Saturday, November 20, 2010

Vikasam - 1

A new weekly suppliment by name Yuva was started a couple of weeks back in the Andhra Bhoomi daily.
I am contributing a page on soft skills in that pull out.


Welcome to browse the suppliment every week.
It is really interesting.
Not that I am a contributor!
http://www.andhrabhoomi.net/features/yuva

This is the content from the first issue.

వికాసం
అనుసరించకండి.-

నిర్వహణ: విజయగోపాల్
vijayagopalk@gmail.com


November 11th, 2010

మాటయినా, మరొకటయినా, మనం ప్రతి విషయాన్నీ మరొకరిని గమనించి నేర్చుకుంటాము. ‘యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాః’ అన్నది గీత వాక్యం. అంటే ‘గొప్పవారు ఏ మార్గంలో వెళితే, మిగతా వారంతా అదే దారిని వెళతారు’ అని అర్థం! కానీ, మనముందు దారితీస్తున్న వారంతా, గొప్ప వాళ్ళనే నమ్మకం ఉందా? లేదు గనుకనే సూక్తి కూడా మారింది. ‘గతానుగతికో లోకః’ అని కొత్త మాట. దీనికి తెలుగు చెప్పాలంటే ‘గొర్రెదాటు’ అన్న ఒక్క మాట చాలు. గొర్రెలకు గొప్ప తెలివి ఉండవలసిన అవసరం లేదు. కానీ గుంపు వెళుతూ ఉంటే, దారికి ఏదో ఒక అడ్డు వస్తుంది. అప్పుడు యజమాని వచ్చి అదిలిస్తే, ముందున్న ఒక గొర్రె, అడ్డుమీదనుంచి ముందుకు దూకుతుంది. అంతే! తరువాత ఒకదాని వెంట మరొకటి అన్ని గొర్రెలూ దూకుతాయి, అడ్డు తొలగినా సరే, అవి అలా దూకుతూనే పోతుంటాయి. వింత ఏమిటంటే అనుసరించడమన్న విషయానికి వచ్చేసరికి, తెలివిగల మనిషికి, తెలివిలేని గొర్రెలకూ అంత తేడా కనిపించదు! ‘ఎందుకు చేస్తున్నారు ఈ పని!’ అనే ప్రశ్నకు మామూలుగా జవాబు ‘అందరూ చేస్తున్నారు గనుక!’ అని వస్తుంది. ఇందుకు ఎన్ని ఉదాహరణలయినా మీరే ఊహించుకోవచ్చు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఒకసారి ఒక క్రాస్ కంట్రీ రేస్ జరిగింది. పరుగు మొత్తం ఏడు మైళ్లదూరం జరగాలి. పరుగు మొదలయింది. రెండు గంటల తర్వాత, ముందు నిర్ణయించిన మార్గంలో ఒక్క పురుగు (పరుగు తీసే వ్యక్తి!) కనిపించలేదు. ఏమి జరిగింది? ఏదో జరిగిందని అర్థమవుతూనే ఉంది. అధికారులు వెంటనే కారుల్లో వస్తుంటారు గనుక సంగతిని సులభంగానే అర్థం చేసుకోగలిగారు. పోటీదారులందరూ దీక్షగా, మరెక్కడో పరుగు పెడుతున్నారు. నిజానికి పరుగు ముగియవలసిందన్న సంగతి కూడా పట్టకుండా వారంతా పరుగుతీస్తున్నారు. అందరికన్నా ముందు పరుగెత్తుతున్న వ్యక్తి, ఒకచోట, తప్పుదారి మళ్లాడు. అందరూ అతని వెంటే, తప్పుదారిలో పరుగెత్తారు! మామూలు మనిషి తన జీవితకాలంలో కనీసం పదివేలమందిని ప్రభావితులను చేయగలడని పరిశోధకులు జాన్ మాక్స్‌వెల్ అంటున్నారు. ఇక నాయకులుగా వారు మరింత ఎక్కువ మందిని ప్రభావితులను చేస్తారు. నాయకత్వం రాజకీయంలోనే కానవసరం లేదు. చిన్నపిల్లలలోనూ స్వతహాగా ‘రా! చూపిస్తా!’ అనగలిగిన నాయకులుంటారు! అందుకే నాయకులుగా ముందుకు సాగుతున్నా, అనుసరించే వారుగా మరొకరి వెంట వెళుతున్నా మనం సరయిన దారిలో వెళుతున్నామా? అని ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతో ఉంది! సరయిన దారిని గుర్తించవలసిన అవసరం అంతకన్నా ఎక్కువగా ఉంది! మనం ఒక నిర్ణయం చేస్తే, అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, మనల్నేగాక మరెందరినో ప్రభావితులను చేస్తుంది. సరయిన మనుషులు సరయిన నిర్ణయాలు చేస్తే, అందరికీ బాగుంటుంది! సరయిన నిర్ణయాలు చేయడం అలవాటుగా మారాలి మరి.

