Friday, May 15, 2026

సూపర్ ఎల్ నీనో వస్తున్నదా? On the impending 'Super El Nino".


సూపర్ ఎల్ నీనో వస్తున్నదా?



సూపర్ ఎల్ నీనో వస్తున్నదా

 

పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా బహుశా సూపర్ ఎల్ నీనో అనే వాతావరణ సన్నివేశం బహుశా వస్తున్నది. దాని ప్రభావంగా ఎన్నడూ లేనంతగా ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

గత కొంతకాలంగా వాతావరణం గురించి పరిశోధనలు జరుగుతున్న చోట్ల అంతటా చాలా బలమైన ఎల్ నీనో వాతావరణ పరిస్థితి, ఈ సంవత్సరం రెండవ భాగంలో రావచ్చు, అన్న సూచనలు అందుతున్నాయి. అది మరి ముందు ఎప్పుడూ లేనంతగా బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు.

ఈ పరిస్థితిని కొందరు గాడ్జిల్లా ఎల్ నీనో అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరువులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవత్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టు వారి అంచనా.

అసాధారణమైన వాతావరణ పరిస్థితులు రాబోతున్నాయి, అని ఈ విషయం గురించి వ్యాఖ్యానించిన యునైటెడ్ కింగ్డమ్ వారి నేషనల్ వెదర్ సర్వీసెస్ పరిశోధకులు ఆడం స్కైఫే అంటున్నారు.

ఎల్ నీనో అన్నది ప్రపంచ వాతావరణంలో మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతటా వాతావరణంలో వింత పరిస్థితులు కనబడతాయి. ఉష్ణ మండల ప్రాంతంలోని శాంతి మహాసముద్రం అంటే పసిఫిక్ మీద తూర్పు నుండి పడమటి వైపు వీచే వ్యాపార పవనాలు బలహీనమవుతాయి. అందువల్ల సముద్రంలో లోతులలోనున్న చల్లని నీరు పైకి చిమ్ముకు రావడం బాగా తగ్గుతుంది. కనుక ఉపరితలంలో ఉన్న వేడి నీరు పసిఫిక్ సముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాలలోకి బలంగా కదులుతుంది. మొత్తానికి వాతావరణంలో ఎప్పటిలాగే కలిగే చలనం కొంత తూర్పు వైపుకు కదులుతుంది.

శాంతి మహాసముద్రం మధ్యభాగంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సగటుగా ఉండే స్థాయి నుంచి అర డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది. అప్పుడు ఎల్ నీనో మొదలవుతుంది. అంటే గాలి కదలికలో తేడాలు వస్తాయి. ఆ మార్పు అలా రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ చేరితే అది బలమైన ఎల్ నీనో పరిస్థితి కింద లెక్క. దాన్నే సూపర్ ఎల్ నీనో అంటారు. ఎల్ నీనో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తుంది అనుకుంటున్న తీవ్రమైన పరిస్థితి 1982-83, 1997-98 ఆ తరువాత 2015-16లలో వచ్చింది.

 

సూపర్ ఎల్ నీనో వచ్చే అవకాశం గురించి చాలా చోట్ల పరిశోధనలు జరుగుతున్నాయి. మార్చి నెలలోనూ ఏప్రిల్ మొదటి భాగంలోనూ పడమటి దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చని నీరు మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాలకు బలంగా కదులుతున్నది. నిజంగా బలమైన ఎల్ నీనో రావడానికి ఇది ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ మాసం కల్లా ఉష్ణోగ్రతలో తేడా రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు గమనించారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ క్యాస్ట్ వారు బలమైన ఎల్ నీనో వచ్చే పరిస్థితి 50 శాతం వరకు ఉండవచ్చు అని అనుమాని స్తున్నారు.

ఇక యు ఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వారు ఆ అవకాశం 25 శాతం మాత్రమే ఉంది అంటున్నారు. యూరోప్ లోని గ్రూపులు మరింత తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు వస్తాయని, వేడి మూడు డిగ్రీలు సెంటీగ్రేట్ చేరుతుందని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈసారి ఎల్ నీనో తీరు ఎన్నడూ లేనంత బలంగా ఉంటుంది. మే మాసం గడిచి, జూన్ మాసంలో సగం తరువాత ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పే వీలు ఉంటుంది అంటున్నారు.

