Tuesday, October 26, 2010

Medha Column - 1

This is the material that appeared in the Medha page of  Andhra Bhoomi daily on 19th of october 2010

అయితే ఏంటట? .October 19th, 2010


రామర్ పిళ్లే ‘ఇదుగో! పెట్రోలు!’ అన్నాడు. ‘ఛస్! అన్నీ కబుర్లు!’ అన్నారంతా! నిజంగానే అతడు తెరమరుగయ్యాడు. కొన్ని సిద్ధాంతాలు, అండ పిండ బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. అంతగానూ చప్పబడి కుప్పకూలిపోతాయి. కొన్ని విషయాలు మాత్రం, చాలా సూక్ష్మంగా వచ్చి, చివరకు అత్యవసరాలుగా మారి ఊరుకుంటాయి. అలాంటివాటికి ఉదాహరణ ‘విద్యుదయస్కాంత శక్తి’. ప్రపంచ గతినే మార్చివేసిన పరిశోధనలకు మొదటి ఉదాహరణగా విద్యుదయస్కాంత శక్తి గురించి చెప్పుకోవచ్చు. హాన్స్ క్రిస్పియన్ ఆయర్‌స్టెడ్ కదులుతున్న దిక్సూచి ముల్లు ఆధారంగా, విద్యుత్తుకు, అయస్కాంతానికి సంబంధం ఉందని గమనించాడు. 1821లోనే మైకెల్ ఫెరడే ఈ విషయం గురించి మరింత ముందుకు కృషిచేశాడు. అతను ఎలెక్ట్రిక్ మోటార్‌ను తయారుచేశాడు. పదేళ్ల తర్వాత, తీగచుట్ట మధ్యలో అయస్కాంతం కదిలితే విద్యుత్తు పుడుతుందని కనుగొన్నాడు. 1845లో విద్యుదస్కాంత సిద్ధాంతం వచ్చింది. ఆధునిక భౌతిక శాస్త్రానికంతా అదే ఆధారమయింది. ఫెరడే తన పరిశోధనను ప్రధానమంత్రిగారికో, మరో పెద్ద రాజకీయ నాయకునికో ప్రదర్శించి చూపాడట. ఆ పెద్దమనిషి ‘ఎందుకు పనికి వస్తుందిదీ?’ అని అడిగాడట. ఫెరడే మాత్రం, ‘అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు పనికివస్తుందీ?’ అని ఎదురుప్రశ్న వేశాడట (ఈ సంగతిని పరిశోధకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన ఒకానొక ఉత్తరంలో తెలియజేశాడు). ఫెరడే ‘త్వరలో మీరు దీనిమీద సుంకాలు వసూలు చేయవచ్చు’నన్నాడని కూడా అంటారు. ఇది మాత్రం కేవలం జోకయి ఉంటుంది. సైన్సులో ఒక పరిశోధన ప్రభావం తెలియడానికి 50 సంవత్సరాలు కనీసం పడుతుందేమో? 1880 ప్రాంతంలో విద్యుత్తు వాడకం ప్రచారంలోనికి వచ్చింది. ప్రస్తుతం, పల్లెలో అయినా సరే విద్యుత్తు లేకుండా, బతుకును ఊహించలేని పరిస్థితి వచ్చింది!




ఆకర్షణ ఉందా?.-కె.బి. గోపాలం

October 19th, 2010

ఆపిల్ పండు కిందపడి, న్యూటన్‌కు ఆలోచనలను కలిగించింది. వస్తువులు ఎంత పెద్దవయితే, మిగతా వస్తువులను అంతగా ఆకర్షిస్తాయి, అని సిద్ధాంతం. ఆ ఆకర్షణను గురుత్వ ఆకర్షణ అన్నారు. అందరూ అవున్నారు కానీ, ఈ ఆకర్షణ గురించి అర్థమయింది మాత్రం తక్కువే. న్యూటన్ మాత్రం చివరకు గ్రహాల కదలికల గురించి కూడా, ఈ సిద్ధాంతం ఆధారంగా సరయిన లెక్కలు వేయగలిగాడు. ఆ తర్వాత ఐన్‌స్టయిన్ రంగంలోకి దిగి, ఆకర్షణలో స్పేస్, అంటే స్థలం వంపు తిరుగుతుందన్నాడు. ఈ విషయం ఆధారంగానే ‘సాపేక్ష సిద్ధాంతాన్ని’ సిద్ధం చేశాడు.

