు
వచ్చేలోపల రాజారాం గారికి పిలుపు వచ్చి హాలులోకి వెళ్లినరు. మేమంత ఫోటో
తీయించుకున్నము. చిత్రం గదా!
తెలుగు
పత్రికల్లో హిందూస్తానీ సంగీతం: వాకాటికి, సదాశివగారి పట్ల గొప్ప గౌరవం. అందులో
విచిత్రం లేదు. కానీ, ఆయన ఒక పత్రిక సంపాదకుడు. తలుచుకుంటే
తలుచుకున్న సంగతి గురించి, తలుచుకున్న వారి చేత రాయించి
ప్రచురించగలరు. అదే జరిగింది. హిందూస్తానీ సంగీతం గురించి, తెలుగు
పాఠకులు చదువుతరా? అని అనుమానం మొదట్లో వచ్చిందేమో? కానీ
సదాశివసారు రాసిన సంగతులను అందరూ తలకెత్తుకున్నరు. ఆయనను, సంగీతం
గురించి రాయమని ఒత్తిడి చేసిన వాండ్లలో నేను మొదటి వాణ్ని అని నేను చెప్పుకోవలసి
రావడం, నా దురదృష్టం. ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు
మేము సంగీతం గురించి, సాహిత్యం గురించి ఎన్ని గంటలు
మాట్లాడుకున్నమో, రాజవర్ధన్ వంటి వారికి గుర్తుండే
ఉంటుంది. ‘సాయంత్రం రాండి, ఒక కొత్త చీజ్ వినిపిస్త’ అని చిన్న
చీటీ వచ్చేది నాకు. నేను రెక్కలు కట్టుకుని వాలేవాణ్ని. ఇక్కడి ఈ చీజ్ ఇంగ్లీషులో
తినేది కాదు. ఉరుదూలో వినేది. సదాశివగారికి హిందుస్తానీ మీద గురి ఎక్కువ. నాకు
కర్నాటకంతో ఉన్న పరిచయం హిందుస్తానీతో లేదు. ఇప్పటికీ లేదు. కానీ వినడం మాత్రం
హిందూస్తానీయే సుఖంగా జరుగుతుంది. ఈ సంగతి గురించి ఎంతో చర్చ జరిగింది. అక్కడ
వచ్చిన సంగతులు, ఆయన లోనే మిగలకూడదు. అందరూ వినాలని నా
వాదం. చివరికది గెలిచింది.
నేనున్నాను:
సదాశివ సారు తమ పుస్తకాల్లో నా పేరు కూడ ఒకటి రెండు చోట్ల రాసినరు. అది నాకు
గొప్ప. అంతకంటే గొప్ప ఇంకొకటి ఉన్నది. చెప్పాల్నో, చెప్పగూడదో
తెలియదు. సదాశివ సారు, నేను ఉత్తరాలు చాలానే రాసుకున్నము. కానీ
ఆయనకు రాను రాను రాత వీలుగాకుండ అయింది. ఫోన్ చేస్తే కూడ ఎక్కువసేపు
మాట్లాడలేకపోవడం గమనించిన.
పేపర్లో
‘సదాశివకు అవార్డు’ అన్న వార్త చూచిన. పెద్దాయనను ఇంత పొద్దున్నె చికాకు
పెట్టేదేమి అని వెంటనే ఫోన్ చేయలేదు. అంతలో ఫోన్ మోగింది. ‘ఇంత అన్యాయముంటదా? ముబారక్
చెప్పరా!’ ఇవి ఆయన అక్షరాలా అన్న మాటలు. ఏవో మాటలు నడిచినయి. అయినా మీరు లేకుంటే, ఆ
పుస్తకాలు ఎక్కడినుంచి వస్తుండే, గానీ’ అన్నారాయన. నా కళ్లలో నీళ్లు
సుడులు తిరిగినయి. ఇంతటి మంచితనమా? నా గొంతు వణికింది. ‘ఇంక టిఫిన్ దింట.
పెట్టేస్తున్న’ అన్నది ఆయన నోట నేను విన్న చివరి మాట. ఆదిలాబాదుకు పొయ్యి సారును
చూడాలెనని మనసు పీకుతునే ఉన్నది. ఇద్దరు దోస్తులతోటి ఈ సంగతి మీద మాటలు కూడ
నడిచినయి. మనువడు కార్తీక్ పెండ్లికి, సారు, హైదరాబాద్
వస్తరనుకుంటే రాలేక పోయిరి. ‘నేను రాకుంటెనేమి. మీరు పెండ్లికి పోవాలె’ అని
ఫోన్లోనే చెప్పినరు. పెండ్లికి పోయినప్పుడు రాజ వర్ధన్‌తో ‘ఆదిలాబాద్‌కు వస్తము’
అని కూడ చెప్పినట్లున్న.
నేను
ఉద్యోగం ఏనాడో వదిలిన. సారు లోకాన్ని వదిలినరు. ఆదిలాబాద్‌లో ‘యాది’ మిగిలింది.
ఆదిలాబాద్ యాదిలో మిగిలింది. సారు కొడుకులు తేనెతుట్టె రేపినరు. ఆలోచనలు
ముసురుకుంటున్నయి.
ఉత్తరం:
యాది సదాశివసారు ఉత్తరం రాస్తే, అదొక వ్యాసం. అందులో ఒకటి రెండు తప్ప
వ్యక్తిగతం మాటలుండవు. ఆయన ప్రభావం మనసులో ఉందనుకుంట. ఆశారాజు కవితా సంకలనం ‘పాగల్
షాయర్’ వచ్చిన తరువాత నేనొక ఉత్తరం రాసి బ్లాగులో పెట్టిన (2010లో). మీరూ చదవవచ్చు దాన్ని. ‘రాజూ! కలంతోని గాక, మనసుతో, మాటలను
మాలగట్టిన వాండ్లంత పాగల్ గాక మరేమవుతరు? నీ ఒక్క పహిల్వాన్ పోయెం జాలు. ఓ
గ్యానపీఠం ఇయ్యవచ్చు దానికి. ‘ఇప్పుడు శత్రువుక్కూడా మిత్రుడిని.’ ఎంత మాటన్నవు
అన్నా! నిన్ను భుజంమీద ఎక్కించుకుని గల్లీ గల్లీ జులూస్ చేయాలనిపించింది.
రాజూగైడ్, ఒగరు, పాగల్
షాయర్‌లలో నీ ఎక్స్‌ప్రెషన్ ఒక ఉన్నత శిఖరానికి చేరింది. కిందికి దిగకు.’ అంటూ
సాగుతుంది ఆ ఉత్తరం. నిజానికి నేను రాసిన ఉత్తరం పోస్టు చేయలేదు. ఆ సంగతి నాకు
తరువాత తెలిసింది. కానీ ఆశారాజు నా ఉత్తరాన్ని చదివినడు. ఇప్పటికీ
కనిపించినప్పుడంత ఇద్దరమూ మాటలు పంచుకుంటము. అభిమానాన్ని అంతకంటే ఎక్కువగ
పంచుకుంటము.
No comments:
Post a Comment