Friday, August 8, 2025

Lokabhiramam - Kolatalu (లోకాభిరామం - కొలతలు)

లోకాభిరామం - 1 నుంచి ఒక వ్యాసం



కొలతలు


తెలంగాణము ఏర్పడుతున్నది: ఏర్పడుతున్నది అన్న మాటకు వేరుగా పడుతున్నదని అర్థమనుకుంట. సరే గాని, మన మిత్రుడు, మంచి కవి. కవిత రాసి చూపించాడు. దాన్ని అచ్చు వేసేట్లయితే ఈ ప్రసక్తి వచ్చేది కాదు. చదివి వినిపించాలి. అందులో ఆయన రణము అన్న మాట వాడుకున్నాడు. చదువుతుంటే, అది రనము అయింది. మాట మార్చగూడదా అంటే యుద్ధము అన్నాడు. అది యుద్దము అయింది. ఎందుకొచ్చిన బాధ పోరు అంటే పోతుంది గదా అనుకుని ఇద్దరమూ సర్దుకున్నాము. సంస్కృతం ప్రభావం పోయి మనమంతా తమిళులను తలదన్నుతున్నాము. ఈ నేప‘త్యం’లో పరి‘స్తి’తి ఎవరికీ అ‘ర్త’మవుతలేదు! కృష్ణ అన్న మాటను క్రిష్న, క్రుష్నగా మార్చేసుకున్నాము. ఆం‘ద్ర’ప్రదేశ్‌ అన్నది అలవాటయి పోయింది. వేరు పడుతున్న పది జిల్లాలను తెలుగునాడు, లేదా హైదరాబాద్‌ రాష్ట్రం అంటే పోతుందేమో? తెలుగుదేశం అందము అంటే, ఆ అందమయిన మాటను కొందరు ‘కబ్జా’ చేసి పెట్టుకున్నరు మరి. ఈ కబ్జా అనే మాటను కంప్యూటర్‌ తెలుగులో సరిగా రాయడం కుదరదు. అది సిసలయిన ఉర్దూ మాట! ఆక్రమణ అని అర్థం!కళల్లో: కలల్లో ఏం కనిపించినా సర్దుకుపోవచ్చు. అది మరెవరికీ కనిపించదు. మనం వర్ణించి, వర్నించి కాదని మనవి!) చెప్పలేము. కాని ఇళ్లల్లో కనిపించేవి ఇంచుమించు సహజంగ ఉండాలి గద! మా ఇంట్లో ఒక పెయింటింగు ఉంది. (అదిప్పుడు ఎక్కడో దాగి ఉంది) అందులో గీతాబోధన దృశ్యం. అవును అదే! క్రుష్నుడు, అ‘ర్జ’నులకు సంబంధించినది. నా దృష్టి మాత్రం గుర్రాల (బండి ర మీద! ఎంత సేపు చూచినా, మొత్తం ఎన్ని గుర్రాలున్నయి, వాటన్నిటికీ కలిపి ఎన్ని కాళ్లున్నయి అర్థమ యేది కాదు. పెయింటింగులంటే అట్లాగే ఉండాలి. సర్రియలిజం అనే స్వగోలజం, డాడాయిజం వరకు పోనవసరం లేదు గానీ, పెయింటింగులో కొలత తేడాలుంటేనే సృజనాత్మకత ఉన్నట్టు లెక్క. మామూలు ఫొటోగ్రాఫు వలె ఉంటే, ఆ పెయింటింగును నేను అంతసేపు గమనిస్తానా? గుర్తుంచుకుంటానా? ఇక్కడ ప్రస్తావిస్తానా? ఈ మధ్యన అంతర్జాతీయంగా పెయింటింగ్‌లో ఒక ట్రెండ్‌ వచ్చింది. మరీ ఫొటోగ్రాఫులాగ బొమ్మలు గీయడం ఒకటి. కంప్యూటర్‌ సాయంతో ఫొటోను, పెయింటింగ్‌ వలె కనిపించేలాగ చేయడం! ఒకటని రెండు సంగతులు చెప్పినట్లున్నాను.

