Wednesday, January 28, 2015

‘‘లోకబాల్య’’ తిలక్‌ - శ్రీశ్రీ వ్యాసం


‘‘అన్నం చల్లారి పోతోంది తమ్ముడూ’ అని చెప్పడానికి వచ్చాను, నీ గుడిసె తలుపు తాళం వేసి ఉంది.  అక్కడో కాగితపు చీటీ చూశాను. అందులో ‘ నా కోసం దుఃఖించు’ అని వ్రాసిఉంది. కింద ఏ సంతకమూ లేదుగాని, ఆ అక్షరాలలో మానవజాతి సొంత దస్తూరీని పోల్చుకున్నాను.’’
పిన్న తనంలో మరణించిన ఫ్రెంచి కవి రాంబోమీద ఒక అమెరికన్‌ కవి వ్రాసిన గీతం ఇది. చిన్నతనంలోనే చనిపోయిన అన్ని దేశాల కవులకీ ఇది వర్తిస్తుందనుకుంటాను, శంకరాచార్యుడు, షెల్లీ, రూపర్ట్‌బ్రూక్‌, డీలన్‌ థామస్‌, పెనుమర్తి వెంకటరత్నం, కొంపెల్ల జనార్దనరావు, దేవరకొండ బాలగంగాధరతిలక్‌ అందరికీ ఇది అనువర్తిస్తుంది.
‘‘లోకమాన్య’’ బాల గంగాధరతిలక్‌ను అందరూ ఎరుగుదురు. మన తెలుగు తిలక్‌ను తెలుగువారిలోనే ఎంతమంది ఎరుగుదురో చెప్పలేను. అతను చనిపోయినప్పుడు కొన్ని పత్రికలు ఆ వార్త ప్రచురించాయి. కొందరు మిత్రులు గద్యాలలోనూ, పద్యాలలోనూ, తమ సంతాపం ప్రకటించారు. ఆ మధ్య ఒక సాహిత్య పత్రిక తిలక్‌ స్మారకార్థం ఒక సంచిక వెలువరించింది. మళ్ళీ ఇప్పుడీ సంచిక వెలువడుతోంది.
మిత్రుడు శ్రీ కాళిదాసు దీనికి సంపాదకీయం వ్రాయమని అడిగినప్పుడు నేను కొంచెం సంకోచించాను. ఎందుచేతనంటే తిలక్‌ను రెండు మూడు సార్ల కంటె ఎక్కువ పర్యాయాలు నేను కలుసుకోలేదు. అతని రచనలన్నీ చదివానని కూడా చెప్పలేను.  ‘అయినా నువ్వే ఇది వ్రాసి తీరా’లని మిత్రుడడిగితే సరే అన్నాను.
తీరా వ్రాయాలని కూర్చుంటే ఏమి వ్రాయడానికీ తోచలేదు. ‘‘లోకబాల్య’’ అనే బిరుదం మాత్రం స్ఫురించింది. చనిపోయే క్షణందాకా మానవుని బాల్యదశలోని అమాయకత్వాన్ని తిలక్‌ నిలుపుకున్నాడనే నా ఉద్దేశం. కాని అతని రచనల్లో మాత్రం పరిపుష్టమైన పరిణతి ఉంది.  ఇంగ్లీషు కవి విల్లియం బ్లేక్‌ తన పాటలలో కొన్నిటిని ‘‘ అమాయకత్వపు పాటలు’’ అనీ, మరికొన్నిటిని ‘‘అనుభవపు పాటలు’’ అనీ అన్నాడు.  తిలక్‌ కవితలో ఈ అమాయకత్వమూ, అనుభవమూ రెండూ ఒకే చోట గోచరిస్తాయి.
పాఠకులకొక సందేహం కలగవచ్చును. తిలక్‌ రచనలన్నీ చదవకుండానే నేనీ అభిప్రాయం ఎలా తెలియచెయ్య గలుగుతున్నానని! మరేం లేదు. ఇప్పుడు నేనుంటూన్న ఈ మద్రాసు నగరంలో తూర్పున ఒక మహా సముద్రం వుంది. నగరంలో ఎన్నో దేవాలయాలున్నవి. సముద్ర తీరానికి చాలా అరుదుగానూ, దేవాలయాలలోనికి అంతకన్నా అరుదుగానూ వెళ్ళే నేను అవన్నీ అక్కడ ఉండడంలోనే ఒక ఆనందం, ఒక ఆత్మ సంతృప్తీ పొందుతూ ఉంటాను. మహిమాన్వితమైన అమాయకత్వాన్ని ఆ దేవాలయ  గోపురాలలో నేను చూస్తాను. ఇక మహా సముద్రం ఉందంటే అద మానవ జీవితానుభవ సమస్తానికీ ఒక చక్కని ప్రతీక! ఔను తిలక్‌ రచనలన్నీ నేను చదవలేదని మరోమారు మనవి చేస్తున్నాను. కాని చదివిన కొలది పాటి రచనలే చాలు తిలక్‌ను మొదటి తరగతి రచయితలలో ఒకడని గుర్తించడానికి!
విచారించవలసిన విషయం ఏమిటంటే తిలక్‌ ఇంకా ఎన్నో రచనలు కావించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే అతడు మరణించడం! ఇది వరకతడు వ్రాసిన వాటి కన్న ఎన్నో రెట్లు గొప్ప రచనలను మనం పోగొట్టుకున్నా మన్నమాట. తనలోని సృజనశక్తి సుతీక్షణంగా విజృంభిస్తున్న సమయంలోనే అతను మరణించడం దురదృష్టకరం!
అందుకే నాకనిపించింది తిలక్‌ చనిపోవడం అంటే మిట్ట మధ్యాహ్నమే సూర్యుడస్తమించినట్టుందని !
Thanks to the sources!
I am in awe of Tilak's writings!

Monday, January 26, 2015

Avasarala Kanyakumari - Padmasri Award

Shravanam again!!

This is in celebration of the State recognition to Kum Kanyakumari.
She surely, deserves much better!!



Kum Kanyakumari - Violin 
Guruleka - Ragsudharasa - Nee_dayarada