Wednesday, March 6, 2019

ఎందుకని?


ఎందుకని?

పథికుడా, నీవు ఈ మార్గాన మరొకసారి నడచి రావేమొ కానీ, నీ పాదముద్రలు ఇందు కలకాలము నిలిచి యుండు.
ఈ మాటలు ఎవరో అన్నవి కావు. నేనే అంటున్నాను. ఒక నిజమైన యాత్రికుడు మన ముందు నుంచి నడిచి వెళ్ళి పోతాడు. అతను తిరిగి రాడు. కానీ కాలి గుర్తులు మాత్రమే ఉండి పోతాయట. కవిత్వధోరణిలో ఉన్నప్పుడు నా మనసులో సంచరించిన మాటలు ఇవి. అందరూ యాత్రికుల కాలి గుర్తులు అట్లాగే నిలుస్తాయి అంటే నాకు కూడా నమ్మకం లేదు. కానీ ఉండాలి అన్నది బహుశా మనసులో ఆకాంక్ష కావచ్చు. కనుకనే ఈ మాటలు అన్నట్టు ఉన్నాను.
కొంతకాలంగా పరిశోధకులు ఎన్నెన్నో గుహలలో వెతికి పాత కాలపు మనుషులు సృష్టించిన, అంటే తొలి జాతి మానవులు సృష్టించిన చిత్రకళను కొంత పరిశీలించారు. అందులో ముఖ్యంగా జంతువుల బొమ్మలు కనిపించాయి. వాటిని వేటాడి తింటున్న మనిషి తాను గమనించిన జంతువుల బొమ్మలు గీయడంలో ఆశ్చర్యం లేదు. కానీ జంతువుల బొమ్మల మధ్యన చాలా చోట్ల మనిషి చేతిగుర్తులు కనిపించాయి. అవి కూడా రాతి మీద చేతిని ఉంచి నుంచి రంగులను వెదజల్లి స్టెన్సిల్ పద్ధతిలో వదిలిన చేతిగుర్తులు. చిత్రంగా వీటిలో కొన్ని మనిషి చేతుల వలె లేవు అని అంటున్నారు. అరచేతులు చిన్నవి, ఆ చేతి వేళ్ళు పొడుగ్గా ఉన్నాయని పరిశీలకులకు అనుమానం కలిగింది. అవి అసలు మనిషి చేతులు కావేమో అని కూడా అన్నారు. బహుశా తమకు దొరికిన బల్లి లాంటి ఏ జంతువుల చేతులను గోడ మీద పెట్టి రంగు చల్లి ఉంటారు, అన్న వాదం వినిపించింది.
ఈ ముక్కను పక్కన పెడితే, మనిషి తన చేతి చిత్రాలను రాశుల మీద వదిలిన విషయం మాత్రం సత్యం. గుహ లో దొరికిన కొన్ని ఇటు వంటి చిత్రాలలో ఉన్నది ఆడ మనుషుల చేతులు అన్నారు కూడా. మగవాళ్లు వేటాడారు. జంతువులను పట్టి తెచ్చారు. వాటి బొమ్మలు గీశారు. తమతో నున్న ఆడ మనుషుల చేతులను కూడా రాతి గోడల మీద పెట్టి వాటి బొమ్మలు కూడా తీశారు.
ఇంతకూ మనిషికి బొమ్మలు గీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
ఒకప్పుడు నేను పాట గురించి రాస్తూ, మామూలుగా మాట్లాడుతున్న మనిషి, ఆ మాటలకు వరుసలు కట్టి పాట కాపాడాలన్న ఆలోచన ఎప్పుడు తెచ్చుకున్నాడు? అని అడిగాను! మొదటిసారి పాట పాడిన వ్యక్తికి తలవంచి నమస్కరించాలని కూడా అన్నాను. మాట పాటగా ఎప్పుడు మారింది? మామూలు అడుగులు నాట్యంగా ఎప్పుడు మారాయి? కేవలం సమాచార వినిమయం కోసం మాట్లాడుకుంటున్న పదాలలో కవిత అనే పొందిక ఎప్పుడు మొదలైంది? ఇవన్నీ మనలాంటి వాళ్లం పట్టించుకుని, జవాబు కొరకు గట్టిగా ఆలోచించవలసిన ప్రశ్నలు. సరే, 21వ శతాబ్దపు పద్ధతిలో పళ్లు తింటే సరిపోతుంది, బొమ్మల గురించి ఆలోచన అవసరం లేదు అనుకుంటే నేనేమీ చేయలేను. మా చిన్నాన్న గారు ఒకప్పుడు అన్న ఒక మాట నాకు అప్పుడప్పుడు గుర్తుకువస్తుంది. ఆయన పెద్దబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వయసులో