ప్రపంచమంతటా, కాలెండరు కొరకు బొమ్మలు గీయడం ఒక పెద్ద కళా విశేషం. (మల్యాగారు కాలెండరు భామలతో పడే కష్టాలు ఎన్‌డిటీవీ గుడ్‌టైమ్స్‌లో చూడగలరు!) గతంలో మందు కంపెనీలవారు గుడ్డలు తడిసిన అమ్మాయిల పెయింటింగులతో మాత్రమే సంతృప్తి పడేవారు. మరి కొందరు, మన దేశంలోని వివిధ దేశాల అందమయిన స్త్రీల బొమ్మలను, సచేలలుగా, (అనగా గుడ్డలతో సహా!) బొమ్మలు గీసి కాలెండర్లు వేసేవారు. ఆ అమ్మాయిలకు, కావ్యాలలో వర్ణించిన, చేపల వంటి కన్నులు, శంఖం వంటి మెడ వగైరాలుంటాయి. సరదాకు నేను ఆ రకం బొమ్మలు కొన్ని సేకరించి, స్కాన్‌ చేసి, నా బ్లాగులో పెట్టి ‘ఇలాంటి అందగత్తె నిజంగా ఉంటే, మీరే మంటారు లాంటి చితిని (చిలిపి) మాట ఒకటి రాశాను. ఎంట్రీకి ‘ఇండియన్‌ బ్యూటీస్‌’ అని పేరు పెట్టాను. ఇంటర్‌నెట్‌లో ఈ-మేల్‌, ఫీమేల్‌ అనేవి ముఖ్యమయిన ఆకర్షణలని నా ఉవాచ! కావాలంటే ఉద్ఘాటిస్తాను, నొక్కి వక్కాణిస్తాను కూడా! అమ్మాయి బొమ్మలు చూడదలుచుకున్న వారంతా ‘సెర్చ్‌’లో ఇండియన్‌ అని కొట్టడం, నా బ్లాగుకు రావడం, (నన్ను తిట్టుకుని వెళ్లిపోవడం!) ఈ బొమ్మలను చూడడం! అదొక సరదా! నా బ్లాగులో టాప్‌టెన్‌ పేజీల్లో ఇది కూడా ఒకటయిందంటే, సంగతేమిటో అర్థమయే ఉంటుంది!
ఈ నేపథ్యంలో మనం మాడరన్‌ ఆర్ట్‌ గురించి మాట్లాడుకుంటే పరిస్థితి తీవ్ర ఇబ్బందికరమవుతుందని చెప్పక తప్పినది కాదు!
స్థాపత్యం అని ఒక శాస్త్రం ఉంది. అందులో నుంచే స్థపతి అనే మాట వస్తుంది. దేవుడి విగ్రహాలను, గుడులకు సంబంధించిన మిగతా సంగతులను ఈ శాస్త్రంలో వివరిస్తారు. ఒక విగ్రహం ఎంత ఎత్తుంటే, ఏయే భాగంలో ఎంత వెడల్పు ఉండాలి. శరీర భాగాల కొలతల్లో ఉండే సాపేక్ష నిష్పత్తులేమిటి, తెలియడానికి లెక్కలుంటాయని చెపితే విన్నాను. తరువాత స్థాపత్యం గురించి తెలిసింది. ఈ లెక్కలు ఉన్నందుకే దేవుని విగ్రహాలన్నీ జీవకళతో, సహజంగా కనిపిస్తుంటాయని అర్థమయింది. ఇక్కడ నాకు ఒకటి, అనగా రెండు సంగతులు గుర్తొస్తుంటాయి. (విశ్వనాథ వారి ప్రభావం.. ‘ఇచ్చటనొక విషయ మున్నది, ఒకటి యనగా రెండు!’ అంటారాయన!) తిరుపతి ఎంకన్న, వెంకన్న (ఏదయినా ఒకటే) విగ్రహంలో మోకాళ్ల నుంచి కింది భాగంలో ఏదో తేడా కనపడుతుంది. అసలు కాళ్లు ఇంకొంచెం లోతులో ఉన్నాయని, కనిపించే వెండి పాదాలు, వేరుగా తగిలించినవని పెద్దలు చెప్పగా విన్నాను. అసలా విగ్రహం బాలాంబిక విగ్రహమనీ, నక్షంలో ఆ తేడా తెలుస్తుందని అన్నవారున్నారు. (చదువరీ మనము దారి తప్పక ముందే తిరిగి విషయములోనికి వెళ్లుదము!) అమ్మవారు, స్వామివారి పక్కన ఉన్నట్లు విగ్రహాలుంటే, వారిద్దరి ఆకారాలు, దామాషా పద్ధతిలోనే (ఎస్టిమేట్స్‌, ఉజ్జాయింపులకు) సరిగ్గా ఉంటాయి ఉదాహరణ సీతమ్మ, రామయ్యలు! అదే అమ్మవారు, స్వామివారి అంక భాగంలో ఉంటే, ఈ నిష్పత్తిలో కొంచెం తేడా కనపడుతుందని నా మెదడు(?)కు తోచింది. మాలోల నరసింహుల తొడ మీద ఆసీనులయిన అమ్మవారు మరీ చిన్నగుంటరు! కాదా!
రామప్ప గుడిలో నిలబడిన అమ్మాయిలు (శిల్పాలే!) ఏ క్షణంలోనయినా దిగి వచ్చి, ఓ చిరునవ్వు కూడా పడేస్తారేమోనని నేను ఎదురుచూస్తిని! నిజంగా అంత సహజంగా ఉంటాయి ఆ మూర్తులు! ఇంక మీరు, గతంలో చూచిన విగ్రహాలు ఏవి సహజంగ ఉన్నాయి, ఏవి లేవని ఆలోచిస్తారు. ఆలోగా, మరో కొన్ని మాటలున్నయి.
కూడలిలో, దారి పక్కన నిలబడి మనకు మార్గదర్శనం చేస్తున్న నాయకుల (చేసిన కూడా) విగ్రహాలు తెలిసినవే. అవన్నీ లైఫ్‌ సైజ్‌ కన్నా పెద్దవయినా సరే, సౌష్ఠవం అంటే అసలు కొలతల నిష్పత్తులు మారవు! గమనించాం? ఒకప్పుడు హైదరాబాద్‌లో స్టేడియం దగ్గర ఒక నాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. భారీగా అనావరణం, అనగా తెర తొలగించుట కూడా అయ్యింది. తరువాత, ఆ బొమ్మ ఆయన నిజమూర్తి వలె లేదన్నారు. విగ్రహాన్ని మార్చారు. కేవలం సహజంగా కనపడాలనే గదా?
ట్యాంకుబండ్‌ మీద నిలిచిన విగ్రహాలలో కొన్ని కేవలం ఊహామూర్తులు. కృష్ణదేవరాయలు పొట్టివాడని చరిత్ర చెపుతుంది. ఇక్కడ మాత్రం భారీ మనిషి. అందుకు మాడల్‌ సాక్షాత్తు ఎన్‌టీఆర్‌ అన్నగారేనట తెలుసా?
ఇంకా ఉందా? ఏమో చూద్దాం.
మా ఇంట్లో యింకో కుష్ణమూర్తి ఉన్నాడు. అంటే మొదలు ఒక కృష్ణమూర్తి ఉండనే ఉన్నాడని అర్థంగద. ఇక ఆయన వ్యత్యస్త పాదారవిందుడు. రెండో (ఈ మధ్యన టీవీలో ‘రొండో’ అని రాస్తున్నరు) ఆయన కాళ్లు పక్క పక్కననే ఉన్నాయి. ఈ రెండో ఆయన వెనక ఒక ఆవున్నది. లేక, లేగ, దూడనా? ఈ బొమ్మలు పొడవు వెడల్పులనే నిష్పత్తులు, అదే స్థాపత్య సూత్రాలు, మామూలు మాటల్లో సౌష్ఠవం, వాస్తవికత, సహజత్వం అసలు లేవని నాకనిపిస్తుంది. ఇంతకూ, శిల్పాలు, చిత్రాలలో మూర్తులు సహజంగా ఉండవలెనా? లేక అవి ప్రతీకలు మాత్రమే గనుక ఎట్లాగయినా ఉండవచ్చునా? ఈ అనుమానం నాకు చిన్నప్పటి నుంచీ ఉంది. రానురాను అది మరింత అనుమానమవుతున్నదే తప్ప, విడిపోయే వీలు కనపడటం లేదు. మీరేమంటారూ?


No comments:

Post a Comment