నిరీక్షణ - వియెత్నాం జానపద కథ
ఉత్తర వియెత్నాంలో లాంగ్’సన్
దగ్గర, సముద్రం పక్కన ఒక చిన్న కొండ ఉన్నది. దానిమీద వింత
ఆకారంలో ఒక రాయి ఉన్నది. ఆ రాయి ఒక ఆడమనిషి నిలిచిన ఆకారంలో ఉంటుంది. ఆమె చేతిలో
ఒక బాబు ఉంటాడు. ఆమె సముద్రం వేపు చూస్తూ ఉంటుంది. పడవల వారంతా ఆ కొండను
‘‘నిరీక్షణ శిఖరం’’ అంటారు. నిజంగానే అటువంటి ఆడమనిషి ఉండేదని, ఆమె రాతిగా మారిందని వాళ్లు కథలుగా చెప్పుకుంటారు.
చాలా సంవత్సరాల క్రితం లాంగ్`సన్ పల్లె దగ్గర ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఒకసారి పెనుతుఫాను వచ్చింది. పెద్దవాళ్లు ఇద్దరూ
చనిపోయారు. పదునాలుగు ఏళ్ల లాన్, అతని చెల్లెలు నామ్
మిగిలిపోయారు. పాపకు అప్పుడు తొమ్మిదేళ్లు మాత్రమే. లాన్, ఇంకా నామ్ ఎంతో ప్రేమగా ఉండేవారు. వాళ్లే తమ పొలాలలో పంటలు పండిచుకునే వారు.
లాంగ్`సన్‌కు ఒకసారి ఒక సర్కస్ వచ్చింది.
అన్నా, చెల్లెలు చూడడానికి వెళ్లారు. అక్కడ జోస్యం చెప్పే మనిషి కూడా ఉన్నాడు. లాన్
వెళ్లి తన భవిష్యత్తు గురించి చెప్పమని అడిగాడు. ‘‘నీకు నీ చెల్లెలు మీద చాలా
ప్రేమ కదా,
ఒకనాటికి మీరిద్దరూ భార్యాభర్తలు అవుతారు’’ అన్నాడు
జ్యోతిష్యుడు. లాన్‌కు నమ్మకం కలగలేదు. అయితే ఆ జ్యోతిష్యుడు గొప్పపేరు గలవాడు.
చాలా తెలివిగలవాడు. తప్పకుండా నిజమే చెప్పి ఉంటాడు. అయితే అతను చెప్పిన ప్రకారం
జరగకూడదని లాన్‌కు బాగా తెలుసు. ఏదో రకంగా అది జరగకుండా అరికట్టాలి. జ్యోతిష్యుడు
చెప్పిన మాటల సంగతి అతను నామ్‌తో చెప్పనేలేదు.
మరుసటి ఆదివారం నాడు అన్నా, చెల్లెలు ఇద్దరూ కట్టెల కోసం అడవికి వెళ్లారు. వాళ్ల వంటచెరుకు వాళ్లే తెచ్చుకోవాలి. అడవిలో నామ్ అన్నకు, తనకు తిండి సిద్ధం చేస్తున్నది. అప్పుడు లాన్ వెనుకనుంచి వచ్చి తన గొడ్డలితో ఆమె తలమీద ఒక్క వేటు
వేశాడు. దెబ్బవేసిన తరువాత అతను వెనుదిరిగి అదే పనిగా వీలయినంత వేగంగా
పరుగెత్తాడు. అలా అతను కొన్ని రోజులపాటు నడుస్తూ వెళ్లిపోయాడు. చాలా దూరంలో ఉన్న
ఒక పల్లెకు చేరాడు. అతను తన పేరు మార్చుకున్నాడు. అక్కడ అందరికీ తాను టాన్ అని
చెప్పుకున్నాడు. ఊళ్లో ఒక వ్యాపారి దగ్గర పనిలో కుదిరాడు.
