Wednesday, February 9, 2011

Experience and the Age!!

Here is one of my articles printed in Andhra Bhoomi recently!

అనుభవ సాగరం

భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న రిచర్డ్ ఫేన్‌మన్‌ను తెలివిగల మనిషి అని ప్రపంచమంతా తలకెత్తుకుంది. ఆయన నోబెల్ గ్రహీతలందరిలాంటి తెలివిగల మనిషి కాదు. అతని తెలివిలో అంతకన్నా ఎక్కువ ఏదో ఉంది. ఒక సందర్భంలో ఆయన అన్న మాటలు మనమందరమూ గమనించవలసినవి! ఒకానొక రోజున మనం జీవితంలో ఎన్నో తప్పులు చేశామని అర్థమవుతుంది. కానీ ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు తగిన సమయం మాత్రం ఆ తర్వాత ఉండదు’! అన్నారాయన!


అనుభవంగల వారంటే, నిర్ణయాలతో మంచి, చెడు మధ్యన తేడా తెలిసిన వారనేగదా అర్థం! ఈ లెక్కన వయసు పెరిగి, అనుభవాలతో పండిన వారికి మాత్రమే మంచి నిర్ణయాలు చేతనవుతాయని కూడా అర్థమా? సరిదిద్దుకునే సమయం లేనప్పుడు, మంచి, చెడ్డా తెలిసి కూడా లాభం లేదు! ఆ తెలివి ముందే కలిగితే, మనకూ మంచిది. మన వారికీ మంచిది. ప్రపంచానికీ మంచిది.

అనుభవం అంటే వేచి చూస్తుంటే వచ్చే పుట్టినరోజు లాంటిది కాదు. మెదడు తలుపులు మూయకుండా చిన్నతనం నుంచే ప్రపంచంలో జరుగుతున్న మంచి చెడులను వాటివెనకగల నిర్ణయాలను గమనించాలి. అప్పుడు తలపండకుండానే తలపులు పండుతాయి. చిన్న వయసులోనే మంచి విజయాలు సాధించిన వారంతా ఈ పనే చేశారు.

విద్యలో పావుభాగం కాలం నేర్పుతుందని ఒక మాట ఉంది. అది ఎంతకాలం అన్నది మన చేతుల్లో ఉండాలి. వయసు పెరిగితే గాని అనుభవం పెరగదన్న పద్ధతి మారింది. నేను చిన్న వయసులోనే పెద్దవారి అనుభవాన్ని సంపాదించుకోవాలన్న నిర్ణయం ఉండాలి. అందుకు మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఈ ప్రపంచంలో అందరికీ సేఫ్ ప్లేయింగ్ అనే పద్ధతి అలవాటయింది. పేదరాశి పెద్దమ్మ కథలో రాకుమారునికి దక్షిణం వేపు వెళ్లవద్దని సలహా ఇస్తుంది. అతను దక్షిణానికి వెళతాడు. కనుకనే కథ సాగుతుంది. చాలామంది మాత్రం ఆ దక్షిణాన్ని తప్పించుకుని బతుకుతుంటారు. జీవితంలో రిస్క్‌కు చోటు లేకుంటే మంచి, చెడు, తేడా మనకుగా మనకు తెలియదు.

అనుభవంగల వారితో మాట్లాడటం, చర్చించడం, ముందు అదొక అనుభవం. ఆ పైన అదొక అనుభవ పాఠశాల. టీవీ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్ యశ్‌పాల్ గారు చేసిన వ్యాఖ్య గుర్తుంచుకోవాలి. మనం పిన్నవాళ్ళము, తర్వాత వచ్చాము గనుక అది ఒక డిసడ్వాంటేజ్ అని మనం అనుకోలేదు. జరగవలసిన ప్రగతి జరిగింది. మనం మళ్లీ మొదటి నుంచీ మొదలు పెట్టనవసరం లేదు. ఇవాళటి పరిస్థితిని వెదికి తెలుసుకుంటే చాలు!’ అన్నారాయన. దీన్ని ‘లేట్ ఎంట్రీ అడ్వాంటేజ్’ అని వ్యాఖ్యానించారు. ఈ పద్ధతిని మనం కూడా వాడుకోవచ్చు. అనుభవం మనకే కలగవలసిన అవసరం లేదు. అనుభవం పండిన వారితో కలిసి మాట్లాడి, ఆ సారాన్ని మనం పంచుకుంటే చాలు.

అనుభవసారంగా వచ్చిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. విజయాలను సాధించిన వారు, అలాంటి వాటిని గమనించిన వారు ఎన్నో విషయాలను ప్రపంచానికి అందించారు. పుస్తకాలు గురువులకన్నా ఓపికగా మనకు విషయాలు వివరిస్తాయి. వాటిని నాలుగుసార్లు చదివి నెమరు వేయవచ్చు. చదివేవారు నిజంగానే ఎంతో నేర్చుకున్నారు. ‘మంచి పుస్తకాలన్నీ మంచి చేసి ఉంటే ఈ ప్రపంచం ఏనాడో మారిపోయి ఉండేదన్నాడు’ ఒక తెలివిగల పెద్ద మనిషి. పుస్తకాలు మంచి చేయవు. పుస్తకాలను చదివిన వారు మంచి చేయగలుగుతారు. పత్రికలలో వికాసం గురించిన విషయాలను చదివే అవకాశం ముందు నుంచీ ఉంటే, మరెంత బాగుండునో’ అనుకుంటాము. అనుభవానికి పది సంవత్సరాలు పడితే, ఆ అనుభవ సారాన్ని మనం అందులో పావుభాగం కూడా వాడకుండా అందుకునే వీలుంది. ప్రయత్నం చేయడమే కావలసింది.

అందరికీ సంవత్సరంలో 365 రోజులు, రోజుకు 24 గంటలే ఉంటాయి. అనవసరమయిన, అర్థం లేని పనులు చేసినా, ఆ రోజులు గడిచిపోతాయి. ఆలోగానే తెలివిగలిగి, మార్గాలు వెతికితే, అందరికీ లేని అనుభవం మన స్వంతమవుతుంది. ఏ పని చేయవలసినది, ఏది అనవసరం అని తేల్చుకుంటే, అనుభవం బడిలో అది మొదటి క్లాసు. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. గోళ్లు గిల్లుకుంటూ కూచుంటే ముసలితనం ముందే వచ్చి తలకెక్కుతుంది. ప్రవాహంలో పడి కొట్టుకు పోతుంటే ఎక్కడ ‘ఎండ్’ అయ్యేదీ మనకే తెలియదు. అది నరకం. మన ఇష్టం ప్రకారం ఈదడం స్వర్గం! కనీసం అదే జీవితం. ఎదురీదవలసిన పరిస్థితులూ రావచ్చు! అక్కడ అసలయిన అనుభవం అందుతుంది!

అనుభవం కోసం కూచుంటే తెలియకుండానే అది మనలను దాటి వెళ్లిపోతుంది. ‘గోగెటిట్! ఆల్ బై యువర్ సెల్ఫ్’.

Can we wait forexperience to build up?
???????

No comments:

Post a Comment