Thursday, August 12, 2010

Explorers and Explorations

కొలంబస్ లాంటి అన్వేషకులు ఎందుకు ప్రపంచం చుట్టూ తిరిగారు?




మనిషికి ఒకచోట తిని కూచుంటే తోచదు. మెదడుకూ శరీరానికీ పని ఉండాలి. మనదేశం వారు ఎంతకాలమయినా మనిషి బ్రతుకు గురించి, గతం, భవిష్యత్తుల గురించి, మరెన్నో తాత్విక విషయాల గురించీ అలోచిస్తూ గడిపారు. ఓడలు, ధనం ఉండికూడా భారతీయులు, లోపలి ప్రపంచంలో మునిగి బయటి ప్రపంచాన్ని వెదకడానికి బయలుదేరలేదు. ఈ విషయాన్ని ఎంత మంది గమనించారో తెలియదు. మెదడుతో బాటు శరీరానికి కొంత పని, అందునా ధైర్యంగా చేయవలసిన పని కావాలనుకున్న వారు సాహసయాత్రలకు బయలుదేరారు.

ప్రపంచం తిరుగుతూ వాళ్లు సేకరించిన సమాచారం, అక్షరరూపంలో, చిత్రపటాల రూపంలో, మిగతా వారికి ఎంతో ఉపకరిస్తున్నట్లు తెలిసింది. ఆయా దేశాలు, ప్రాంతాలు, ఖండాల హద్దులు తెలిశాయి. అది ఎంత తప్పుల తడకయినా అప్పట్లో అదే ఉన్న సమాచారం. 15వ శతాబ్ది తర్వాత యూరోపినుల అన్వేషణయాత్రలలో ఒక పద్ధతి కనబడుతుంది. ముందుగా ప్రపంచంలో అంతకు ముందు తెలియని ప్రాంతాలను వెతకాలి. ఆ తర్వాత సముద్రాలు మహా సముద్రాలలోని దీవులను, ఇతర విశేషాలను వెతకాలి. ఇక ఆధునిక కాలం వచ్చిన తర్వాత, భూమి మీద నుంచి అటు అంతరిక్షంలోకి, ఇటు సముద్రం లోతులకు తిరిగ వెతకాలి. అలా సాగింది పథకం.

గ్రీకు భూగోళ నిపుణులు భూమి గుండ్రంగా ఉందని కనుగొన్నారు. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దిలో చైనావారు, రోము వారు సంబంధాలు ఏర్పరుచుకున్నారు. కొలంబస్ కాలానికి సాకేతికంగా యూరోపియనులకన్నా చైనా వారు, అరేబియనులు ముందడుగుగా ఉన్నారు. యుద్ధాలతో అల్లకల్లోలమయిన యూరపు వారు, ప్రశాంతత ఏర్పడిన తర్వాత మళ్లీ ఆసియా ప్రాంతాలకు యాత్రలు మొదలు చేశారు. నార్వే, స్పెయిన్, పోర్చుగల్ దేశాల అన్వేషకులు దక్షిణంగా సాహస యాత్రలు చేశారు. స్పెయిన్, పోర్చుగల్ పోటీ పడకూడదని, ప్రపంచాన్ని పంచుకుని యాత్రలు కొనసాగించారంటే వింతగా తోస్తుంది. ఆ కాలంలో జరిగిన సముద్ర యాత్రలను వర్ణిస్తూ ప్రసిద్ధ మాసపత్రిక నేషనల్ జియొగ్రాఫిక్ వారు వాడిన మాటలు నిజాన్ని నిక్కచ్చిగా తెలియజేస్తాయి. గాడ్, గ్లోరీ అండ్ గోల్డ్ అనే మూడు అంశాల కోసం యాత్రలు జరిగాయట. అందుకే సాహస యాత్రికులకు, సముద్రం దొంగలకు అంతగా తేడా లేదన్నారు.

అంతకు ముందు, ఆ తర్వాత మాత్రం కేవలం కొత్త ప్రాంతాలను సంగతులను తెలుసుకోవడానికి మాత్రమే సాహస యాత్రలు జరిగాయి.

No comments:

Post a Comment