 

ఇంతకు దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది

మధ్య, తూర్పు శాంతి మహాసముద్రం మీద జరుగుతున్న మార్పులు కలుగజేసే ప్రభావం, టెలికనెక్షన్స్ అనే పద్ధతి ద్వారా ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ప్రపంచమంతటా వాతావరణ పద్ధతి, శీతోష్ణ స్థితులు బాగా మార్పులు చూపుతాయి. ఫలితంగా పంటలు సరిగా పడకపోవడం, సముద్రతీరాలలోని పగడపు కొండలు బ్లీచ్ కావడం మొదలు ఆయా ప్రాంతాలలో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి.

పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది. మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు. అంటారు పరిశోధకులు టిమ్ స్టాక్ డేల్. పెద్ద ఎత్తున తుఫానులు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు అంతకు ముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు, అంటారాయన.

మొత్తానికి ఉత్తర, దక్షిణ అమెరికాలలో, అటు ఆఫ్రికా, చైనాలలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలోని మధ్య దక్షిణ ప్రాంతాలు, భారతదేశం, అమెజాన్లలో  వర్షాలు మొదలైన చోట్ల పొడి వాతావరణం బాగా పెరిగి కరువులు, హీట్ వేవ్ లు, అడవులు తగలబడడం లాంటివెన్నో జరగవచ్చు.

యూకే, యూరోప్ లలో ప్రభావాలు మరింత బలంగా ఉంటాయి. అక్కడ వేసవి వేడి మరింత తీవ్రంగా, చల్లును కూడా మరింత తీవ్రంగా ఉండే వీలుంది. చలికాలంలో తేమ ఎక్కువయ్యి అనుకూలం కాని పరిస్థితులు ఎదురు కావచ్చు. వాతావరణంలోని మిగతా అంశాల ప్రభావం ఈ పరిస్థితుల మీద ఉంటుందని అర్థం చేసుకోవాలి.

వాతావరణం మారుతున్నది, ప్రపంచం వేడెక్కుతున్నది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. ఆ పరిస్థితి సముద్రంలో తీరానికి తోసుకువస్తున్న ఒక అల లాంటిది అయితే, ఈ ఎల్ నీనో అన్నది ఉవ్వెత్తున వచ్చి ముంచెత్తే చాలా పెద్ద అల అని చెప్ప వచ్చు. కనుక కలిగే మార్పులు పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రపంచ మొత్తం మీద వేడిమి రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ పెరిగే వీలు బలంగా ఉంది.

2024 సంవత్సరంలో ఎల్ నీనో వచ్చింది. ఆ సంవత్సరంలో మునుపెన్నడు లేనంతగా ప్రపంచ వాతావరణ వేడెక్కింది. ఇక అంటున్నట్టు ఈ సూపర్ ఎల్ నీనో కాని వచ్చిందంటే అది మరొక కొత్త రికార్డ్ అవుతుంది.

ఎల్ నీనో వల్ల వేడి పెరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా లా నీనా అనే పరిస్థితి కూడా ఉంది. ఈ రెండు పరిస్థితులు గత 50 - 60 సంవత్సరాలలో అంతకుముందున్నడు లేనన్ని మార్లు వచ్చాయి. కానీ వాతావరణం గురించి పరిశోధించిన వివరాలు 150 సంవత్సరాల మేర మాత్రమే ఉన్నాయి. అందులో కూడా మొదట్లో చేసిన పరిశోధనలు అంత నమ్మదగినవి కావు అన్న అనుమానాలు ఉన్నాయి. అప్పటి గణాంకాలు సరిగా లేవని అనుమానం. కనుక వాతావరణ మార్పు వల్ల ఈ ఎల్ నీనో, లా నీనాలు, వస్తున్నాయని, వాటి వల్ల వాతావరణం మారుతున్నదని, గట్టిగా చెప్పడానికి కొంతమంది పరిశోధకులు అభ్యంతరం చెబుతున్నారు.

మొత్తానికి ప్రపంచం వేడెక్కుతున్న తీరు వల్ల, వస్తున్న ప్రభావాలు బలంగా కనబడు తున్నాయి. ప్రపంచమంతటా వేడి పెరిగితే నేల నుండి తేమ ఇగిరిపోతుంది. చుట్టూ ఉన్న వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఫలితంగా కరువులు, వరదలు వస్తాయి. మొత్తానికి ప్రపంచమంతటా జల చక్రంలో బలమైన మార్పులు కనబడుతున్నాయి అంటారు స్టాక్ డేల్. ఎల్ నీనో కారణంగా వర్షాలలో తేడా వస్తుంది. కనుక వాతావరణం, శీతోష్ణస్థితులలో మార్పులు తప్పవు, అని కూడా అంటారాయన.

 


 

No comments:

Post a Comment