ఐన్‌స్టయిన్ సిద్ధాంతం ప్రకారం విశ్వం రాను రాను వెడల్పవుతున్నది. అందులోని అంశాలన్నీ ఒకదానినుంచి ఒకటి దూరంగా పోతున్నాయి. ఈ విషయాన్ని హబుల్ టెలిస్కోపు కూడా గమనించింది. కానీ, ఈ సిద్ధాంతం సరిగానే ఉందనడానికి మరో ఆలోచన అవసరం. అంశాలన్నీ ఒకదాన్నుంచి మరొకటి, కాలం ప్రకారం దూరంగా పోతున్నాయంటే, ఒకప్పుడవన్నీ ఒకేచోట ఉండేవి అనుకోవాల్సి వస్తుంది. ఐన్‌స్టయిన్ సిద్ధాంతం అన్ని విషయాలకూ జవాబులను యిచ్చింది. విశ్వం పుట్టుక మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. ‘విశ్వం పుట్టుకకు ప్రారంభంగా చెపుతున్న పేలుడుకు ముందు, అందులోని అంశాలన్నీ ఎట్లాగుండేవి?’ అన్నది ప్రశ్న. పదార్థమంతా, చెప్పలేనంత తక్కువ స్థలంలో, అంత కుంచించుకుపోయి ఉండేదా? ‘్భతిక శాస్తవ్రేత్తలు ఇలాంటి అంతులేని అంకెలను సులభంగా అంగీకరించరు.

అందుకే, ఈమధ్యన యిద్దరు పరిశోధకులు, ఐన్‌స్టయిన్ సిద్ధాంతాల్ని పక్కన పెడుతూ, మరొక సిద్ధాంతాన్ని సిద్ధం చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పరిశోధనలు సాగిస్తున్న మాగ్సిమో బనడోస్, పెడ్రో ఫెరైరాలు, విద్యుదయస్కాంత సిద్ధాంతాలను ఆధారంగా, కొత్త సిద్ధాంతాన్ని తెచ్చారు. గురుత్వాకరణ గురించి ఐన్‌స్టయిన్ చెప్పిన అన్ని అంశాలను రుజువుచేస్తూనే, వారు విశ్వం పుట్టుక గురించి కూడా చెప్పగలుగుతున్నారు.

ఫెరైరా, బనడోస్‌లు చెపుతున్న ప్రకారం, గురుత్వాకర్షణ శక్తి మరీ అంత బలమయినది కాదు. విశ్వంలోని పదార్థమంతా, మరీ అణువంత స్థలంలోకి కుంచించుకోనవసరంలేదు. అది ఎంత కుంచించుకున్నా బంతి అంత ఉండి ఉంటుంది, అంటున్నారు వీళ్లిద్దరూ!

ఆ బంతి కూడా, ఒక్కసారిగా, ఒక్కచోట పుట్టింది కాదు. అంతకుముందున్న విశ్వం ఏదో కారణంగా కుంచించుకుపోయింది. అప్పుడది దట్టమయిన బంతిగా మారింది. మారుతూ ఉండగా, ఇక ఏ మాత్రం కుంచించుకుపోలేని పరిస్థితికి చేరింది. అంటే, దాని మందం, మందానికి ఉండే పరిమితికి చేరింది, అన్నమాట. విశ్వంలోని పదార్థం మరీ మరీ కుంచించుకుపోయి, పరిమితిని చేరి, ఇక కుంచించుకునే అవకాశం లేక పేలింది. అదే ‘బిగ్ బ్యాంగ్’! ఈ పెద్ద పేలుడుతో, ఇప్పటి విశ్వం పుట్టుక జరిగింది.

ఈ కొత్త విశ్వం పేలిన తర్వాత, కొంతకాలం, విస్తరించకుండా ఉండిపోయిందని కూడా అంటున్నారు ఈ పరిశోధకులు. ‘విశ్వం పుట్టిన తొలి రోజుల్లో గురుత్వాకర్షణ తరంగాల పరిస్థితిని గురించి, ఎంతో పరిశీలన జరగాలి. అప్పుడుగానీ, గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి, అసలు సంగతి తెలుస్తుంది’ అంటారు ఫెరైరా. ‘ఐన్‌స్టయిన్ సిద్ధాంతం మరీ సింపుల్‌గా, సులభంగా ఉంది! కానీ, ఇలాంటి సులభమయిన పద్ధతి, అన్నిసార్లూ సరయింది కాదు!’ అంటారతను. అందుకే మరి! సైన్సులో శాశ్వత సత్యాలు లేవంటారు!

ఐన్‌స్టయిన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం సరయింది కాదు అనడం ఇది మొదటిసారి మాత్రం కాదు. ఈ సరికొత్త ఆలోచన, అలా వచ్చిన ఆలోచనల్లో అన్నిటికన్నా గొప్పది, అంతమాత్రం కాదు. గురుత్వాకర్షణకు స్థల కాలాలే గాక మరిన్ని మితులున్నాయి. వాటిలో వంపులూ, తేడాలు యింకా అర్ధం కాలేదు. గురుత్వాకర్షణ, పదార్థం దగ్గర ఒకరకంగా, ఖాళీలో మరొక రకంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ అంత సులభంగా అర్థమయ్యేవి కావు. ఫిజిక్స్, అంటే భౌతికశాస్త్రం, ‘అన్ని రకాల సైన్సులకూ తల్లి’ అంటారు. అది అందరికీ సులభంగా అర్ధంకాదని అందరూ అంగీకరిస్తారు. ఇంతగా కొత్త సిద్ధాంతాలు పుడుతున్నాయంటే, త్వరలోనే గురుత్వాకర్షణ గురించి నిగ్గుతేలుతుందేమో! ‘గురుత్వాకర్షణ, అసలు ఒక శక్తే కాదు. అది ఒక ప్రభావం మాత్రమే!’ అంటున్న ఎరిక్ వెర్లింగ్త్‌గారినీ పట్టించుకోవాలి. ‘నన్నడిగితే, గురుత్వాకర్షణ అని ఏదీ లేదు!’ అంటారాయన!