ఆ తరువాత వచ్చే మాలాంటి వాళ్ళం కూడా బాగానే చదువుతున్నాము. అప్పట్లో గ్యాస్ నూనె అనే కిరోసిన్ తో నడిచే స్టవ్వు లు ఉండేవి. వాటిలో ఒక రకం లో వత్తులు ఉండేవి. అంటే ఒక స్టవ్ లో వత్తులు ఎక్కించవలసి వచ్చింది. అందులో ఏదో ఒడుపు ఉన్నట్టుంది. అది మాకు తలకెక్కలేదు. ఒకడు ఒకడు ఇంజనీరింగ్ చదువుతున్నారు కానీ స్టవ్ లో వత్తులు ఎక్కించడం కూడా తెలియదు, అన్నారు చిన్నాన్న గారు. ఇక నేను ఈ విషయం గురించి వ్యాఖ్యానం చేయను.
కేవలం బతుకు అవసరాలను మాత్రమే ముందు ఉంచుకుని, సులభంగా బతికే పద్ధతి ఉంది. ఇక మడిసన్నాక, కూసంత కలాపోసన కూడా ఉండాలి గదా? అనేది మరొక పద్ధతి. ఇందులో స్టవ్ వత్తులు రావు.
మెసొపొటేమియాలో మట్టి పలకల మీద అప్పటి వారు తుంగ మొక్కలతో మూడు కోణాల గుంటగా వచ్చే పద్ధతిలో రాతలు రాసుకున్నారు. అట్ల రాసుకున్న రాతల్లో వ్యాపారపు లెక్కలు, వచ్చిన లాభనష్టాల గురించిన ఉత్తరాలు కూడా ఉన్నాయని ఎక్కడో చదివినట్టు గుర్తు. కానీ ఈ మధ్యన ఒక విచిత్రమైన పుస్తకం చేతికి వచ్చింది. దాని పేరు గిల్గమేష్. చెబితే నమ్మరు కానీ ఇది ఒక ఇంత రూపంలో ఉన్న నవల. బహుశా ప్రపంచంలోనే అతి మొట్టమొదటి నవల అయి ఉంటుంది. గిల్గమేష్ అనే వ్యక్తి ఒక రాజు. అతనికి ఒక మిత్రుడు దొరుకుతాడు. ఇద్దరూ కలిసి అద్భుతాలు చేస్తారు. కానీ ఎక్కడో తేడా వస్తుంది. ఈ నవలలో పాత్రలు, వాటి పేర్లు మన చరిత్రను భాషలను గుర్తుకుతెస్తాయి అంటే ఆశ్చర్యం లేదు. ఇంతకు విషయం ఏమిటంటే, ఈ నవలను మెసొపొటేమియాలో అప్పట్లో మట్టి పలకల మీద రాసి ఉంచారు. చాలా కాలం వరకు అది ఎవరికీ అర్థం కాలేదు. పరిశోధకులు ఎంతో కృషి చేసి అందులోని విషయాన్ని అర్థం చేసుకోగలిగారు. ముందు అప్పటి మెసొపొటేమియన్ భాషను అర్థం చేసుకున్నారు. అందులో ఉన్నది ఒక కథ అని తెలుసుకున్నారు. దానికి ఆంగ్లానువాదం కూడా వచ్చింది. అది నా చేతికి వచ్చింది. ఇంకేముంది? ఈ కథను మన తెలుగు పాఠకులకు అందించకుండా ఉండడం ఎట్లా? అన్న అనుమానం నాకు మొదలైంది. నాకు నిద్ర పట్టడం లేదు! కానీ ఇంతకు అప్పట్లోనే మట్టి పలకల మీద చక్కటి కథను కవితారూపంలో రాసుకోవలసిన అవసరం ఎందుకని వచ్చిందట? అది ప్రశ్న!
మనిషి అనుభవంలో ఈ కళ అన్నది ఒక భాగంగా మారింది. బొమ్మలు పుట్టాయి, ఆటలు పాటలు పుట్టాయి. వీటిని గురించి ఎందుకు అన్న ప్రశ్నలు కూడా పుట్టాయి. ప్రశ్నలకు జవాబులు చెప్పాలని కూడా ఎంతమందో ప్రయత్నం చేశారు. వారిలో అన్న ముందు చెప్పు కొనవలసిన వాడు విఖ్యాత కవి పాబ్లో నెరుడా! ఇతను చిలీ దేశంలో పుట్టాడు. లాటిన్ అమెరికన్ కవులు రచయితలలో కన్నా ముందు చెప్పు కొనవలసిన వాడుగా పేరు సంపాదించుకున్నాడు. నెరూడా కవితలను గురించి నిజంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ నిజానికి సందర్భం కాదు. ఇక్కడ కేవలం ఆ కవి సృజనాత్మకతను గురించి చెప్పిన ఒకటి రెండు మాత్రలను మాటలను మాత్రం మీ ముందు ఉంచుతాను. మరొక