Monday, May 4, 2015

Kinnerasani Paatalu

This is an article by Kompella Janardhana Rao


కిన్నెరసాని పాట : కోకిలమ్మ పెళ్లి 



                 ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు, చిలకతల్లీ కోకిలమ్మానూ. చిన్ననాడే పలుక మొదలెట్టి తండ్రికి మేను పులకరింపించిన చిలకతల్లి వేదపనసలు చెప్పుకొనే బ్రాహ్మణుణ్ణి తనలో నిలిపివేసింది. ఇంట్లో నిరాదరము పాలయి, చెప్పుకొనేటందుకు నోరయినా లేక ప్రకృతి తల్లితోపాటు తల్లీ వెదకుకుంటూ వచ్చి కౌగిలించింది. దీవించి పెళ్ళి చేసింది.
                ‘చిలకతల్లి మహాన్వయంబున
                నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
                కోకిలమ్మా తెనుగుపలుకూ
                కూడ బెట్టిందీ.
                కావ్యమంతా చెక్కినధ్వని యిక్కడ కోకిలమ్మ తెనుగుపలుకులో ముడివడి కావ్యం ముగింసింది. ఈ కథ (వొట్టిది) జరిగేటప్పటికి ఈ తెలుగులంతా గొప్పయెకివిూళ్ళు.
                ‘దొంగ నాగరికతలో దేశం
                తూలిపో లేదోయ్‌
                అందుకే యిద్దరు కూతుళ్లే అయినారు తెలుగురాజుకి ఇద్దరమ్మలనూ వలపించగలయీ కవివాక్కు కోకిలమ్మ పెళ్ళికి తెలుగు తీపులు పట్టి అడివిని, సెలయేరునూ, ఆలాటి సామగ్రిని తలపించే ప్రాకృతగతులతో మనస్సును గుంజుతూ నడిచింది. గురజాడ అప్పారావుగారి తీయని లేత నడకలు దాటి వీరి ముత్యాలసరం, కవితా సంపన్నమయిన్ని, పాకరహితమైన విరగబాటు చేపట్టింది, వస్తువు తలచి, అసలు సత్యనారాయణగారి కవిత జాగ్రత్తతోడి దిద్దుబాటుకంటె ఉద్రేకముతోడి విరగబాటే యెక్కువ విందు పెట్టుతుంది. మరికొన్ని మెలకువలు ఈ పొంగులలో అందాలు తెరుస్తవి.
                ‘కోకిలమ్మ పెళ్ళికంటె విరివి అయిన కిన్నెరసాని పాటలువీరి కవితా సంపదను మిక్కిలిగా ప్రవహించినవి. అసలు కథాకల్పనమే హృద్యమైనది. అత్తగారి అపనిందకు అనిష్టమైన అడవుల పరుగులువారి, ప్రేమకల మగని అనునయ కౌగిలిలో కరిగి నీరై పారిన భార్య కిన్నెరసానికై అతడు శిల అయిన క్రమము అంతా కవి చెప్పక, అతనినోటనే.
                ‘ఈ యేడుపు రొదలోపల
                నా యొడలే నే నెరుగను
                నా యీ దేహ మదేమో
                రాయివోలె నగుచున్నది
                అనిపించి చూపిన సొగసు వీరి విలక్షణమైన కళావిహార చాతుర్యమును చూపుతుంది. ఈ కావ్యములో ఈ దీనకథలో కొన్ని ఘట్టాలు కంట నీరు పెట్టకుండా చదవడం కష్టం: రసస్ఫూర్తిని గూర్చి మాటాడగల సహృదయానుభవమంతా ఇందలి కళాజ్యోతికి తృప్తి పడ తీరుతుంది. కిన్నెరసానిని ఒక వీరవనితగా , తెలుగు జాతి మనస్సులో ప్రవహించగల నాయికగా సృష్టిచేసి నిజమైన కావ్యసంపత్తి నిర్వహించినాడు కవి. నవ్యకవితలో మొదటి పంక్తిని నిలువగల కొలది కావ్యాలలో కిన్నెరసాని పాటలుఒకటి. ఇందు ప్రకృతి ఎంతో విస్తృతముగా జీవము పట్టి అనుభవానికి రసశుద్ధి తేగలుగుతున్నది.
                ‘తలిరాకువంటి మె
                త్తని యెర్ర పెదవితో
                తార్చి నామోము నద్దగ రావు కాబోలు
                నాయొడల్‌ మిగుల నందపుకుప్ప యని చెప్పి
                ఎల్లతావులను ముద్దిడ రావు కాబోలు
                ‘అని సన్న గొంతుతోపతికై వసరిన కిన్నెరసాని యేడ్పుతో ఎంతో సన్నిహితమై గాఢమైన అనుభవము సాధారణీకృతికి రావడమేకాక, రచనయున్నూ అస్వాద్యముగా నడిచింది. ఈ పాకములు కిన్నెరసానిలో తరుచుగా పూచినవి. కొకిలమ్మ పెళ్ళిలో అడవీ, అక్కడ తిరిగే కోకిలా కనిపిస్తే ఇక్కడ కోకిలమ్మ పాటలు పుష్పించి ప్రకృతి అంతటా మ్రోగించింది. కిన్నెరనడకలురసమయమై, ‘గోదావరీ సంగమముశిల్ప విలసితమై మరీ హృదములై నఘట్టాలు. అసలు గోదావరిలో కలిసిపోయిన కిన్నెర ప్రసంగములో సముద్రుని పాత్రము కల్పించడం కవి నాటకీయ ప్రతిభ చాటుతుంది. తన గొంతుతో కవి తానుపాడిన ఒక పాట కాక, ఎన్నో పాటలు రూపాలుకట్టి వచ్చి దీనికి మహాకావ్యత్వము సంపాదిస్తున్నవి.
                కొన్ని అతిధోరణులు (వీరు ముక్తసరుగా పాడరు,) పచ్చిగా ఎండుగాపడితే, అవీ వీరి ఉద్రేకము తాలూకు విశిష్టతను తెలుపుతవి. అట్టివి కూడా కావ్య గతిలో విడిచిన విచ్చలవిడితనమే కొన్ని ఉన్ముక్తములైన సౌందర్య విభ్రమాలకు పూచీ, వహిస్తుందని స్మరిస్తే అది కవిని అంతటా సమర్ధించడం కాదు గమనించడం.

                ఛందోగతుల అందాలు కలుపుకోడంలో స్వరకలితమైన సంగీతాభిజ్ఞత అవసరమని చెప్పేవారము కవులు ఒప్పుకోనక్కరలేదు. చరిత్ర ఒప్పుకోదుకాని, కొందరిపట్ల ఆజ్ఞానము అందుకు తోడ్పడ్డదవుతుందంటే ప్రతిఘటించనక్కరలేదు. కవితయందు ఏర్పడే సంగీతమే గమనించానా, సత్యనారాయణగారు పెళ్ళిపోకడలుగా ఛందోగతులు నడిపించి అందాలు కురిపించారు.

Thanks to friend for this material.

No comments:

Post a Comment