కండర గండడు మేడ్ ఈజీ!.October 19th, 2010

అమ్మాయిలంతా సైజ్ జీరో, అబ్బాయిలంతా ‘కండరగండడు’ కావాలనేది ప్రస్తుతం ఫాషన్! పొట్టమీద గట్టి కండరాలు, రెండు చేతులకూ అందని జబ్బలూ ఉంటే, అది ‘డబాంగ్!’ పద్ధతి! అందుకు జిమ్‌లో చేరి అమాంతం బరువులను ఎత్తుతూ గడుపుతున్నారు అందరూ!

కండరాలు బాగా పెరగాలంటే, అంతలేసి బరువులను ఎత్తనవసరంలేదని, తక్కువ బరువుతోనే పని జరుగుతుందనీ మెక్‌మాడ్డర్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. అందులో కిటుకును వారు బయటపెట్టారు. తక్కువ బరువుతోనే గానీ ‘ఇక నావల్ల కాదు బాబోయ్!’ అనేదాకా వ్యాయామం కొనసాగించాలట!

ఇలాంటి విషయాలను గురించి పరిశోధించే రంగాన్ని ‘కైనేసియాలజీ’ అంటారట. ‘ముక్కుతూ మూలుగుతూ పెద్ద బరువులు ఎత్తనవసరంలేదు. చిన్న బరువునే, ఇక వీలుగాదు అనేదాకా ఎత్తుతూ ఉండాలి’ అంటారు సువర్ట్ ఫిలిప్స్. ‘కండరంలో కొత్త ప్రొటీన్లు తయారయేందుకు ప్రేరణ కావాలి. అప్పుడే కండరాలు పెద్దవిగా పెరుగుతాయి. అందుకు అలసట ఎంతో అవసరం!’ అంటూ అసలు సంగతి తెలియజేశారతను.

ఈ ఆలోచన నికొలస్ బర్డ్ అనే పి.హెచ్.డి విద్యార్థినుంచి వచ్చింది. సాధారణంగా వాడే బరువులలో మూడవ వంతు మాత్రమే వాడుతూ వీళ్లు, కొందరి చేత వ్యాయామం చేయించి పరిశీలించారు. రకరకాల బరువులతో ప్రయత్నించి ఈ 30 శాతాన్ని సరయిందిగా గుర్తించారు.

ఈ పరిశోధన సంగతి అందరికీ తెలిస్తే తక్కువ బరువు డంబుల్స్‌కి గిరాకీ పెరుగుతుందేమో! అదేమోగానీ, మరీ బలం లేని బక్కపలచని మనుషులు, వయసు ముదిరినవాళ్లూ, అనారోగ్యంగలవాళ్లు కూడా, ఈ పద్ధతిని వాడి మరింత బలంగా, పుష్టిగా మారే అవకాశం ఉందంటున్నారు!



బంగారం సంగతులు

మనిషి వాడుకున్న లోహాలలో మొదటిది బహుశ బంగారమే అంటారు పరిశోధకులు. క్రీ.పూ నాలుగు వేల ఏండ్లనాడు మనిషి బంగారంతో తయారుచేసిన వస్తువులు దొరికాయి. అంటే, రాతియుగంనాడే బంగారం తెలుసన్న మాట.

1799లో కాన్రాడ్ రీడ్‌కు ఒక బంగారు ముద్ద దొరికింది. అతను దాని విలువ గుర్తించలేక, తలుపుకు అడ్డంగా మాత్రమే వాడుకున్నాడు. తర్వాత, 17 పౌండ్ల ఆ ముద్దను మూడున్నర డాలర్లకు అమ్ముకున్నాడు. అప్పటికే దాని ధర అంతకు వెయ్యి రెట్లు ఉండేది.

ప్రపంచంలో ఇప్పటికి దొరికిన బంగారంలో, 85 శాతం ఇంకా వాడుకలో ఉంది. ఎక్కువ బంగారం గల దేశం అమెరికా. నగల సంగతికి వస్తే భారత్‌దే పైచేయి. అలంకరణ పేరున వాడుతున్న బంగారంలో 20 శాతం, భారతదేశపు చీరల్లో ఉంది.

No comments:

Post a Comment