ప్రసిద్ధ కవి తో పాటు కలిసి నెరూడా ఒక పుస్తకం రాశాడు. అందులో కలిగిన ఒక అనుభవం గురించి చెపుతాడు. చిన్న వయసులోనే తాను ఇంటి కంచె లోనుంచి అవతల ఒక దృశ్యాన్ని చూశాడు. అతనికి అది చాలా కళాత్మకంగా కనిపించింది. దాన్ని ఒక అనుభవం గా ఈ కవి తరువాత వర్ణించాడు. అది సరే గానీ మనకు తెలియని వారి నుండి కూడా మనం చేసిన ఒక పని గురించి అభినందనలు అందితే కలిగే ఆనందం అంతులేనిది అంటాడు neruda. అది మన వ్యక్తిత్వపు పరిధులను విస్తరింప చేస్తుంది అని కూడా అంటాడు. తనకు చిన్నతనంలో కలిగిన ఒక అనుభవాన్ని గుర్తుంచుకుని ఇందులోని ప్రతీకాత్మకత ను తరువాత వాడుకున్నట్టు చెపుతూ చక్కటి వ్యాఖ్యానం చేస్తాడు. కళారూపాల వల్ల వాటి సృష్టికర్తకు అపరిచితుల నుంచి కూడా అభినందనలు అందుతాయి అన్నది అతని మాటలలోని సందేశం.
కలలు కేవలం అభినందనలు కొరకు మాత్రమే పుట్టాయంటే అవి సత్యం కాదేమో అని నా అభిప్రాయం. మనిషికి మెదడులో ఒక సంచలనం కలుగుతుంది. రాయాలనిపిస్తుంది. పాడాలనిపిస్తుంది. గీత గీయాలి అనిపిస్తుంది. లేకుంటే, ఆ పని చేయకుంటే అదేదో సినిమా లో చూపించినట్టు కడుపు ఉబ్బరం మొదలవుతుంది.
కళారూపాలు ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు లేదు అంటాడు ఆరెంట్ అనే ఒక పరిశీలకుడు. అయినా ఈ ప్రశ్నకు పెద్దపెద్దవాళ్లు కూడా జవాబులు చెప్పారు. నాకు అందరికన్నా పెద్దవాడు గా కనిపించే ఖలీల్ జిబ్రాన్ కూడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పాడు. నా గుండెను తీసి అరచేతిలో పట్టుకుని తిరుగుతాను, దాన్ని అందరూ చూస్తారు గాక అంటాడు అతను ఒక పరిస్థితిలో. ఎందుకని చూడాలి? ఆ గుండెల్లో ఉన్న విశేషాలు అందరికీ తెలియాలి కనుక! ఇది బహుశా నా కడుపుబ్బరం పద్ధతి లాంటిదే! కవిత చెప్పిన మొదటి మనిషి ఎంతో అవహేళనకు గురై ఉంటాడని జిబ్రాన్ అంటాడు. నిజంగానే అర్థం కాని వారు కళాస్రష్టలు అంతగా పట్టించుకోరు. ఆటపట్టిస్తారు కూడా. మెదడులో కలిగిన ఉబ్బరం గురించి ఎదుటివారు తెలుసుకున్నప్పుడు వారికి అంటే కళ్లను సృష్టించిన వారికి దొరుకుతుంది అంటాడు జిబ్రాన్!
జిబ్రాన్ పుస్తకాలలో మొదటిది ప్రవక్త అన్న పేరున ఎప్పుడో తెలుగులో వచ్చింది. కాళోజీ నారాయణరావు గారు అనువదించారు. ఆ తరువాత దాన్ని చాలా మంది అనువదించారు. నేను దాన్ని వదిలేసి తరువాతి నాలుగు పుస్తకాలను తెలుగు చేశాను. ఆ పుస్తకం ఎంతో జనాదరణ పొందింది. అనువాదం చేసిన నాకే గొప్ప ఆనందం కలిగింది. అనువాదం చేసినందుకు కొంత, దాన్ని అందరూ మెచ్చుకున్నందుకు మరింత! అప్పుడు కవికి కూడా ఈ సంగతి తెలిస్తే కలిగే ఆనందం ఎంత?
బహుశా, అందుకేనేమో ఎవరూ ఏమీ రాయకూడదు అంటూనే నేను కూడా చాలా రాసేస్తున్నాను. నా అడుగు జాడలు ఈ దారుల మీద కొంతకాలమైనా నిలబడతాయి అని బహుశా లోలోపల ఆశ ఉన్నట్టు ఉన్నది. లేకుంటే ఎందుకు ఈ రాతలు? ఎందుకు ఈ కవితలు?

No comments:

Post a Comment