***

‘ముందువారితో సమంగా పోతే చాలు!’ అనుకున్నంత కాలం గుంపులో ఒకరిగా ఉండిపోవలసిందే.

=============



అది మీ చేతుల్లో ఉంది

ఇద్దరు కుర్రవాళ్లు ముల్లా నస్రుద్దీన్‌ను ఆట పట్టించాలని పథకం వేశారు. వాళ్లు ఒక చిన్న పురుగును పట్టుకున్నారు. రెండు చేతులను పురుగుచుట్టూ గుండ్రంగా పెట్టి ముల్లా దగ్గరకు తీసుకెళ్లారు. పురుగు బతికి ఉందా? చచ్చిందా? అని అడిగారు. అతను చెప్పిన జవాబును అబద్ధం చేయడం సులభమే. ‘చచ్చింది’ అంటే పురుగును వదిలేయాలి. ‘బతికి ఉంది’ అంటే, అదిమి చంపి చూపాలి! అది వారి పథకం.

ముల్లా దగ్గరికి వెళ్లి, ప్రశ్న అడిగారు.

‘ఈ చేతుల్లో ఉన్న పురుగు చచ్చిందా? బతికి ఉందా?’ అని.

‘ఆ సంగతి మీ చేతుల్లో ఉంది!’ అన్నాడు ముల్లా!



=============

ఇంటర్వ్యూలో...

కమిటీవాళ్లు మనకు శత్రువులు కారు. మనలోనుంచి తగినవారికోసం వాళ్లు వెదుకుతున్నారు. ‘మీరు వెదుకుతున్న మనిషిని నేనే!’ అని వారిని నమ్మించడం మనవంతు. ఆ పని చేయగలిగితే, అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వకుండానే మనం ఉద్యోగం చేజిక్కించుకోవచ్చు.

గమనించండి...

ఏం జరుగుతుందని ఊహించకండి. ఊహించనిదాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి.

హాయిగా రిలాక్స్ అయే ప్రయత్నం చేయండి! నో టెన్షన్స్!

మీ వేషం, భాషా ముఖ్యం! కానీ అవే ముఖ్యం కావు.


అతి వినయం మంచిది కాదు. నిజంగా మీరు నమ్ముతున్న సంగతి గురించి (కొంతవరకు) వాదించినా తప్పులేదు.


తెలియని విషయం, తెలియదనడం మంచిది. తెలియదు అన్న దాకా ప్రశ్నలు వచ్చిపడుతూనే ఉంటాయి.


తికమకపడవద్దు. అప్పుడే మరిచానన్నట్లు, బుర్రగోక్కోవద్దు.


వాళ్లు చికాకుపెట్టే ప్రయత్నం చేస్తారు. చికాకు పడవద్దు.


అనవసరంగా చర్చకు దిగవద్దు.


మీరూ (సరయిన) ప్రశ్నలు అడగవచ్చు! ఇంటర్‌వ్యూలను తట్టుకోవడం తెలిసిన తర్వాత, ఇక వాటి అవరం ఉండదు!

===============



మరొకరితో... మరికొందరితో...