టాన్ కష్టించి పనిచేసేవాడు. వ్యాపారం కిటుకులు
నేర్చుకున్నాడు. అతని యజమాని ముసలివాడు అయ్యాడు. వ్యాపారాన్ని టాన్‌కు వదిలేశాడు.
చనిపోయిన తరువాత ఆస్తి కూడా టాన్‌కు చిక్కింది. ఒకనాడు ఒక రైతు భార్య, కూతురితో సహా టాన్ అంగడికి వచ్చాడు. ఆ రైతు పేరు విన్. ఆయన కూతురి పేరు సాన్.
వాళ్లు దూరప్రదేశంనుంచి అక్కడికి వచ్చాము అన్నారు. సాన్ చాలా అందమయినది. టాన్‌కు
ఆమె మీద ప్రేమ కలిగింది. కొంతకాలంలోనే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. మరొక ఏడాదికి
కొడుకును కన్నారు కూడా.
కుటుంబం ఏర్పడింది కనుక సరుకుల కోసం టాన్ దేశాల వెంట
తిరగడం తగ్గించాడు. తన పనిమనుషులను పంపించే వాడు. ఒక రాత్రి సాన్ అందమయిన తన
జుట్టును దువ్వుకుంటున్నది. టాన్ వచ్చి దువ్వెన అందుకున్నాడు. తల దువ్వసాగాడు.
దువ్వుతుండగా అతనికి సాన్ తలలో నిటారుగా పెద్ద గాయం కనిపించింది. దాన్ని గురించి
సాన్‌ను అడిగాడు. ఆమె ఒక కథ చెప్పింది. ఇక టాన్‌కు ఆమె ఎవరో తెలిసిపోయింది. గాయంతో
పడి ఉన్న తనను వేటగాళ్లు కొందరు కాపాడి తెచ్చి విన్‌కు ఇచ్చారు అని చెప్పింది సాన్.
విన్ దంపతులు ఆమెను సొంత కూతురిలా పెంచుకున్నారు. మొదట్లో ఆమెకు గడచిన సంగతులు
ఏవీ గుర్తుకు వచ్చేవి కాదు. కానీ కొంతకాలానికి నెమ్మదిగా అన్ని సంగతులు గుర్తుకు
వచ్చాయి. అయినా ఆమె రహస్యాన్ని తనలోనే దాచుకున్నది. మొదటిసారిగా ఆమె ఆ సంగతులను
టాన్‌కు మాత్రమే చెప్పింది.
టాన్ చాలా కలవరపడిపోయాడు. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజం
అయినయి అని అర్థం చేసుకున్నాడు. సరుకుల కొరకు వెళ్లాలని చెప్పి అతను ప్రయాణానికి
బయలుదేరాడు. త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పాడు. వారం గడిచింది. నెల గడిచింది.
ఆరు నెలలు అయ్యాయి. అతను మాత్రం రాలేదు. తమకు ఎక్కడయినా టాన్ కనిపించాడా అని
వచ్చే ప్రయాణికులు అందరినీ సాన్ అడుగుతూ ఉండేది. పనివాళ్లను ఆమె యజమానిని వెతకమని
అన్ని దిక్కులకు పంపించింది. కానీ అతని జాడ మాత్రం తెలియలేదు. చివరకు సాన్‌కు కూడా
టాన్ గురించి రహస్యం అర్థం అయింది.
బాబుతో పాటు సాన్ తమ పాత పల్లె లాంగ్`సన్‌లోని ఇంటికి చేరుకున్నది. ప్రతినిత్యం ఆమె బిడ్డడిని ఎత్తుకుని కొండ
ఎక్కుతుంది. టాన్ వస్తాడని బోటు కోసం సముద్రంలలోకి చూస్తూ ఉంటుంది. స్వంత ఊరికి
ఏనాడయినా అతను తిరిగి వస్తాడని ఆమె నమ్మకం. నిరీక్షిస్తూ ఆమె అలా నిలబడి
ఉండిపోయింది. అన్ని విషయాలను మరిచిపోయింది. చివరకు ఒకనాటికి ఆమె శిలగా మారింది.
No comments:
Post a Comment