Wednesday, November 24, 2010

Vikasam 2

Today's "YUVA" supplement in Andhra Bhoomi carries the third edition of the column Vikasam.
Visit the page and read my articles.
http://www.andhrabhoomi.net/yuva/vikasam-953 
I would be grateful if you choose to send me some feedback.

This is the content from the last weeks edition!

విజయగోపాల్ vijayagopalk@gmail.com, November 16th, 2010

రిలాక్స్ ప్లీజ్...
 

ధేశ రాజధాని కొత్త ఢిల్లీలో ఆటో నడుపుతున్న ఒకతను ఏదో మాట్లాడుతూ ‘టెన్షన్!’ అన్నాడు. ‘ఆటో నడపడంలో కష్టం ఏమిటి’? ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లడం, మామూలుగానే ‘ఎక్కువ’ డబ్బులు తీసుకోవడం అనుకుంటున్న నాకు, ఒక్క క్షణం ఆశ్చర్యమయింది. కానీ, ఆలోచించి చూస్తే ఆటో నడపడంలో ఉండే చిక్కులు, ఒక్కొక్కటే అర్థమయినాయి! ‘అవును గదా! టెన్షన్!’ అనుకున్నాను. ఢిల్లీలో ‘టెన్షన్’ అందరికీ ఒక ఊతపదంగా ఉంటుందంటే నమ్మండి.

ఈ భూప్రపంచంమీద, ఆకర్షణలు, ఒత్తిడులు, టెన్షన్‌లు (్భతికపరమయినవి) వాటి వాటి స్థితిలో ఉండకపోతే, మనమంతా గాల్లోకి ఎగిరిపోతాము. బెలూనులాగా పేలిపోతాము. అవే ఆకర్షణలు, ఒత్తిడులు, టెన్షన్‌లు మనసులోనూ ఉంటున్నాయి. వాటిని పెంచి పోషించి మనమంతా, నానా బాధలు పడుతున్నాము. ‘అతనా! తొందరడడమా? ఎప్పుడయినా చూచారా?’ అని నా గురించి మరెవరో అంటే, నాకు టెన్షన్ పట్టుకుంది ఒకసారి!
సమస్యలు లేకుంటే అది బతుకే గాదు. సీత, పీతల కష్టాలు తెలుసు గదా! సమస్యల గురించి కాదు ఆలోచించంవలసింది. ముందుగా సమాధానాల గురించి పట్టించుకోవాలి.


గాలిలో మేడలు కట్టవద్దు. పేకమేడలు అంతకన్నా వద్దు. సమస్య గురించీ, సమాధానం గురించీ, చాలా వాస్తవికంగా ఆలోచించగలగాలి. చాలాసార్లు సమస్య, సమాధానం మన చేతుల్లో లేవని తెలుస్తుంది. అలాగని చేతులెత్తేయడం పద్ధతి కాదు. మనవంతుగా, ఏం చేయగలుగుతామో అది చేయాలి. ఫలితాలు తప్పకుండా వస్తాయి.

‘మన టెన్షన్‌కు మనమే పూర్తిగా బాధ్యులము’ అన్న సంగతి ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. అది అర్థమయింది గదా, అని, సమస్యను అమాంతంగా ఎత్తి మరెవరి నెత్తినో పెట్టడం వీలుగాదు. తీసి కింద పడేయడం కూడా వీలుగాదు. ఆ విషయంగా మనం చేసే మార్పులు, ప్రాక్టికల్‌గా చిన్నవిగా, ఒక క్రమంలో ఉండాలి!

అసలు ముందు సమస్య గురించి మనకు అర్థమయిందా? తర్వాత మనం చేయదలుచుకున్నది ఏమిటి? ఈ రెండు సంగతులను మనం బాగా గుర్తించాలి. వాటిని గట్టిగా గుర్తుంచుకుని కార్యరంగంలోకి దిగాలి!

క్షణాల్లో ఏదో జరగాలి, జరుగుతుంది అనుకోవడం తప్పు! అసలు నావల్ల ఏమీ అయ్యేట్లు లేదు అనుకుంటే, మనమిక ముందుకు ఒక అడుగుకూడా వేయలేము.

ప్రయాణం ఎంత దూరమయినా, ఒకడుగు ముందుకు వేస్తేగానీ, అది ప్రారంభం కాదు. మనమూ మనుషులమే. అందరూ పరుగుపెడుతూ వెళ్లిపోతున్నారనీ, మనం ఇక్కడే ఉండిపోతున్నామనీ అనిపించడం సహజం! ఎక్కడా నిలబడి, ఉండిపోనంతకాలం, మనమూ ఏదో సాధిస్తూనే ఉంటాం!

ఏమీ జరగడంలేదు అనిపించిందా? ఏదో జరిగే ఉంటుంది. చేయలేకపోయిన విషయాలకన్నా, సాధించగలిగిన సంగతులను గురించి ఆలోచించడం మంచిది. ఉత్సాహం పెంచుకుని, జరగవలసిన సంగతులను గురించి ఆలోచిద్దాం!

మనల్ని ఎవరూ మెచ్చుకోరు! ఫరవాలేదు! మనల్ని ముందు మనం గుర్తించి మెచ్చుకుంటే, మరొకరి మెప్పుకోలు, తప్పక వస్తుంది!
అంతవరకూ... ‘నో టెన్షన్!’ ప్లీజ్!
-----------------------------------------------
మార్పు అవసరమా?