ఇంట్లోగానీ, సంఘంలోగానీ, చదువులోగానీ, ఉద్యోగంలో గానీ, ఎటువెళ్లినా మనకు మనుషులు ఎదురవుతారు. బాగా బతకడమంటే, ఈ మనుషులతో కలిసి బాగా బతకడమని అర్థం చేసుకోవాలి. బాగా బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో కొన్ని...!


మనమొకచోటికి వెళితే ‘అబ్బా! ఎందుకువచ్చాడూ!’ అనిపించుకోకుంటే మంచిది. అందరితోనూ కలుపుగోలుగా ఉండడం ఎంతో అవసరం. ఇది అనుకున్నంత సులభంగా వీలయేది కాదు.


ప్రతి సంఘటనకూ, మాటకూ ఎక్కువగా చలించకూడదు. వెంటనే ప్రతిచర్యనూ, ప్రభావాన్ని చూపకుండా ఉండగలిగితే మంచిది. చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోకుండా ఉండగలిగితే మేలు!


మనకు అందరిలోనూ నిజమైన ఆసక్తి ఉందన్న భావాన్ని, నడవడినీ అలవాటు చేసుకోవాలి. అందరిపేర్లనూ గుర్తుంచుకుంటే ఎంతో మంచిది. అరుదుగా కలిసే వారినయినా, పేరు గుర్తుంచుకుని పలకరించి చూడండి. ప్రభావం ఎలాగుంటుందో మీరే గమనించవచ్చు.


అందరికీ మనలోనూ ఆసక్తి కలిగేలా ప్రవర్తించడం ఒక కళ. అది పట్టుబడిందంటే, ఎదుటివారిని మనవారుగా మార్చుకోవడం సులభమవుతుంది.


ఇలాంటి సూత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటిని గురించి చెప్పడం సులభం


అనుసరించడం అంత సులభం కాదు. కష్టం మాత్రం అంతకన్నా కాదు!



==============

నిజమైన చిత్రం

మనిషి తన గురించి తానొక రకంగా ఊహించుకుంటాడు. మిగతావాళ్లు ఆ మనిషి గురించి ఏదో అనుకుంటారు. ఆ మనిషికి అసలు స్వరూపం ఒకటి ఉంటుంది. తాను మరేదో కావాలన్న ప్రయత్నమూ ఉంటుంది. వీటన్నిటినీ కలిపితే, ఆ మనిషి అసలు చిత్రం వస్తుంది.


-డోర్ షారీ.

I would like your comments please!!
&&&&&&&

1 comment:

  1. బాగుంది గురువుగారు! ఎంతమంది యువకులు పట్టించుకుని ఈ 'యువ" నామాన్ని సార్థకనామధేయురాలిగా మారుస్తారో వేచి చూడటమే!

    ఈ "భాగం"లో నాకు నచ్చింది - "మరొకరితో... మరికొందరితో..." శీర్షిక, దాని కథనం! ఇలాటివి మరిన్ని, దానికి కొసఱుగా మీకున్న సంగీత ప్రతిభతో, విద్వాంసుల పరిచయంతో కొద్దిగా ఆ వైపు కూడా ఏదన్నా వ్రాస్తే నాలాటి వారికి ఎంతో లాభం.

    అది అలా ఉంచితే, నేను ఆ మధ్య టెడ్ టాక్స్ లోని కొన్ని ప్రసంగాలను తెలుగీకరణ చేసే ప్రయత్నం చేసుకున్నా. టెడ్ వారిని సంప్రదిస్తే, కాపీరైటు అని సమాధానమిచ్చినట్టు గుఱ్తు. ఆ పైన నేను వ్రాసుకున్నది నాకే నచ్చక అన్నీ డిలీట్ చేసి అవతల పారేసా.....

    ఈ సమయమొక్కటీ కట్టేసినట్టు కాకుండా కొద్దిగా చేతులాడించి నాకు వీలు కలిపిస్తే, మళ్లీ నా వ్రాతలు మొదలు పెడతానేమో తెలియదు కానీ, ఇప్పటికి మాత్రం క్షమించెయ్యాలి మీరు...

    ReplyDelete