Friday, January 2, 2026

పెరుగు సైన్స్ - curds and Science : An article in Telugu

పెరుగు - సైన్స్

How much do you know about the curds that you eat?

పెరుగు - సైన్స్‌

ఈ మధ్యన నాలుగైదు రోజులుగా పెరుగు సరిగా తోడు కోవడం లేదు. అవును మరి! నాలుగైదు రోజులుగా వాతావరణం మళ్ళీ కొంచెం చల్లబడింది. చలికాలం అంటూ లేకుండానే ఎండకాలం తరుగుతున్న తరుణంలో మళ్ళీ కొంచెం చలి మొదలైంది. చలి దుస్తులు తెచ్చుకున్న వాళ్లకు సంతోషం కలిగింది. వాటిని ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

ఉన్నట్టుండి మళ్లీ చలి మొదలు కావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాతావరణ శాస్త్రం అని చెబుతారు. సముద్రంలో మార్పులు, అక్కడి నుండి వచ్చే గాలిలో మార్పులు, ఆ గాలికి కొండలు అడ్డు రావడం, ఈలోగా మబ్బులు తయారుకావడం, మొత్తానికి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, ఇవన్నీ కలిస్తే వాతావరణ శాస్త్రం అవుతాయి. తత్వం చెప్పినట్టు ఇక పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొందము గాక అని మొదలు పెడితే, చాలామంది చెవులు మూసుకుంటారు. వాతావరణ శాస్త్రం చెబుతాను అని మొదలు పెడితే ఎవరు వినరు. ఎవరూ చదవరు.

ఎక్కడ మొదలు పెట్టాము? పెరుగు దగ్గర మొదలు పెట్టాము! మొదటి మాటల్లోనే వాతావరణ శాస్త్రంలోకి వెళ్ళిపోయాము. అందులో బోలెడంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం కలగలిసి ఉంటాయని చెబితే, ఆశ్చర్య పడని వాళ్ళు, ఇంకేం చెప్పినా ఆశ్చర్య పడరు. మళ్లీ పెరుగు దగ్గరికి వెళ్లిపోతాము. పాలలో, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేస్తే మరునాటికి అది పెరుగుగా మారుతుంది. ఏం పెరిగిందని, పాలు, పెరుగుగా మారినవి? జవాబు వినడానికి కొంతమందికి ధైర్యం అవసరం. పెరుగు లేదా మజ్జిగలో లాక్టోబాసిల్లస్‌ అనే సూక్ష్మ జీవులు ఉంటాయి. వాటి కారణంగానే పెరుగు పెరుగు అవుతుంది. కొంచెం పెరుగును పాలలో వేస్తే, అక్కడ సూక్ష్మజీవులు పెరుగుతాయి. విపరీతంగా సంఖ్యలో పెరుగుతాయి. కనుక దాని పేరు పెరుగు అవుతుంది. పప్పు తినేవాళ్ళకు తాము సూక్ష్మజీవులను మహా ఇష్టంగా తింటున్నాము అని తెలిస్తే బహుశా కడుపులో తిప్పవచ్చు. అందుకని పాలు పెరుగు లేని, వీగన్ తిండి అని ఒకటి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనకు అవసరం లేదు. మొత్తానికి పెరుగు తయారీలో జీవశాస్త్రం, అందులో సూక్ష్మజీవశాస్త్రం ప్రత్యక్షంగా మనముందు పని చేస్తున్నదని అర్థం చేసుకోవాలి. అందుబాటులో సూక్ష్మదర్శిని అనే మైక్రోస్కోప్‌ ఉన్నవాళ్లు ఒక పెరుగు చుక్కను స్లైడ్‌ మీద వేసి దాని కింద పెట్టి చూడాలి. లుక లుక లాడుతూ కావలసినన్ని సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పప్పు తినే వాళ్ళు ఇక ఆ తరువాత పెరుగు తినడానికి అనుమానం రావచ్చు. ఇది కూడా ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు.

 పెరుగులో, కనీసం పెరుగు తయారీలో, కావలసినంత రసాయన శాస్త్రం, మరింత భౌతిక శాస్త్రం కూడా ఉన్నాయి. పాలలో ఉండే ప్రోటీనులు, వాటిని కలిపి ఉంచే నీళ్లు, మిగతా అంశాలు ఒక రకంగా ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చి పెరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడాలు వస్తాయి. ఆమ్లాలు పుడతాయి. కనుక పాలలోని తీపి పోయి, పెరుగులోని పులుపు మొదలవుతుంది.

ఇక భౌతిక శాస్త్రం సంగతి! సూక్ష్మజీవులు పెరగడానికి, ఒక రకమైన ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే అవి నిజంగా పెరుగుతాయి. అప్పుడు పాలు పెరుగుగా మారతాయి. చలికాలం వస్తే, అవసరమైన వేడిమి ఉండదు. కనుక పాలు తోడుకోవు. ఉత్తర భారతదేశంలో తోడు పెట్టిన పాలగిన్నెకు, స్వెటర్లు, దుప్పటి ముక్కలు చుట్టి ఇంటి బయట పెట్టడం చాలామందికి అలవాటు. కొంచెం వెచ్చదనం కలిగి పెరుగు తొందరగా తయారవుతుందని వారి ప్రయత్నం. మన దగ్గర ఉండే ఈ కొంచెం చలికి మాత్రమే, పాలు తోడుకోవడం కష్టం అయితే, ఉత్తర భారతదేశంలోని వణికించే చలిలో, సూక్ష్మజీవులు పెరగడం, పాలు పెరుగుగా మారడం, ఇంచుమించు అసాధ్యం అవుతుంది. అలవాటుగా తరతరాలుగా, లేదంటే యుగాలుగా జరుగుతున్న ఈ పెరుగు కార్యక్రమంలో పెరుగుతున్నవి సూక్ష్మజీవులు అని తెలిస్తే, అద్భుతం అనిపించడం లేదా? అది సైన్స్‌లోని ఆనందం! అడుగడుగున, చూడగల ప్రతి అంశంలోనూ, సైన్స్‌ దాగి ఉంటుంది. అది అర్థం అయినప్పుడు సైన్స్‌ రుచి మొదలవుతుంది. అందులో ఒక ఆనందం కలుగుతుంది. మనవాళ్లు పాత కాలంలోనే, విజ్ఞానం కన్నా అది అర్థం అయినప్పుడు కలిగే ఆనందము అసలైన పరబ్రహ్మము అని చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన పద్ధతి మరొక రకంగా ఉండి మనకు అర్థం కాలేదు.

సైన్స్‌ రుచి తెలిసిన వాళ్ళు, చిన్న పెద్ద, ప్రతి అంశం వెనుక ఉన్న సైన్స్‌ గురించి వెతుకుతారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు రుచి మరింత పెరుగుతుంది. ప్రపంచం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రకృతి చేస్తున్న మహిమలు తెలుస్తాయి. బ్రతుకు మరింత ఆశాజనకంగా కనబడుతుంది. బ్రతుకు అర్థం తెలిస్తే, పెరుగు తయారయ్యే పద్ధతి తెలిస్తే గొప్పగా ఉంటుంది అన్న విషయంలో అనుమానం లేనేలేదు!

 ఈ వ్యాసం రాసి చాలా కాలమయింది, గమనించాలి.

No comments:

Post a Comment