నేను పరిపూర్ణ మానవుడను, అంటే నిండు మనిషిని! నాలో ఏ లోపమూ లేదు.. నేను పరిశుద్ధ వ్యక్తిని, ప్రశాంత వ్యక్తిని.. నాలో లొసుగులే లేవు.. నేనిట్లా ఉన్నంత కాలం నాలో ఏ మార్పు అవసరం లేదు.. కానీ, నన్ను మీరు, నా మనసు ఆధారంగా గుర్తించేట్లయితే, నేను నా మనసు ప్రకారం బతుకుతుంటే, నాలో మరింత పరిపూర్ణత రావాలని నాకే అనిపిస్తుంది. నేను మారాలి మరి!

మనలను మనం గుర్తించుకోగలిగితే మనలో మార్పు అవసరం తెలుస్తుంది. ‘మీరు మారాలి’ అంటూ అన్ని వేపులనుంచీ మనకు బోధనలు, సూచనలు అందుతున్నాయి ఈ మధ్యన. శిక్షణ తరగతులు, పుస్తకాలు, ప్రసంగాలు ఎన్నో మనలను మారమంటున్నాయి.
వీటన్నిటితో మార్పు రావచ్చు. కానీ ఆ మార్పు నిజం కాదు. తిరుగులేనిది కాదు. మనలో లేని అంశాలను, మనలోనికి పంపడానికి ప్రయత్నాలవి. అంటే మనలో మార్పు కాదు. అది మన గుర్తింపుకు మార్పు అనవచ్చు.
మార్పు లోపలినుంచి రావాలి. మనలను మనం గుర్తించగలిగి, ‘‘ఇక్కడ మరేదో అవసరం ఉంది’’ అన్న భావన మనకు కలగాలి.

అప్పుడు ఈ ‘బాగుపడడం’ అనే కార్యక్రమం అందుకు హంగులుగా, శిక్షణ, పుస్తకాలు, ప్రబోధాలు రంగంలోకి వస్తాయి. మార్పులో అది ఒక భాగం మాత్రమే. మనం మారడానికి సిద్ధం కావాలి. అది అసలయిన మార్పు!



నిజమైన చిత్రం
నువ్వు నిద్రలేచినా లేవకున్నా తెల్లవారడం మాత్రం ఖాయం
-జాన్ చియార్డీ


మనం లేకపోతే ఈ ప్రపంచం ఏమయిపోతుందో అనుకోవడం మనకు అలవాటయింది. మనం లేకున్నా ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మనమున్నందుకు ఏదో ఒక తేడా చూపించాలి.

.
--------------------------------------
ఉచితంగా... ఓ సలహా!
మిమ్మల్ని ఎవరయినా సలహాలడిగారా? మీరు సలహాలిస్తుంటారా?
ఒక్కక్షణం ఆలోచించండి!
సలహా అడుగుతున్నవాళ్లు నిజానికి సలహా అడగరు. వాళ్ల నిర్ణయం వాళ్లు చేసుకునే ఉంటారు. వాళ్ల బాధాగాధను మీరు వింటే చాలు!

వాళ్లకు కావాల్సింది ఓదార్పు. మీరున్నారన్న భావం చాలు!

వారికి మీరొక సర్టిఫికేట్ ఇవ్వాలి. నీవనుకున్నది బాగుంది అంటే చాలు!వాళ్లు మీకు దగ్గరగా వచ్చిన భావం కోసం వస్తారు. మనసులోని భయాలు, బాధలు, మీ ముందు పరిస్తే మీరు భుజం చుట్టూ చేయివేసి వారిని దగ్గరగా తీసుకుంటే చాలు.

వాళ్ల మాట సరయిందని మీరు అనాలి! వాళ్లలో లోపాలున్నా, బలహీనత ఉన్నా, వాళ్ల మాటలను మీరు పట్టించుకుంటారన్న నమ్మకం చాలు!నిర్ణయాల బాధ్యత మీరు తీసుకోవాలి! ‘ఈ నిర్ణయం నాది కాదు!’ అని వారు తమ బరువును దించుకునేందుకు సాయం చేస్తే చాలు!

వాళ్లకు బాధ చెప్పుకోవడానికి మరెవరూ కనిపించి ఉండరు. మీరే వారికి చివరి ఆశ. మీ మాట అక్కడ కిటుకవుతుంది. మీరేమీ చెప్పనవసరం లేదు. వాళ్ల నిర్ణయం వాళ్లే చేసుకుంటారు. మీరు పక్కన ఉంటే చాలు!

చర్చకు వచ్చిన సత్యాలు, సమాచారాలను తరచి చూడాలి. ఒత్తిడితో ఉన్నవారు సాధారణంగా నిజాలను గుర్తించలేకపోతారు. ఆ పరిస్థితుల్లో మీరు అండగా ఉంటే చాలు!

ఎవరికో సమస్య ఉంటే, మీరు సలహాలిచ్చారు. మీకు సమస్య ఎదురయితే ఎవరు సలహా ఇస్తారు! ఇదొక చక్రం! గుర్తుంచుకోండి.
------------------------


వోస్... ఇంతేనా!

విన్‌స్టన్ వార్డ్ చాలా కష్టపడి ఒక నివేదిక రాసి కిస్సింజర్‌కు పంపించాడు.
‘దీన్ని మరింత మెరుగుపరచడం వీలుపడదా?’ అన్న ప్రశ్నతో నివేదిక తిరిగి వచ్చింది
వార్డ్ మరింత కృషిచేసి నివేదికను తిరగరాసి పంపాడు.

మళ్లీ అదే కామెంట్‌తో నివేదిక తిరిగి వచ్చింది

మరోసారి వార్డ్ నివేదికను తిరగరాశాడు

మూడవసారీ అదే కామెంట్

‘నో! ఇక నావల్లగాదు!’ అన్నాడు వార్డ్

‘అయితే ఈసారి నివేదికను నేను చదువుతా’ అన్నాడు కిస్సింజర్.

Let us enjoy good ideas!



&&&&&------------

No comments:

Post a Comment